[హైదరాబాద్‌ను పూర్తి స్థాయిలో తెలుసుకోవాలనే కోరికతో నగరంలో ప్రయాణించి పి. జ్యోతి గారు అందిస్తున్న ఫీచర్ ‘ఆదాబ్ హైదరాబాద్’.]


హైదరాబాద్ క్లాక్ టవర్లు-1. మెహబూబ్ చౌక్ క్లాక్ టవర్


చేతికి గడియారాలను ధరించే సంస్కృతి దాదాపుగా కనుమరుగవుతుంది. స్మార్ట్ వాచ్‌లు డిజిటల్ వాచ్‌లు చేతులను అలంకరిస్తున్నాయి. సమయం చూసుకోవడానికి సెల్ ఫోన్ ఒక్కటి చాలు. ఒకప్పుడు గడియారాలకు పెద్ద సామాజిక, చారిత్రిక చరిత్ర ఉండేది. ప్రజలందరికీ గడియారం అందుబాటులో లేనప్పుడు పాలకులు కొన్ని కూడలులలో పెద్ద పెద్ద కట్టడాలను కట్టి చుట్టూ గడియారాలను అలంకరించేవాళ్ళు. ఆ గడియారపు గంటలతో నగర ప్రజలు సమయాన్ని తెలుసుకునేవాళ్లు. వీటిని క్లాక్ టవర్స్ అంటారు. ఇలా సమయాన్ని తెలియపరచడంలో కూడా ఊరంతటినీ కలిపి ఉంచే సంస్కృతి ఉండేది. మనిషి సామూహికంగా జీవించిన ఆ రోజులకు ప్రతీకలుగా ఈ క్లాక్ టవర్స్ ఇప్పటికీ నగరాలలో చారిత్రిక అనవాళ్ళుగా మిగిలి ఉన్నాయి.
హైదరాబాద్ నగరంలో ఇలాంటి కొన్ని అందమైన క్లాక్ టవర్లు ఉన్నాయి. వీటి నిర్మాణ శైలి కూడా విశిష్టంగా ఉండేది. ఇవి కాలం చేసిన గాయాలతో పాడుపడితే వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఈమధ్య పునర్నిర్మించే పని చేపట్టింది. దానితో ఆ గడియారాలన్నీ జీవం పోసుకుని నగర వాసులకు సమయాన్ని సూచిస్తున్నాయి. రణగొణ ధ్వనుల మధ్య ఆ చప్పుళ్లు మనకు వినిపించట్లేదేమో కాని ఈ క్లాక్ టవర్ల వద్ద నిల్చుని ఆ గడియారపు చప్పుళ్ళను వినడం నిజంగా గమ్మత్తయిన అనుభవం. మన హైదరాబాద్ లోని ప్రాచీన క్లాక్ టవర్ల గురించి రాసే క్రమంలో ముందుగా మెహబూబ్ చౌక్ క్లాక్ టవర్ గురించి చెప్పుకుందాం.
మహబూబ్ చౌక్ క్లాక్ టవర్ ఐదు అంతస్థుల కట్టడం. దీనిని 1892లో హైదరాబాద్ ప్రధాన మంత్రి అస్మాన్ జా నిర్మించారు. హైదరాబాద్ ఆరవ నిజాం, మీర్ మహబూబ్ అలీ ఖాన్ పేరు మీద ఈ కూడలి మెహబూబ్ చౌక్‌గా చరిత్రలో నిలిచింది.


(అస్మన్ జా)


(మెహబూబ్ చౌక్ క్లాక్ టవర్ 1892 లో)
హిజ్ ఎక్సలెన్సీ అమీర్ ఇ పైగా బషీర్ద్-ఉద్-దౌలా ఆజం-ఉల్-ఉమ్రా అమీర్-ఎ-అక్బర్ నవాబ్ సర్ ముహమ్మద్ మజారుద్దీన్ ఖాన్ బహదూర్ రిఫాత్ జంగ్ గారిని సర్ అస్మాన్ జాహ్ గా పిలిచేవారు. ఈయన 1887 నుండి 1894 వరకు హైదరాబాద్ ప్రధాన మంత్రిగా పనిచేసారు. జాహ్ అమ్మమ్మ బషీరున్నీసా బేగం, నిజాం అలీ ఖాన్ కుమార్తె. అస్మాన్ జాహ్ హైదరాబాదు నిజాం తర్వాత రెండవ ఉన్నతమైన ‘పైగా’ రాచరికపు కుటుంబ సభ్యుడు.
1869లో, అస్మాన్ జాహ్ మంత్రిగా తన ప్రజా జీవితంలో ప్రవేశించాడు. న్యాయశాఖలో కొనసాగుతూ, ప్రధానమంత్రిగానూ సహ-రాజప్రతినిధిగానూ వ్యవహరించారు. తరువాత అతను కౌన్సిల్ ఆఫ్ రీజెన్సీ సభ్యుడు కూడా అయ్యాడు, చివరకు 1887లో ప్రధానమంత్రిగా నియమితుడయి 1893 వరకు ఆ పదవిలో కొనసాగాడు. ఆ సమయంలోనే ఆయన అస్మాన్ ఘర్ ప్యాలెస్, బషీర్ బాగ్ ప్యాలెస్, సరూర్ నగర్ ప్యాలెస్, మహబూబ్ చౌక్ క్లాక్ టవర్ వంటి చారిత్రిక కట్టడాలను నిర్మించాడు. 1887లో క్వీన్ విక్టోరియా స్వర్ణోత్సవ సంబరాలకు నిజాం ప్రతినిధిగా లండన్ వెళ్లాడు అస్మాన్ జాహ్. అస్మాన్ జాహ్ ఐదవ నిజాం తహ్నియాత్ అలీ ఖాన్ కుమార్తె పర్వారిషున్నీసా బేగంను వివాహం చేసుకున్నారు. వారికి 1891లో ఒక కుమారుడు మోయిన్-ఉద్-దౌలా బహదూర్ జన్మించాడు. జాహ్ 16 జూలై 1898న బషీర్ బాగ్ ప్యాలెస్‌లో మరణించాడు అతన్ని పైగా టూంబ్స్‌లో ఖననం చేసారు.
అస్మాన్ జాహ్ మెహబూబ్ చౌక్ గడియార స్తంభాన్ని ఆ రోజుల్లో చిన్న తోట మధ్యలో నిర్మించారు. ఆ స్తంభం నాలుగు వైపులా పెద్ద గడియారాలు పెట్టించాడు. ఏ దిక్కు నుండి చూసినా సమయం తెలుసుకోగలిగేలా ఆ రోజుల్లో ఈ స్తంభాన్ని నిర్మించారు. ఇది చార్మినార్‌కు పశ్చిమాన, లాడ్ బజార్‌కు అతి సమీపంలో ఉంది.
ఈ క్లాక్ టవర్ నిర్మించిన సమయంలో హైదరాబాద్‌లో గడియారాలు చాలా అరుదు. అవి సామాన్యులకు అందుబాటులో లేని విలాసవంతమైన వస్తువులు. కేవలం రాజ వంశీయులు, నవాబులే గడియారాలను ధరిచే రోజులవి. హైదరాబాద్‌లోని సాధారణ పౌరులు తమ రోజువారీ కార్యకలాపాలకు వెళ్లేందుకు క్లాక్ టవర్‌ను నిజాం నగర ప్రజలకు బహుమతిగా అందించారు. దీనిపైన కనిపించే గడియారాలను ఆ రోజుల్లో లండన్ నుండి దిగుమతి చేసారు.
ఈ క్లాక్ టవర్ కుతుబ్ షాహీ నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తుంది. ఇందులో రెండు అంతస్తుల్లో మెటల్ బాల్కనీలు ఉన్నాయి. టవర్ బేస్ గ్రానైట్లతో అలంకరించబడి, మోర్టార్ తోనూ సున్నంతోనూ దీన్ని ప్లాస్టరింగ్ చేసారు. ఈ ప్రదేశానికి ప్రవేశం ఒక చిన్న రెండు అడుగుల వెడల్పు గల గేట్ ద్వారా ఉంది. 70వ దశకం వరకు ఈ తోటలో ఫౌంటెన్లు ఉండేవని స్థానికులు చెబుతారు, కానీ అవి క్రమంగా అదృశ్యమయ్యాయి.
మహబూబ్ చౌక్ నిర్మాణ శైలి విశిష్టమైనది, నగరంలో ఉన్న ఫ్రీ-స్టాండింగ్ క్లాక్ టవర్లకు ఇది చక్కటి ఉదాహరణ. ప్రధానంగా ఫ్రెంచ్ నిర్వచనాలతో యూరోపియన్ ఆర్కిటెక్చర్‌కు ఇది ప్రతీక. డోర్ ఓపెనింగ్‌ల పైన ఉన్న క్లెరెస్టోరీ కిటికీలు, స్టైలైజ్డ్ ట్రెఫాయిల్ ఆర్చ్‌లు, మధ్య భాగంలో గ్రానైట్‌లో నిర్మించిన బేస్ ఒకప్పటి నిర్మాణ వైభవాన్ని తెలియజేస్తాయి. ప్రస్తుతం దక్షిణ భారత దేశంలో ఇండో-యూరోపియన్ సింథసిస్ శైలిలో కనిపించే టవర్లలో ఇది ముఖ్యమైనది.


ఈ టవర్ క్రింది భాగం గ్రనైట్లో కట్టబడి ఉంది. దాని ద్వారం ఆర్చ్ యూరోపియన్ శైలికి ప్రతీక. నిజానికి ఈ గ్రానైట్‌ను చలి ప్రదేశాలలో ఉపయోగిస్తారు. యూరోప్‌లో దీని వాడకం ఎక్కువ. అప్పటికే ఆంగ్ల కట్టడాల శైలి మన సంస్కృతిలో భాగం అయింది. దానికి గుర్తుగా ఈ క్రింది భాగం కనిపిస్తుంది. పైన ఫోటోలలో టవర్ క్రింది అంతస్తులో ముందు భాగం, కుడి ఎడమ భాగాల నిర్మాణం చూడవచ్చు.


టవర్ మొదటి అంతస్తు నిర్మాణ శైలిలో ఫ్రెంచ్ శైలి కనపడుతుంది. ఇక్కడ ద్వారంపై ఉన్న ఆర్చ్‌ని గమనించి చూడంది.ఇది క్రింది భాగంలోని గ్రనైట్ గోడపై ఆర్చ్‌కు భిన్నంగా ఉంది. దాని పక్కన ఉన్న స్తంబాలు యూరోపియన్ శైలిలోనే ఉన్నా పైన చెక్కిన పూలు టర్కిష్ శైలికి దగ్గరగా కనిపిస్తాయి. ఇది కుతుబ్ షాహీల శైలి. దీన్ని యూరోపియన్ శైలితో ఇక్కడ కలిపి ప్రదర్శించారు.


పై అంతస్తుకు వెళితే అక్కడ బైటికి కనిపించే తలుపు, ఆర్చిలలో కూడా మార్పు కనిపిస్తుంది. ఇది ఈ టవర్ ప్రత్యేకత. క్రింద తలుపు రెక్టాంగిల్గా ఉంటే పైది ఓవెల్ షేపులో కనిపిస్తుంది. ఈ రెండు అంతస్తులను కలుపుతూ పొడుగ్గా స్థంబాలు డిజైన్ చేసి ఉంటాయి. ఎక్కడా వంక కనిపించని ప్రక్కా డిజైన్ ఇది. పైన మెటల్ రెయిలింగ్‌ని చూడండి. అలాగే తలుపు పై ఆర్చ్ గోడలో డిజైన్ చేసిన నగిషీ కూడా ఈ టవర్‌కు ఓ హుందాతనాన్ని ఆపాదిస్తుంది.


ఈ టవర్‌ను పక్క నుండి చూస్తే మరో విషయం కనిపిస్తుంది. క్రింది భాగం మొత్తం గ్రనైట్ తోనూ, మొదటి అంతస్తు గ్రనైట్ ఇంక సున్నంతో ప్లాస్టరింగ్ చేసి ఫ్రెంచ్ డిజైన్‌తో ఉన్న ద్వారం తోనూ ఆ పై అంతస్తు మొత్తం లైం స్టోన్‌తో ప్లాస్టరింగ్ చేసి టర్కిష్ శైలిలో ద్వారం డిజైన్ తోనూ కనిపిస్తుంది. అలాగే క్రింది భాగంలో స్తంభాలకు టర్కిష్ పద్దతిలో ప్లాస్టరింగ్ చేయడం గమనించవచ్చు.


ఆ పైన గడియారం ఉండే భాగం మొత్తం లైం స్టోన్‌తో కట్టిందే. అక్కడ నాలుగు పక్కల అంటే నాలుగు గడియారాలు పక్కగా రెండు స్తంభాలు కనిపిస్తాయి. వాటిపైన చెక్కిన డిజైన్ పూర్తి టర్కిష్ శైలిలో ఉంటుంది. ఇక్కడ బైటకు కనిపించే ద్వారం ఆర్చ్ కూడా క్రింది మూడిటికి భిన్నంగా ఉంది. అంటే గ్రౌండ్ ఫ్లోర్లో గ్రనైట్ గోడకున్న ద్వారం నుంచి ఆ పైకి చూస్తే ప్రతి అంతస్తులోనూ అర్చ్, తలుపు ఆకారాలు భిన్నంగా కనిపిస్తాయి. అన్నిటికన్నా పైన కనిపించే డోం నిర్మాణం ఇస్లామిక్ శైలికి నిదర్శనం. ఇవన్నీ ఈ క్రింది ఫోటోలో స్పష్టంగా గమనించవచ్చు.


ఈ చౌక్ చుట్టూ రోజువారీ ఉపయోగించే గృహోపకరణాల నుండి ఆయుధలు, మందుగుండు సామాగ్రి వరకు విభిన్నమైన వస్తువులను విక్రయించే దుకాణాలు ఉండేవి. ఇది అప్పట్లో అత్యంత ముఖ్యమైన వాణిజ్య కేంద్రం. ఇప్పుడు కూడా దీని చుట్టు అతి పురాతన ముర్గీ బాజార్ ఉంది. దాని గురించి మరో వ్యాసంలో చెప్పుకుందాం. అలాగే కొన్ని అతి పురాతన వస్తువులు, లోహ సామానులు షాండిలేర్ల దుకాణాలు ఈ రోజుకీ దీని చుట్టుపక్కల కొన్ని గత కాలపు ఆనవాళ్లుగా నిలిచే ఉన్నాయి.
టవర్‌కు పశ్చిమాన ఉన్న మసీదును మస్జిద్-ఎ-చౌక్ అంటారు. దీనిని చౌక్ కే మస్జిద్ లేదా జామా మస్జిద్ చౌక్ అని కూడా పిలుస్తారు. దీనిని 1817లో ఖాజా అబ్దుల్లా ఖాన్ నిర్మించారు. దీన్ని 1904లో VI నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ పునర్నిర్మించారు, 1880లో నిర్మించిన మోతీ మహల్ ఈ చౌక కు తూర్పున ఉంది. ఈ మసీదు ద్వారం రాజస్థానీ హిందూ శైలోలో ఉండడం విశేషం. హిందూ ముస్లిం సామరస్యతకు ఇది ప్రతీకగా నిలిచి ఉంది.


మహబూబ్ చౌక్ క్లాక్ టవర్ 2008లో INTACH హెరిటేజ్ అవార్డును పొందింది.


మన నగర చరిత్రను మాసిపోకుండా నిలిపి ఉంచడానికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఎన్నో. కాని దాని తరువాత ఇలాంటి అపురూప కట్టడాలను రక్షించుకోవలసిన బాధ్యత కూడా మనపై ఉంది. ఈ ప్రదేశంలో అసాంఘిక కార్యకలాపాలు జరగడం, తాగుడు, జూదం, గంజాయితో సమయాన్ని గడిపే వాళ్లు ఈ ప్రదేశాన్ని ఎన్నుకుని అక్కడ తమ జండా పాతడం బాధ కలిగించే విషయం. ప్రొద్దున పదకొండు గంటలకు నేను ఈ చౌక్ దగ్గరకు వెళ్ళాను. సరిగ్గా పదకొండుకు ఓ పది క్షణాల ముందు ఈ గడియారం ఓ వార్నింగ్ బెల్ ఇస్తుంది. అంటే సమయాన్ని వినమని మన దృష్టిని అటువైపు మళ్ళిస్తుంది. తరువాత వరుసగా పదగొండు గంటలు వింటుంటే భలే గమత్తుగా అనిపించింది. 2000 తరువాత ఈ టవర్‌ను పూర్తిగా రిపేర్ చేసారట. కాని ఆ సమయంలో కూడా అక్కడ కొందరు యువకులు మత్తులో కనిపించారు. ఎంత గొప్ప కట్టడాలయినా ప్రజల సంరక్షణపైనే ఆధారపడి ఉంటాయి. ఎంతో చారిత్రిక నేపథ్యం ఉన్న ఈ అపురూపమైన కట్టడం చుట్టు పక్కల వాతావరణం పట్ల ప్రజలు శ్రద్ధ తీసుకుంటారని, బాధ్యతగా వ్యవహరిస్తారని ఆశిద్దాం.
