చీకటి నిండిన మనసుగుహలో
అక్షరాల కొవ్వొత్తులను వెలిగించి
కవితావెలుగులతో నింపుదామని
ప్రయత్నిస్తున్నా
తోడవ్వవా దినకరా
అలసిన పాదమడుగులేయనట్టు
దుఃఖంలో కూరుకుపోయిన గుండె
కొట్టుకోనంటోంది
కాస్తమానవత్వపు చేదతో
దుఃఖాన్నితోడి
కరుణను నింపవా ప్రభాకరా
మకిలిపట్టినమనిషి ఉనికి
మనసు వాకిలిపై కారుమబ్బై
కమ్మేస్తుంటే
మూసుకుపోయిన దారిలా
మనిషితనం నిష్క్రమిస్తుంటే
దిక్కు తోచని మాకు
దీనబాంధవుడివై భాస్కరా
కాస్త దోవ చూపవా
మూగజీవులు ప్రేమజీవులై
కళ్ళతోనే కబుర్లాడుతుంటే
మాటనేర్చిన మేమేమో
కామంతోకళ్ళమూసుకుపోయిన
కబోదులమవుతుంటే
కాస్తాకళ్ళను ప్రేమచుక్కలతో కడిగి
వెలుగియ్యవయ్యా భాస్కరా
సి. ఎస్. రాంబాబు పేరెన్నికగల కథా రచయిత. కవి. “పసిడి మనసులు” అనే వీరి కథా సంపుటి పలువురి ప్రశంసలు పొందింది.
1 Comments
Sridhar
మీ కవితలో ఒక మంచి భావం అలాఅలా సెలయేరులోని నీరులా ప్రవహిస్తూ వెళుతూ ఓ అందమైన లయను కలిగి ఉంటుంది. బావుంది రాంబాబుగారు….