“అంకుల్! ఈ లెటర్ చూడండి. డాడీ లాకర్లో వుంది. ఆయన నన్ను ఇంతగా మోసం చేస్తారని అనుకోలేదు.” అంటూ నిప్పులు కక్కుతూ కోపంగా తన చేతిలో వున్న కవరును లాయర్ ఫణీంద్ర ఎదురుగ వున్న టేబుల్ మీదకు గుమ్మం తలుపు దగ్గిర నుంచే బాణంలా విసిరి కొట్టింది అనిత.
“అన్నూ ఇలా వచ్చి కూర్చో.. నీకు ఇంతగా కోపం వచ్చే పని ఏమి చేసాడు భార్గవ? కొంచెం వాటర్ తాగి కూల్ అవ్వు.. మై డియర్” అంటూ చెప్పాడు ఫణీంద్ర.
ఆ తరువాత ఆ లెటర్ చదివి తన టేబుల్ మీద వున్న బుక్‌లో పెట్టి “ఇందులో నాకు ఎలాంటి తప్పు కనబడలేదు.” అన్నాడు.
“మీ దగ్గిర లాకర్లో వున్న హారం మధుర ఆంటీకి ఇవ్వమని, మాకు ఈ లెటర్ రాశారు. ఆవిడ ఎవరు? డాడీకి మాత్రమే తెలిసిన ఆ మనిషికి విలువైన ఈ హారం ఎందుకు ఇవ్వాలి?.. ఇస్తే అన్నకు ఇద్దరు అమ్మాయిలు వున్నారు. ఈ మూడో మనిషి ఎవరు? అమ్మ పోయి ఇరవై ఏళ్లు ఐయ్యింది. అమ్మకి ఎంతో ఇష్టమైన హారం కనిపించలేదు, ఏమైందా అని బీరువాలు వెదికాను. చివరికి డాడీ పర్సనల్ లాకర్లో ఈ లెటర్ మాత్రమే వుంది. నాకు గుండెలు మండిపోతున్నాయి.”
“అనితా! మీ డాడీ నీకు మీ అన్నకీ ఏమి లోటు చేయలేదు. మీ మదర్ నాన్నమ్మ జ్యూయలరీ ఇచ్చాడు. రెండేసి విల్లాలు ఇచ్చాడు. రిసార్ట్స్ ఇచ్చాడు. వాటి విలువ అంతులేనిది. కేవలం 5 లక్షల హారం గురించి కన్న తండ్రినే అనుమానిస్తున్నావు. మధుర గురించి నీకు చెప్పినా అర్థం కాదు. మధుర చాలా మంచిది. ఆ బంధం పవిత్రమైనది. నాకు మాత్రమే తెలుసు. అందుకే ఆ హారాన్ని మధురకు ఇవ్వమని నా అధీనంలో ఉంచాడు. నిజానికి నీకు తెలియకుండా ఇస్తే ఏమి చేయగలవు? అలా చేయలేదు. అప్పుడే నువ్వు మధుర పవిత్రత అర్థం చేసుకోవాలి.” అన్నాడు ఫణీంద్ర.
“ఆ హారం ఖరీదు గురించి నేను ఆలోచించడం లేదు. ఆ పరాయి మనిషి మీద ప్రేమను భరించ లేక పోతున్నా. మమ్మీని, నన్ను మరచి.. చివరగా మధురను కలవరించడం నాకు కోపంగా వుంది. మీరు ఏదో.. అంటున్నారు కాని డాడీకి ఆవిడకు మధ్య ఏదో వుంది. మగాళ్లు మోసగాళ్లు. ఏ బంధమైనా తెంచుకోగలరు. పెంచుకోగలరు. అందులో అంతులేని ఐశ్వర్యం ఉంటే వేరే చెప్పాలా!”
“ఎంత మాట అన్నావు అనితా? స్త్రీ పురుషులమధ్య పరిచయం కేవలం సెక్స్ కోసమే అని ఎందుకు అనుకుంటారు? నీ భర్త కూడా కుబేరుడే మరి. కేవలం తోటి మహిళను గౌరవించు. చేతనైతే హెల్ప్ చేయి. చులకన చేయకు.. ” అన్నాడు ఫణీంద్ర.
“అంటే ఆవిడ మీకు కూడా తెలుసా?”
“అది ఇప్పుడు ఎందుకు? మీ డాడీ చివరి కోరిక తీర్చడం నీకు ఇష్టం లేదు. పోనీలే ఆ హారం అలాగే ఉందనీ. ఇక నువ్వు వెళ్ళు..” అంటూ లేచి లోపల రూంలోకి వెళ్లిపోయాడు.
అనిత కూడా లేచి వచ్చేసింది. ఈ విషయం భర్త కిశోర్‌కి చెప్పలేదు. పూర్తిగా ఇది తన పర్సనల్ మేటర్ అనుకుంది. కానీ ఆమెకు తండ్రి రాసిన ఉత్తరమే గుర్తుకి వస్తోంది.
ఏదో కసి. ‘ఎవరో నాకు తెలియని అనామిక కోసం డాడీ పడిన ఆరాటం.. అంటే మమ్మీ మీదా నా మీదా లేని మమకారం, ఇష్టం – మధుర అనే ఎవరో స్త్రీ మీద ఉండటం ఏమిటీ’ అనే ఆరాటం నిలువ నీయడం లేదు. ’ఫణీంద్ర అంకుల్ కూడా ఏదో దాచి పెడుతున్నారు’ అనుకుంది.
‘డాడీ ఆ లెటర్ రాయకుండా వుండాల్సింది. ఆయనకు ఇష్టం వచ్చినట్టు చేయవలసింది. అప్పుడు నాకు ఈ బాధ ఉండేది కాదు.. ఆవిడ ఎవరి మీదనో ద్వేషం ఉండేదీ కాదు’ ఆలోచిస్తూ కారు డ్రైవ్ చేస్తున్న అనితకు రోడ్ మీద దృష్టి లేకుండా పోయింది. ఎదురుగా వచ్చే మలుపు దగ్గిర ఆటోకు డాష్ ఇచ్చి యాక్సిడెంట్ చేసింది. ఎవరో చూసి హాస్పిటల్లో చేర్చారు.
కిశోర్‌కి ఫణీంద్రకి ఫోను చేసి చెప్పేరు. వాళ్ళు వచ్చేసరికి ఆపరేషన్ రూంలో వుంది.
“అంకుల్ ఇదేమిటీ అనిత ఎప్పుడు పొరబాటు చేయదు. ఈ రోజు ఏమి జరిగిందో..” అంటూ దిగులుపడ్డాడు కిషోర్.
అంటే అనిత తన దగ్గిరకు వచ్చినట్టు కిషోర్‌కి చెప్పలేదని అర్ధమై.. “నిజం, అనిత మూడ్ ఈ రోజు బాగులేదేమో.. పరధ్యానంగా ఉన్నట్టుంది. అనిత బ్రెయిన్‌కి బాగా దెబ్బలు తగిలాయని డాక్టర్ అంటున్నారు.” అన్నాడు ఫణీంద్ర.
“ఆటోలో వున్నది ఎవరు?” అడిగాడు కిషోర్.
“పోలీసులు చెప్పాలి. చూద్దాం..!”
అంతలో డాక్టర్ వచ్చారు.
ఫణీంద్ర వివరాలు చెప్పాడు.
“ఓహ్ మీరు లాయర్ ఫణీంద్ర, బిజినెస్‌మాన్ కిషోర్ వైఫ్ అనిత… అయాం సారీ, అనితకి బ్రైన్ సర్జరీ చేయాలి. ఎలా ఉంటుందో చెప్పలేం.. విల్ ట్రై” అన్నారు. ధైర్యం చెప్పి వాళ్ళ దగ్గిర ఆపరేషన్‌కి అనుమతి తీసుకుని వెళ్లిపోయారు.
మరో డాక్టరు వచ్చి “మీరు ఇంటికి వెళ్ళండి. మేము సర్జరీ చేసాక ఫోను చేస్తాం. అవసరం ఐతే UK డాక్టర్లని కన్సల్ట్ చేస్తాం.. ప్లీజ్” అన్నాడు.
చేసేదిలేక ఇంటికి వచ్చారు. ఫణీంద్ర తనతోబాటు కిషోర్‌ని ఇంటికి తీసుకువెళ్లాడు. హాస్పిటల్‌కి ఇల్లు దగ్గిర. అదీకాకుండా కిషోర్ లోన్లీనెస్ ఫీలవుతాడని!
అప్పుడే పోలీసులూ వచ్చారు కూడా.
“సారీ సార్, మా డ్యూటీ చేయాలి.. ఆటోలో ఎవరో ఒక లేడీ ఇద్దరు పిల్లలు వున్నారు. వారు వుమన్ అండ్ చైల్డ్ వెల్ ఫెయిర్ సంస్థకి చెందినవారని తెలిసింది. ఎవరో అనాథలు.. కనుక పెద్దగా కేసు ప్రాబ్లం లేదు..” అన్నాడు ఇన్స్పెక్టర్ దయాకర్.
“అలా అనకండి.. వారికి న్యాయం జరగాలి. అనాథ అయితే వదిలేస్తామా? ఆ భారం నాది..! వారెక్కడ వున్నారు? బాగున్నారా?” ఆత్రంగా అడిగాడు కిషోర్
“దట్ ఉమన్ అండీ స్పాట్ డెడ్. లక్లీ కిడ్స్ ఆర్ ఓకే.!”
“ఇట్స్ వెరీ బాడ్. పిల్లలను చూద్దాం పదండి. అంకుల్..” అన్నాడు కిషోర్.
“మీ దగ్గిరకే తీసుకువస్తాం సార్. మీరు కూర్చోండి. ఫణీంద్రగారు ఆ వుమన్ తరపున ఏమి చేయాలో చెప్పండి..” అన్నాడు ఇన్స్పెక్టర్.
“ఆవిడ ఎవరో వివరాలు చెప్పండి..” అన్నాడు ఉదారంగా సహాయం చేయాలని ఫణీంద్ర.
“పేరు మీనాక్షి. ఫోటో ఇదిగో..” అంటూ వివరాలు చెప్పేడు ఇన్స్పెక్టర్.
యథాలాపంగా చూసి ఉలిక్కి పడ్డాడు ఫణీంద్ర.. అది మధుర ఫోటో!
‘వాట్ ఏ ట్రాజెడీ.. ఎవరి కారణంగా అనిత గొడవపడిందో అదే స్త్రీ.. ఆమె వల్ల మరణించడం..!
“ఓహ్ గాడ్.. చూడు కిషోర్ ఇది ఎవరో కాదు మధురమీనాక్షి..” విషాదంగా అన్నాడు ఫణీంద్ర.
“అంకుల్..” నోట మాటరాని కిషోర్ విలపించాడు పెద్దగా!
అర్ధం కానీ పోలీసులు నిశ్చేష్టులయ్యారు. ఎవరో అనాథ కోసం కిషోర్ అనే గొప్ప ధనవంతుడు రోదించడం మొదటిసారి చూసారు వాళ్ళు.
ఫణీంద్ర లేచి వచ్చి కిషోర్ భుజం తడుతూ ఓదార్చేడు.
“కూల్ డవున్ కిషోర్! నీది మరీ పసివాడి మనసు. ఓర్చుకో. విధి నిర్ణయం తప్పించలేం కదా” అని చెప్పి, “ఆవిడ పిల్లల పోషణకు విరాళం ఇచ్చాడు. అందుకే తట్టుకోలేక బాధపడుతున్నాడు” అని పోలీసులకి చెప్పి..
“నువ్వు నీ చేతుల మీదుగా అంతిమసంస్కారాలు చేయడమే ఉపశమనం. లే ధైర్యం తెచ్చుకో.. మంచిమనసుతో కర్తవ్యం నిర్వహించు..” అన్నాడు ఫణీంద్ర.
‘ఇంట మంచివాళ్లా వీళ్ళు..! ఒళ్ళు పొగరుతో.. ధనమదంతో.. పట్టపగలు డ్రింక్ చేసి.. ఇష్టం వచ్చినట్టు డ్రైవ్ చేసే ఆడవాళ్లు మగ వాళ్ళు కేసులు మాఫీ చేయడానికి నోట్ల కట్టలను చేతిలో పెట్టే ఈ రోజుల్లో ప్రముఖులు అయిన ఇద్దరు దయార్ద్ర హృదయులను ఇప్పుడే కళ్ళతో చూడటం వాళ్ళే నమ్మలేకపొతున్నారా పోలీసులు.
“పదండి ఆలస్యం చేయకండి..” అంటూ బయలుదేరాడు ఫణీంద్ర.
అనిత వున్న హాస్పిటల్ మార్చురీలోనే మధుర బాడీ వుంది. ఫణీంద్ర సలహా మీద ఆమె ఆర్గాన్స్ డొనేట్ చేసి క్రిమేషన్ ముగించాడు కిషోర్.
అనితకి ప్రాణాపాయం తప్పింది. రెండు వారాల తర్వాత ఇంటికి వచ్చింది. మధుర పిల్లలను కిషోర్ అనితా సంతానం లేకపోవడంతో దత్తత తీసుకున్నారు.
అనిత గతం మరిచిపోయింది. తండ్రి రాసిన ఉత్తరం.. మధుర.. యాక్సిడెంట్.. ఏదీ గుర్తులేదు.
సుజా సుహాస్ తన పిల్లలు అని కన్న పిల్లలకంటే ప్రేమగా పెంచుకోడం వల్ల ఫణీంద్ర కిషోర్ కుదుటపడ్డారు.
సుజా బర్తడేకి విలువైన హారం ఇచ్చాడు ఫణీంద్ర. అది.. తన ప్రాణ స్నేహితుడి కోరికగా.
మధుర ఇప్పుడు అందరి మనస్సులో జీవించే వుంది పరోక్షంగా!
ముఖ్యంగా అనిత మెదడు ఆమెదికాదు. మధురది.
ఈ విషయం ఫణీంద్ర, కిషోర్‌కు తప్ప ఎవరికీ తెలియదు.
తెలియవలసిన అవసరం లేదు కూడా!
మరి మధుర ఎవరు? భార్గవికి ఆమె ఎలా తెలుసు? కిషోర్ ఎందుకు మధుర విగత శరీరాన్ని చూసి విలపించాడు?
[ఈ ప్రశ్నలకు జవాబు పాఠకులు చెబితే బాగుంటుంది. దయచేసి అక్రమ సంబంధం వూహించవద్దు. మీ హుందాతనాన్ని తెలియచేయండి. – రచయిత్రి]
ఏ. అన్నపూర్ణగారిది కాకినాడ. వారి నాన్నగారు పిఠాపురం రాజావారి కాలేజీలో ఇంగ్లీషు లెక్చరర్‌గా పని చేశారు. ఇంట్లో చాలా అమూల్య గ్రంథాలూ నవలలు, మాసపత్రికలు, ఎన్నో పుస్తకాలు ఉండడం వలన చిన్నప్పటి నుంచే బాగా చదవడం అలవాటైంది. బాల సాహిత్యంతో పాటు ఇతర పుస్తకాలు చదివేవారు. ఆ తరువాత చదువు, పెళ్లి పిల్లలు జీవితంలో అందరిలాగే పరిణామాలు జరిగినా ఏనాడూ చదవడం మానలేదు. పిల్లలు బాగా చదువుకుని మెరిట్లో అమెరికా వెళ్ళాక తీరిక లభించి రచనలు చేయాలనే ఆలోచన వచ్చింది. రంగనాయకమ్మ, వై.సులోచన రాణి, యండమూరి, మల్లాది అభిమాన రచయితలు. వారి ప్రభావమో ఉత్తరాలు రాసే అలవాటూ కలసి వారిని రచయిత్రిని చేశాయి. వారి మొదటి కథ ‘రచన మాసపత్రిక’లో వచ్చింది. మొదటి నవల ‘చతుర’లో ప్రచురితమయింది. వీరి రచనలను ఎక్కువగా – రచన, చతుర ప్రచురించాయి. ఏభై కథలు. మూడు చతుర నవలలు, ఇరవై అయిదు కవితలు వ్రాశారు. విపుల కథలు రెండు కన్నడంలో అనువదించారు. ఇంకా ఇతర పత్రికలు, వెబ్ మ్యాగజైన్లలోను ప్రచురితమయ్యాయి. మాజీ ఐఏఎస్ ఆపీసర్ డాక్టర్.జయప్రకాశ్ నారాయణగారు తొంభై ఏడులో హైదరాబాదులో స్థాపించిన ‘ఉద్యమ సంస్థ’లో ఇరవై నాలుగేళ్లుగా కార్యకర్తగాను; సంస్థ మాసపత్రికలో వ్యాసాలు రాసే రచయిత్రిగా గుర్తిపు రావడం వారికి సంతృప్తినిచ్చింది! అటువంటి అత్యుత్తమైన గొప్ప అధికారితో పనిచేసే అవకాశం రావడం అన్నపూర్ణ గౌరవప్రదంగా భావిస్తారు. దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారి భార్య ఇందిర అన్నపూర్ణగారికి మేనత్తగారే! ఇప్పుడు గత ఆరు సంవత్సరాలుగా అమెరికాలోని కాలిఫోర్నియాలో స్థిరపడ్డారు. చదవడం రాయడంతో కాలం ఆనందంగా గడిచిపోతోంది. వారి భర్త మేథ్స్ ప్రొఫెసర్‌గా హైదరాబాదులో పనిచేశారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
అలనాటి అపురూపాలు-144
జలగా రావ్
చక్రభ్రమణం
సమాంతర రేఖల నీడన స్పర్శరేఖలు-5
యువభారతి వారి ‘నా గొడవ’ – పరిచయం
మానస సంచరరే-62: జ్ఞాపకాల దారులలో!
క్షీరసాగరము – గోప్రాముఖ్యము
మేనల్లుడు-17
‘స్వాతంత్ర్య భారతికి అమృతోత్సవ హారతి’ గ్రంథావిష్కరణ సభ విశేషాలు
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®