[‘యాక్టర్’ అనే అనువాద కథని అందిస్తున్నారు శ్రీమతి బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి. ఒడియా మూలం అరవింద్ రాయ్.]
నాటకం పేరు – విస్థాపనము
స్థానం – మాతా మంగళా బస్తీ యొక్క ఆఖండలమణిమందిరం ఎదురుగా.
సమయం – రాత్రి పదకొండు గంటలకు.
బావ్నా మిశ్రీ వాళ్ళ డాబా వద్ద ఒక ట్రాలీ రిక్షా.
ట్రాలీ రిక్షా మీద మూటలు కట్ట కట్టి ఉన్నాయి. వాటి మీద ఏదో పార్టీది పాత బ్యానర్ తిరగదిప్పి వేసుంది. దాన్నే సింహాసనంగా చేసుకుని ఠీవిగా కూర్చుని, సిగరెట్ తాగుతున్నాడు రంగా నాయక్.
బస్తీలో అందరూ బీడీ తాగితే రంగా నాయక్ విల్స్ ఫిల్టర్ తాగుతాడు. బస్తీ వాళ్ళంతా సారా లేదా కల్లు తాగితే రంగా నాయక్ విదేశీ విస్కీ తాగుతాడు.
రంగా మాసిన మురికి జీన్స్ వేసుకున్నాడు. జీన్స్ మీద ఒక ఎల్లో టీ షర్ట్. దానిమీద – I AM GENIUS అని వ్రాసుంది.
రంగా నాయక్ ట్రాలీ సినిమాహాల్ బాల్కనీ సీట్ అనుకోండి. రంగా అక్కడ కూర్చుని ఠీవిగా సిగరెట్ తాగుతూ నాటకం చూస్తున్నాడు.
మాతా మంగళా బస్తీ యువసంఘం ద్వారా ఈ ఏటి సూపర్ హిట్ నాటకం ‘విస్థాపనము’ ప్రదర్శించబడుతోంది.
వేదిక నలువైపులా ప్రేక్షకుల రద్దీ కనిపిస్తోంది.
వేదికకు చుట్టూ బ్లూ రంగు జరీ అంచు ఉంది, నాలుగు వైపులా పూరిళ్ళు ఉన్నాయి.
ఇండ్ల పైన డిష్ ఏంటెన్నా ఉన్న డాబాలు అనేకం. ఇండ్లను ఆనుకుని జరీ అంచులా టాయ్‌లెట్స్ ఉన్నాయి. టాయ్ లెట్ ఎదురుగా నీళ్ళు నింపిన ప్లాస్టిక్ డ్రమ్, లేదా టిన్స్ ఉన్నాయి. టాయ్‌లెట్ వెనుకపక్క తడినేల మీద రెండు మూడు పందులు అటూ ఇటూ తిరుగుతున్నాయి. తోపుడు బండి చాట్ వాడు బండి మీద ‘మాతా సుభద్ర పెసల్ చార్ట్’ అని వ్రాసి పెట్టుకున్నాడు. చాట్ బండి వెలుగులో నూనె ఓడుతున్న కొందరు యువతుల ముఖాలు కనిపిస్తున్నాయి. అటు వైపు పాన్, బీడీలమ్మే చిన్న పచారీ కొట్టు ఉంది. కేబిన్ లోపల మనుషులు కనిపించరు. ఎందుకంటే వాళ్ళ ముఖాలకు అడ్డుగా షాంపూ, గుట్కా, దాల్చీనీ, ఇలాయచీ పొట్లాలు పొదిగిన హారాలున్నాయి. అప్పుడప్పుడూ ఆ కొట్టు వెనకవైపు కొన్ని కుక్కలు కూడా మొరుగుతున్నాయి. బస్తీ వెనుకవైపున వెనుక రాత్రి ట్రైన్, రాకాసిలా ఛుక్ ఛుక్ మంటూ పరుగెత్తి వస్తోంది. ఈ అన్ని గందరగోళాలు, శబ్దాల కోలాహలంలో వేదిక మీది డైలాగ్స్ వినపడీ వినబడనట్లుంటాయి.
రంగా రంగస్థలం వైపు కళ్ళు చికిలించి చూశాడు. వేటకు వచ్చిన అడవిపిల్లిలా చెవులు నిక్కించి సావధానంగా నిలబడ్డాడు. కుడిచేతి రెండు వేళ్ళ మధ్య సిగరెట్ వెలుగుతోంది. రంగస్థలం వైపు చూసి, ‘ఎవరూ, ఎవరది? వీడి రాఢంగ్ పార్టీ వాడిలా డైలాగులు వదులుతున్నాడు! ఎక్కడినుంచో డబ్బులకు వచ్చినట్టున్నాడు. వెధవ! యాక్టింగ్ బాగా చేస్తున్నాడు. వీడి తల్లి చచ్చినట్టు ఏమి ఏడుపు ఏడుస్తున్నాడు, ఆ హీరాకుడ్ ఆనకట్ట కోసం పొలమూ పుట్ర, పిల్లాపీచూ అన్నీ పోగొట్టుకున్నట్టు ఏడుస్తున్నాడే!’ అనుకున్నాడు మనసులో.
ఆ పిల్లాడు రంగస్థలం మీద ఎంత బాగా యాక్టింగ్ చేశాడంటే అందరికీ కళ్ళు తడిశాయి.
స్టవ్ రిపేరు చేసే కొట్టు పెట్టుకున్న ఖడుకీ, కుళాయిలు రిపేర్ చేసే సునాకర్, గ్రిల్ ఫ్యాక్టరీలో లోహాలు కొట్టి సాగదీసే గేండువా, మర్డర్ కేసులో బెయిల్ మీద బయటికొచ్చిన సతురా అందరూ కంట తడిపెట్టారు.
ఆ రాత్రే రంగా వివరాలు కనుక్కున్నాడు. తన నటనతో అందర్నీ ఏడిపించిన వాడు ధూసా మైతీ.
బాబ్నా మేస్త్రీ ద్వారా తెలిశాయీ వివరాలు. ఆ పిల్లాడి తండ్రి రంగులు వేసేపని బాగా చేస్తాడట. ఏడంతస్తుల పైనుంచి జారిపడి చనిపోయాడు. తల్లి రోజంతా కూలి పని చేస్తుంది. రాత్రి ఉడికించిన గుడ్లు అమ్ముతుంది. ఈ పిల్లాడు ఎప్పుడూ బలాదూర్‌గా తిరుగుతుంటాడు. ఒక పిల్లతో పెళ్ళి ఖాయం చేశారు. తల్లిని కొట్టి డబ్బులు లాక్కుని అంతా ఆ పిల్లకు ధారపోస్తాడు.
రంగా నాయక్‌కు ఈ వివరాలు చాలు. పోద్దున్నే ధూసా మైతీ అనే ఆ నటుని ఇంటికి చేరాడు. ధూసాకు రంగా ఎవరో తెలుసు. రంగా బస్తీకి ఎప్పుడో ఓసారి వస్తాడు. బస్తీవాళ్ళకు పనులు ఇప్పిస్తాడు. వాళ్ళ పనుల కోసం రాజకీయ నాయకుల దగ్గరికి, పోలీసుల దగ్గరికి వెళ్తాడు. బస్తీలో చందాలు వసూలు చేస్తాడు. ఎప్పుడంటే అప్పుడు బస్తీలో ఎవరో ఒకరింట్లో డేరా వేస్తాడు. ఒంట్లో దేవుడు పూనుతాడు. దొమ్మీలు చేస్తాడు. బస్తీ అంతా తగలబెడతానని బెదిరిస్తాడు. అయినా బస్తీలో అతడికి గౌరవం ఉంది. అందుకే రంగాకు ఎవరైనా తెలిసినా, తెలియకపోయినా, బస్తీ లోని జనాలందరికీ రంగా ఎవరో తెలుసు.
రంగా అడిగాడు. “డబ్బు సంపాదించాలా?”
ధూసా కళ్ళలో వెలుగు డబ్బు మాట వినగానే. కానీ నోరు విప్పలేదు.
“ఒరే! రాత్రి ఇక్కడ కూలీ చేస్తావా?” రంగా కళ్ళు తిప్పుతూ అడిగాడు.
ధూసాకు రంగా మజాక్ చేస్తున్నాడనిపించింది. అందుకే తల వంచుకొని ఊరుకున్నాడు.
“వెధవా! లవ్ చేస్తావు. జోబులో డబ్బులు లేవు. పెండ్లెలా చేసుకుంటావ్? పెండ్లి చేసుకోకుంటే పిట్ట ఎప్పుడో ఎగిరిపోతుంది.” అని లోభపెట్టాడు. ధూసా చలించాడు. ఏదో చెప్పాలని చూశాడు గానీ మాట్లాడలేకపోయాడు.
రంగా నే అన్నాడు, “నిన్న రాత్రి యాక్టింగ్ భలే చేశావు. దిల్ కుష్ అయిపోయింది. ఒరేయ్, ఇలా యాక్టింగ్ చేస్తే లక్షలు సంపాదిస్తావు. వెధవా! లక్షలేందిలే, అనుకుంటే రాజకీయనాయకుడై పోతావు.”
ధూసాకు ఉత్సాహం వచ్చింది. “యాక్టింగ్‌లో డబ్బు వస్తుందా?” అని అడిగాడు.
“ఒరే, వస్తాయిరా. ఈవేళ నాతో రా. ఈ వేళ్టి నుంచి నీ వ్యాపారం మొదలు. ” రంగా ధూసా వీపు తట్టి చెప్పాడు. ధూసా వెఱ్ఱిమొహం వేసుకుని చూస్తున్నాడు. “వెధవా! కటక్ లో చాలామంది సారాయి తాగి ఖల్లాస్ అయినారంట. ఒరే వెధవ, ఆ యాపారం కాంట్రాక్టు నాకు దొరికింది.”
“అంటే?” అడిగాడు ధూసా.
“పదిహేడు పజ్జెనిమిది మంది మొగుడు చచ్చిపోయిన ఆడోళ్ళు, నీలాంటి పది పన్నెండు మంది బోళా మగపిల్లలు కావాలి. మీరందరూ గవర్నర్ హౌస్ ముందు ర్యాలీ తీయాలి. సర్కార్ ముర్దాబాద్ అనాలి.” అని చెప్పాడు రంగా.
“నేనేం చేస్తానక్కడ? మా వాండ్లెవళ్ళూ సారాయి తాగి సావలేదు.” ధూసా ఆశ్చర్యంగా అడిగాడు. ఆ మాటకు అక్కడున్న వాళ్ళందరి మొహాలు మాడడం చూశాడు. రంగా పగలబడి నవ్వాడు. “ఒరే వెధవా, నీవు బార్ లైట్ వేరా. నీవెలా లవ్ చేశావు? ఆ ర్యాలీలో నీ పేరు కృష్ణా రేడీ. తండ్రి పేరు పమాలు రేడీ.”
“నా పేరు ధూసాసన్ మైతీ. బాపూ పేరు నిహాల్ మైతీ. జిల్లా చౌబీస్ పర్ గణా.”
“చుప్ బే!” రంగా గట్టిగా అరిచాడు. “ఒరే వెధవా! నిన్న డ్రామాలో ఏం పేరు నీకు?”
“శంకర్ పూజారి” సంకోచిస్తూ చెప్పాడు ధూసా.
“నీవు ధూసా మైతీనంటివే, నిన్న రాత్రి శంకర్ పూజారివెలా అయ్యావు?”
రంగా మాటలు పూర్తి అయ్యీ కాకముందే ధూసా “అది డ్రామా” అన్నాడు.
“ఆ! అదే నేను జెప్పేది. అక్కడెట్ల డ్రామా చేశావో అట్లే డ్రామా చేయాలి. సంపాయించాలి. ఇయ్యాల్టి నుంచీ నీవు కృష్ణా రేడీవి. నీ బాపూ పమాలు రేడీ. బాపూ రిక్షా నడుపుతాడు. నీ ఇల్లు పటాపోల్ కాలువ దగ్గర బస్తీలో ఉంది. బాపూ ఆరోజు సారాయి తాగి రాత్రి ఇంటికొచ్చి, ఆ.. ఆ తర్వాత చెప్పు. ఏడ్చుకుంట జెప్పాలి. పత్రిక వాళ్ళు చాలా డేంజరు. నీవు ధూసావని, నేను నిన్ను అక్కడ ఫిట్ చేశానని నీ పొట్టలోంచి మాట బయటికి రానే గూడదు. డ్రామా పది గంటలకు మొదలు. బండిలో పో. అక్కడ యాక్టింగ్ చేయి. మధ్యానం తిని, తాగి ఇంటికి పో. ఇదిగో ఈ పావలా.”
జీవితంలో మొదటిసారి ఐదు వందలు సంపాదించే సంతోషంలో ధూసా మైతీ రంగాను దేవుణ్ణి చూసినట్టు చూశాడు.
డ్రామా మొదటి రోజు ధూసా యాక్టింగ్ బాగా చేశాడు. మీడియా వాళ్ళ ముందు గుండెలు బాదుకుంటూ, “మా బాపూ పమాలు రేడీ, రోజూ మాదిరే రిక్షా నడిపి ఇంటికొచ్చేముందు ఒక బాటిల్ తాగి వచ్చినాడు. అంతే, ఇంట్లో కొంచెం తనకలాడినాడు, సచ్చిపోయాడు. అయ్యో మా బాపు..” అంటూ రేడీ నని చెప్పుకొని ఏడిచాడు, నేలపైన పడి దొర్లి దొర్లి ఏడ్చాడు. గుండెలు బాదుకొని ఏడ్చాడు. తన దురదృష్టాన్ని తిట్టిపోశాడు. ఇలా జరగడానికి కారణమైన దుష్టుల్ని పట్టుకోమని సర్కార్‌ను డిమాండ్ చేశాడు. ఉరేయాలన్నాడు.
ర్యాలీ తర్వాత మినీ ట్రక్ వచ్చింది. అందరూ తమ తమ ప్లేకార్డులు తీసుకొని ట్రక్‌లో కూర్చున్నారు. రంగా సాయంత్రం బస్తీకి తిరిగొచ్చాడు. ధూసాకు 100 రూపాయలు బక్షీస్ ఇస్తూ, “ఈ యాక్టింగ్‌తో నీవు రాజకీయ నాయకుడైపోతావు.” అన్నాడు.
మొదటి సంపాదన వచ్చిన సంతోషంతో ఫ్రేమికకు వందరూపాయల ప్రీపెయిడు ఎయిర్ సెల్ వోచర్, థర్టీ ఫోర్ రెడ్ ఇన్నర్స్ కొన్నాడు. ఝర్నా సంకేతస్థలానికి వచ్చింది. లోహాలు, చెక్కముక్కలు, గాజు ముక్కలు పడి ఉండే గోదాము వెనక వాళ్ళ సంకేతస్థలము. ధూసా తను తెచ్చిన రెండిటినీ ఝర్నా చేతుల్లో పెట్టాడు. “ఈరోజు నుంచి పనిలో సెట్ అయినాను. ఆ సంపాదనతోనే తెచ్చినాను.” అన్నాడు.
రెండు వస్తువుల్ని చూసి ఝర్నా నమ్మలేకపోయింది. అయినా కుతూహలంగా అడిగింది. “ఏం పని దొరికిందేం? ఇంత సంపాదనా!”
“యాక్టర్” ధూసా జవాబుకు ఝర్నా ఉలిక్కిపడింది. “ఈరోజు నుంచి నేను యాక్టర్ని. షారుఖ్, అనుభవ్.. వాళ్ళ మాదిరే నేనూ యాక్టర్ని.”
ఆ మసకచీకట్లో ఎంతో బేలగా ఆమె ధూసాను చూసింది. ఆశ్చర్యంగా “వావ్! అమ్మో! యాక్టరా?” అంది.
ధూసా ఆమెను దగ్గరికి లాక్కుంటూ, “టీవిలో చూడు. న్యూస్ పేపర్‌లో చూడు. నా ఫోటో వస్తుంది. నేను యాక్టర్ను.” డ్యూయెట్‌లో మాదిరి ఝర్నాను పట్టుకుని, “నిన్నూ నన్నూ కలిపేదే ఈ ప్రేమకథా.. లాలాలా..” అంటూ పాడాడు.
ధూసా ఛాతీ మీకికి ఝర్నా ఒరిగింది. “వదులు. ఎవరైనా చూస్తారు.” అంటూ ఇంకా దగ్గరికి వచ్చింది. మొదటిసారి ఆమెకు ఈ ఛాతీ నమ్మదగినదే అనిపించింది. ధూసా మాటల్లో ఆత్మవిశ్వాసం ఉండింది.
ఝర్నా, “అయితే పెళ్ళెప్పుడు చేసుకుందాం? ఇప్పుడిక సంపాదన కూడా ఉంది కదా! అమ్మకేం అభ్యంతరం ఉంటుంది?” అంది.
ధూసా, “రేపు కావాలంటే రేపే చేసుకుందాం. నాకు సొంత సంపాదన లేదా ఏమి?” అన్నాడు.
నిజంగా ధూసాకేమీ లెక్కలేదు. నెల తిరక్కుండానే ఆఖండల్ మణి మందిరంలో ఝర్నాకు హారం వేసి పెళ్ళి చేసుకుని ఇంటికి తీసుకెళ్ళిపోయాడు.
పెళ్ళి అయిన మరుసటిరోజే ఇంకొక పని దొరికింది. “సైకిల్ గుర్తు వాళ్ళ ర్యాలీ ఉంది. వాళ్ళ నాయకులు దిల్లీ నుంచి వస్తారంట. పోలీసుల మీద రాళ్ళు రువ్వాలి. వెదురుతో చేసిన బారికేడ్లు ఇరగ్గొట్టాలి. తిరిగొచ్చేటప్పుడు బిర్యానీ తినొచ్చు. పైన వెయ్యి రూపాయలిస్తారు. అరెస్ట్ అయితివా, నీ తల్లికి, పెండ్లానికి తలో వెయ్యీ, మూడురోజులు భోజనం, బెయిల్ మీద వచ్చాక మళ్ళీ యాక్టింగ్.” అని రంగానాయక్ చెప్పాడు.
ఈసారి కూడా ధూసా నెగ్గుకొచ్చాడు. జైలుకు వెళ్ళాల్సిన పని పడలేదు. అందుకే బిరియానీ ప్యాకెట్, వెయ్యి రూపాయలు తీసుకొని తిరిగొచ్చాడు. ఝర్నా ఎదురొచ్చి సంతోషంతో వాటేసుకొని ధూసా మెడ చేతులతో చుట్టేసి ఉయ్యాలలూగింది. “ఈరోజు జిందాబాద్ చేస్తున్న ఆ సైకిల్ పార్టీ వాళ్ళు మంచోళ్ళు కాదు. వాళ్ళ పార్టీలోకి ఎలా వెళ్ళావు?”
ధూసా అన్నాడు, “అరె అవన్నీ మనకెందుకు, మనం యాక్టర్. ఎవరు పిల్చారో, టకటక నోట్లెంచి ఇచ్చేవారెవరో వాళ్ళ వెనుకే మనం. మన మంచి చెడూ దీంట్లో ఏముంది? నాటకాలవాళ్ళ లాగే మన పని కూడా. అంతే. వాళ్ళ దగ్గర సీన్ స్క్రీన్ ప్లే ఉంది. లైట్ – మైక్ ఉంది. వేషముంది. అవి వదిలేస్తే మనమూ వాళ్ళూ ఒకటే.”
ఝర్నా డబ్బు లెక్కబెట్టింది. ముద్దు ఇచ్చింది. ధూసా కౌగిట్లో కరిగిపోతూ మెల్లగా, “దుష్టుడివి నీవు.” అంది.
రంగా నిజమే చెప్పాడు. ఈ రాజధానిలో ప్రతిరోజూ పని దొరుకుతుంది. పెట్రోల్ రేట్ పెరిగితే యాపారమే. ఎక్కడో గొడవలు జరిగితే యాపారమే. ఎక్కడో రాస్తా రోకో జరిగితే యాపారమే.
“మనకు సొంత ఊరు, ఠికానా ఏమీ లేదు. జాతి జంజాటం లేదు. ఇల్లు లేదు, కుటుంబం లేదు. రాత్రి గడిస్తే కొత్త పేరు తగిలించుకోడమే. రాత్రి గడిస్తే కొత్త కొత్త చోట్లకు సొంతవాళ్ళమైపోడమే. చెట్టు పార్టీ వాళ్ళు దుడ్లిచ్చి చేప పార్టీవాళ్ళను తిట్టిపోయాలంటే సిద్ధమే. మనం వాళ్ళని తిట్టిపోస్తాము. చేప పార్టీ వాళ్ళు దుడ్లిచ్చి, ‘చెట్టు పార్టీవాళ్ళు మా ఆడోళ్ళని అవమానం చేశారని’ అన్నారనుకో. మనం ఒకటికి రెండు కల్పించి వాళ్ళు బట్టలూడదీశారని ఇలా ఏవేవో చెప్తాం. ఎవరూ మనకు శత్రువులూ కారు. మిత్రులూ కారు. ఇది మన యాపారం. ఎవరి ఉప్పు తింటే వాళ్ళ పాట పాడడమే.” అని రంగా నూరిపోశాడు.
ధుసాసన్ ఎప్పుడైనా ఒంటరిగా రాత్రి పూట కూర్చుని ఆలోచిస్తుంటాడు. ఇలా ఎన్ని రోజులు నడుస్తుంది యాక్టింగ్? ఇప్పుడు కొడుకు ఐదేండ్ల వాడైనాడు. కుటుంబం పెరిగే కొద్దీ, తినేవాళ్ళు పెరుగుతారు. అమ్మకు పనికి పోయే శక్తి తగ్గిపోయింది. ఝర్నా కూడా రోజూ ఏదో ఒక కంప్లైంట్ తీసుకొస్తుంది. మొదట్లోలా దగ్గరకు రాదు. ఆమె ఒంట్లో అప్పటి తాపం లేదు.
ఆరోజు సాయంత్రం ఐదేళ్ళ కొడుకు మళ్ళీ ఒక షాకిచ్చాడు. బస్తీ పిల్లలతో ఆడి ఇంటికొచ్చి తల్లిని అడుగుతున్నాడు, “అమ్మా, టూనా అంటున్నాడూ, వాళ్ళ నాయనకు కొట్టు ఉందంట. పింటూకేమో వాళ్ళ నాయన మేస్త్రీ. మా నాయన ఏమి చేస్తాడు? నేనేమని చెప్పాలి?” మొండిపట్టు బట్టి అడుగుతున్నాడు పిల్లాడు. “చెప్పు. మా నాయన ఏమి చేస్తాడు? నేనేం చెప్పాలి? చెప్పు?” ధూసా తన బ్యాగ్ సరిచేసుకుంటున్నాడు. చిన్న పిల్లల ప్రశ్నలు చెవిలో బడినాయి. లేచివచ్చాడు. పిల్లాడ్ని ఒడిలోకి తీసుకొని.”మా నాయన యాక్టర్ అని నువ్వు జెప్పు.” అన్నాడు.
పిల్లాడు వెఱ్ఱిమొహం వేసుకుని చూస్తున్నాడు.
“వాళ్ళ నాయనలంతా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తారు. కానీ మీ నాయన ఒక యాక్టర్. ఒక్కోసారి రాజు యాక్టింగ్, ఒక్కోసారి పులిగా గాండ్రించడం, ఒక్కోసారి పోలీస్ కావడం, ఒక్కోసారి రిక్షావాలా కావడం.” అన్నాడు.
ధూసా ఒళ్ళోంచి జారిపోయి పిల్లాడు గెంతసాగాడు. వెళ్తూ వెళ్తూ, “మా నాయన యాక్టర్! మా నాయన యాక్టర్!” అని కేకలేస్తున్నాడు.
‘ఈ లైన్ విడిచిపెట్టాలి. రోజూ జరిగే వ్యాపారమేదన్నా జూసుకోవాల. ఆడదేమో పానీపూరి బండి నడపమంటుంది. అమ్మేమో గుడ్లు ఉడికించి అమ్మమంటుంది.’ అని ఆలోచిస్తున్నాడు ధూసా. ఇదే అయోమయంలో ధూసా ఏమి జేసేది అని ఆలోచిస్తాడు. అప్పుడే రంగా ఇంకొక కాంట్రాక్ట్ తెచ్చి ఇస్తాడు. ఈ పార్టీవాళ్ళు ర్యాలీ సరిగ్గా జరిగితే అందరికీ ఒక్కో బనియన్, ఒక జత చెప్పులు ఇస్తామన్నారంట. వెయ్యి రూపాయలు, మాంసంతో భోజనం పెడతారంట.
ధూసా ఆలోచన ఆలోచనగానే ఉండిపోయింది. “ఈ మారు నా పేరు ఏముంటుంది?” అని రంగాను అడిగాడు.
రంగా నవ్వుతూ, “ఆచార్య విహార్‌లో ఒక అత్యాచారం కేస్ వచ్చింది. దానికి 50, 60 మంది స్త్రీలు కావాలి. మీ ఆమెను పంపించు. స్లోగన్ రాసి పెట్టా ఈరోజు బట్టీ పట్టించు.” అన్నాడు.
“సర్కార్ గద్దె దిగాలి. గద్దె దిగాలి.
దిగకపోతే మంటల్లేస్తాయ్ మంటల్లేస్తాయ్
రోడ్డు మీద పోరాటాలవుతాయ్
జీవన్ పట్నాయక్ డౌన్ డౌన్”
అంతే. ఇంత మాత్రం బట్టీ పడితే చాలు. రేపు పదిగంటలకు పి.ఎమ్.జీ చౌరస్తా దగ్గరికి ఆమెను తీసుకున్ని అక్కడికి చేరు.”
ధూసా కుతూహలంగా అడిగాడు, “నిజంగా జరిగిందా?”
“వెధవా! ప్రశ్నలడగొద్దని చెప్పానా? ఎవరి పెండ్లాం పైన ఎవరు అత్యాచారం చేసినారు, ఎవరి బిడ్డను ఎవరెత్తుకుపోయినారు ఇయ్యన్నీ తెలుసుకునే అవసరం మనకెందుకు? ఈ వెధవలున్నారే వీళ్ళలో ఎవరి పెళ్ళానికేం జరిగిందో, వాళ్ళకు మన కష్టం అర్థమవుతుందా? లేక వాళ్ళ పెళ్ళానికి మన కడుపు బాధ అర్థమవుతుందా? మనకు ఎవరు డబ్బిచ్చినారో మనం వాళ్ళ మనుషులం. వాళ్ళెలా చెప్పారో మనమలా చెయ్యాలి. అర్థమైందా?”
రంగాకు చిరాకు తెప్పించానే అని ధూసా తనను తాను తిట్టుకున్నాడు. ఇట్ల ఇంకెన్నడూ ప్రశ్నలే వేయొద్దనుకున్నాడు.
ధూసా ప్రస్తావన విని ఝర్నా గట్టిగా అరచి గోల చేసింది. “నే పోనయ్యా! నీవు యాక్టరువు. ప్రతి పాత్ర చేయగల్గినోడివి. ఇట్లాంటి పనులన్నీ జేయడం నా వల్ల కాదు. ఈ గొడవలో నన్ను ఇరికించొద్దు. ఎవరి ఇంటి ఆడోళ్ళను ఎవరు ఏమి జేసినారో ఆ చోటికి పొయ్యే పని నాకు యాల?” అని వాదించింది.
“ఇది ఆడోళ్ళ యవ్వారం. ఒక ఆడామెకు అవమానం జరిగింది. మీ ఆడోళ్ళ గొంతే వినబడాలి. మా మగోళ్ళు ఆడికి బోయి జేసేదేంది?” నచ్చజెప్పబోయాడు.
“వద్దు. నాకు భయం. నా వల్ల గాదు. నీవే ఆడోళ్ళ బట్టలేసుకోని యాక్టింగ్ జెయ్యి. షారుఖ్ కూడ డబల్ రోల్ ఏస్తాడా ఎయ్యడా?” అంది ఝర్నా.
ఝర్నా మాటలు విని ధూసా ఉలిక్కిపడినాడు. ఏమంటున్నది ఇది? ఎట్లెట్లా? తర్వాత ఆలోచించసాగాడు. సినిమాలో అంతా బూటకమే. ఇక్కడ? తర్వాత అనిపించింది, ‘ఎందుకు జరగదు?’ యాక్టింగే అయినప్పుడు మగ ఏంది, ఆడ ఏంది? యాక్టింగ్ చూసేవాళ్ళకేం తెలుసు వీడు బాడుగ యాక్టర్ అని? ఆ పాత్ర వేస్తున్న వాళ్ళే నిజం మనుషులని కదా అనుకుంటారు! ధూసా ఈ ద్వంద్వాల గందరగోళంలో పడిపోయాడు. ఎన్నో జవాబులు కన్పిస్తున్నాయి. ఒకటి తీసుకుంటే ఇంకోటి ప్రత్యక్షమవుతుంది.
మొదటిసారి ధూసా రంగా నాయక్‌ను వెనక్కి పంపించాడు. “మా ఆడోళ్ళకు సుస్తీ చేసింది.” అని చెప్పేశాడు.
రంగా కళ్ళెఱ్ఱజేసి బెదిరించాడు. “వెధవా! అడ్వాన్స్ తీసుకున్నావ్, ఇప్పుడు మోసం జేస్తున్నావు. నా యాపారం ముంచేస్తావా? మీ ఆడోళ్ళు ర్యాలీకి బోవాల్సిందే. లేకుంటే నీ యాక్టింగ్ యాపారమే బంద్ చేస్తా.” అన్నాడు.
రంగా చేతులు పట్టుకొని, ధూసా బతిమిలాడుకున్నాడు. “రంగా భాయీ, నీకు ఆడోళ్ళు గావాల సరే, నేనో పని జేస్తా. మా ఆడోళ్ళు రాకున్నా, నా యాపారం మునగనియ్యను.” అన్నాడు.
రంగా, “వెధవా! సరీగ పది గంటలకు పి.ఎం.జీ. చౌరస్తా దగ్గర. నా దగ్గర వేషాలేయకు. బద్మాషీ జేసినావంటే నువ్వెవరని కూడా జూడను.” గట్టిగా కేకలేశాడు.
రంగా శక్తి, సామర్థ్యం ధూసాకు తెలుసు. కాబట్టి ర్యాలీకి వాళ్ళమ్మను తీసుకెళ్ళాడు.
తల్లి ఎక్కడికి తీసుకెళ్తున్నావని అడిగింది.
భూమి పట్టాలిస్తారు. బిపిఎల్ కార్డు ఇస్తారు అని నమ్మకంగా చెప్పాడు.
తల్లి ఉత్సాహంగా, “ఎవరిస్తారు? ఎక్కడిస్తారు?” అని అడిగింది.
“నాకు తెలీదు. ఒకటి చెప్తా విను. అక్కడ ఆ ర్యాలీలో అందరూ ఏమి చెప్తే నీవూ అదే చెప్పు. కుదిరితే చెయ్యెత్తు.” అని చెయ్యెలా ఎత్తాలో నేర్పించాడు. “ఏదీ చెయ్యెత్తు” అన్నాడు.
తల్లి కష్టపడి నడుము నుంచి రెండు అంగుళాలు పైకి ఎత్తింది. “ఉఫ్.. వాయమ్మా!” అని నొప్పితో అరిచింది. మళ్ళీ ప్రయత్నించింది కానీ లేపలేకపోయింది. “మోకాళ్ళు నొప్పులు! ఏం సంపాదిస్తావో గానీ కడుపు కూడా పూర్తిగా నిండదు. ఇంగ నా రోగాల మాట ఏం జెప్పేది నీతో?” అంది.
ధూసా విననట్టే ఉండిపోయాడు. “ఆ పనికిమాలినదాన్ని రమ్మంటే రానంటుంది. నీవూ కాళ్ళు చేతులు పనిచెయ్యవంటావు. ఎక్కడ్నించి తెచ్చి అందరి కడుపులు నింపేది?” అన్నాడు.
తల్లి చాలా సార్లు అమ్మో అయ్యో అంటూనే, “పద, కాళ్ళీడ్చుకుంటూ ఎలాగో వస్తాను. డబ్బులు వస్తాయంటే వద్దంటామా? సర్కార్ పట్టాలిస్తుంది. కార్డు ఇస్తుంది అంటున్నావు గదా!” అంది.
తల్లి మాటల్లో ఏ భావముందో ఆలోచించేంత టైం లేదు ధూసాకు. వాళ్ళ బస్తీ వెనుకపక్క మినీ ట్రక్కు మాటిమాటికీ రమ్మంటూంది. పాత బట్టల మూటలా తల్లిని ఎత్తి ట్రక్‌లో పడేశాడు ధూసా.
ర్యాలీ ముగిసింది. అందరూ తమ తమ కూలీ తీసుకొని తమ దారిని వెళ్ళిపోయారు. ధూసా వాళ్ళమ్మ ఉండిపోయింది. దేవదారు చెట్టు కింద ఆయాసపడుతూ ఉంది.
మహిళా ర్యాలీలో గరమ్ గరమ్ ఉపన్యాసాలిచ్చేందుకు వచ్చిన నాయకులదేం తప్పుంది? వాళ్ళు అందరికీ కూలి ఇచ్చేశారు. ధూసా వాళ్ళమ్మతో పాటు ట్రక్కులో వచ్చిన మిగతా ఆడోళ్ళదేం తప్పుంది? వాళ్ళు సర్కార్ డౌన్ డౌన్ అంటూ ముందుకు వెళ్ళిపోయారు. ధూసా వాళ్ళమ్మ రెండు అడుగులు వేసి దగ్గరున్న చెట్టు కింద ఆగిపోయి ఆయాసపడుతోంది.
సాయంత్రం ధూసాకు కబురు తెలిసింది. తల్లి ర్యాలీ జరిగే చోట చెట్టు కింద కూర్చొని ఆయాసపడుతోందని. అతడెళ్ళి ట్రాలీలో వేసుకొని తిరిగొచ్చేటప్పుడు, “నేనెన్ని మార్లు యాక్టింగ్ చేస్తాను గదా, నీవొక్కమారు చేయలేకపోతివా? రంగా భాయీకి తెలిస్తే నా గతేమవుతుందో?” అన్నాడు.
ఒక శవంలా ఇంటికి తిరిగొచ్చింది అతని తల్లి. ఆఖర్న గట్టిగా అయ్యో అయ్యో అని అరిచింది. తర్వాత ఏ శబ్దమూ లేదు. ధూసా వెనక్కి తిరిగి చూస్తే, అస్థిపంజరంలా పడి ఉందామె. ఇది అమ్మనా లేక అమ్మ శవమా?
అమ్మ పోయాక ఐదురోజులకు రంగా మళ్ళీ వచ్చాడు. “మంచి యాపారం దొరికింది. నీవు సరీగా ఫిట్ అవుతావు.” నవ్వుతూ,
“వెధవా! మీ అమ్మ గొప్పగా యాక్టింగ్ చేసింది. మీ వంశమే యాక్టర్ లా ఉందే!” అన్నాడు. ధూసా ఏమీ మాట్లాడలేదు. “ఈసారి ఎఱ్ఱజెండా వాళ్ళు చాలా పెద్ద ర్యాలీ చేస్తున్నారు. పోస్కో గురించి. పోలీసులతో గొడవపడాల్సి ఉంటుంది. బ్యారికేడ్లు విరగగొట్టుకొని అసెంబ్లీ వరకు పోవాల్సి ఉంటుంది.” అంటూ నవ్వి మళ్ళీ చెప్పాడు. “అర్థం జేసుకో ధూసా! పోలీసుల బ్యారికేడ్లు పడగొడ్తే సర్కార్‌ను పడగొట్టినట్లే. ఈ సారి ఒక్కొక్కరికి రెండు వేలు వస్తాయి.” రెండు వేల మాట వింటూనే ధూసా కళ్ళు మెరిశాయి. “డ్రామా ఎప్పుడు” అని అడిగాడు.
“ఎల్లుండి. ఇదిగో అడ్వాన్స్.” రెండొందలు చేతిలో పెట్టి రంగా వెళ్ళిపోయాడు.
ఆరోజు ఎఱ్ఱజెండా వాళ్ళు పెద్ద గొడవ జేశారు. మొదట సంచిలో రాళ్ళు పెట్టుకొని పోలీసుల మీద తుపాకిగుండ్ల మాదిరి విసిరారు ఆ విప్లవకారులు. పోలీస్ లాఠీఛార్జ్, టియర్ గాస్ వదలడం చేసినా వెనుదిరగలేదు.
పోలీసులు చుట్టుముట్టినపుడు ఛేదిస్తే బక్షీష్ దొరుకుతుందని ధూసాకు గుర్తొచ్చింది. అందుకే ర్యాలీకి వచ్చేముందే వాళ్ళు రెండు కార్టన్ల సారాయి పంపించారు.
ధూసాకు మత్తు ఎక్కేకొద్దీ లోభం పెరుగుతోంది.
పోలీసులు మాటిమాటికీ టియర్ గాస్ వదులుతున్నారు.
లాఠీ ఎత్తి పట్టుకునే వస్తున్నారు పోలీసులు.
ధూసా కళ్ళలో బక్షీష్ కదలాడుతోంది. మత్తులో పోలీసుల మీద కోపం పెరుగుతోంది. ఇంకోసారి బలమంతా ప్రయోగించి వెదురు ఫెన్సింగును ఊపేశాడు. ఒక వెదురు ముక్కను విరిచి పోలీసుల వైపు పరుగెత్తాడు.
అప్పుడే గొడవ, కేకలు, అరుపులు ఎక్కువైనాయి. “కొట్టు.. తన్ను.. పట్టుకో పట్టుకో” అనే కేకలతో ఆ ప్రదేశం నిండిపోయింది. మత్తులో ధూసాకేమీ అర్థం కావడం లేదు. స్వాధీనం కోల్పోయాడు. వెదురును చేతిలో పట్టుకొని ముందుకెళ్ళిపోయాడు. ఉన్నట్టుండి ఎవరిదో తుపాకీ పేలిన చప్పుడు! అక్కడే ఉన్నవాడున్నట్టు పడిపోయాడు. ఛాతీలోంచి రక్తం అక్కడ పడిన నీళ్ళతో కలిసి పారుతోంది.
విప్లవకారులంతా అరుపులు కేకలలో ఎక్కడివాళ్ళక్కడ చెదిరిపోయారు. వెనకనుంచి ఎవరిదో గొంతు – “పదండి ముందుకు పదండి ముందుకు.” నినాదాలు చేస్తున్న నాయకగణం సురక్షిత స్థానాల్లోకి వెళ్ళిపోయారు. పోలీసు ధూసా రక్తసిక్త దేహాన్ని కుక్కనీడ్చినట్టు ఈడ్చుకుపోయారు. కాస్సేపటి కిందట యుద్ధ క్షేత్రంగా కనిపించిన చోటు ఉన్నట్టుండి నిర్మానుష్యంగా మారిపోయింది.
రంగా నాయక్ కు కబురు చేరింది – ధూసా చచ్చిపోయాడు.
రంగా ఇంకొక బాటిల్ తాగాడు. “గొప్ప యాక్టర్ చనిపోయినాడు. పోనీలే వెధవ! కొత్తోడెవడో వస్తాడు. మళ్ళీ చౌకలో యాపారం జరుగుతుంది. పోనీలే వెధవసచ్చినోడు! ఎప్పుడూ బేరాలాడేవాడు. ఇగ వాణి పెండ్లాం, పిల్లోడి సంగతి చూడాలి. హా హా హో హో!”
మరుసటిరోజు ధూసా శవం బస్తీకి చేరింది. ఏ వెదురు, గాజుముక్కల గోదాము వెనక ఝర్నాతో ప్రేమ పంచుకున్నాడో అక్కడే తెల్లని దుప్పటి కప్పిన శవాన్ని పెట్టారు. తలాపున కొన్ని పూలు పెట్టారు. పక్కన కొందరు పోలీసులున్నారు.
బస్తీ నుంచి చాలా మంది అక్కడికొచ్చారు. కొందరు ఏవో అనుమానాలతో ఇంట్లోనే ఉండిపోయారు. కుతూహలంతో ధూసా దగ్గరికొచ్చినవాళ్ళూ, భయంతో గొళ్ళెం పెట్టుకొని లోపల ఉండిపోయినవాళ్ళూ అందరూ ఒకే రకమే. అందరూ సామాన్యులే. సాధారణ మనుషులే. వీళ్ళంతా సుఖదుఃఖాలనన్నింటినీ ప్రాప్తం అనుకుంటారు. మనుషులే తమలాంటి మనుషులు చేసే మాయలో పడతారు. కొట్టుమిట్టాడతారు. వాళ్ళలో వాదప్రతివాదనలు చేసే శక్తీ ఉండదు. ఆ మనస్తత్వమూ ఉండదు. ఎందుకంటే వాళ్ళు సామాన్యులు. తుచ్ఛులు.
ధూసా శవం కూడా అలాంటి సామాన్యమైన విషయమే వాళ్ళకు.
ఝర్నా కొడుకుతో పాటు అక్కడికి చేరుకుంది. శవాన్ని జూసి వెక్కి వెక్కి ఏడ్చి పడిపోయింది. ఆమె దుఃఖం చూసి బస్తీలోని కొందరు ఆడవాళ్ళు తామూ కంటతడి పెట్టారు. ధూసా కొడుక్కేం తెలుస్తుంది? తల్లి ఏడుపు చూసి వాడూ ఏడ్చాడు. పోలీసులు ధూసా శవాన్ని బండిలో వేసుకొని గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయారు.
బస్తీ వాళ్ళు కూడా కండ్లు తుడుచుకుంటూ అక్కడినుంచి వెళ్ళిపోయారు. ఝర్నా కొడుకును ఎత్తుకొని వెక్కుతూ తిరిగొచ్చింది.
దోవలో కొడుకు,”అమ్మా! బాపూ ఎప్పుడొస్తాడు?” అని అడిగాడు.
అమ్మ గట్టిగా ఏడ్చేసింది. కొడుకును కిందికి దింపింది.
“అమ్మా, ఇంత ఏడుస్తున్నావేమి? మా బాపూ చచ్చిపోయిన మనిషిగా యాక్టింగ్ చేస్తున్నాడు గదా! యాక్టింగ్ గదా చూస్తిమి. ఏడుస్తావెందుకు? చూడు, నేను కూడా పెద్దోడ్నై యాక్టర్ బాపూ మాదిరే యాక్టర్ నవుతా! యాక్టర్!” అంటున్నాడు పిల్లాడు.
ఒడియా మూలం: అరవింద్ రాయ్
అనువాదం: బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి
బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి విమర్శకులు, అనువాదకురాలు. అత్యంత లోతైన రీతిలో విమర్శలు చేయగల అరుదైన విమర్శకులు.
