Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రంగుల హేల 65: అభీ నా జావో ఛోడ్ కర్!

[సంచిక మాసపత్రికలో ప్రముఖ రచయిత్రి శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి గారు అందిస్తున్న కాలమ్ ‘రంగుల హేల’.]

అభీ నా జావో ఛోడ్ కర్!

ఈ మాట మనసులో మనమంతా వివిధ సందర్భాల్లో అనుకుంటాం. ఆ పాట రచయితంత కవితాత్మకంగా మన భావం వెలువరించలేకపోవచ్చు కానీ హృదయస్పందన మాత్రం అదే! మనం పెద్దవాళ్ళమయ్యాక, మన పిల్లలు వాళ్ళ ఇంటి నుంచి మన ఇంటికి వచ్చి తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు ‘అప్పుడే వెళ్ళిపోతున్నారేమిటి? ఉన్నట్టే లేదు కదా!’ అనిపిస్తుంది. ప్రేమికులు ఒకరి పట్ల మరొకరు ఆకర్షించబడి అనురాగం పంచుకునే రోజుల్లో వీలు చూసుకుని ఒక ప్రదేశంలో కలుస్తారు. అక్కడ కూర్చుని ఏవేవో చాలా చెప్పాలనుకుని ఏదో ఒకటి మాట్లాడతారు. ఆ మాటల్లో ఒకరి పట్ల ఒకరికున్న ఆపేక్షనీ, ఆరాధననీ పంచుకునే భావాలుంటాయి. మళ్లీ కలిసేవరకూ ఆ తాదాత్మ్యంలోనే ఉంటారు. మిగిలిన లోకసంబంధ విషయాలన్నీ వారికి అప్రస్తుత ప్రసంగాలుగా అనిపిస్తాయి. ఒకరినొకరు మళ్ళీ వీక్షించుకునే క్షణాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి మానసిక పరిస్థితుల్లో కలిసి కొంత సమయం గడిపాక విడిపోక తప్పదు. అప్పుడా హృదయాలు ‘అభీ నా జావో ఛోడ్ కర్!’ అంటూ ఇలాగే పాడుకుంటాయి.

ఏడాదికో రెండేళ్లకో మన ఊరు వెళ్ళినప్పుడు మన ఊరి నేలతల్లీ, పైరగాలీ, ఆకుపచ్చ చేలూ, కొబ్బరి తోటలూ, పశువులూ, మేకలూ, బాతులూ, కోళ్ళూ, చేలోవాలే పిట్టలూ, కొంగలూ అన్ని మనల్ని ఓ సారి పరికించి చూసి మౌనంగా పలకరిస్తాయి. కొన్ని రోజులుండి మనం తిరిగి వచ్చేస్తుంటే అవన్నీ మూగగా ఇదే మాటంటాయి ‘మా మనసు నిండలేదు!’ అని.

అమ్మా, నాన్నా వీధిలోకి వచ్చి, మనం కారెక్కుతుంటే దిగులుగా నిలబడ్డప్పుడు, కళ్ళనిండుగా ఉన్న కన్నీళ్లు పలికే పాట  ‘మమ్మల్ని వదిలేసి వెళ్ళకు. నువ్వు ఇలా వెళ్లడం మా మనసులకు నచ్చడం లేదు!’  అన్న దుఃఖపు భారం  వారిదయితే, ఆ బాధావేదన అచ్చంగా మనదే!

తన ఊరిలో పుట్టి పెరిగిన పిల్లల పట్ల ఊరికెంత ఎంత  మమకారమో! పొలిమేర దాటి వస్తుంటే అక్కడ పచ్చని మొక్కల మధ్య నిలబడి ఉన్న మన ఊరి పేరున్న బోర్డు సైతం బెంగగా అనే మాట అదే ‘అప్పుడే వెళ్ళిపోతున్నావా?’

గోదావరి రేవు దాటుతుంటే లయబద్దంగా పడవని తాకుతూ మంద్రంగా పక్కకి తప్పుకునే వాత్సల్య గోదారి, కలకల సవ్వడి చేస్తూ ఇదే మాట అంటుంది ‘నా తనివి తీరలేదు!’ అని. ఇలా రకరకాలుగా మన మనసుకు చుట్టుకున్న బంధాలు ఇలాగే ప్రేమను వర్షించి  మనల్ని బాధిస్తాయి. ‘అసలు వచ్చి ఉన్నట్టే లేదు!’  అన్న మాట వారికీ, మనకీ కూడా వర్తిస్తుంది. ఆ మాట తాలూకు బాధ మన గొంతులో లోడెడ్ గన్ లాగా భారమౌతుంది.

చదువుకునే రోజుల్లో ఎవరైనా మిత్రురాలు మన ఇంటికి వస్తే గంటలు గంటలు కబుర్లు చెప్పుకుని, ఆ మాటలు పూర్తికాక “మీ ఇంటి వరకూ వస్తానే!” అంటూ తన వెంట వెళ్లే వాళ్ళం. ఆమె ఇల్లు వచ్చిన తర్వాత కూడా ఇంకా కొన్ని కబుర్లు మిగిలిపోయి “నిన్ను మీ ఇంట్లో వదిలేసి వస్తా!” అంటూ ఆ మిత్రురాలు మన ఇంటికి వచ్చేది. కొంత సేపు ముచ్చట్లయ్యాక “ఇక నేను వెళ్తానే!” అంటూ బయలుదేరేది.మళ్ళీ తనని దింపడానికి మనం బయలుదేరేవాళ్ళం. ఈ అంటువ్యాధి గమనించిన వాళ్ళ పెద్దవాళ్ళు కానీ, మన ఇంట్లో పెద్దవాళ్లు కానీ, ఎవరో ఒకరు గట్టిగా కేకలు వేసేదాకా ఈ సీరియల్ సాగేది. ఆ మాటల్లో ఏ ఊసులుండేవో ? ఎన్ని ఊహలుండేవో ? మనకే తెలియదు. అన్నీ అల్లిబిల్లి ఆలోచనలే! ఇప్పుడొకటి కూడా గుర్తు లేదు.

మన తోబుట్టువులు కానీ, మనతో కలిసి పెరిగిన కజిన్స్ కానీ, బాల్య మిత్రులు కానీ మన ఇంటికి వస్తే వాళ్ళున్న రెండు రోజులూ రెండు నిమిషాల్లా గడిచిపోతాయి. మనం బాల్యంలోకి వెళ్లిపోయి కుందేలు పిల్లల్లా కుప్పిగంతులు వేస్తాం.సీతాకోకచిలుకల్లా అందంగా మారిపోతాం. ఆపు లేకుండా కబుర్లు చెప్పుకుంటూనే ఉంటాం. వాళ్లు తిరిగి వెళ్ళిపోతుంటే ‘అసలు మాట్లాడినట్టే లేదే!’ అనిపించి మనసును ఎవరో మెలిపెట్టినట్టుగా ఉంటుంది. వీళ్ళు ‘ఇంకో రెండు రోజులు ఉంటే బావుండేది కదా!’ అనిపిస్తుంది. వారి పట్ల మన ఆత్మీయత, వారి కోసం మన పనులన్నీ పక్కనపెట్టి,రెండు రోజులు సెలవు పెట్టిన విషయం మన గమనికలోకి రానీయదు. ఇష్టం పెరిగే కొద్దీ అసంపూర్ణతా భావం కూడా పెరుగుతుందేమో! ఎంత పొందినా హృదయపాత్ర ఖాళీగానే ఉండిపోతుంది అది పూర్తిగా నిండదు. అది ఒక భావోద్వేగం! అనుబంధాల బంధనాలు మన హృదయంపై గాఢమైన ప్రభావాన్ని చూపిస్తాయి. కలిసి, విడిపోతున్నప్పుడు ఆ దుఃఖం కెరటాలు కెరటాలుగా ఎగిసిపడుతుంది.

కొందరికి అనేక సబ్జెక్టుల్లో ఆసక్తీ, ప్రేమా ఉంటాయి. అంచేత వారు వివిధ మాస్టర్స్ డిగ్రీలు చేస్తూ, ఒకటి పూర్తికాగానే మరొకటి మొదలుపెడతారు. అలాగే సాహితీ పిపాస గలవారు నిరంతరం సాహిత్య పఠనం చేస్తూనే ఉంటారు. ‘ఇక చాలు, చాలా పుస్తకాలు చదివానులే!’ అని సంతృప్తి పడరు. అలాగే సాహితీ సృజన చేసేవారు సమాజంలోని తోటివారిపై ప్రేమ ఉన్నంతవరకూ, చిగురులు వేసే ఆలోచనలున్నంత వరకూ రచనలు చేస్తూనే ఉంటారు ‘యే దిల్ అభీ భరా నహీ!’ అనుకుంటూ.

కాలం పట్ల ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా కాలం పట్టించుకోదు. కాలచక్రం మున్ముందుకు సాగిపోతూనే ఉంటుంది. అంతేకాదు బడికి రానన్న పిల్లాడిని కూడా జబ్బు పట్టుకుని లాక్కుపోయే మాష్టారిలా అది మనల్ని గబగబా నడిపిస్తూనే ఉంటుంది. ఎవరైనా మన దగ్గరకు వచ్చి చెయ్యి పట్టుకుని “నా జావో ఛోడ్ కర్!” అన్నా మనకి వెళ్ళక తప్పదుగా!

Exit mobile version