[సంచిక మాసపత్రికలో ప్రముఖ రచయిత్రి శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి గారు అందిస్తున్న కాలమ్ ‘రంగుల హేల’.]
ఎటు వెళ్తున్నాం? మనం!!
రాజకీయ నాయకులు రాజకీయమే చేస్తారు. ప్రాణాయామం చేసుకుంటూ గదిలో ఓ మూల కూర్చోరు కదా! అది అందరికీ తెలిసిన సంగతే! అయినా ఒకోసారి ఎన్నికలయిన తర్వాత మెజారిటీ తక్కువయినప్పుడు అధికారంకోసం పార్టీలు వేసే ఎత్తులూ, జిత్తులూ, అభ్యర్థులతో ఇతరపార్టీల వారి బేరసారాలూ, సొంతపార్టీ నుంచి బెదిరింపులూ, అవి తప్పించడం కోసం ఎమ్మెల్యేలను పొరుగు రాష్ట్రంలోని హోటళ్లలో బంధించడం మొదలైన విన్యాసాలు చూసి ముక్కున వేలేసుకుని ఆశ్చర్యపడిపోతూ ఉంటాం. చివరికి ఎవరో ఒకరు అధికార పీఠం ఎక్కుతారు. అక్కడితో ఆ ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఏ రాష్ట్రంలో ఎలక్షన్ జరిగి ఏ పార్టీ పవర్ లోకి వచ్చినా ఏమున్నది గర్వకారణం? అన్ని పార్టీల మేనిఫెస్టోలూ ఒకటే! కవర్ పేజీ రంగులు మాత్రమే వేరు వేరు. అందులో చాలా ఉదార చాకోలెట్లు ఉంటాయి. మన రాష్ట్ర ఖజానా లోంచి తీసి మనకే విందులు వడ్డిస్తామంటారు. అది కూడా తమ ప్రభుత్వ పదవుల్లో వారు అన్ని రకాల సౌకర్యాలకీ తీసుకోగా మిగిలితేనే! మొత్తం రాష్ట్ర బడ్జెట్‌కి సరిపడినన్ని ఉచితాలు. రాష్ట్ర బడ్జెట్‌ని క్లోన్ చేసి అంతే బడ్జెట్ మరొకటి పుట్టిస్తే తప్ప వారిచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేరు. అందుకే రాష్ట్రాధినేతలు తలకు మించిన అప్పులు చేస్తూ కంకర రోడ్డు మీద ఒంటెద్దు బండిని లాగినట్టు పరిపాలిస్తుంటారు. అభివృద్ధి ప్రాజెక్ట్‌లు శంకుస్థాపన రాయి కిందే నిద్రపోతూ ఉంటాయి. ప్రజలకు కూడా నాయకులు ఎక్కడి నుంచి తాయిలాలు తెచ్చిస్తారు అన్న అవగాహన ఉండదు. అలా ఆశపడి కొత్త కొత్త నాయకుల్ని గెలిపిస్తుంటారు, గొర్రెలు అప్పుడప్పుడూ కసాయిలను మార్చినట్టుగా. పేదలకి కార్పొరేట్ వైద్యం అని చెప్పి గెలిచాక ఆ ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళకి చెల్లించాల్సిన బిల్లులు కోట్లు దాటాక ప్రభుత్వం ఆ బాకీలు ఎగ్గొడుతుంది. వాళ్ళు పేదలను వెళ్ళగొడతారు. ఈ విషయాలు మళ్ళీ ఎన్నికలొచ్చేవరకూ ఎవరూ గమనించరు.
కుటుంబం స్వార్ధానికి దారితీస్తుందని పెళ్లి చేసుకోకుండా ఉన్న నాయకులు కూడా ప్రజాస్వామ్య సమాఖ్యస్ఫూర్తిని మర్చిపోయి చరిత్రలోని రాజులకుమల్లే రాజ్యవిస్తరణ కాంక్షను మాత్రం వదులుకోలేకపోవడం చిత్రాల్లోకెలా చిత్రం! అలా మనిషి తన తర్వాత కూడా తమ పార్టీని శాశ్వతంగా నిలబెట్టుకోవాలనుకోవడం అమాయకత్వం అని మన చరిత్ర చెబుతోంది కదా! అది గుర్తు చేసుకోవలసిన అవసరం లేదా?
అంతర్జాతీయంగా, దేశాలు ఒకదానితో మరొకటి పలు కారణాలతో యుద్దానికి దిగితే ఆపడానికి అన్ని దేశాలూ కలిసి ఒక పెదరాయుడిగా ఉండే సంస్థని ఏర్పరచుకున్నప్పటికీ అది ఆ పనిచేసే శక్తి లేక బలహీనపడి ఐసీయులో ఉంది. అంచేత ప్రపంచ ధనిక దేశాధ్యక్షుడు ఆడింది ఆట పాడింది పాటగా చెల్లుబాటవుతోంది. అంతర్జాతీయ చట్టాల అమలుకు తమవంతు బాధ్యత తీసుకోవాల్సిన మిగిలిన దేశాల పెద్దలు కూడా రకరకాలుగా కూటములు కట్టి రాజకీయం చేస్తున్నారు. అందరికీ ఆర్థిక సంబంధ వ్యాపార లాభాలు ముఖ్యంకానీ దేశ ప్రజల రక్షణ, వారి సుఖజీవనం కాదు. ధనిక దేశాల అధ్యక్షులకు ఛాలెంజ్ విసిరే చిన్న దేశాల వెనక అందుకు సపోర్ట్ గా నిలబడే పెద్ద దేశాలుంటాయి, గ్రూపులుంటాయి. రాజకీయ తమాషాలు అనేకం జరుగుతూ ఉంటాయి. మీడియా వాళ్లకి కాళ్లతో, చేతులతో చేసినా పూర్తికాని పని. వాళ్లు వార్తల్ని వేడివేడి మిర్చి బజ్జీలుగా వేయించి వడ్డిస్తుంటారు మనకి. అన్నీ ఒకే రుచితో ఉండకుండా కొంచెం వెరైటీ స్టఫ్ పెట్టడం కోసం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పోటీపడుతుంటాయి. నేడు ప్రపంచంలో ఎక్కడో ఒక చోట ఏళ్ల తరబడి యుద్ధం జరుగుతూ ఉండడం చూస్తున్నాం. యుద్ధంలో ప్రాణాలు పోగొట్టుకునేదీ, క్షతగాత్రులు అయ్యేదీ వివిధ దేశాల సైనికులే కదా! వారందరి వెనక ఎన్నో కుటుంబాలుంటాయి. అవసరంలేని యుద్దాలు చెయ్యడం అంటే వారందరి జీవితాలతో చెలగాటం ఆడినట్టే! అవి వారిలో ఎందరికి గుండె కోతను మిగులుస్తాయో!
మానవుడు శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకున్నా తనకున్న ఆదిమానవుని తాలూకు అనాగరిక రాక్షస ప్రవృత్తిని వదులుకోలేక జంతువులా ప్రవర్తిస్తూ ఉంటాడు. అణు విజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుని ఇతర గ్రహాల పైకి వెళ్లి చూసొచ్చి చందమామ లాంటి గ్రహాలపై తనకి అవసరమైనవి ఏమైనా ఉన్నాయేమో అని వెతుక్కుంటూ తిరిగాడు. ప్రపంచ ప్రజల క్షేమం కోసం, విశాలహితం దృష్ట్యా అణు విజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి కానీ మారణాయుధాలు తయారు చేసి విధ్వంసం వైపు పయనించడం శోచనీయం. చిన్నాచితకా దేశాల్ని లొంగ తీసుకోవడం కోసం యుద్ధానికి కాలు దువ్వడం విలయం సృష్టించడం ఏం ప్రగతి? ఏ మనిషి అయినా చిరకాలం జీవించలేడు, భూమిని వదిలి వెళ్లాల్సిందే! ఈ భూమి మన సొంతం కాదు. ఈ ధరిత్రిని తర్వాత తరానికి వీలయినంత ప్రశాంతంగా నివాసయోగ్యంగా అప్పచెప్పి వెళ్లాల్సిన బాధ్యత మనదే! ఆ మాత్రం పరిణతి 80 ఏళ్లకీ రాకపోతే ఆ వ్యక్తి మనిషి ఎలా అవుతాడు ? ప్రపంచంలో నిత్యం జరిగే యుద్ధ వార్తలు, జలసంధుల దిగ్బంధనాలు వంటివి వింటుంటే మనకి ఊపిరి సలపనట్టుగా ఉంటుంది. తీరి కూర్చుని కాలక్షేపానికి చేసే ఈ యుద్ధాలు మనిషి ఎందుకు చేస్తున్నాడో చేసే వాళ్లకైనా తెలుస్తోందా అన్నది అనుమానమే! శాంతి చర్చలు జరుగుతాయి అంటారు, యుద్ధం ఆగుతుంది అంటారు, లేదు లేదు ఆగదు. ప్రస్తుతానికి యుద్ధాన్ని డీప్ ఫ్రిజ్‌లో పెట్టామంటారు! అంతా గందరగోళం!
రాజకీయాల తర్వాత మనకి నచ్చే వినోదం సినిమాలు! ఇప్పుడు సినిమాల్లో కథ, మాటలు, పాటల మీద ఆశ లేదు. తలా తోకా లేని కథలు, దిగజారిన పోకిరీ పాటలు, హీరోయిన్ అసభ్యకర డాన్సులూ కామన్ అయ్యాయి. మితిమీరిన హింసతో రక్తాన్ని ఏరులుగా పారిస్తూ, జుగుప్సాకర చుంబనాలతో సినిమా ఆడించుకుని నిర్మాతలు హిట్ అంటూ జబ్బలు చరుచుకుంటున్నారు. మనం సినిమా పిచ్చి వదులుకోలేని వాళ్ళం కనుక ఓటీటీలో పరభాషా చిత్రాలు చూసి నలుగురికి చెప్పి సంతోష పడుతుంటాం. పాన్ ఇండియా పేరు చెప్పి రెండు చేతిరుమాళ్ళు హీరోయిన్‌కి బట్టలుగా ఇచ్చి కోట్లు గడిస్తున్నారు చందాలు వేసుకుని సినిమా తీసిన ప్రొడ్యూసర్లు.
గర్ల్స్ హాస్టల్లో అమ్మాయిల రూముల్లో అబ్బాయిలుండే హీనాతిహీనమైన కథలతో సినిమాలు తీసి అవార్డులు కూడా తెచ్చుకుంటున్నారు నిర్మాతలు. ఆ సినిమా విడుదల మొదటిరోజు వేలరూపాయల టిక్కెట్లు కొని ఎగబడి యువత చూడడం బాధాకరం. కాలేజీలో చదువుకునే యువతీ యువకులు ఒకరి పట్ల మరొకరు ఆకర్షితులు కావడం సహజం. దాన్ని దాటి వాళ్ళు మిగిలిన స్టూడెంట్స్ ఎదురుగా పరిధి దాటి ప్రవర్తించడం, అమ్మాయిలు అనుచితమైన డ్రెస్సులతో కాలేజీలకు వెళ్లడం చూస్తున్నాం. బయట ట్రెండ్ అలా ఉందని సినిమా వాళ్ళూ , సినిమాలు చూసి ఇలా తయారయ్యారని బయటి వాళ్ళూ అనడం పాత చింతకాయే! మరోపక్క ఆడపిల్లలకి కనీస రక్షణ లేని భయానక పరిస్థితులు నిత్యం వార్తలుగా చదువుతున్నాం. మనమంతా ఎటు పరిగెడుతున్నామో అర్థం కావడం లేదు. ఈ పరిస్థితుల్లో మా ఆడపిల్లలు సేఫ్ అని మనమూ, మన ఫీజులు మనకి వస్తున్నాయి అంటూ కాలేజీ యాజమాన్యాలూ, జనాన్ని థియేటర్లకి రప్పించాం లాభాలు వచ్చాయి అనుకుంటూ సినిమా వాళ్ళూ హాయిగా నిద్రపోతూ ఎలా బాధ్యతా రహితంగా ఉంటున్నామో! తలచుకుంటేనే మన తలవంగిపోతున్నది.
పాతికేళ్ల క్రితం హిట్ ఐన సినిమా సిల్వర్ జూబ్లీ ఫంక్షన్లో అప్పటి హీరోయిన్ (పెళ్ళై ఇద్దరు పిల్లల తల్లై) ఆ సినిమాలోని హీరో మీద సగం శరీరం పడేసి ఫోటోలకు ఫోజులిస్తూ ఉంటుంది.అది ప్రేక్షకుల ఆనందం కోసమా? తెలీదు. యూట్యూబ్ ఓపెన్ చెయ్యగానే అడక్కుండానే ఇలాంటి అనేక సంబరాలు దర్శనమిస్తుంటాయి.
సినీ తారల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసి చిలవల ఫలవలు కల్పించి ఎక్కడివో ఫోటోలు తీసుకొచ్చి వీడియోలు చేయడం, తద్వారా వారిని అగౌరవపరచడం, జనం సోమరుల్లా కూర్చుని తమ జీవితాల్లోని గుంతల్ని మరిచిపోయి స్మార్ట్ ఫోన్లలో వాటిని చూస్తూ ఆనందించడం ఒక వ్యసనంగా మారిపోయింది.
హిందీ సినిమా ఎంటర్టైన్మెంట్ టాక్ షోల పేరుతో మరో అభాగ్యం మనల్ని చుట్టుకుంది. టైతో సహా ఆపాదమస్తకం నిండైన దుస్తులతో యాంకర్లుంటారు. చిన్నపిల్లలు టవల్ చుట్టుకున్నట్టుగా పెద్ద పెద్ద హీరోయిన్లు మోకాళ్ళపైకి ఏవో గుడ్డలు చుట్టుకుని అనాచ్చాదిత భుజాలను చూపిస్తూ ఆ షోలకు వస్తుంటారు. నాలుగు గంటలు జిమ్ములో పడేసి నలగ్గొట్టిన శరీరాలవడం వల్ల మొహంలో అలసట కనబడుతూనే ఉంటుంది. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న ముక్కులు, పెదాలతో, డైట్ కంట్రోల్ వల్ల నీరసించిన మొహంలో పళ్ళు ఎత్తుగా కనబడుతూ వాళ్లెలా అందంగా ఉన్నామనుకుంటున్నారో ఆ దేవదేవుడికే తెలియాలి. ఇదంతా ఓ వేలంవెర్రి కాకపోతే ఏమిటి? సినిమాల్లో ఎలాగూ పాత్ర డిమాండ్ చేసిందంటూ సరైన బట్టలు ఇవ్వడు నిర్మాత. ఇక్కడ కూడా ఎందుకో ఈ బీదరికం! ఆ షోలకి వాళ్ళు చక్కగా నిండుగా బట్టలు వేసుకొని అందంగా తయారైతే చూ సే అదృష్టం మనకే లేదనుకోవాలి.
ఇంకా ఇలాంటి షోలలో యువ హీరోలు కాలిపొడుగునా అడ్డంగా చింపుకున్న జీన్ పాంట్స్ వేసుకుంటారు, డెబ్భైఏళ్ళ పాత హీరోయిన్లతో సహా! యాభై ఐదేళ్ల విశ్రాంత హీరోయిన్ మిడ్డీ వేసుకుని వస్తే ఆమెను మరో పాత హీరో బేబీ అంటూ సంబోధిస్తూ ఉంటాడు. ఆరడుగుల పుల్లకాళ్ళ స్టార్ హీరోయిన్ బికినీ లాంటి డ్రెస్ వేసుకునొచ్చి కాలు మీద కాలు వేసుకుని ఇబ్బందిగా కూర్చుంటుంది. అంత ఖర్మ ఎందుకో? ఆవిడకి సౌకర్యంగా ఉండే దుస్తులు వేసుకుని వచ్చినంత మాత్రాన ఆమె మార్కెట్ పడిపోదు కదా! వీళ్ళు వీక్షకులకు ఆనందం ఇస్తున్నామనుకుంటారా? TRP రేటింగ్ పెంచుకుంటున్నామన్న భ్రమలో ఛానెల్స్ ఉంటాయి. చూసేవాళ్ళ అభిరుచి పట్ల చులకనభావం కాకపోతే మరేమిటిది? ఇక తెలుగు ఛానెల్స్‌లో హాస్యపు స్కిట్ల గురించి ఒక్క మాటలో రాయాలంటే కళ్ళూ, చెవులూ, నోరూ మూసుకోవడం మంచిది.
ఇలా రాజకీయపరంగా, సినిమాలపరంగా, టీవీ, స్మార్ట్ ఫోన్స్ పరంగా అన్నివైపులా నిరాశాజనకంగా ప్రవర్తిస్తూ ఎటు వెళుతున్నాం? మనం!!
అల్లూరి గౌరీలక్ష్మి కథా, నవలా రచయిత్రిగా చక్కని పేరు సంపాదించారు. ఈమె మంచి కవయిత్రి, ఫెయిర్ కాలమిస్ట్ కూడా. నాలుగు కథా సంపుటాలూ, 4 నవలలూ, 3 కవిత్వ సంకలనాలూ, రెండు కాలమ్స్ బుక్ వెలువరించారు.
APIIC Ltd. లో General Manager గా పనిచేసి పదవీ విరమణ పొందారు.
