[శ్రీ రాజేష్ కుమార్ పొన్నాడ రాసిన ‘అమ్మ’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
గడియారంలో సమయం ఉదయం ఎనిమిది గంటలుగా చూపిస్తోంది. “కాఫీ ఎక్కడే?” అని అరుస్తూ నిద్ర లేచాడు రోహిత్. “తెస్తున్నా బాబు” అంటూ కాఫీ కప్పుతో కంగారుగా వచ్చింది పనిమనిషి యాదమ్మ.
కాఫీ తాగుతూ, “ఇప్పటిదాకా ఎక్కడ చచ్చావ్? నన్ను ఎందుకు నిద్ర లేపలేదు? నేను కాలేజీకి వెళ్ళాలని నీకు తెలియదా?” అంటూ కసురుకున్నాడు రోహిత్.
“ఇందాక లేపాను. కానీ మీరు లేవలేకపోయారు. ఆ తరువాత నేను వంటింట్లో పనిలో ఉన్నాను” అంది భయంతో యాదమ్మ.
“అమ్మ ఎక్కడుంది?” అని గదమాయించాడు.
“అమ్మగారు షూటింగ్‌కు వెళ్ళారు. మీకేమైనా కావాలంటే నన్ను దగ్గరుండి చూసుకోమన్నారు బాబు” అని వినయంగా సమాధానం చెప్పింది. రాత్రి తాగింది ఇంకా దిగకపోవడంతో నిద్రలేవలేకపోయాడు రోహిత్. అయినా అతికష్టంమీద బాత్రూమ్ వైపు నడిచాడు. రోహిత్ సీనియర్ ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థి. అతని తల్లి ప్రీతి, పేరు మోసిన సినిమా నటి. తండ్రి పెద్ద సినీ నిర్మాత. పెళ్ళి అయిన తరువాత కూడా భర్త సినిమాలో నటించడానికి అభ్యంతరం పెట్టకపోవడంతో ఎంతో కష్టపడి టైం షెడ్యుల్‌ను, ఫిజిక్‌ను మెయింటెయిన్ చేస్తూ సినిమాల్లో నాయకిగా, ప్రతినాయకిగా నటిస్తూ ఎన్నో అవార్డులు, రివార్డులు, రెమ్యూనరేషన్ సంపాదిస్తూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. కొడుకుని ఎలాగైనా డాక్టర్ని చేసి ఆ తరువాత యాక్టర్‌ని చేయాలని ఆమె కోరిక. ప్రీతి తల్లి వసుంధర. భర్త చనిపోయిన తరువాత కూతురి, మనవడి ఆలనాపాలనా చూస్తూ కాలక్షేపం చేస్తూ దేవుని పిలుపు కోసం ఎదురు చూస్తున్న డెబ్బై ఏళ్ళ అమ్మమ్మ. రోహిత్ నరనరాన అహంకారం, కోపం, గర్వం నింపుకున్న వ్యక్తి. తన తల్లిదండ్రులు పేరున్న, డబ్బున్నవారన్న భావనలో ప్రవర్తిస్తుంటాడు. ఆదరాబాదరాగా డ్రెస్ వేసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చిన రోహిత్‌కు యాదమ్మ టిఫిన్ సెక్షన్ కింద ఇడ్లీలు వడ్డించింది.
ఇడ్లీలను చూసి ప్లేట్ విసిరికొట్టాడు రోహిత్.
“ఎప్పుడు చూసినా ఇడ్లీలేనా? వేరే టిఫిన్ ఏమీ వండటం రాదా?” అంటూ విసురుగా వెళ్ళిపోయాడు. దాంతో నేలపై పడిన ఇడ్లీలు, పళ్ళెం తీసి నేలను శుభ్రం చేసింది యాదమ్మ. అలా ఇంట్లో టిఫిన్ నేలపాలు చేసి కాలేజీకి వెళ్ళిన రోహిత్ కాలేజీ క్యాంటీన్లో అల్పాహారం ముగించాడు. ఫేమస్ సినిమా నటి ఒక్కగానొక్క కొడుకు కావడంతో కాలేజీలో అందరూ రోహిత్‌ను ఎంతో గొప్పగా చూడసాగారు. అలా ఆ రోజు సోసోగా కాలేజి టైం ముగించి ఇంటికి చేరాడు రోహిత్. అప్పటికే షూటింగ్ ముగించుకుని ఇంటికి వచ్చింది ప్రీతి. కొడుకు చదువు గురించి వాకబు చేసింది.
“ఎలా ఉన్నావ్? మధ్యాహ్నం భోజనం చేసావా? వేళకి సరిగా తింటున్నారా లేదా?” అని అడగకుండా ఎప్పటిలాగే రొటీన్‌గా చదువు గురించి అడిగేసరికి రోహిత్‌కు కోపం వచ్చింది.
ఏం చేయాలో తెలియక ముక్తసరిగా సమాధానం చెప్పాడు.
అలా రోజులు గడుస్తున్నాయి.
***
కాలేజీలో పేరేంట్స్ మీట్ అని అనౌన్స్ చేయడంతో రోహిత్ అమ్మానాన్నలతో ఈ విషయం గురించి చెప్పాడు.
“లక్షలకు లక్షలు ఫీజులు కడుతున్నాం కదా! మధ్యలో ఎందుకు ఈ పేరెంట్స్ మీటింగులు?” అని ప్రశ్నించింది ప్రీతి.
“నేను డాక్టర్ కావాలనేది నీ కల కదమ్మా. నా కోసం రాలేవా అమ్మా?” అంటూ సమాధానం చెప్పే ప్రయత్నం చేశాడు రోహిత్.
“నాకు షూటింగ్ ఉంది. రావడం కుదరదు. కావాలంటే మీ నాన్నను తీసుకెళ్ళు” అని చెప్పి వెళ్ళిపోయింది ప్రీతి. తండ్రి కూడా మీటింగ్‌కు రానన్నాడు. దాంతో ఏం చేయాలో తెలియని సందిగ్ధంలో ఉండిపోయాడు రోహిత్.
చూస్తుండగానే పేరెంట్స్ మీటింగ్ రోజు వచ్చేసింది.
కాలేజీలో విద్యార్థులంతా తమ తల్లిదండ్రులతో సహా వచ్చారు. వారందరి మధ్యా రోహిత్ తల్లిదండ్రులు లేని అనాథలా ఒంటరిగా ఉన్నాడు. పేరెంట్స్ అంతా తమ పిల్లల చదువు గురించి కాలేజీ వారితో చర్చించారు.
పిల్లల లోటుపాట్లను, బిహేవియర్‌ను కాలేజీ ప్రిన్సిపాల్, సిబ్బంది తల్లిదండ్రులకు వివరించారు.
అలా రోహిత్ వంతు వచ్చింది. అతని బ్యాక్‌గ్రౌండ్ గురించి తెలిసిన కళాశాల ప్రిన్సిపాల్ అతని దగ్గర నుంచి అభిప్రాయాలు, విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి కనబర్చలేదు.
“మీ అమ్మగారు, నాన్నగారు అన్ని విషయాలు నువ్వు కాలేజీలో చేరినప్పుడే నీ గురించి చెప్పారు. అందుకే నీకు నీట్ పరీక్ష కోసం ట్రైనింగ్ ఇస్తున్నాం కదా” అని ప్రిన్సిపాల్ చెప్పాడు.
“సార్! నా అభిప్రాయం తెలుసుకోరా?” అని అమాయకంగా అడిగాడు రోహిత్. ప్రిన్సిపాల్ నవ్వి ఊరుకున్నాడు. ఆ కోపంతో ఇంటికి వచ్చాడు రోహిత్.
“భోజనం చేస్తావా బాబు” అని ఎప్పటిలాగే అడిగింది యాదమ్మ. “నాకు ఏమీ వద్దు” అని కోపంతో మేడపై ఉన్న తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు.
ఇదంతా గమనించిన వసుంధర, యాదమ్మతో “కాలేజీలో ఏమైందో ఏమో, వాడిని కాసేపు కదిలించకు” అని చెప్పింది.
రోహిత్ మాత్రం తెచ్చుకుని దాచుకున్న మందు సీసాలు తీసి, తాగడం మొదలెట్టాడు. కాలేజీలో జరిగిన సంఘటన తనకు బాగా బాధను కలిగించింది. ఆ బాధను మర్చిపోడానికి ప్రయత్నించసాగాడు. కుదరకపోవడంతో మందు తాగడం ఎక్కువైంది.
అప్పుడు సమయం రాత్రి తొమ్మిది గంటలు. రోహిత్ రూమ్ లోంచి బయటకు వచ్చి, వసారాలో నిలబడ్డాడు. కింద నుంచి గమనించిన యాదమ్మ, మేడపైకి వెళ్ళి మరోసారి “టైం తొమ్మిది అవుతోంది బాబు. అమ్మ, నాన్న ఇంకా రాలేదు. నీకు భోజనం మేడపైకే తీసుకురానా” అని అడిగింది.
“అమ్మా, నాన్న” అనే పదం వినగానే కోపంతో రోహిత్ “నేనేమైనా చిన్న పిల్లాడినా? ఎప్పుడు తినాలో నాకు తెలియదా? నేను ఏమైనా అన్నం పెట్టమన్నానా? నీ హద్దుల్లో నువ్వు ఉండు” అంటూ తాగిన మైకంలో, మత్తులో యాదమ్మ కడుపుపై కాలితో తన్నాడు.
దాంతో ఆమె మేడపై నుంచి “అమ్మా” అరుస్తూ కింద పడింది.
ఆ అరుపుకు వసుంధర వచ్చి యాదమ్మని చూసి , ఆమెను హస్పిటల్‌కు తీసుకెళ్ళమని మిగిలిన పనివాళ్లని తొందర పెట్టింది. యాదమ్మ తలకు బలమైన గాయమైంది.
ఇదంతా పట్టని రోహిత్ తన గదిలోకి వెళ్ళి నిద్రపోయాడు. ఆ మరునాడు ఏడు గంటలకు నిద్ర లేచాడు. తన గది నుంచి బయటకు వచ్చాడు. ఎదురుగా వసుంధర నిలబడి ఉంది.
“అమ్మమ్మా! ఏమైంది? ఇంట్లో నువ్వు ఒక్కదానివే ఉన్నావా?” అని అడిగాడు.
వసుంధర, రోహిత్ భుజం మీద చెయ్యి వేసి సోఫాలో కూర్చోబెట్టింది.
“చూడు నాన్నా! నీకు మీ అమ్మ ప్రీతి గురించి కొన్ని విషయాలు చెప్పాల్సిన సమయం వచ్చింది. నేను చెప్పేది జాగ్రత్తగా విను” అంటూ చెప్పడం మొదలు పెట్టింది.
***
కొన్ని సంవత్సరాల క్రితం మీ అమ్మ సినిమాల్లో హీరోయిన్ అవుదామని ప్రయత్నిస్తుండేది. ఎంత కష్టపడి ప్రయత్నించినా ఫలితం రాలేదు. అప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ అవుదామని ప్రయత్నించింది. అలా చివరికి జూనియర్ ఆర్టిస్ట్ అయింది. కానీ ఆ పని ద్వారా వచ్చే ఆదాయం జీవితానికి సరిపోయేది కాదు. సినిమాలు వద్దని నేను ఎంత చెప్పినా వినేది కాదు. చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో చాలా గారాబంగా పెంచాను. కానీ ఆ గారాబం తనకు స్వతంత్రాన్ని, ధైర్యాన్ని, తెగువను ఇచ్చింది. జూనియర్ ఆర్టిస్ట్‌గా ఉన్నప్పుడు ఎవరైనా వెధవ వేషాలు వేసినా, అసభ్యంగా ప్రవర్తించినా వాళ్ళకి చెప్పుతో సమాధానం చెప్పేది. అలాంటి మీ అమ్మ ప్రవర్తనకు చాలా మంది తోటి నటీ,నటులు భయపడేవారు. దాంతో ఆమెకు అవకాశాలు కూడా కరువైనాయి. ఇలాంటి పరిస్థితుల్లో మీ అమ్మ ఒక పెద్ద నిర్మాత రాధాకృష్ణ కంట పడింది. మీ అమ్మను చూసి ఆ రాధాకృష్ణ తన సినిమాలో మెయిన్ హీరోయిన్గా అవకాశం ఇస్తానన్నాడు. అతని ద్వారా పెద్ద డైరెక్టర్ పరిచయం అయ్యాడు. అలా మీ అమ్మ మొదటి సినిమా హీరోయిన్గా వచ్చింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. దాంతో మీ అమ్మ ఇంక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. వరుస హిట్లతో సినిమా రంగంలో హీరోయిన్గా దూసుకుపోయింది. స్టార్ స్టేటస్ పొందింది.
ఆ సమయంలో మీ అమ్మకు హీరోయిన్గా మొట్టమొదటి అవకాశం ఇచ్చిన రాధాకృష్ణగారు, తన కొడుకుకి మీ అమ్మతో పెళ్ళి చేయాలని అనుకున్నాడు. అదే విషయం మీ అమ్మకు చెప్పాడు. తనకు జీవితాన్ని ఇచ్చిన వ్యక్తి కావడంతో ఆయన మాట కాదనలేక “సరే” అని ఒప్పుకుంది. కానీ ఒక షరతు పెట్టింది. పెళ్ళి తరువాత కూడా తాను సినిమాల్లో నటిస్తానని, అందుకు అంగీకరిస్తే పెళ్ళి చేసుకుంటానని చెప్పింది.
అది విన్న రాధాకృష్ణ ఆమె పెట్టిన షరతుకు అంగీకరించాడు. అలా రాధాకృష్ణ కొడుకుతో మీ అమ్మకు పెళ్ళి అయింది. కొన్నాళ్ళకు మీ నాన్న పిల్లల కోసం ప్లాన్ చేద్దామని మీ అమ్మతో అన్నాడు. దానికి మీ అమ్మ ఒప్పుకోలేదు. తనకు ఈ స్థితిలో పిల్లల కంటే హీరోయిన్గా కెరియరే ముఖ్యం అంది.
కానీ మీ నాన్న పిల్లలు కావాలని పంతం పట్టాడు. దాంతో మీ అమ్మ సరోగసి విధానం ద్వారా అయితే నాకేమీ అభ్యంతరం లేదు అని అంది. ఇద్దరూ కలిసి ఫ్యామిలీ డాక్టర్ రమను కలిసారు. రమ వాళ్ళిద్దరూ చెప్పింది విని షాక్ అయింది. “మీరు మీ రంగంలో మంచి స్థితిలో ఉన్నారు. ఈ సమయంలో పిల్లలు వద్దనుకోవడం, కావాలనుకోవడం మీ ఇష్టం. కానీ పిల్లలు కావాలంటే మాత్రం సరోగసి విధానానికి ఎందుకు ఎంచుకున్నారు? ఎవరినైనా దత్తత తీసుకోవచ్చు కదా?” అని ప్రశ్నించింది.
దాంతో మీ నాన్న “మా బిడ్డలో మా రక్తమే ఉండాలి. పెంచుకున్న పిల్లలు పరాయి వాళ్ళే అవుతారు కదా డాక్టర్” అని ఆమెకు చెప్పాడు.
అప్పుడు ఆమె గెస్టేషనల్ సరోగసి విధానాన్ని వారికి వివరించింది. అంటే మీ అమ్మ నుంచి అండాన్ని తీసుకుని, మీ నాన్న నుండి వీర్యాన్ని తీసుకుని వాటి ద్వారా ప్రయోగశాలలో పిండాన్ని సృష్టించి, ఆ పిండాన్ని వేరే ఎవరైనా మహిళ గర్భంలో ప్రవేశపెడతారు. తద్వారా మీ అమ్మ నీకు జన్యు పరమైన తల్లి అవుతుంది. వేరే మహిళ నిన్ను మోసిన తల్లి మాత్రమే అవుతుంది. ఈ విధానం అమలుకు మీ అమ్మ, నాన్న ఒప్పుకున్నారు.
కానీ ఇక్కడున్న సమస్య ‘పిండాన్ని మోయడానికి అద్దె గర్భం ఇవ్వడానికి ఎవరు ముందుకు వస్తారు?’ అని. ఆ సమయంలో మీ అమ్మ, నాన్న కలిసి అలాంటి మహిళ కోసం వెతకడం మొదలు పెట్టారు. ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తామన్నారు. చివరికి ఒక మహిళ దొరికింది. ఆ మహిళ వయసు ముప్పై సంవత్సరాలు. అప్పటికే ఒక మగబిడ్డ ఉండడంతో గర్భం ధరిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆమెకు కొంత అవగాహన ఉంది. తన భర్తకు బైపాస్ సర్జరీ చేయించాల్సిన అవసరం వచ్చింది.
రోజు కూలీ చేసుకునే ఆమెకు సర్జరీకి అయ్యే ఖర్చు భరించే తాహతు లేదు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో మీ అమ్మానాన్నలు చెప్పిన దానికి అంగీకరించింది. ఆమెను కూడా డాక్టర్ రమనే కుదిర్చింది. అందుకు ప్రతిగా డాక్టర్ రమకు తెలిసిన హాస్పటల్లో గర్భం అద్దెకు ఇవ్వడానికి సిద్ధమైన సరోగేట్ మదర్ భర్తకు ఆపరేషన్ చేయిస్తానని మీ నాన్న మాట ఇచ్చాడు. సంతకాలు చేయడానికి, అగ్రిమెంట్ కుదర్చడానికి డాక్టర్, సరోగేట్ మదర్‌కు కాగితాలు ఇచ్చింది. కానీ ఆమె ‘పేగు బంధాన్ని ఏ ఒప్పంద పత్రాలు నిర్ణయించలేవు డాక్టర్ గారు. మీరు ఏమి చెప్పినా నేను చేస్తాను. నా భర్తను బతికించండి చాలు’ అంటూ నమస్కారం పెట్టింది. అది చూసి మీ అమ్మా, నాన్న నివ్వెరపోయారు. మీ నాన్న ఆమె భర్తను హాస్పటల్లో చేర్పించి ఆపరేషన్‌కు ఏర్పాట్లు చేసాడు. అలా విజయవంతంగా సరోగేట్ మదర్ భర్త, ఆపరేషన్ పూర్తి అయింది. దాంతో ఆమె తన గర్భాన్ని అద్దెకు ఇవ్వడానికి సిద్ధపడింది. డాక్టర్ ఆమెకు తగిన విధంగా కౌన్సిలింగ్ ఇచ్చారు. మంచి పోషకాహారం ఇస్తూ, ఆరోగ్య పరీక్షలు చేస్తూ ఆమెను ప్రత్యేకమైన ఇంట్లో ఉంచారు. అలా చూస్తుండగానే డెలివరీ టైం వచ్చింది. కడుపులో బిడ్డ అడ్డం తిరిగింది. నార్మల్ డెలివరీ సాధ్యం కాదని డాక్టర్ తేల్చేసారు. దాంతో ఆమె కడుపు కోసి ఆపరేషన్ చేసి మాత్రమే బిడ్డను బయటకు తీయగలం అన్నారు. అందుకు ఆమె సమ్మతించింది. ఆ విధంగా ఆమె గర్భాన నువ్వు పుట్టావు. అలా నిన్ను మీ అమ్మ ప్రీతి మోయలేదు, కనలేదు. అప్పటి వరకూ పరిచయం లేని ఎవరో ముక్కు మోహం తెలియని ఒక మహిళ నిన్ను నవమాసాలు మోసింది.
***
“ఇదీ నీ జన్మ తాలుకు గతం” అని ముగించింది వసుంధర.
‘తన తల్లి తనను మోయడానికి కూడా ఇష్టపడలేదు’ అనే భావన రోహిత్‌కు తీవ్ర మనస్థాపానికి గురిచేసింది. అప్పటి వరకూ తన తల్లిదండ్రుల మీద ఉన్న కోపం ఇంకా పెరిగిపోయింది.
ఆ కోపంతోనే “అమ్మమ్మా! ఇదంతా ఇప్పుడు నాకు ఎందుకు చెప్పాలనిపించింది?” అని అడిగాడు.
“ఎందుకంటే ఒక స్త్రీ గర్భం విలువ నీకు తెలియాలని. తాగిన మైకంలో నువ్వు ఆ యాదమ్మ కడుపు మీద కాలితో తన్నావు. ఆమె ఎంత బాధ అనుభవించి ఉంటుందో నీకు అర్థం కావాలని.”
మొట్టమొదటిసారిగా తాను చేసిన పనికి రోహిత్ కళ్ళల్లో అసంకల్పితంగా నీళ్ళు తిరిగాయి. ఆ కన్నీళ్ళు కనబడనీయకుండా తుడుచుకుంటూ “ఇంతకీ నన్ను మోసిన ఆ తల్లి ఇప్పుడు ఎక్కడుంది?” అని ప్రశ్నించాడు.
“తెలియదు. ప్రసవం అయిన తరువాత ఆమె నుంచి నిన్ను తీసుకొని, ఆమెకు మరికొంత డబ్బు ఇచ్చి పంపించాం. ఆ తరువాత ఆమెకు, మాకు సంబంధాలు లేవు” అని చెప్పింది వసుంధర.
ఈసారి కన్నీరు ఆపుకోవడం రోహిత్ వల్ల కాలేదు. అలానే ఏడుస్తూ “అమ్మమ్మా! ప్లీజ్ చెప్పు. నీకు తెలిసే ఉంటుంది. అవసరం అయ్యాక అమ్మ మనుషులను, వస్తువులను వదిలేస్తుంది. కానీ నువ్వు వదిలేయవు. కూలి కోసం ఇటుకలు మోసిన ఆ తల్లి, బరువు అని అనుకుని మధ్యలో దించేసుకోకుండా నవమాసాలు నన్ను మోసిన ఆ తల్లిని నేను చూడాలి” అంటూ భావోద్వేగానికి గురయ్యాడు.
మొట్టమొదటిసారిగా రోహిత్‌ని ఏడవడం చూసిన వసుంధర అతన్ని ఓదారుస్తూ “ఆమే యాదమ్మ” అని నిజాన్ని చెప్పింది.
“నిజమా? ఏమిటి నువ్వు అనేది?”
“అవును. ప్రసవం తర్వాత యాదమ్మ దగ్గర నుంచి నిన్ను తీసుకొని ఆమెకు కొంత డబ్బు ఆఫర్ చేసాం. కానీ తను తీసుకోలేదు. మన ఇంట్లో పని చేస్తానని అంది. అలా ఇంట్లో పనిచేస్తూ నిన్ను చూసుకునేది.
నీ మలమూత్రాలు కడిగింది. నీకు చనుబాలు ఇచ్చింది. అంటే నీకు డబ్బా పాలు పట్టబోతుంటే , తనే పాలు ఇచ్చింది. నిన్ను మోయడం మాత్రమే కాకుండా, నీకు అమ్మ కాని అమ్మ అయింది. అప్పటి నుంచి మన ఇంట్లోనే పనిమనిషిగానే ఉంది.”
ఊహ తెలిసాక యాదమ్మ తనకు స్నానం చేయించడం మాత్రమే రోహిత్‌కు గుర్తుంది. దాంతో ఆమెను ఒక పనిమనిషిగానే చూసేవాడు. వసుంధర చెప్పిన నిజం విన్న తర్వాత “నేను వెంటనే మా అమ్మ యాదమ్మను చూడాలి. ఏ హాస్పిటల్లో ఉంది?” అని అడిగాడు.
వసుంధర ఆసుపత్రి అడ్రస్ చెప్పింది. వెంటనే హాస్పటల్‌కు బయలుదేరాడు.
***
రోహిత్, హాస్పిటల్లో డాక్టర్‌ను యాదమ్మ ఆరోగ్యం గురించి వాకబు చేసాడు.
డాక్టర్ అనుమతితో యాదమ్మను ఉంచిన గదిలోకి వెళ్ళాడు. ఆమె హాస్పిటల్ బెడ్ మీద పడుకుని ఉంది.
ఆమె రోహిత్‌ను చూసింది. ముఖంలో ఎటువంటి ఫీలింగ్స్ లేవు.
ఇసిజి మెషీన్లో హార్ట్ బీట్ చూపిస్తోంది. ఇసిజి లైన్స్ కూడా జిగ్‌జాగ్‌గా ఉన్నాయి. హార్ట్ రేట్ కూడా డెబ్భైకి పైనే చూపిస్తోంది.
రోహిత్ ఆమె పాదాల దగ్గర నిలబడి ఆమెకు నమస్కరించాడు.
“అమ్మా! నన్ను క్షమించు అని అడగడానికి కూడా అర్హత లేని తప్పు చేసాను. అమ్మమ్మ నాకు అంతా చెప్పింది. కానీ పెద్ద మనసు చేసుకుని నన్ను మన్నించు” అని తల దించుకున్నాడు.
యాదమ్మ, “ఇన్నేళ్ళకు నీకు నిజం తెలిసింది. కానీ నేను సంతోషంగా లేను. నేను, నిన్ను మోస్తున్నప్పుడు నువ్వు అప్పుడప్పుడు నన్ను తన్నేవాడివి. ఆ దెబ్బలు నాకు మధురంగా, తియ్యగా అనిపించాయి. కానీ నిన్న నువ్వు, నన్ను కాలితో కడుపుపై తన్నావు. ‘ఇలాంటి వాడినా నేను నవమాసాలు మోసాను’ అని ఇప్పుడు బాధ పడుతున్నాను” అని కన్నీళ్ళు పెట్టుకుంది.
“అమ్మా! నేను నిన్ను ఎన్నోసార్లు తిట్టాను. అవమానించాను. ముఖం మీద అన్నం ప్లేట్ విసిరాను. నేను మంచివాడిగా మారాను. ఈ ఒక్కసారి నా తప్పును మన్నించు” అంటూ రోహిత్ ఆమె కాళ్ళు పట్టుకుని ఏడ్చాడు. అతని కన్నీటి చుక్కలు ఆమె పాదాల మీద పడ్డాయి.
ఇసిజి మెషీన్లో హార్ట్ బీట్ చూపించడం లేదు. ఇసిజి లైన్స్ కూడా సమాంతరంగా ఉన్నాయి. హార్ట్ రేట్ సున్నాగా చూపిస్తోంది.
ఇదంతా గది బయట నుంచి గమనించిన డాక్టర్ వచ్చి పరీక్షించి “కార్డియాక్ అరెస్ట్ అయింది. సారీ! ఈమె చనిపోయింది” అని చెప్పాడు.
రోహిత్ నోటమాట రాలేదు.
బాటమ్ లైన్: నవమాసాలు బిడ్డలను మోసిన, మోస్తున్న తల్లులకు పాదాభివందనాలతో ఈ కథ అంకితం.
