[శ్రీమతి సాధనా శంకర్ ఆంగ్లంలో రచించిన ‘Ascendance’ అనే సైన్స్ ఫిక్షన్ నవలను ‘ఆరోహణ’ పేరుతో అనువదించి అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]


[ఏకాంతంగా మాట్లాడుకోడానికి వల్హన్, ఒడెప్ దగ్గరలోని ఒక కొండ పైకి ఎక్కుతారు. ఓ గట్టు మీద కూర్చుని కాసేపు సూర్యాస్తమయాన్ని చూస్తారు. చీకటి పడుతుండగా, సంభాషణ మొదలవుతుంది. నెపో నిల్వలు ఇంకెంత కాలం ఉంటాయని మీ అంచానా అని అడుగుతాడు ఒడెప్. ఇంకో 1500 జాక్‌లకు సరిపోయే నిల్వలు ఉన్నాయనీ, అయితే అవి చాలా వేగంగా తగ్గిపోతున్నాయని చెప్తాడు వల్హన్. పరిస్థితి ఆందోళనకరంగా మారేవరకు వేచి చూడకుండా, పరిష్కారాలకి ఇప్పుడే ప్రయత్నించాలని అంటాడు. నెపోకి ప్రత్యామ్నాయం పురుషులకి ఇంకా దొరకలేదని చెప్తాడు ఒడెప్. పో నిల్వలు పెద్ద మొత్తంలో ఎక్కడ ఉన్నాయో నీకు తెలుసా అని అడిగితే, గైనేక్ దగ్గర నిల్వలున్నాయంటాడు ఒడెప్. అయితే నివేదికలు పరిశీలిస్తే, తమ వైపు ఉన్న నిల్వలను గైనేక్ అస్సలు ఉపయోగించడం లేదని తెలిసిందనీ, కానీ ఎందుకో అర్థం కావడం లేదని అంటాడు వల్హన్. కాసేపు ఒడెప్ మౌనంగా ఉండి, అసలు ఫెన్స్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన గైనేక్దేనని చెప్తూ, వాళ్ళు తమకంటే అన్ని రంగాలలో ఎంతో ముందు ఉన్నారనీ, నెపోకి ప్రత్యామ్నాయంగా వాళ్ళేదో రెన్యూవబుల్ మెటీరియల్‌ని అభివృద్ధి చేసి ఉంటారనీ, అందుకే నెపోని వాడడం మానేసారని చెప్తాడు ఒడెప్. ఈ విషయాలన్నీ ఉనుమో గమనిస్తూనే ఉంటుదని, ఉనుమో అధిపతి తనకి తెలిసిన వ్యక్తేననీ, అతన్ని అడగనా, అని వల్హన్ ప్రశ్నిస్తే, వద్దంటాడు ఒడెప్. మొదట ఫెన్స్‌కి అవతలివైపు వారు దేన్ని ఉపయోగిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేయమంటారు. కొండ దిగి ఇద్దరూ ఒడెప్ ఇంటికి చేరుకుంటారు. వల్హన్ బయల్దేరే ముందు – గైనేక్‌తో వ్యవహరిస్తున్నప్పుడల్లా, మనం ఈ గ్రహాన్ని వారితో పంచుకుంటున్నామని; ప్రస్తుతం వారు వేరే జాతి కావచ్చు కానీ మనకు తెలిసిన విశ్వంలో మనలాంటివి మన రెండు జాతులు మాత్రమేననీ; ఈ వాస్తవాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోమని చెప్తాడు ఒడెప్. గేమింగ్ లౌంజ్‌లో కూర్చుని తనకిష్టమైన గేమ్స్ ఆడుతుండగా, ఒక గేమ్ మధ్యలో ‘క్రియేషన్’ అనే పదాన్ని గుర్తిస్తాడు రాదుల్. అంతకుముందు ఇమే అడిగిన ప్రశ్న గుర్తొస్తుంది. ‘క్రియేషన్’ గురించి మరింత తెలుసుకోవాల్సిన అవసరం ఉందని గ్రహించి, గేమ్‌ని వదిలేసి, దాని గురించి సమాచారం కోసం లెక్స్‌లో వెతకసాగాడు. అన్ని లింక్‌లు కోషుమ్ వైపే నడుపుతాయి. దాంతో, తాను కోషుమ్ సందర్శించక తప్పదని అర్థమవుతుంది రాదుల్కి. ట్రావెలర్ ఎక్కి కోషుమ్ ఉన్న భవనం చేరుకుంటాడు. పాటిక్స్నీ, సైనెడ్ని తలచుకోగానే అతనిలో విశ్వాసం పెరుగుతుంది. తన ఐడి చూపించి లోపలికి ప్రవేశిస్తాడు. తనకి కావల్సిన సమాచరం ఉన్న కన్సోల్ 20వ అంతస్తులో ఉందని తెలుసుకుని లిఫ్ట్ ఎక్కి అందులో ప్రవేశిస్తాడు. ఒక వర్క్‌స్టేషన్‌లో కుర్చుని ‘క్రియేషన్’ గురించి వెతుకుతాడు. ఎన్నో ఏళ్ళ క్రితం అప్డేట్ చేసిన డేటా దొరుకుతుంది. దాన్ని పూర్తిగా ప్రాసెస్ చేసేసరికి రాత్రి ముగిసి, తెల్లారిపోతుంది. తనకి లభించిన సమాచారంతో తన తదుపరి చర్యలకు ప్రణాళిక రూపొందించుకుంటాడు రాదుల్. ఫురావా గార్డెన్ లో తాను డిజైన చేసి నాటిన పూల మొక్కల దగ్గర కూర్చుని వాటి ఎదుగుదలని గమనిస్తాడు ఇమే. కాసేపటికి అతనికి వల్హన్ నుంచి సందేశం వస్తుంది, సాయంత్రం అయోనాలో కలుస్తానని. అయోనాలో ఇమేని కలుస్తాడు వల్హన్. తాను కొత్తగా గుర్తించిన రెండు గ్రహాల గురించి వెల్లడిస్తాడు ఇమే. అయితే వల్హన్ పరధ్యానంగా ఉండడం, తాను చెప్తున్న వివరాలపై అంతగా దృష్టి నిలపకపోవడం గమనిస్తాడు ఇమే. ఉన్నట్టుండి, ఆ గ్రహాలలో నెపో లాంటి పదార్థాన్ని గుర్తించావా? ఉంటే, ఆ నిల్వలను మనం తవ్వి తీసుకోవచ్చా అని వల్హన్ అడిగేసరికి ఇమే కంగారుపడతాడు. ఎలోన్లో నెపో నిల్వలు వేగంగా తరిగిపోతున్నాయా అని తనలో తాను అనుకుంటాడు. వల్హన్ని అడిగితే, నెపోకు ప్రత్యామ్నాయాలను కనుగొనడానికి ప్రయత్నాలను ముమ్మరం చేయాలని అంటాడు. ఇంతలో రాదుల్ నుంచి క్రియేషన్కి సంబంధించి ఓ సందేశం వస్తుంది ఇమేకి. రాదుల్ లాంటి వ్యక్తికి సైనెడ్లో సభ్యత్వం ఎలా దొరికిందని అడుగుతాడు ఇమే. రాదుల్ ఇక్కడ ఉన్నప్పుడు దేని గురించి మాట్లాడాడని వల్హన్ అడిగితే, క్రియేషన్ గురించి మాట్లాడాడనీ; గైనేక్లు ఎందుకు క్రియేషన్ కొనసాగాస్తున్నారు, మనం ఎందుకు కొనసాగించటం లేదని అడిగాడని చెప్తాడు ఇమే. గైనేక్ గురించి నువ్వేమనుకుంటున్నావని ఇమేని అడుగుతాడు వల్హన్. వాళ్ళ గురించి తనకి పట్టింపు లేదని అంటాడు ఇమే. వాళ్ళు నెపోకి ప్రత్యామ్నాయం కనుగొన్నారనీ, మనం కూడా అలాంటిదేదో తొందరగా కనిపెట్టాలని చెప్తాడు వల్హన్. గైనేక్ని అడగచ్చుగా, లేదా వాళ్ళతో వ్యాపారం చేయచ్చుగా అని అంటాడు ఇమే. – ఇక చదవండి.]
అధ్యాయం-2 – క్షీణత – నాల్గవ భాగం
ఓవల్ ఆకారపు కిటికీ నుండి విశాలమైన సమతల భూమి కనిపిస్తోంది. దూరంగా పర్వతశ్రేణులు అగుపిస్తున్నాయి. పాటిక్స్ ఆఫీస్ గది ‘ఎటుయిస్’ భవనంలోని ఒక ఎత్తైన కొనలో ఉంది. ఒక మూల ఓవల్ ఆకారపు కిటికీతో, గాలిలో ఎగురుతున్న పొడవాటి ‘ట్రావెలర్’ ఆకారంలో ఉందా గది.
వల్హన్ కిటికీ దగ్గర నిలబడి బయటకు చూశాడు. విశాలమైన భూమికి అవతల, పర్వతాల అవతల ఎక్కడో ఒక చోట ఫెన్స్ (1) ఉంది, అది సంఘర్షణను నిలువరిస్తోంది, అవకాశానికి అడ్డంకిగా ఉంటోంది.
పాటిక్స్ తన వర్క్‌స్టేషన్‌లో కూర్చుని, తన దృష్టి సారించినాల్సిన పనులలో లీనమవుతుండగా, అక్కడికి తానెందుకు వచ్చాడో, పాటిక్స్తో ఏం చెప్పాలనుకున్నాడో, ఎలా చెప్పాలనుకున్నాడో – అనే వాటి గురించి ఆలోచించాడు వల్హన్. అయితే, పాటిక్స్ గదిలో నిలబడి ఉండగా, జరగబోయే సంభాషణ అంత కష్టంగా అనిపించలేదు. పాటిక్స్, వల్హన్ సమస్యల పట్ల తమ విధానాలలో చాలా భిన్నంగా ఉంటారు. పాటిక్స్ ఒక లక్ష్యం మీద ఉన్న వ్యక్తి, ఎల్లప్పుడూ ఏదో ఒక సుదూర లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తాడు. దేనికో త్వరపడాలన్న ఆరాటం, అసహనం అతనిలో నిలువెల్లా వ్యాపించాయి. మరోవైపు, వల్హన్ ప్రశాంతంగా, స్థిరచిత్తంతో ఉంటాడు. అతను అన్ని విషయాలను ప్లాన్ చేసి ఆలోచిస్తాడు. అయితే, వారి మధ్య విభేదాలు ఉన్నప్పటికీ, వారు గతంలో అనేక ప్రాజెక్టులలో కలిసి పనిచేశారు, పరస్పరం సహకరించుకున్నారు.
“అవును, వల్హన్, నువ్వు ఎక్కడికి వెళ్ళావు?” అని పాటిక్స్ ప్రశ్నించడంతో వల్హన్ తన ఆలోచనల నుండి బయటపడ్డాడు.
“నువ్వు సైనెడ్ క్రితం సమావేశం మిస్ అయ్యావు. తదుపరి సమావేశానికి నువ్వు రావాలి. కొత్త సభ్యులు మాట్లాడతారని ఆశిస్తున్నాము, పైగా చర్చలు ఆసక్తికరంగా ఉంటాయి” అని చెబుతూ, పాటిక్స్ కూడా లేచి కిటికీ దగ్గరికి వచ్చి – వల్హన్తో పాటుగా కిటికీ అంచుకు ఆనుకున్నాడు. పగటికాంతి అతని పొడవాటి శరీరంపై పడి, అతని దుస్తుల లేత గోధుమ రంగును ప్రస్ఫుటం చేసింది. తన ఆఫీసులో విశ్రాంతిగా ఉన్నట్టు కనిపిస్తున్నా, పాటిక్స్ టెన్షన్‌గానే ఉన్నాడు.
“పాటిక్స్, నువ్వు రాదుల్ని ఉనుమో (2) పని కోసం తీసుకొచ్చావు కదా?” అడిగాడు వల్హన్. సంగతేమిటో తెలుసుకోవాలంటే నేరుగా మాట్లాడటమే ఉత్తమ మార్గం అని వల్హన్ నిర్ణయించుకున్నాడు.
“ఆఁ, అవును, ఒక విధంగా, నువ్వు అలా అనచ్చు. కానీ, దానికి ఇంకా చాలా సమయం ఉంది. అతన్ని ఎంపిక చేసిన ఉద్దేశాలలో ఇదీ ఒకటి కావచ్చు.”
పాటిక్స్ కిటికీ దగ్గర నుండి కదిలి గదిలో ఒక మూలలో ఉన్న ఈజీ చైర్లో కూర్చున్నాడు. ఉనుమో గురించి చర్చించడం అతనికి చాలా సౌకర్యంగా అనిపించింది.
‘సరే, ప్రస్తుతం ఉనుమో ఏం చేస్తోంది? ఏ విషయంలో బిజీగా ఉంది?” వల్హన్ కిటికీ దగ్గర నిలబడి అడిగాడు.
“వల్హన్, నువ్వు నన్ను ఉనుమో పని గురించి అడగాలనుకుంటున్నావా? లేదా నువ్వు నాకు ఏదైనా చెప్పాలనుకుంటున్నావా?” అంటూ పాటిక్స్ అతని వైపు సూటిగా చూశాడు.
“ప్రత్యామ్నాయాల కోసం గైనేక్ (3) ఉపయోగించే పదార్థం గురించి ఏదైనా సమాచారం ఉందా అని నేను ఆలోచిస్తున్నాను. అది ఇప్పటికీ నెపో (4) యేనా? లేదా దానికి బదులుగా వాళ్ళు ఏదైనా కొత్తది కనుక్కున్నారా? ఈ విషయంలో మనం ప్రయోగాలు చేస్తున్నాం, మరి వాళ్ళు ఇప్పటికే అదే మార్గంలో ఉన్నారో లేదో తెలుసుకుంటే మనకెంతో ప్రయోజనం! మన శ్రమ చాలా తగ్గుతుంది,” అని వల్హన్ తన మనసులో ఉన్నది చెప్పేసి ఊపిరి పీల్చుకున్నాడు.
పాటిక్స్ మౌనంగా ఉన్నాడు. అతను తన ఈజీ చైర్లో నెమ్మదిగా కదులుతూ లెక్స్ (5) నీ, కోషుమ్ని చెక్ చేశాడు. గైనేక్ ఉపయోగించే ప్రత్యామ్నాయ పదార్థాల గురించి ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు. ఫెన్స్‌కి ఆవలి వైపు వాళ్ళు ఉపయోగిస్తున్న రెన్యూవబుల్ మెటీరియల్ గురించి డేటాను సేకరించడానికి ఉనుమో ప్రయత్నిస్తోంది, కానీ అది ఇంకా విజయవంతం కాలేదు. దీని గురించి వల్హన్‌కు ఎలా తెల్సింది, ఎవరు సమాచారం ఇచ్చారో అని ఆశ్చర్యపోయాడు పాటిక్స్.
“వల్హన్, ఈ అంశం మీద నీకెందు ఆసక్తి కలిగింది? మాత్సులో ఇది నీ స్పెషలైజేషన్ ఏరియా కాదు కదా?” అని అడిగాడు పాటిక్స్.
“ప్రత్యామ్నాయ పదార్థాన్ని కనుక్కోడంలో ఇటీవల మనం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని లెక్స్‌లో నాకు ఏదో కనిపించింది, అందుకే అడగాలని నిర్ణయించుకున్నాను” చెప్పాడు వల్హన్. తాను అలా చెబుతుండగానే, పాటిక్స్ నెపో నిల్వలను వెంటనే చెక్ చేస్తాడని వల్హన్‌కు తెలుసు.
‘ఓ, ఇది కొత్త విషయం, వల్హన్. మేము ఇంతకు ముందు దీని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. మేము దీని గురించి కొంత సమాచారాన్ని పొందడానికి ప్రయత్నిస్తాం, దొరికిన సమాచారాన్ని నీతో పంచుకుంటాం” అని చెప్పేసి, పాటిక్స్ కుర్చీ లోంచి లేచి తన వర్క్‌స్టేషన్‌కు వెళ్ళిపోయాడు.
వారి సమావేశం ముగిసిందనేది స్పష్టం, కానీ ఈ సంభాషణ ముగియలేదు. వాళ్ళు మళ్ళీ ఈ విషయం గురించి మాట్లాడుకుంటారని, త్వరలోనే మాట్లాడుతారని వల్హన్కి గట్టిగా అనిపించింది.
“రాదుల్ బాధ్యతలను నిర్ణయించే ముందు కొంచెం అతన్ని గమనించు, పాటిక్స్. గైనేక్ పట్ల అతనికి తీవ్ర ఆగ్రహం ఉన్నట్లు అనిపిస్తోంది, ఇది ఆందోళన కలిగిస్తోంది” అని అక్కడ్నించి వెళ్ళే ముందు వ్యాఖ్యానించాడు వల్హన్.
పాటిక్స్ వల్హన్కి ఏమీ చెప్పకపోయినా, వల్హన్కి ఒక విషయం ఖచ్చితంగా తెలుసు – ఒడెప్ చెప్పింది నిజమే. గైనెక్ రెన్యూవబుల్ సబ్‌స్టిట్యూట్‌ని ఉపయోగిస్తున్నారు. పాటిక్స్ మౌనానికి అర్థం కూడా అదేనని గ్రహించాడు వల్హన్.
వల్హాన్ వెళ్ళిపోయిన తర్వాత, పాటిక్స్ తన వర్క్‌స్టేషన్‌లో కూర్చుని పిచ్చిగా పని చేయడం ప్రారంభించాడు. సబ్స్టిట్యూషన్స్, నోటస్ సంఖ్య, నెపోను శుద్ధి చేయడంలో జరిగుతున పరిణామాల గణాంకాలను వెలికితీసాడు. అతను సమాచారాన్ని ప్రాసెస్ చేస్తుండగా, క్రితం కాలంటే (6) లో వల్హన్ నోటస్కు వెళ్లాడని గుర్తించాడు. పాటిక్స్ తనకి అందుబాటులో ఉన్న డేటాను జల్లెడ పడుతుండగానే సూర్యోదయం అయింది. అతను వేగం పెంచి నెపోకు ప్రత్యామ్నాయాలను కనుగొనడానికి చేసిన ప్రయత్నాలను పరిశీలించడం ప్రారంభించాడు. పురుషులు చాలా జాక్ (7) ల నుంచి కష్టపడుతున్నారని, కానీ ఇంకా విజయం సాధించలేదని గ్రహించాడు. చాలా ఆశాజనకమైన ప్రారంభాలు జరిగినా వాటి నుండి ఖచ్చితమైన ప్రయోజనమేదీ కలగలేదు. ఆ ప్రయత్నాలన్నీ నెపోను శుద్ధి చేయడం, దాని ఫలితాలపైనే దృష్టి సారించాయి. పాటిక్స్ మాత్సుకు మారి నెపో వినియోగం, దాని నిల్వల పరిమాణంపై డేటాను కనుగొనడానికి ప్రయత్నించాడు. వినియోగం గురించి సమాచారాన్ని అతను యాక్సెస్ చేయగలిగినప్పటికీ, తరువాతిది అతనికి యాక్సెస్ అవలేదు.
పాటిక్స్ ఆగి లేచి నిలబడ్డాడు. వల్హన్ ప్రశ్నలకు జవాబు దొరికింది. పాటిక్స్ తన గది నుండి బయటకు వచ్చేసరికి మధ్యాహ్నం అయింది. ఎటుయిస్ భవనం బేస్మెంట్కు చేరేందుకు లిఫ్ట్ లోకి వచ్చాడు. ఎటుయిస్, కోషుమ్ యూనిట్ల బేస్మెంట్లను కలిపే కారిడార్‌లో నడిచాడు. ఊహించినట్లుగానే, అక్కడ ఎవరూ లేరు. ఎదురుగా, ఎటువంటి సంకేతం లేని తలుపు ఉంది. అది గోడతో కలిసిపోయింది. పాటిక్స్ తలుపు దగ్గరకు వెళ్లి దానిపై ఒక చోట రెప్పవాల్చకుండా చూసాడు. ఆ తలుపు తెరుచుకుంది. అతను లోపలికి వెళ్ళగానే, వెంటనే అది మూసుకుపోయింది.
మామూలుగా అనిపించే మరొక తలుపు వద్ద నిలబడ్డాడు పాటిక్స్. తన రెండు చేతులను తలుపు మీద ఉంచాడు, అతని లెక్స్ పై ఒక నంబర్ వచ్చింది. అతను దానిని కన్సోల్ లోకి ఎంటర్ చేశాడు. తలుపు తెరిచుకుని, ఉనుమో ఆపరేషనల్ యూనిట్ కనిపించింది. క్రితంసారి నోటస్కు వచ్చి వెళ్ళాకా, అతని పారామీటర్స్ ఉనుమో రికార్డులలో అప్డేట్ అయ్యాయి.
ఉనుమో యూనిట్లో అనేక కన్సోల్లు, వర్క్స్టేషన్లతో కూడిన పొడవాటి గది ఉంది. రెండు టోబోట్లు (8) వాటి సంబంధిత వర్క్స్టేషన్లలో బిజీగా ఉన్నాయి. బబుల్స్ నుండి సమాచారాన్ని ప్రాసెస్ చేస్తున్నప్పుడు యంత్రాల నుండి మృదువైన హమ్మింగ్ వెలువడుతోంది. బబుల్స్ అనేవి ఫెన్స్ వెంబడి అమర్చిన పరికరాలు. అవి చాలా సున్నితమైనవి, గ్రహణశక్తి కలిగినవి, అవతలి వైపు వాళ్ళు తమని గమనించారని అనిపిస్తే, తమని తాము స్విచ్ ఆఫ్ చేసుకుంటాయి. ఎవరికీ కనిపించకుండా, వినిపించకుండా తిరుగుతూ ఫెన్స్‌కి అటు వైపున ఉన్న ఛానెల్‌ల నుండి శబ్దాలను, సంభాషణలను కేప్చర్ చేస్తాయి, తరువాత ఉనుమో లోని యంత్రాలు వాటిని విశ్లేషిస్తాయి. కొన్ని కీలకపదాల ఆధారంగా, ఫెన్స్‌కి ఆవలి వైపు గురించి రిపోర్ట్లు తయారవుతాయి. ప్రస్తుతం ఆ రిపోర్టులు పాటిక్స్ స్క్రీన్‌పై ప్రత్యక్షమయ్యాయి.
ఓ కన్సోల్ ముందు కూర్చుని, పాటిక్స్ పనిలో లీనమయ్యాడు. కొద్దిసేపటి తర్వాత, వల్హన్ ‘సేఫ్ యాక్సెస్’లో ఉంచిన నెపో రిజర్వ్‌ల డేటాను అతను యాక్సెస్ చేయగలిగాడు. లభించిన డేటాతో యంత్రాలు నమూనాలను లెక్కించి ఇవ్వడంతో, పరిస్థితి మరింత స్పష్టమైంది. డిప్లీషన్ ట్రెండ్‌ను సైనెడ్ దృష్టికి వల్హన్ ఎందుకు తీసుకురాలేదా అని ఆశ్చర్యపోయాడు పాటిక్స్. పైగా ఇది చాలా జాక్‌ల క్రితం తెలిసింది.
పాటిక్స్ ప్రాసెసింగ్ ఆపేసి నిశ్శబ్దంగా కూర్చున్నాడు. గదిలో మరో వైపున, వివిధ స్క్రీన్లు ముఖ్యమైన ప్రదేశాల లైవ్ ఇమేజెస్‌ని చూపించసాగాయి. ఒకదానివెంట ఒకటిగా మారుతున్న చిత్రాలను తదేకంగా చూశాడు పాటిక్స్. ఒక విధంగా, నెపో నిల్వల క్షీణత ఇంకా దాచిపెట్టబడటం అదృష్టవశాత్తూ జరిగింది. పాటిక్స్ తన ప్రణాళికల కోసం ఈ సమాచారాన్ని ఉపయోగించుకోవచ్చు.
చాలా జాక్‌ల పాటు, ఈ విషయంపై సైనెడ్ దృష్టి పడకపోవడం పాటిక్స్ను ఇబ్బంది పెట్టింది. సైనెడ్ పురుషుల ప్రయోజనాలను పెంపొందించాల్సి ఉంది. వారి జీవితాలను మెరుగుపరచాల్సి ఉంది. అయితే, సైనెడ్ లౌకికమైన, అప్రధానమైన అంశాలపైనే దృష్టి సారించింది. వారి సమావేశాలలో ఎప్పుడూ ముఖ్యమైన ఏదీ చర్చించబడలేదు. సైనెడ్ నాయకత్వాన్ని స్వాధీనం చేసుకుని, ఎలోన్ (9) లో ఉన్న పవర్ బాలన్స్ని మార్చే ప్లాన్ కోసం పాటిక్స్ వేచి చూస్తున్నాడు.
ఫెన్స్‌కి ఆవలి వారితో శాంతియుత సహజీవనమనేది కేవలం ఓ ప్రహసనం. పురుషులకి గైనేక్‌తో శాంతి అవసరం లేదు. పురుషులకు ఆ గ్రహం అవసరం, మొత్తం వారికే. సగం పర్వతాలు, సగం సముద్రాలు, సగం ఖనిజాలు, ప్రతిదీ సగం – మాత్రమే అందుబాటులో ఉన్న సగం గ్రహం అనే భావన అతనికి కోపం తెప్పింస్తోంది. అతను లెక్కలేనన్ని జాక్‌ల పాటు ఈ సగం ఉనికిలో జీవించాడు. ఇప్పుడు సగాన్ని పూర్తిగా మార్చి ఎలోన్‌ను పూర్తిగా సొంతం చేసుకునే సమయం వచ్చిందని అతనికి తెలుసు. గత యుద్ధం తర్వాత, తమ సంఖ్య బాగా తగ్గిపోడంతో, సంధి కోరే ముందు, చాలా మంది పురుషులు, చివరి ప్రయత్నం కోసం తీవ్రంగా పట్టుబట్టారు, కానీ అది వారి మనుగడకు సంబంధించిన విషయం. అయితే, ఫెన్స్ ఏర్పాటు చేయబడినప్పటి నుండి, వారు తమ సంఖ్యను పెంచుకున్నారు, తమ నగరాలను విస్తరించారు విపరీతమైన అభివృద్ధి సాధించారు, కానీ ఇప్పటికీ, పురుషులు ఎలోన్లో సగం మాత్రమే. పాటిక్స్కీ, మరికొందరికి, ఎలోన్ పురుషులకే చెందుతుందడనంలో ఎలాంటి సందేహమూ లేదు. వారు ఎల్లప్పుడూ గ్రహం తమదని భావించారు. ఇప్పుడు, దానిని గైనేక్ నుండి స్వాధీనం చేసుకునే సమయం ఆసన్నమైంది.
చాలా మంది ఫెన్స్ని శాంతికి చిహ్నంగా భావిస్తారు, కానీ పాటిక్స్కు అది వారి హద్దుని నిరంతరం గుర్తు చేస్తుంది. కొంతమంది పురుషులు ఈ హద్దుని స్వచ్ఛందంగా ఎలా అంగీకరించారో అతనికెప్పుడూ అర్థం కాలేదు. ఈ గ్రహాన్ని గైనేక్‌తో పంచుకోడాన్ని ముగించాలని పురుషులని ఒప్పించడానికి ఓ బలమైన కారణాన్ని కనుక్కోడానికి చాలా జాక్‌ల నుంది పాటిక్స్ ప్రయత్నిస్తున్నాడు. గోడను బద్దలుకొట్టి, తమ హద్దుల నుండి బయటపడటానికి పురుషులను అంగీకరించేలా ఒత్తిడి చేసే మార్గాన్ని గుర్తించడానికి అతను ప్రయత్నిస్తున్నాడు.
ఇప్పుడు, అతనికి ఓ కారణం దొరికింది. నెపో నిల్వల క్షీణత అనేది ఓ ప్రారంభం. సరిగ్గా వ్యవహరించినట్లయితే, నెపో నిల్వల క్షీణత – పాటిక్స్ ఆశించినట్లుగా చర్య తీసుకునేలా వారిని ఒప్పించగలదు. దాని గురించి బాగా ఆలోచించేసరికి, తాను వెతుకుతున్నది దొరికిందనని – వారి హద్దులను అధిగమించడానికి సహాయపడే కారణం అదేనని గట్టిగా నిశ్చయించుకున్నాడు పాటిక్స్.
బబుల్స్ నుండి సమాచారాన్ని ప్రాసెస్ చేసే కన్సోల్ వైపు నడిచాడు. డాక్యుమెంట్ చేయబడుతున్న నివేదికలను స్కాన్ చేశాడు. ‘సీని’ అనే పదం సంభాషణలో మళ్లీ మళ్లీ వినిపిస్తోందని అతను గ్రహించాడు. అది గైనేక్లో ముఖ్యమైన విషయంగా అనిపించింది. కూర్చుని నివేదికలను మరోసారి ప్రాసెస్ చేయడం ప్రారంభించాడు పాటిక్స్.
—-
ఈ సైన్స్ ఫిక్షన్ నవలలో రచయిత్రి సృజించిన కొత్త పదాలు, వాటి అర్థాలు:
(1) Fence ఫెన్స్= సరిహద్దు
(2) Unumo ఉనుమో = ఫెన్స్‌కి అవతల స్త్రీ జాతి నివసించే ప్రాంతాలలో జరుగుతున్న వాటిని ఆరాతీసే రహస్య సంస్థ
(3) Gynake, గైనేక్ = ఎలోన్ గ్రహంలో స్త్రీలను సూచించేందుకు పురుషులు వాడే పదం
(4) Nepo, నెపో = అవయవాల భర్తీకి ఉపకరించే ఒక ఖనిజం
(5) Lex, లెక్స్ = సమాచార పరికరం
(6) Calante, కాలంటే = ఎలోన్ గ్రహంలో ఒక నెల
(7) Zacs, జాక్స్ = సంవత్సరాలు
(8) Tobok, టోబాక్, Tobot, టోబాట్ = యంత్ర సహకారి
(9) Elone, ఎలోన్ = ఒక గ్రహం
(మళ్ళీ కలుద్దాం)


రచయిత్రి పరిచయం:


రచయిత్రి శ్రీమతి సాధన శంకర్ రిటైర్డ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారిణి. ఆర్థికశాస్త్రంలో పి.హెచ్.డి. చేశారు. ‘Ascendance’ వారి ఐదవ పుస్తకం, రెండవ నవల, మొదటి సైఫి నవల. అంతకుముందు ఆమె ‘నెవర్ ఎ డిస్కనెక్ట్’ (2010) అనే నవల; ‘వెన్ ది ప్యారలల్స్ మీట్’ (2007) అనే వ్యాసాల సంపుటి; ‘అహ్లాన్ వా సహ్లాన్ – జర్నీ టు సిరియా’ (2006), ‘కాచింగ్ ఫైర్‌ఫ్లైస్’ (2016) అనే రెండు ట్రావెలాగ్లు ప్రచురించారు. ఆమె వివిధ ఆంగ్ల వార్తాపత్రికలకు, మ్యాగజైన్లకు వ్రాస్తారు. దూరదర్శన్‌లో యాంకర్‌గా, హోస్ట్‌గా పలు కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుత నివాసం ఢిల్లీ.
https://themindprism.com అనే బ్లాగ్/వెబ్సైట్ నిర్వహిస్తున్నారు.

కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.