సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది తుమ్మూరి రాంమోహన్ రావు గారి వ్యాఖ్య:
    ~
    ‘నా గవాక్షం నుండి తొంగి చూస్తూ ….’
    నేను తరచుగా చెప్తుంటాను మిత్రులతో కార్యకారణ సంబంధం గురించి. చాలా ఏండ్ల కింద ఓ వారపత్రికలో విశ్వనాథ సత్యనారాయణ గారి పెద్దకుమారుడు విశ్వనాథ అచ్యుతదేవరాయలు రాసిన ‘ కైకేయి’ పౌరాణిక నవలలో ఈ కార్యకారణ సంబంధం గురించి చదివిన గుర్తు . అందులో మంథర పూర్వ జన్మ వృత్తాంతం ఉంటుంది. మనందరం ఆడిపోసుకునే మంథర పాత్ర లేకుంటే రాముడు అరణ్యవాసం చేయటం గానీ సీతాపహరణం గానీ రామాయణం గానీ జరిగే అవకాశాలు లేవు. ఇది కేవలం కార్యకారణ సంబంధం గురించి చెప్పడానికి మాత్రమే తీసుకున్న ఉదాహరణ. విషయం ఏదైనా సరే ఒక పని జరగడానికి ముందుగా కొంత నేపథ్యం తయారౌతుంది. ఈ ఆటుపోట్ల కావేరి ఆత్మకథ అనువాదం వెనుక గూడా అలాంటి కార్యకారణ సంబంధం ఉన్నది.
    డా. వెలుదండ నిత్యానందరావు కాబేరీ (కావేరి ) ఛట్టోపాధ్యాయ గారి ‘పీపింగ్ త్రూ మై విండో ‘ పేరుతో ఆంగ్లంలో రాసుకున్న ఆత్మకథను తెలుగులోకి అనువదించారు. ఇప్పుడు కావేరిగారు ఆయనకు దైవమిచ్చిన “అక్క” అయినా ఈ అనువాదం ఆరంభ దశలో పూర్తిగా అపరిచితురాలు. నిత్యానందరావు గారు నిరంతర పరిశోధనాసక్తులు. ఉస్మానియా విశ్వ విద్యాలయ తెలుగు శాఖాధిపతిగా చేసి పదవీ విరమణ గావించిన వారు. అందరివలె కవిత్వం , కథ, నవలా రచనల జోలికి వెళ్ల కుండా పరిశోధన పైన దృష్టి పెట్టిన వారు. ఇంత వరకూ ఏ అనువాదము చేపట్టని వారు. అలాంటి మనిషి ఒక అపరిచితురాలి ఆత్మకథను అనువాదం చేయడం ఆశ్చర్యకరమైన విషయం. ఏదో ఒక గ్రంథం ఆవిష్కరణ సభలో ఒక బెంగాలీ మిత్రుని చేతిలో కనబడిన ఈ పుస్తకం చూడగానే ఎందుకో ఈయనలో దాన్ని అనువాదం చేయాలనిపించడం, అదే మాట ఆ మిత్రునితో అనడం , ఆయన సరే ననటం ,అది రెండు నెలలు శ్రమించి అనువాదం చేయడం , అది పుస్తకంగా రూపొందడం
    విచిత్ర మైన విషయం. చాలా మంది తమ పుస్తకాలను ఇతరభాషల్లోకి అనువాదం చేయించుకోవడానికి తెగ ప్రయాసపడతారు. కానీ కావేరి ఛటోపాధ్యాయ గారి అదృష్టం ఏమో గానీ , ఆమె అడగకుండానే, అనువాదకుని ఆసక్తి మేరకు ఆ పని సజావుగా సాగింది. ఈ ఆత్మకథ చదువుతుంటే ఒకచోట కావేరీ గారు భర్తతో తొలిసారి ఉద్యోగరీత్యా సికింద్రాబాద్ వచ్చారు. అక్కడ కొంత కాలం ఉన్నాక , కొన్ని నెలలు హైదరాబాదు లో కూడా ఉండటం జరిగింది. అంతే ఆమెకు తెలుగునేలతో సంబంధం . అది కూడా ఆమె భర్తకు ఉద్యోగం వచ్చిన కొత్తలో. (1983-84). ఇప్పుడు కావేరి గారు అమ్మమ్మ , నానమ్మ దశలో ఉన్నారు.
    సరే , కావేరి గారు తన ఆత్మకథను తన హృదయగవాక్షం నుండి చూస్తూ దొరలి పోయిన సంఘటనలను, అనుభవాలను అనుభూతులను జ్ఞప్తికి తెచ్చుకుని రాసారు. తాను పుట్టిన రోజున మొదలైన కథ , తను క్యాన్సరు బారిన పడి కోలుకొని అడపా దడపా బెంగుళూరు లో ఉండే అబ్బాయి, అమ్మాయిల దగ్గరికి రాకపోకలదాకా సాగింది. కథ చదువుతుంటే మన తెలుగింటి కథలానే అనిపించింది. తన తల్లి తండ్రికి రెండవ భార్య. తండ్రి ఇంగ్లీషు లెక్చరరు . ఒకరకంగా చండశాసనుడే. సవతితల్లి సంతానం ఇద్దరక్కయ్యలు, తన తమ్ముడు చెల్లెలు , తల్లి అనారోగ్యం, తమ్ముడి ఉపనయనకాలం లో మానసికరోగిగా మారటం, మేనమామల ప్రేమ, స్వంత ఊరిలో ప్రకృతి అందాలకు పరవశించడం, చదువుకుంటూ ఉద్యోగం చేయడం , తల్లి అకాల మరణం, వివాహం ,,తండ్రి మరణం, మనసెరిగిన భర్తతో కాపురం ,పాతికేళ్ల్ల ప్రాయంనుంచి చనిపోయే వరకు తమ్మని బాధ్యత స్వీకరించడం, ఉద్యోగరీత్యా పలు ప్రదేశాలకు తరలి వెళ్లడం, పిల్లల పెంపకం తో పాటు తన బి.ఇడి. డిగ్రీ పూర్తి చేయటం
    రామకృష్ణ మిషన్ స్కూల్లో కొంతకాలం పనిచేయడం, అత్తా మామలను సేవించడం, తను క్యాన్సరు వ్యాధి బారిన పడటం, కెమో థెరపీ చికిత్స చేయించుకోవడం, కోలుకోవడం ఇత్యాదిగా ఉన్న సందర్భాలతో ఈ ఆత్మకథ జీవితంలోని రకరకాల ఆటుపోట్లకు తట్టుకుని నిలబడటం ప్రధానంగా కనిపిస్తుంది. బెంగాలీ ఆచారాలు, వ్యవహారాలు, వంటలు , తిండ్లు , కట్టుబాట్లు తెలుగు వాటితో పోల్చుకునే విధంగా కనబడతాయి. తొలి ప్రయత్నమైనా డా. వెలుదండ నిత్యానందరావుగారు అనువాదం చేయడంలో కృతకృత్యు లయ్యారు. ఈ అనువాదం చదువుతుంటే స్థలాలు , మనుషులు మాత్రమే వేరు , కథాంశంలో సాధారణీకరణ కనబడుతుంది. ఆడవారి అగచాట్లు అంతటా ఒకటే అనిపిస్తుంది. శత్రువుకు కూడా రాకూడదని భావించే కష్టాలను స్వయం గా అనుభవించి ఆశావహ దృక్పథంతో , మానసిక స్థైర్యం తో అధిగమించి విజేతగా నిలిచారు కాబేరీ చటోపాధ్యాయ్ గారు.
    ఒక పొరుగు రాష్ట్రానికి చెందిన ఆత్మకథను మన తెలుగు వారికి అందజేసిన మిత్రులు వెలుదండ నిత్యానందరావు గారికి అభినందనలు. వారి కలం నుండి ఈ పరంపర ఇక ముందు ఇలాగే కొనసాగుతుందని ఆశిస్తున్నాను. సీరియల్ గా ప్రచురిస్తున్న సంచిక సంపాదకులు కస్తూరి మురళీకృష్ణ గారికి కృతజ్ఞతలు.
    తుమ్మూరి రాంమోహన్ రావు.
    రిటైర్డ్ హెడ్మాస్టర్. కవి,రచయిత

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది డాక్టర్ కొండపల్లి నీహారిణి గారి వ్యాఖ్య:
    *
    జీవితానికే ఓ పాఠం’ ఆటపోటుల కావేరి’.
    ఆచార్య వెలుదండ నిత్యానంద రావు గారు అనువదించిన “ఆటుపోటుల కావేరి” ఆత్మకథ చాలా అద్భుతంగా ఉన్నది. శ్రీమతి కావేరి చటోపాధ్యాయ గారి ఆత్మకథ ఇది. జీవిత చరిత్ర అనడం కంటే ఐదు, ఆరు దశాబ్దాల క్రింద జన్మించిన సగటు స్త్రీల బంధనాల చరిత్ర అనడం బాగుంటుందేమో అన్నంత బాగా ఉంది.. “Peeping through my window” అనేది ఎందరి హృదయ కవాటాల కథనో!
    కావేరి గారి ఈ జీవిత కథను చదువుతుంటే చాలా విషయాలు మా జీవితాల్లో మేము అనుభవించినవే కనిపించాయి. ఎక్కడ వర్ణనలు వాడాలో, ఎక్కడ కథనం నడిపించాలో తెలిసిన చేయి తిరిగిన కలం కావేరి గారిది. సనాతన సంప్రదాయాలకు ప్రాణమిచ్చే కుటుంబాలలో అభ్యుదయ భావాలు ఎలా చిగురించాయో చక్కగా రాశారు. మహారాష్ట్ర, అరుణాచల్, పంజాబ్, ఒరిస్సా వంటి ఎన్ని ప్రదేశాలను చూపించారు?ఎన్ని ప్రదేశాలకు మమ్మల్ని వేలు పట్టుకుని నడిపించారు!భార్యాభర్తల అనురాగం ఆదర్శవంతంగా ఉంటే ఎంతటి భయంకర జబ్బులనైనా దూరం చేస్తుంది అని చెప్పడానికి కావేరి గారి జీవితంలో చూస్తాం. “సత్యసంధత నిజాయితీలను పెంచుకోవడం వల్లనే మన మీద మనకు నమ్మకం, మన శక్తి సామర్థ్యాల మీద విశ్వాసం పెరుగుతాయి” అంటారు కావేరి గారు. ఈ మాటలు పాఠకులకు కొండంత ధైర్యాన్ని కలిగిస్తాయి. వారికి క్యాన్సర్ వంటి భయంకరమైన జబ్బు వచ్చినా ఆత్మస్థైర్యాన్ని చేతబట్టుకొని ఉన్నతమైన ఆలోచనలతో ఇంత ఆనందంగా కనిపిస్తు చెదరని ధైర్యాన్ని పాఠకులకు కలిగిస్తున్నారు.”బలహీనమైన మనస్సు దెయ్యాల కొంప”,”మనలోకి ప్రతికూల భావాలేవీ ప్రవేశించి సతమతం చేయకుండా మనసులో దుర్భేద్యమైన గోడను నిర్మించుకోవాలి” అని చెప్పడం ఎంతో ఆశావహంగానో ఉంది, ప్రేరణను కలిగిస్తున్నది.”నీ జీవితాన్ని నువ్వు ప్రేమించు” అని చెప్పే కావేరి గారు 2020కి 14 ఏళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు చూస్తే క్యాన్సర్ వచ్చిందా అన్నట్టుగా నాదొక ఆనందపరమైన జీవన ప్రస్థానం అని సగర్వంగా చెప్పుకోగలుగుతున్నారు. దీనికి ఏ కొలమానాలు ఉంటాయి? వీరి ధైర్యానికి, ఉన్నతమైన ఆదర్శ భావాలకి హృదయపూర్వక అభినందనలు సమర్పించడం పాఠకురాలిగా నా ధర్మం. ఇంత మంచి రచనను ధారావాహికగా అందించిన ‘సంచిక పత్రిక’ వారికి, ఇంగ్లీషులో నుంచి తెలుగులోకి అనువదించి మాకు అందించిన డాక్టర్ వెలుదండ నిత్యానంద రావు గారికి, బతుకు తీయదనాన్ని విడమర్చి చెప్పిన మూల రచయిత్రి కావేరి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.
    – డాక్టర్ కొండపల్లి నీహారిణి కవయిత్రి రచయిత్రి సంపాదకురాలు.*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!