[సత్యగౌరి మోగంటి గారు రచించిన ‘ఆకాంక్ష’ అనే కవిత పాఠకులకి అందిస్తున్నాము.]


సగం శరీరం గుంతలో,
రెండు చేతులు మగ్గంపై,
సుతిమెత్తని పత్తిని-
దారపు పోగుగా చేసి,
వేవేల పోగులను-
సుందరమైన వస్త్రంగా మార్చి,
సమస్త మానవాళికి,
సకల దేవతలకు,
పెద్దలకు.. పిన్నలకు..,
వారు మెచ్చే –
అందరికీ నచ్చే,
మనసులను గెలిచే..
రంగురంగుల..
బహు చక్కని అద్దకాలతో..
వెలకట్టలేని..
అపురూపమైన వస్త్రాల నేతగాళ్లు
రూప శిల్పులువాళ్ళు..!
వీరి ప్రతిభను గుర్తించలేని
అంధులం.. మనం
వారికి పట్టెడన్నం పెట్టలేని
నిర్భాగ్యులం..
మన దేహాన్ని అలంకరించే
గొప్ప వస్త్రశిల్పులైన,
నేతన్నలవంటిని కప్పే,
వలువలీయలేని..
మనసులేని పేదవాళ్లం..!
కనీసంవారి కష్టాలు తీరాలని
ఆకాంక్షిద్దాం..!!

కవయిత్రి సత్యగౌరి మోగంటి వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. ఎమ్.ఎ; బి.ఎడ్, బి.ఎల్. చదువుకున్నారు. కాకినాడకు చెందిన వీరు ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పదవీ విరమణ చేశారు. తెలుగు సాహిత్యం లోనూ, రచనావ్యాసంగంలోను అభిరుచి వున్న శ్రీమతి సత్యగౌరి, రేడియో ప్రసంగాలు, అడపాదడాపా వివిధ ప్రక్రియల్లో రచనా వ్యాసంగం చేస్తూ ప్రస్తుతం హైదరాబాదులో విశ్రాంత జీవితం గడుపుతున్నారు.