Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఆరు కథలు – కొన్ని జీవితాలు-4

[కొన్ని స్నేహాలు, కొన్ని బంధాలు అపార్థాలకి కారణమవుతాయి. ఆత్మీయులనుకున్న వారిలో కలతలు రేపుతాయి. కొందరికి సరైనదనిపించినది మరికొందరికి ఆమోదం కాకపోవచ్చు. కొందరికి సహేతుకమనిపించినది కొందరికి బరితెగింపులా అనిపించవచ్చు. చిన్న వయసులో జరిగితే ఏమాత్రం ఆక్షేపణ చెప్పని ఘటన మలివయసులో జరిగితే ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి. సంఘం, కుటుంబ సభ్యులు, బంధువులు నానా రకాల మాటలు అంటారు. మరి ఆసరా అవసరమైనప్పుడు తోడు నిలవని వారి మాటలకు విలువివ్వాలా, లేక అంతరాత్మ ప్రబోధాన్ని గౌరవించాలా – ఇలా కొన్ని కుటుంబాలలో చెలరేగిన ఉద్విగ్నతలను ఆరు కథలుగా అందిస్తున్నారు శ్రీ గూడూరు గోపాలకృష్ణమూర్తి. ఇది నాల్గవ కథ. ఒకటవ కథ లింక్. రెండవ కథ లింక్. మూడవ కథ లింక్.]

తోడు

“రవీ!”

“ఏంటమ్మా?”

“నేను.. నేను..!” నేను చెప్పబోయే విషయం నా నోటి వెంబడి రావటం లేదు. ఆ విషయానికి అనుకూలమైన సమాధానం వస్తే పరవాలేదు. అదే ప్రతికూలమయితే నేను తట్టుకోలేను.

ఐదు పదుల వయస్సు దాటిన నేను కొడుక్కి లక్షణమైన అమ్మాయిని తీసుకొచ్చి పెళ్ళి చేయాలి. అలాంటిది ఈ సమయంలో నేను కోరుకుంటున్నది సబబేనా? నేను ఈ ప్రశ్న వేసుకుంటే అనుకూలమైన సమాధానాల కంటే ప్రతికూలమైన సమాధానాలే వస్తాయి. అది నాకు తెలుసు.

“చెప్పమ్మా!” రెట్టించాడు రవి.

నేను ఏం చెప్పగలను?

నా భర్త చనిపోయే సమయానికి రవి వయస్సు ఐదు సంవత్సరాలు. తెలిసీ తెలియని వయస్సు. నా అడుగుల్లో అడుగు వేసి నడిచిన వాడు. అలాంటి వాడు ఇప్పుడు విజ్ఞానవంతుడు, వివేకవంతుడు అయిన పాతికేళ్ళ నవయువకుడు. ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్.

“నేను సుధాకర్ అంకుల్‍ని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను.” అన్నాను.

వాడు బాంబు పేలినట్టు అదిరిపడ్డాడు నా మాటలకి.

ఆలోచనలో పడ్డాడు రవి. సుధాకర్ అంకుల్ తన తండ్రికి ఆప్త స్నేహితుడు. తన తండ్రి చనిపోయినప్పటి నుండి తన కుటుంబానికి ఎంతో సేవ చేస్తున్నాడు. అది తను కాదనడు. అతనికి ఋణపడి ఉంటాము. అయితే అతని రాకపోకలు వల్ల తమ కుటుంబానికి ఎన్నో సమస్యలు వచ్చి పడ్డాయి. తన తల్లిలో ఎటువంటి లోపం లేకపోయినా ఆమె పవిత్రంగా బ్రతుకు వెళ్ళదీస్తున్నా చుట్టుపక్కల వాళ్ళు ఎన్నో విమర్శలు చేస్తున్నారు ఇప్పుడు కూడా. తనకి ఎంతో బాధ కలుగుతుంది. ఇప్పుడు కూడా. అయినా ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు సుధాకర్ అంకుల్ తమింటికి ఇలా రాకపోకలు సాగించడం తనకి నచ్చటం లేదు. తన తల్లి బాధ పడ్తుందని తను మౌనం దాలుస్తున్నాడు. ఇప్పుడు తన తల్లి  ప్రస్తావన తేవడం తనకి ఇబ్బందిగా ఉంది.

“ఈ వయస్సులో నీకు ఇలాంటి ఆలోచన రావటం ఏంటమ్మా! అది నాకు నచ్చటం లేదు. నిప్పు లేందే పొగ రాదంటారు కదా! మీరిద్దరి గురించి చుట్టుప్రక్కల వాళ్ళు ఏవేవో మాట్లాడుకుంటున్నారు. ఇది నాకు ఎంతో బాధ కలిగిస్తోంది.” అని ఓ క్షణం ఆపి,

“అయినా ఈ వయస్సులో నీకు ఈ పెళ్ళి అవసరమా? ఎందుకంటే ఇంటికి కోడల్ని తెచ్చుకునే వయస్సు నీది. మన పెద్ద వాళ్ళు చెప్పినట్టు ఆడది చిన్నప్పుడు తల్లిదండ్రుల సంరక్షణలోను, పెళ్ళయిన తరువాత భర్త సంరక్షణలోను, ఆ తరువాత కొడుకు దగ్గర ఉండాలంటారు. నీకు నా మీద అపనమ్మకమా? లేక అభద్రతా భావమా? మా దగ్గర ముందు ముందు భద్రత కరువవుతుందని నీ భావనా?” అన్నాడు రవి.

వాడి మాటలకి నేను విస్తుపోయాను. బాధతో గుండెలు బరువెక్కాయి. నా కళ్ళముందు పుట్టి పెరిగిన తన కొడుకు ఇంత ఎదిగిపోయాడు. వాడన్న మాటలకి సన్నటి కన్నీటి తెర. నా ఆత్మాభిమానం దెబ్బతింది. నా కళ్ళల్లో కన్నీరు.

“పెళ్ళి కాని సుధాకర్ గారు, విధవరాలు అయిన నాకు చేస్తున్న సహాయం చూసి మా ఇద్దరి గురించి అందరూ ఏవేవో అన్నారు. అప్పుడు నేను బాధ పడ్తుంటే – ‘అందరి నోళ్ళు మూయించాలంటే మనిద్దరం దంపతులమవ్వాలి. నాకు అభ్యంతరం లేదు. మీరు ఆలోచించుకోండి’ అని అన్నారాయన.

అయితే అయిదు సంవత్సరాల తెలిసీ తెలియని వయస్సులో తండ్రిని పోగొట్టుకున్న నీవు తండ్రి స్థానంలో మరో కొత్త వ్యక్తి వస్తే తట్టుకోలేవు. నా జీవితం అస్తవ్యస్తం అవుతుందని అతని ప్రస్తావన సున్నితంగా తిరస్కరించాను. పెద్దయ్యాక నీకు నచ్చ జెప్పి పరిస్థితులు వివరించి ఒకటవుదామనుకున్నాం.

ఇప్పుడయినా ఏదో శారీరిక సుఖం కోసం, లైంగికానందం కోసం మేమిద్దరం పెళ్ళి చేసుకోవాలని అనుకోవటం లేదు. మానసికానందం కోసం, ఈ జీవిత చరమాంకంలో ఒకరికి మరొకరు తోడుగా ఉంటాలనుకుంటున్నాం” త్రీవమైన స్వరంలో అన్నాను.

అలా అంటున్న నా వేపు ఓ పర్యాయం చూశాడు రవి.  “ఇది నీ జీవితం. నీ ఇష్ట ప్రకారం జీవించే హక్కు ఈ ప్రజాస్వామ్య దేశంలో నీకు ఉంది. ఎదుటి వాళ్ళను శాసించే హక్కు, అధికారం మనకి లేవు. నీ ఇష్ట ప్రకారమే చెయ్యి. అయితే పరిస్థితుల గురించి ఆలోచించు” అంటూ రవి అక్కడ నుండి కదిలిపోయాడు.

రవి మాటలు విన్న నాకు – నా ప్రస్తావన వాడు మనస్పూర్తిగా అంగీకరించ లేకపోతున్నాడన్న విషయం అవగతమయింది. అయితే సుధాకర్ గారు నా భర్త చనిపోయిన తరువాత ఎంత సహాయం చేసారు? ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నారు. ఇప్పటికి కూడా తమిద్దరిలో ఎటువంటి చెడు తలంపులు, ప్రవర్తన లేదు. అయినా తమకి ఎన్నో అపనిందలు, అవమానాలు. అప్పటికీ తాము వాటిని పట్టించుకోవటం లేదు. ఆలా అన్నీ పట్టించుకుంటే తమ మనుగడ ప్రశ్నార్ధకంగా మారుతుంది. ప్రశాంతత కరువవుతుంది. అందుకే గుండె రాటు చేసుకుని జీవన యాత్ర సాగిస్తున్నాము.

మనిషి జీవితం పరస్పర ఆశ్రయంతో నడుస్తుంది. జరుగుతుంది. పరస్పర అవగాహన లేదు. అనుమానం సందేహాలతో తాను నిర్మించుకుంటే, తీవ్రమైన గాలి వీచగా కూలిపోయే పేకమేడలా కూలుతుంది. జీవితంలో కొన్ని ఎదురు దెబ్బలు ఉంటాయి.

మనిషిలో మంచితనం అంతరించిపోయినప్పుడు, మానవత్వం నశించి మృగత్వం ఒళ్ళు విరుచుకున్నప్పుడు వెయ్యి తలలతో స్వార్ధం విషం కక్కుతున్నప్పుడు గుండె గాయపడుతుంది.

ఎవ్వరితో ఎంత వరకూ మాట్లాడాలో ముందే నిర్ణయించుకోవాలి. చెడు తలంపులు గల వాళ్ళని దూరం ఉంచాలి. వారితో వివాదాలకి దిగకూడదు. జ్ఞానవంతులతో మాట్లాడవచ్చు, వివేకం లేని వాళ్ళతో మాట్లాడవచ్చు  కాని మిడి మిడి జ్ఞానం ఉన్న వాళ్ళతో మాట్లాడకూడదు.

తను కన్న కలల పర్వతాల రెక్కలు విరిగి నేల మీద కూలిపోయినప్పుడు, ఊహలు ఊహల గాలిపటాలు తెగిపోయినప్పుడు, జీవితంలోని రంగులన్ని వెలిసిపోయి విషాదవర్ణం మిగిలిపోయినప్పుడు చెప్పలేని దిగులు కలుగుతుంది.

ఇలా సాగిపోతున్నాయి అంతూ పొంతూ లేని నా ఆలోచనలు.

నాకు ఎదురయిన మనుష్యుల, సంఘటనలు ఇలా నేను భావోద్వేగంతో ఆలోచించడానికి కారణం, ఏది ఏదయితేనేమి గడిచిన దానికంటే జరగబోతున్న దాని మీదే మన దృష్టి కేంద్రీకరించాలి. ఎందుకంటే కాలం అతి వేగవంతమయినది. గడిచిన కాలాన్ని వెనక్కి తీసుకురాలేము, అందుకే ప్రస్తుత సమయంలో ఆచితూచి ముందుకు అడుగు వేయాలి. అప్పుడు జీవన ప్రవాహంలో వేసిన ప్రతి అడుగు ఒక విజయ రహస్యానికి సంకేతంగా నిలుస్తుంది. ఇలా అనుకుంటున్న నాలో ఓ స్థిర నిర్ణయం. ఇది నా జీవితం. నేనే దీనికి కర్త, కర్మ క్రియ. నా జీవితాన్ని నేనే చక్కదిద్దుకోవాలి.

ఇలా ఆలోచిస్తున్న నాకు నా భర్త సూర్యం ఒక్కసారి గుర్తుకు వచ్చి కళ్ళు చెమర్చాయి. వెనువెంటనే సుధాకర్ గుర్తుకు వచ్చాడు. వాళ్ళిద్దరి మంచి స్నేహం. స్నేహం, స్నేహితులంటే అలా ఉండాలని తలపుకి వచ్చిన స్నేహం వాళ్ళది.

స్నేహం గురించి నాకు కొన్ని అభిప్రాయాలున్నాయి. స్నేహాన్ని కొనకూడదు. స్నేహాన్ని అమ్ముకునే వారికి దూరంగా ఉండాలి. స్నేహం అనేది బజారులో దొరికే సరుకు కాదు. కాలక్షేపానికి చేసే స్నేహం కన్నా మన కోసం ఆరాటపడే ఒక మంచి హృదయం ఉన్న స్నేహం ఒక్కటయినా చాలు.

సృష్టిలో తియ్యనిది స్నేహం. ఇద్దరి మధ్య స్నేహం కుదిరిన తరువాత దాన్ని పది కాలాల పాటు కాపాడుకోగలగాలి. స్నేహం మంచిని పెంచి పదిమందికి పంచగలగుతుంది. స్నేహ స్వరం సున్నితంగా, స్నేహితుల్ని పలకరిస్తూ ప్రతి నిత్యం, ప్రతి క్షణం ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది. స్నేహం లేని జీవితం నరకం లాంటిది. మంచి స్నేహం ఎలా అయినా కాపాడుకోవాలి. చెడ్డ స్నేహాన్ని డబ్బు ఖర్చు చేసి అయినా విడిచిపెట్టాలి.

ఇక మా విషయానికి వస్తే నేను ఒక విధంగా అనాథను. నా చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్న దురదృష్టవంతురాల్ని. మేనమామ పంచ చేరి జీవితం సాగిస్తున్న నాకు మేనమామ భార్య వల్ల ఎన్నో ఆరళ్ళు. ఏదో విధంగా ఇంటర్ పూర్తి చేసిన తరువాత టీచర్ ట్రినింగ్ పూర్తి చేసి ఓ స్కూల్లో ఉపాధ్యాయురాలిగా అవతారం ఎత్తాను. ఆరు, ఏడు తరగతులకి బోదించేదాన్ని.

ఆ స్కూల్లోనే  హైస్కూలు విభాగంలో సుధాకర్ మేథ్స్ అసిస్టెంట్. అయితే నా భర్త సూర్యం ఇంగ్లీషు, సోషలు చెప్పే వారు. సుధాకర్ సూర్యాన్ని ‘అన్నా!.. అన్నా!..’ అని పిలిచేవాడు. సూర్యం కూడా ఒక  విధంగా అనాథే. తల్లితండ్రుల్ని పోగొట్టుకుని ప్రేమ సమాజంలో పెరిగాడు.

అందుకేనేమో తమిద్దరి మద్యా ప్రేమ చిగురించి అది పెళ్లి వరకూ వచ్చింది. అతని తరుపున ఎవ్వరూ లేరు. నా తరుపున మా మావయ్యా వాళ్ళు నన్ను వెలి వేసారు. రిజిష్టారు ఆఫీసులో సుధాకర్ సమక్షంలో సూర్యానికి నాకు నిరాడంబరంగా పెళ్ళి జరిగింది. అంత వరకూ నన్ను సుధ మేడమ్ అని పిలిచే సుధాకర్ చనువుగా మెలిగేవాడు మా కుటుంబంతో.

ఇక సుధాకర్ కుటుంబం నేపథ్యానికి వస్తే అతని తండ్రిది చిన్నపాటి ఉద్యోగం. అతనికి వచ్చిన  ఆదాయంతో సుధాకర్‌కి వచ్చిన ఆదాయంతో వేడి నీళ్ళకి చల్లనీరు తోడయినట్లు గుట్టుగా ఆ మధ్య తరగతి కుటుంబ జీవితం  సాగిపోతోంది.

సుధాకర్‌కి ఇద్దరు చెల్లేళ్ళు. ఒక తమ్ముడు. వాళ్ళ చదువులకి పెళ్ళిళ్ళకి అయ్యే ఖర్చు సూర్యమే భరించి ఆ ఇంటికి పెద్ద దిక్కుగా ఉండి అన్నీ జరిపించాడు. ఈ విషయం తన భర్త తనకి చెప్పలేదు. నేను కూడా అడగలేదు.  మాటల సందర్భంలో సూధాకర్ ఈ విషయం నాకు చెప్పాడు. నాకు బాధ అనిపించలేదు. ఈర్ష్య  పడలేదు. వాళ్ళిద్దరిదీ ఎంత మంచి స్నేహం అని అనుకున్నేదాన్ని.

కుటుంబం బాధ్యతల వల్ల సుధాకర్‌కి పెళ్ళీడు మించి పోయింది. ఎవ్వరూ అతనికి పిల్లనివ్వడానికి ముందుకు రాలేదు. కొన్ని సబంధాలు వచ్చాయి కాని అతనికి నచ్చలేదు. అందుకే పెళ్ళి కాని ప్రసాదుగా మిగిలిపోయాడు. అయినా అతను బాధపడలేదు. అతన తల్లిదండ్రులు మాత్రం బాధపడ్డారు.

నేను బాగుపడాలి అని అనుకోవడం స్వార్ధం. నాతో బాటు అందరూ బాగుపడాలి అనుకోవడం మంచితనం. నేను ఎలా ఉన్నా ఎదుటి వారు బాగుపడాలి అని అనుకోవడం గొప్పతనం. సుధాకర్ ఆ మూడవ తరగతికి చెందిన మనిషి. తన ఎలా ఉన్నా తన వాళ్లు బాగుపడాలి అని అనుకోవడం వల్లనే కుటుంబ బాధ్యతల్ని నిర్వహించిన అతను జీవితంలో పెళ్ళి లేకుండా ఏకాకిగా  మగిలిపోయాడు. అయినా అతని వదనంలో ఆ భావాలే అగుపించవు.

రవి పుట్టిన తరువాత సూర్యం కన్న ఎక్కువ పొంగిపోయిన వ్యక్తి సుధాకర్. ‘తండ్రిగా నాకు నాకు నా కొడుకు మీద చూపించవల్సిన అభిమానం అంతా నా నుండి దోచేసుకున్నావు సుధా!’ అని సూర్యం అంటే ‘వాడు నాకూ కూడా కొడుకు లాంటి వాడే’ అనేవాడు సుధాకర్.

జీవితం చిత్ర విచిత్రాలు మనిషిని ప్రతి నిత్యం ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటాయి. ప్రతీ ఒక్కరూ జీవితంలో సుఖ శాంతులు కోరుకుంటారు. అయితే ఏదీ మన చేతిలో లేదు. ఎందుకంటే విధి చేతిలో ఆడుకునే ఆట బొమ్మలం మనం. విధి ఎలా ఆడిస్తే అలా ఆడుతూ దాని ఎదురు తలవంచవల్సిందే.

రవికి అయిదు సంవత్సరాలు వచ్చాయి. వాడి ఆట పాటల్తో మురిసిపోతున్న మా జీవితంలో ఓ కుదుపు. మా జీవితాల్ని తలక్రిందలు చేసే ఓ కుదుపు.

అదే నా భర్త సూర్యం గుండెపోటు అనే కారణంతో అకాల మృత్యువు పాలవడం. ఆ సంఘటనకి నేను తట్టుకోలేకపోయాను. ఒంటరివాళ్ళం అయిపోయామని ఏడుస్తున్న నాకు – ‘నేనున్నాను, ఎవరూ లేకపోవడం ఏంటి?’ అని తమకి దిక్కుగా నిలబడ్డాడు సుధాకర్.

ఆలోచనా ప్రపంచం నుండి బయటపడ్డాను.

జీవితంలో ఎన్ని ఆటుపోట్లు? సుధాకర్ తను పెళ్ళి బంధంతో ఒకటయితే తండ్రిని దూరం చేసుకున్న రవికి తండ్రి స్థానంలో సుధాకర్ ఉంటాడు. తమ పవిత్ర సంబంధానికి వక్ర భాష్యం చెప్తున్న వాళ్ళకి చెంప పెట్టు తమది సహజీవనం అని అనుకుంటున్న వాళ్ళకి కళ్ళు తెరిపించాలి.

నేను తప్పు చేయనప్పుడు సమాజం ఎదుట దోషిగా ఎందుకు నిలబడాలి? ఇప్పుడు తామిద్దరం ఇలా మూడు ముళ్ళ బంధంతో ఒకటవుదామనుకోడానికి కారణం కూడా రవితో చెప్పినట్టు లైంగికానందం కోసం కాదు. ఐదు పదలు వయస్సు దాటిన తమకి ఆ అవసరం లేదు. జీవిత చరమాకంలోకి చేరుకుంటున్న తమకి ఒకరికి మరొకరు తోడుగా నిలబడాలి బ్రతికి ఉన్నంత వరకు.

లోకం పోకడలు నేను చూస్తున్నాను. పెళ్ళవగానే తల్లిదండ్రుల్ని నిరాదరిస్తూ వాళ్ళకి మనస్తాపం కలిగిస్తున్న ఎంత మంది పిల్లలు లేరు ఈ సమాజంలో? ఎంత తల్లి చాటున పెరిగిన రవి కూడా నేటి సమాజంలో ఒకడు. వాడు కూడా తనతో పని చేస్తున్న అమ్మాయిని ఇష్టపడుతున్నట్టు, నాకు పరిచయం చేస్తానని చెప్పాడు.

మనష్యులు ఎప్పుడూ ఒకలాగే ఉండాలని లేదు కదా! వారిలో కూడా మార్పు రావచ్చు కదా. నాకు భద్రత కరువు అవచ్చు కదా. అభద్రతాభవం నాలో కలగచ్చు కదా. రవి అలాంటి వాడు కాదు. కాని ఎప్పుడూ మనుష్యులు ఒక్కలాగే ఉండిపోరు కదా!

అందుకే జీవితాంతం నా చేతిలో చేయి వేసి నన్ను ముందుకు నడిపించే తోడు కావాలని, ఆ తోడు సుధాకర్ అని అనుకున్నాను నేను.

(మరో కథ వచ్చే వారం)

Exit mobile version