[ఇటీవల అమెరికా పర్యటించి, అక్కడ చూసిన కొన్ని దర్శనీయ ప్రదేశాల వివరాలు అందిస్తున్నారు శ్రీమతి జె. శ్యామల. ఇది 6వ, చివరి భాగం.]
అహో లహోయా కోవ్!
సాగర సందర్శనం అంటే చాలు నా మనసు సంతోష సముద్రమే అవుతుంది. అందుకేనేమో లహోయా కోవ్ షికారు అందమైన జ్ఞాపకమై అక్షరీకరించే దాకా మనసు నిలువలేదు. ఆ రోజు వాతావరణం అనుకూలంగా ఉండడంతో మా దీప పదపదమంటూ తొందరపెట్టింది. ముందుగా ఆత్మీయ నేస్తం మార్సెల్ల వాళ్లింటికి వెళ్ళాం. వాళ్ళింటికి లహోయా కోవ్ దగ్గరే. ముందుగానే చెప్పడం వల్ల ఆమె మాతో రావడానికి సిద్ధంగానే ఉంది. కారు అక్కడే పార్క్ చేసి, ముగ్గురం నడవసాగాం.
నులివెచ్చని ఎండలో నడక బాగుంది. మార్సెల్ల స్థానికురాలు కావడం వల్ల మధ్య మధ్యలో నేను అడిగిన సందేహాలకు బదులిచ్చింది. ఒక భవనం అక్కడి ఉమెన్స్ క్లబ్‌ది అని, మరొక కాంప్లెక్ సీనియర్ సిటిజన్లకు చెందిందని వివరించింది. రకరకాల ఇళ్ళు. కొన్ని పాత ఇళ్ళు కూడా ఉన్నాయి. ప్రతీ ఇంటిముందు పచ్చదనపు సింగారాలు. ఇక్కడి ఇళ్లలో చాలావరకు చెక్క వాడకమే ఎక్కువ.
సముద్ర తీరం చేరాం. ‘హ్యాపీ హాలిడేస్’ కావడం వల్ల కాబోలు ‘లహోయా కోవ్’ లో జనం సందడి బాగానే ఉంది. సముద్రపు అలలు ముంచెత్తే సుదూర తీర ప్రాంతం కొంతమేర రాళ్ళు.. వాటి మధ్య చిన్న చిన్న నీటి చెలమలు.
‘సీ అనిమొనే’ వగైరాలు ఉన్న చిన్న నీటి చెలమ
అక్కడ పువ్వు ఆకారంలో ఉండే సీ అనిమొనె ఉన్నాయి. వాటి మధ్య వేలితో కొద్దిగా స్పృశిస్తే చాలు.. అవి ముడుచుకుంటాయని చెపుతూ మార్సెల్ల వాటిని తాకింది. అది ముడుచుకోవడం తమాషాగా అనిపించి నేనూ తాకి చూశాను. బార్నికిల్స్, ఖైటాన్స్, లింపెడ్స్ కూడా చూశాం.
మార్సెల్ల హుషారుగా, ఆడుతూ, పాడుతూ నవ్వుతూ, నవ్వించే మనిషి. మిట్టపల్లాలుగా ఉండే రాళ్ళ మధ్య, ఏటవాలుగా ఉన్న ఇసుకదారుల్లో జాగ్రత్తలు చెప్పుకుంటూనే జాలీగా నడిచాం.
ఎటు చూసినా సీ గల్స్, పెలికాన్లు, ఒడ్డున బద్ధకంగా పడుకున్న సీల్స్. నేలమీద తాపీగా నడుస్తున్న సీగల్స్‌ను పట్టుకోవడానికి ప్రయత్నించే చిన్న పిల్లలు. సముద్రం స్థిమితంగా ఉండి, పెద్దగా సడి చేయడం లేదు. నీళ్ళలో లోతు తక్కువగా ఉన్న చోట కొంతమంది ఆనందంగా మునిగి తేలుతున్నారు.
లేత నీలివర్ణంలో సమ్మోహనంగా ఉన్న సంద్రానికి ఆ చివర ఎవరో హద్దు గీసినట్లుగా తోచే ముదురు నీలం సరళ రేఖ. అంతలోనే సంద్రం కొన్ని చోట్ల రంగుమారుతూ వీక్షకులను ఏమారుస్తోంది. సూర్యాస్తమయానికి ఇంకా గంట పైనే సమయం ఉన్నందున కొంత దూరం ముందుకు నడిచి మళ్ళీ వెనక్కు వచ్చి అనువైన బెంచి చూసుకుని బైఠాయిద్దామని అనుకుని అడుగులు కదిపాం. కొంత మేర పైకి ఎక్కి నడిచాం.
ఊడలు దిగిన వృక్ష సముదాయం
ఎన్ని వృక్షాలో! ముడతలు పడ్డ మానులు వంకరలు తిరిగి, పరస్పరం అల్లుకుని, కొన్ని చోట్ల ఆర్చి లాగా, గుహలాగా ఏర్పడ్డ వాటిని చూస్తూ ‘ చెట్లు వయసు మీరినా, భిన్నమైన రూపుతో ఆకర్షిస్తూనే ఉంటాయి ‘ అనుకున్నాను.
కొన్ని చోట్ల చెట్లు నేల వాలకుండా వాటికి ఊతం ఇచ్చేలా రాతి స్తంభాలు ఉంచడం గమనించాను. ఆడుకునే పిల్లలు, ఫోటోలు తీసుకునే వారు, కబుర్లు చెప్పుకునేవారు.. ఎటు చూసినా ఆహ్లాదమే. ఒక ఇంటిమీద కూర్చున్న భంగిమలో ఉన్న కుక్కను చూసి, దీపతో ‘అటు చూడు, ఆ కుక్క ఎంత పైకెక్కి కూర్చుందో!’ అన్నాను. తను నవ్వి ‘అది బొమ్మ అమ్మా’ అంది. ఎంతో సహజంగా భ్రమ పడేంత చక్కగా ఉంది ఆ బొమ్మ. ఇంకా పరిశీలిస్తే ఆ పైనే వెనుక వైపు మరో రెండు కుక్క బొమ్మలు. అంటే త్రికోణాకారంలో వాటిని ఏర్పాటు చేశారు.
పెద్ద హోటల్, పెద్ద భవనాలు.. ఇంకొచెం ముందుకు నడిస్తే వందల ఏళ్ళ నాటి రెండు ఇళ్ళు. వాటి గురించి ఇంకా వివాదాలు నడుస్తున్నాయని మార్సెల్ల చెప్పింది. ఆ తర్వాత తిరిగి వెనక్కు నడిచాం. అదృష్టం.. అస్తమయం తిలకించడానికి బాగా అనువుగా ఉన్న బెంచి దొరికింది. కొన్నిచోట్ల కొద్దిగా అలలు అలా అలా వచ్చిపోతున్నాయి.
సూర్యాస్తమయవేళ ఆకాశం కూడా చిత్రవిచిత్ర రంగులను సింగారించుకుంటూ అలరించసాగింది. అందరి కళ్ళు గగన సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్నాయి. తీసే ఫోటోలకు అంతే లేదు. రాగి వర్ణం, నీల మేఘచ్చాయలతో మబ్బుల డిజైనుతో ఆకాశం అందానికి చిరునామాగా మారింది.
తన కిరణాలతో ఆకాశానికి, సముద్రానికి రంగులు అద్దుతూ సూర్యుడు సముద్రానికి ఆవల మెలమెల్లగా అదృశ్యమవుతున్నాడు. సూర్యుడయితే చూపులనుంచి జారుకున్నాడు కానీ ఆకాశం మాత్రం చాలాసేపు రంజింపచేసింది. చీకటి చిన్నగా ప్రవేశిస్తున్న వేళ మేం తిరుగుముఖం పట్టాం.
సముద్రపు ఒడ్డున ఒకచోట పెళ్ళి వేడుక సంరంభం ఆకర్షించింది. నేల మీద తివాచీ పరిచి, పూలరెక్కలు చల్లి ఉన్నాయి. ఎర్రటి పూలతో పెద్ద లవ్ సింబల్ ఎంతో ఆకర్షణీయంగా ఉంది. మెక్సికన్ మ్యూజిక్ బృందం చక్కటి సంగీతాన్ని వినిపిస్తోంది. అబ్బాయి, అమ్మాయి అభిముఖంగా నిలుచుని ఉన్నారు. పక్కనే కొద్దిమంది ఆత్మీయులు. కెమెరామన్ సరే సరి. రింగులు మార్చుకునే ఘట్టం జరుగుతున్నట్లుంది. సాగర తీరమే వేదికగా, సంధ్యా సమయంలో వివాహం వారి అభిరుచికి అద్దం పట్టింది.
ఇంకొంచెం ముందుకు నడిస్తే మళ్ళీ అలాంటి కోలాహలమే దర్శనమిచ్చింది. అయితే అది ప్రపోజల్ వేడుక అని తెలిసింది.
మార్సెల్లతో దీప, రచయిత్రి.
అలా కబుర్లు చెప్పుకుంటూ మార్సెల్ల ఇల్లు చేరి, ఓ అయిదు నిముషాలు ఉండి, సెలవు తీసుకుని మా ఇల్లు చేరడానికి కారెక్కాం.
ఆ మర్నాడు మీడియా అంతా ఆ సూర్యాస్తమయాన్ని అరుదైన.. అందమైన సూర్యాస్తమయంగా అభివర్ణించడం కొసమెరుపు.
(సమాప్తం)
జొన్నలగడ్డ శ్యామల సీనియర్ జర్నలిస్టు. ఉదయం దినపత్రికలో పని చేసేవారు. వార్త దినపత్రికలో ఆదివారం అనుబంధం ఇన్ఛార్జ్ గా పని చేశారు. ప్రస్తుతం ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. వృత్తి ధర్మంగా అసంఖ్యాకమైన కవర్ స్టోరీలు, ఫీచర్లు, పుస్తక సమీక్షలు రాసినవారు. శ్యామల 70కి పైగా కథలు రాశారు. ఆంధ్రప్రభ, యువ, ఉదయం, వార్త, ఇండియా టుడే లలో వీరి కథలు ప్రచురితమయ్యాయి. ముఖ్యంగా వీరి ‘పడక్కుర్చీ’ కథ అనేక ప్రశంసలు పొందింది. పలు హస్య కథలు కూడా రచించారు. కొన్ని కథలు ఇతర కథాసంపుటాలలో వచ్చాయి. కొన్ని కథల పోటీలలో బహుమతి గెలుచుకున్నారు. పూతరేకులు, సాలోచనం, సాధన, మానస సంచరరే, అన్నింట అంతరాత్మ వంటి కాలమ్‌లు రాశారు.

