[శ్రీ ఆవుల వెంకటరమణ రచించిన ‘ఆకుపచ్చని సంతకం’ అనే కవితని అందిస్తున్నాము.]


సమ్మెట దెబ్బలు తిన్న ఇనుప కడ్డీలా,
ఉలి దెబ్బలు తిన్న గండ శిలలా
ఉక్కపోతతో అట్టుడికిన సగటు మనిషిలా..
రోహిణి ఎండల్లో నెర్లిచ్చి నోళ్ళు తెరిచిన భూమాత ఒళ్ళు..
తొలకరి జల్లులకు ఎంతగా పులకరించి పోయిందో..!
పగిలిన భూమి నోటిలో పన్నీటి చిలకరింత..!
తనువెల్లా పులకరింతల ఆనంద పారవశ్యపు
అంచుల మీదుగా గాడ పరిషంగ్వంలోకి
జారిపోతుంది భూమాత.
ఎప్పుడు ఇంకెప్పుడంటూ ఎండిన నోళ్లు
తెరచి ఎదురుచూస్తున్న భూమితో..
వస్తున్నా నేవస్తున్నానిదిగో నంటూ
ఊరిస్తుంది నీళ్లు నిండిన మబ్బు తెమ్మెర.
అంతా సరిగ్గా ఉంటే మేఘం వర్షించడం
ప్రకృతి పులకించడం అన్నీ మామూలే.,!
జలవృష్టితో తడిసి పునీతమైన బీజం
క్షేత్రంలో అనేకానేక జీవ క్రియలనంతరం బీజమై
అంకురిస్తుంది.
లేలేత పల్లవాలతో, చిరుగాలికి హోయలుపోతూ
బాపు బొమ్మలా వయ్యార మౌతుంది.
ఆకుపచ్చని కోకతో భూగోళ మంతా
ఆనంద పరవశ మౌతుంది.
సుదీర్ఘకాల పురిటి నొప్పలనంతరం
ప్రసవించిన శిశువుని
చూసుకొని ఆనంద ముగ్ధ యైన మాతృమూర్తిలా
తొలకరి ముందరి ఉష్ణ వేదన నంతా
ఒక చిన్న నిట్టూర్పుతో పారదోలి
హృదయ తంత్రుల నిండా
ఆనంద భైరవి నాలపిస్తుంది.

కవి, రచయిత, నాటక, రేడియో రచయితగా ప్రసిద్ధులైన శ్రీ ఆవుల వెంకట రమణ 1999 నుంచీ కథలూ, కవితలు వ్రాస్తున్నారు. వీరి కథలూ, కవితలూ వివిధ పత్రికల్లో అచ్చాయ్యాయి. ఆకాశవాణి విజయవాడ, హైదరాబాదు, మార్కాపురం కేంద్రాల్లో వీరు రచించిన అనేక కథలు, కవితలూ, నాటకాలు అనేక మార్లు ప్రసారమయ్యాయి. దిశా నిర్దేశం – కవితా సంపుటి, అల రక్కసి – దీర్ఘ కవిత, భారత సింహం నాటకం ప్రచురించారు. అనేక సాహిత్య సంస్థల నుంచి సన్మానాలని స్వీకరించారు.
సహజకవి, సాహితీ ఆణిముత్యం, సాహిత్య రత్న, మత్స్యకవిమిత్ర బిరుదుల్ని పొందారు. హ్యుమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారి ఉగాది పురస్కారాన్ని (02-04-2022) పొందారు. 2020లో ప్రజాశాక్తి దినపత్రిక ఆదివారం ప్రత్యేకం స్నేహలో సంవత్సరం పాటు ప్రచురింపబడిన మత్స్యకార కథలని ‘కరవాక కథలు’ పేరుతో సంపుటంగా తీసుకురాబోతున్నారు. కొన్ని వందల యేండ్ల క్రితం తమిళనాడు ప్రాంతం నుంచి వలస వచ్చి ప్రస్తుతం తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల సముద్ర తీరంలో నివసిస్తున్న పట్టపు మత్స్యకారుల మీద చేసిన పరిశోధనా గ్రంథాన్ని అతి త్వరలో ముద్రించబోతున్నారు. కుసుమ వేదన కావ్యాన్ని ఎక్కడా శిక్షణ తీసుకోకుండా స్వయం కృషితో ఛందోబద్ధ పద్యకావ్యంగా రచించారు.
కం॥
గురువెవ్వరు నా కవితకు
గురువెవ్వరు లేరు నాకు గురుతులు దెలుపన్
గురువులు లేకనె నేనిట
ధరణిని శారద కరుణను దయగొని బడితిన్.
1 Comments
GitacharYa
మంచి కవిత ఉ అందించారు