ప్రతివారూ తమ తమ ప్రత్యేక మనస్థితిని బట్టీ వారి జీవితానుభవాన్ని బట్టీ కొన్ని రకాల మనస్తత్వాలనీ, కొన్ని రకాల ఫిలాసఫీలనీ ఏర్పరచుకుంటారు. ఒకే ఇంట్లో పుట్టి పెరిగిన తోబుట్టువులైనా, వారి ప్రవర్తన ఒకేలా ఉండాలనేం లేదు. ఒకరికొకరు వ్యతిరేక తరహా వ్యక్తిత్వాలు కలిగి కూడా ఉండొచ్చు.
ఆడవాళ్లు పెళ్ళయ్యి కాపురం మొదలు పెట్టి ఓ సంవత్సరం గడిచేటప్పటికి ఆదాయ వ్యయాలపై వారికి ఒక అవగాహన వస్తుంది. ఒక జీవన పద్ధతిని నిర్ణయించుకుంటారు. ఇద్దరూ ఉద్యోగస్తులు అయిన వారూ కాని వారూ కూడా.
అప్పుడు కొందరు స్త్రీలు పొదుపు పద్ధతి ఎంచుకుని పిసినారి పద్మలుగా అవతారం ఎత్తుతారు. వీళ్ళ బుర్రంతా సదా వస్తువుల ధరల పైనే ఉంటుంది. చాలా తక్కువ ఖర్చు చేసుకోవాలి. ఎక్కువ పొదుపు చేసుకోవాలి అనుకుంటూ నిద్ర లేస్తారు. ఈ టైపు మనుషులు, సాధారణంగా పనమ్మాయిల్ని పెట్టుకోరు. పెట్టుకున్నా ఇటువంటి వాళ్ళ దగ్గర వాళ్లు ఎక్కువ రోజులు పని చెయ్యరు. కారణం తామిచ్చే డబ్బులకు తగిన పని రాబడుతున్నామా లేదా ? అని ఆలోచిస్తూ పనివాళ్ల ప్రాణం తీస్తుంటారు ఇలాంటి వారు. ఇక వాళ్ళకి చూసీ చూడక అవీ ఇవీ పెట్టే ప్రసక్తే లేదు. నాలుగు రోజులు మానేస్తే జీతం కట్ అంటూ పనమ్మాయిల్ని బెదిరిస్తుంటారు. వాళ్ళు కొన్నాళ్లు భయపడి తర్వాత గడుసుతనం నేర్చుకుని అలా కట్ చేస్తే మానేస్తాం అని ఎదురు తిరిగి వీళ్ళనే భయపెడుతుంటారు.
ఇంకా ఈ పిసినారి పద్మల విన్యాసాలు బహు చిత్రాలు. డబ్బున్నా చీరలు కొనుక్కోరు. సరైన వంటలు వండుకోరు. వండింది కాస్తా పిల్లలకీ, భర్తకీ పెట్టి అర్ధాకలిగా ఉండిపోతారు. ఇలాంటి ఇల్లాళ్లకి దుబారా భర్తలు , పిల్లలు దొరుకుతారు. అప్పుడు వీరి పొదుపరితనం పీక్స్ వెళ్లిపోతుంటుంది.
ఈ పద్మలు బజార్లో ఏది తక్కువ ధరకి దొరుకుతోందీ, డిస్కౌంట్ ఆఫర్ లున్నాయా అని రహస్యంగా గాలిస్తూ ఉంటారు. తీరా చేసి పాత స్టాక్ వేవో కొని మోసపోతుంటారు. ఈ పద్మలు పండగలకి పబ్బాలకీ వాచ్మాన్లకీ, ఇతర పనివాళ్ళకీ ఈనాం లివ్వవలసి వస్తుందని వాళ్లతో గొడవ పెట్టేసుకుంటూ ఉంటారు. ఖరీదైన చీరలు పల్చగా ఉంటాయి కాబట్టి తాము అలాంటివి కట్టమని చెబుతూ ఉంటారు. ఖరీదైన యాపిల్స్, స్వీట్లూ, ఏసీలూ తమకు పడవు కాబట్టి వాడమని స్టేట్మెంట్ లిస్తుంటారు.
మనుషులకి ఒక పని మీద పాషన్ ఉన్నప్పుడు క్రమంగా వారికి అందులో నిపుణత్వం పెరుగుతూ ఉంటుంది. అలాగే ఈ పొదుపు కూడా వీళ్లని ఒక వ్యసనంలా పట్టుకుంటుంది. చూసేవారికి చోద్యంగా ఉన్నా, వీళ్ళ మీద ఒక పిసినారి ముద్ర పడిందని తెలిసినా వీరు కించిత్ కూడా బాధ పడరు.
ఏదైనా ఉచితంగా వస్తుందంటేనే వీరు సంతోషంగా ఉంటారు. తినేది కూడా ఫ్రీ గా వస్తేనే ఆనందంగా తింటారు. అపురూపమైన తమ సొంత కోరికలని నిర్దాక్షిణ్యంగా చంపుకుని ధనం దాచుకుని మురుస్తూ ఉంటారు. ఈ పద్మలు వస్త్రధారణ పై నిర్లక్ష్యం వహించి వెలిసిపోయిన చీరలు కూడా వదలకుండా కట్టుకుంటూ ఉంటారు. వీరు మంచి జీతమున్న ఉద్యోగంలో ఉన్నప్పటికీ, తెచ్చుకునే లంచ్ బాక్సు కూడా కడు బీదరికంతో అలమటిస్తూ ఉంటుంది.
ఇక దర్జా దమయంతుల సంగతి చూద్దాం! వీళ్ళు చక్కగా మంచి చీరలు, నగలూ పోగేసుకుంటూ బంధువుల ఫంక్షన్లకి మూడు పూటలా మూడు రకాల చీరలూ వాటికి తగిన నగలూ ధరిస్తూ చూసే వాళ్ళకి కన్నుల పండువగా ఉంటారు. ఒకసారి కట్టిన చీర మళ్ళీ ఆ సర్కిల్లో కట్టకుండా జాగ్రత్తగా గుర్తు పెట్టుకుంటారు. శ్రద్దగా అందం కోసం వాకింగ్ ల్లాంటివి చేస్తూ, బ్యూటీ పార్లర్ల దర్శనం కూడా చేస్తూ ఉంటారు.
తమ ఇంటి పరిసరాల్నీ పిల్లల్నీ అందంగా పెట్టుకుంటూ నిత్య వసంత లక్ష్ముల్లా ఉంటారు. ఇంట్లో కూడా మంచి ఫర్నిచర్, ఖరీదైన కప్పూ సాసర్లూ, మంచి కిచెన్ వేర్ సేకరిస్తారు. కొత్త డిజైన్ నగలూ, చీరలూ కొనుగోలు చేస్తూ సిరి రాలుతున్నంత ముచ్చటగా ఉంటారు. అది ఒక కళ కూడా!
వారికి కూడా డబ్బు సమస్య ఉంటుంది. ద్రవ్య లోటూ లేకపోదు. ఇంట్లో సన్నాయి నొక్కులూ ఉంటాయి. అయినా వారు ఆ విధంగా తమ ఫైనాన్స్‌ని మేనేజ్ చేసుకుంటూ ఉంటారు. ఒకోసారి మరీ హెచ్చులకి పోయి అప్పుల పాలవుతూ ఉంటారు. అయినా తమ దర్జా లెవెల్ నుంచి కిందికి దిగరు.
ఆ పద్మల్ని చూసి జాలిపడుతూ ఈ దమయంతుల్ని చూసి ముచ్చట పడుతూ ఇరుగూ పొరుగూ కాలక్షేపంచేస్తుంటారు. ఈ పద్మలూ, దమయంతులూ అప్పుడప్పుడూ మనల్ని కూడా ఆవహిస్తూ ఉంటారు. అప్పుడు మనం ఒకసారి పద్మ లాగా మరోసారి దమయంతిలాగా ప్రవర్తిస్తూ ఉంటాం. మరీ పద్మల్లా కాకుండా పూర్తిగా దమయంతుల్లా కాకుండా మధ్య రకంగా సంయమనం పాటిస్తూ ఉండాలని వీరు తోటివారికి ఉదాహరణలుగా నిలబడ్డందుకు వీరికి మనమంతా కృతజ్ఞతలు చెప్పుకుందాం !
అల్లూరి గౌరీలక్ష్మి కథా, నవలా రచయిత్రిగా చక్కని పేరు సంపాదించారు. ఈమె మంచి కవయిత్రి, ఫెయిర్ కాలమిస్ట్ కూడా. నాలుగు కథా సంపుటాలూ, మూడు నవలలూ,రెండు కవిత్వ సంకలనాలూ,ఒక కాలమ్స్ బుక్ వెలువరించారు. APIIC Ltd. లో General Manager గా పనిచేసి పదవీ విరమణ పొందారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™