Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రంగుల హేల 63: పలకరింపుల పరమహింసలు

[సంచిక మాసపత్రికలో ప్రముఖ రచయిత్రి శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి గారు అందిస్తున్న కాలమ్ ‘రంగుల హేల’.]

పలకరింపుల పరమహింసలు

మనల్ని బంధువులో, స్నేహితులో, పరిచయస్థులో ఎక్కడైనా అనుకోకుండా కనబడి “ఏవండీ బాగున్నారా? ఎన్నేళ్లయిందో మిమ్మల్ని చూసి!” అన్నప్పుడు ఆనందపడతాం. ఆ ఆత్మీయ పలకరింపుకి మన మనసు పులకరిస్తుంది. హృదయం ఆనంద తరంగితమౌతుంది.ప్రతిగా, “మీరెలా ఉన్నారు? బావున్నారా!” అని చెయ్యి కలుపుతాం. అలా అని పలకరించిన వాళ్ళందర్నీ చూసి ఇదే రీతిలో మనం స్పందిస్తాం అనుకుంటే పొరబాటే!

మనల్ని, మనకు తెలియని వాళ్ళు కూడా పలకరిస్తారు. ఎలాగంటారా? ఏదైనా హాస్పిటల్‌కి వెళ్లి కూర్చుంటాం, ఆరోగ్యం బాగాలేని మనవాళ్ళనెవరినో తీసుకుని. అక్కడ కూర్చున్న పేషంట్లలో ఎవరో ఒకరు దగ్గరికి వచ్చి “ఈ డాక్టర్ బాగా తిక్క మనిషంట. ఒకటికి నాలుగు సార్లు అడిగితే అరుస్తాడంట.” అంటూ అనవసరపు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దాంతో మనకి కాస్త భయం కలుగుతుంది. ఆ డాక్టర్ని ఏమైనా అనుబంధ ప్రశ్నలడగాలంటే బెరుగ్గా ఉంటుంది. ఆయన చెప్పిన పొడిమాటల్ని విని తలాడించి బైటికొస్తాం. తర్వాత బాధపడతాం. మరికొన్ని సందేహాలు అడిగివుంటే మనం తీసుకొచ్చిన పేషెంట్‌కి ఉపయోగపడేది కదా! అని.

అపరిచితులు కూడా మనల్ని పలకరించి ఇబ్బంది పెట్టిన మరొక సంగతి చూద్దాం. ఒక బాగా పేరున్న మ్యారేజ్ బ్యూరోలో కూర్చుంటాం, మనవాళ్లెవరికో సంబంధాల కోసం సాయంగా. అక్కడ బయట కూర్చున్న వాళ్లలో ఎవరో ఒకరు మనల్ని పలకరించి వివరాలడిగి, పక్కకు రమ్మని పిలిచి “ఈ బ్యూరోలవాళ్ళు పెద్ద దొంగలంటండి. అనువైన సంబంధాలు మనకు చెప్పరంట. మంచి మ్యాచ్‌లు వచ్చినప్పుడు బాగా లంచాలు ఇచ్చే వాళ్ళకి సంబంధాలు కుదురుస్తారంట. మనలాంటి వాళ్ళకి ఏవో వంకలు చెప్పి ఆ సంబంధం మనకు అందనివ్వరంట. రాగానే ఫీజు కట్టించుకుని, ఒక కప్పు టీ ఇచ్చి తియ్యని మాటలు చెప్పి పంపిస్తారంట. ఏంటోనండీ! ఈ రోజుల్లో బంధువులూ సంబంధాలు చెప్పి సాయం చెయ్యడం లేదు. డబ్బు తీసుకున్న బ్యూరోల వాళ్ళు కూడా ఇలా మోసం చేస్తే ఎలాగండీ?” అని మన బుర్రలో లేనిపోని అనుమానాలు, సందేహాలు పుట్టించి బ్యూరోల మీద విరక్తి కలిగిస్తారు.

మన కజిన్సో, చిన్నాన్న పెదనాన్న లాంటి రక్తసంబంధీకులో మనం కనపడినప్పుడు “ఎలా ఉన్నావు? కొంచెం చిక్కినట్టున్నావు!” అంటారు ఆప్యాయంగా. మనమైనా దగ్గరివాళ్ళని అలాగే అంటాం ప్రేమకొద్దీ. అది వేరు. అయితే, ఒకోసారి మనం ఏ సర్జరీనో చేయించుకుని డిశ్చార్జ్ అయ్యి ఇంటికొచ్చాక కొంతమంది వచ్చి పరామర్శిస్తారు. “అయ్యయ్యో! ఇలా అయిపోయారేంటండీ! మొహంలో కళంతా పోయింది. కళ్ళు లోపలికి పోయాయి నల్లబడిపోయారు, బరువు తగ్గిపోయారు, అసలు గుర్తుపట్టలేనట్టుగా ఉన్నారు” అంటారొకరు. మన మౌనం చూసి మరొకరు “డాక్టర్ ఎవరు? ఈ డాక్టర్లు ఇంతేనండి! సరిగా తిననివ్వరు. బోలెడు మందులు ఇస్తారు అసిడిటీ వచ్చి ఆకలి చచ్చిపోయేలా! మా ఇంటి దగ్గర ఒక మంచి మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ కట్టారు. ఎంత బాగా చేస్తున్నారో! మీరు నాతో ముందుగా ఓ మాట చెప్తే అక్కడ సర్జరీ చేయించే వాళ్ళం కదా! జాగ్రత్త ఆరోగ్యం! మిమ్మల్ని చూస్తే చాలా బలహీనంగా ఉన్నారు. కోలుకోవడానికి ఎన్నాళ్ళు పడుతుందో ఏమిటో! ఓ పని చేయండి రోజు రాగి జావ తాగండి. గుడ్డు తినండి, పాలు తాగండి. రాత్రి నీళ్లలో జీలకర్ర, మెంతులు, సోంపు వేసి నానబెట్టి పొద్దున ఆ నీళ్లు మరిగించి చల్లార్చి తాగండి. పూర్తి ఆరోగ్యం చేకూరుతుంది” అంటారు. ఇంకొకరు “అబ్బే అలా కాదండి. నిమ్మరసంలో తేనె కలుపుకుని తాగండి. ఇంకా వీలైతే నా బొంద తాగండి” ఇలా ఏవేవో చెప్పేసి వెళ్లిపోతుంటారు. ‘అసలు వీళ్ళు ఎందుకు వచ్చార్రా బాబూ! ఉచిత సలహాలూ, అనవసర సూచనలూ విసుగు పుట్టిస్తాయని వీళ్లకు తోచదా!’ అనిపిస్తుంది మనకి.

మనం పిల్లల దగ్గరికి విదేశం వెళ్లి ఓ ఆరు నెలలుండి వచ్చాం అనుకోండి. మన బంధుకోటి, మిత్రకోటి ఇంటికి వచ్చి పలకరిస్తుంటారు. “బాగున్నారా! అక్కడ అంతా బాగుందా! మీ ఆరోగ్యం ఎలా ఉంది? జెట్ లాగ్ పోయిందా?” లాంటి కుశల ప్రశ్నలయ్యాక, “ఆ దేశంలో ముఖ్యమైన ప్రదేశాలు ఏమేమి చూసారు?” అనడిగి మనం చూపించిన ఆ ఫోటోలు చూస్తూ టీ, కాఫీ లాంటిది ఇస్తే తాగి కొంతసేపు కూర్చుంటారు. ఆ తర్వాత “అక్కడ మీరు షాపింగ్ చేసి ఏమైనా కొనుక్కున్నారా?” అంటారు. హ్యాండ్ బాగ్‌లు, మెడలోకి మంచి పూసల దండల్లాంటివి ఏమీ కొనుక్కోలేదంటే పీనాసి వాళ్ళు అనుకుంటారేమో అని చూపిస్తాం. వాటిని పరీక్షించి “ఎంత?” అని వివరాలడుగుతారు. అవి గనక తక్కువ రేటు అనిపిస్తే “అయ్యో! మాకు కూడా తేవలసిందండీ. డబ్బులు ఇచ్చేసేవాళ్ళం కదా!” అని నిష్ఠూరమాడతారు. లేదంటే “అయ్యో! ఇవి అక్కడ నుంచి తెచ్చుకున్నారా! ఇక్కడే మనింటి పక్క ఫాన్సీ షాప్ లోకి వచ్చాయి. నిన్ననే చూసాం. క్వాలిటీ కూడా ఇలాగే ఉన్నాయి. ఇందులో సగం రేటే!” అని పక పకమని నవ్వుతూ మనల్ని గిల్లి ఏడిపిస్తారు, కొత్తగా కాలేజీలో చేరినప్పుడు చేసే ర్యాగింగ్ లాగా! మనం ఇవన్నీ భరించక తప్పదు.

మన పేరెంట్స్‌లో ఎవరైనా ఒకరు కాలం చేసినప్పుడు మనం ఊరికి వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత కొంతమంది స్నేహితులు మనల్ని కలవడానికి వస్తారు. “ఎలా జరిగింది?” అనడుగుతారు. మనం కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ జరిగిందంతా చెప్తాం. “మేమూ అదే అనుకున్నాం లెండి అందరం” అంటారు పెద్ద డిటెక్టివ్స్ లాగా! ఆ పై “ఎంత వయస్సు?” అంటూ, అడుగుతారు. మనం “ఎనభై దాటాయి” అని చెప్పాం అనుకోండి. “పర్వాలేదు లెండి పెద్దవయసే కదా! అనారోగ్యం బారినపడి మంచం పట్టకుండా వెళ్లిపోయారు, మీ చేత చేయించుకోకుండా!” అనేస్తారు. అది నిజమే అయినా ఆ క్షణంలో అలాంటి మాటలు బాధనిపిస్తాయి. ‘మనం ఇంత బెంగ పడుతుంటే వెళ్లిపోవడం మంచిదంటారేమిటీ!’ అనిపిస్తుంది. మరి కొంతసేపయ్యాక అక్కడికి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైనా అప్పటికే గతించి ఉంటే, ఆ వివరాలన్నీ ఒకరి తర్వాత ఒకరు చెప్పడం ప్రారంభిస్తారు, అది ఒక డిబేట్‌లా ఫీలవుతూ! అంత సీన్ చెయ్యకుండా, అంత భాష ఉపయోగించకుండా దగ్గరగా వచ్చి వీపు మీద చెయ్యి వేసి మౌనంగా నిమిరితే చాలు కదా, ఆత్మీయుల్ని పోగొట్టుకున్నవారికి మనశ్శాంతి కలుగుతుంది అన్న ఆలోచన రాదెందుకో వీళ్ళందరికీ.

ఒకోసారి ఓ రెండువారాలు ఏ వైరల్ ఫీవరో వచ్చి మనం తీవ్రంగా అనారోగ్యం బారిన పడతాం, కోలుకుంటూ ఉంటాం. అప్పుడు కొంతమంది మిత్రబృందం వస్తారు. వారిలో ఒకావిడ “ఎంత అందంగా ఉండేవారు మీరు? ముద్దుగా జయసుధలా ఉండేవారు! ఇప్పుడు ఆ రంగు, రూపం పోయాయి” అంటుంది (గతంలో ఆవిడ ఆ మాట ఎప్పుడూ అనలేదు. అని ఉంటే నా అమెరికా బ్యాగ్ ఆవిడకి ఇచ్చేసి ఉండేదాన్ని). మిగిలిన వాళ్ళు కూడా ఏవేవో ఉపమానాలు చెప్పి బకెట్ల కొద్దీ జాలి కురిపిస్తారు. ‘మందులు అశ్రద్ధ చెయ్యకుండా వాడుతూ, మంచి ఆహరం బాగా తినండి. రెస్ట్ తీసుకోండి. మీరు మళ్ళీ మామూలుగా అయిపోతారు’ అంటూ ధైర్యం చెప్పడం మానేసి ఇలా విచిత్రమైన కామెంట్స్ చేసేసరికి మనకి ఇంకొంచెం బెంగ వస్తుంది. అద్దం ముందు నిలబడాలంటే భయమేస్తుంది. ఆ తర్వాత వాళ్ళని తలచుకోగానే వాళ్ళు చేసిన కామెంట్స్ గుర్తొచ్చి క్రమంగా ఆ మనుషుల మీద గౌరవం తగ్గి, వారిపట్ల ఒక లాంటి విముఖత, నిరాసక్తత కలుగుతాయి.

పూర్వం రాజులు తమ రాజ్యంలో ఏం జరుగుతోందో స్వయంగా, మారువేషాల్లో తిరిగి తెలుసుకునేవారట. ఇప్పుడు, నాకు కూడా అలా మారువేషంలో తిరగాలని ఉంది. అప్పుడు మనల్నెవరూ గుర్తుపట్టి పలకరించే ప్రమాదం ఉండదు కదా! ఎలా ఉందీ ఆలోచన?!

Exit mobile version