[రోహిణి భైరవజోశ్యులు గారు రచించిన ‘అమ్మా.. నాకీ చదువు వద్దు’ అనే కథని అందిస్తున్నాము.]


“అబ్బబ్బా.. విసిగించేస్తున్నారురా మీ అల్లరితో” అంటూ గదిలో చదువుకుంటున్న వింధ్య చెవులు మూసుకుంటూ బయటికి వచ్చింది.
అక్కడ హాల్లో అన్న కొడుకు శౌర్య, అక్క కొడుకు వంశీ సోఫాల మీద ఎక్కి తొక్కుతూ గట్టిగా కేకలేస్తున్నారు.
అది చూసిన వింధ్య “ఒరేయ్ అలా ఎగిరితే సోఫాలు పాడవుతాయి.. దిగండి” అని కేకలేసి దింపేసింది.
కాస్సేపు బుధ్ధిగానే ఆడుకున్నారు. అంతలో ఏమయిందో ఏమో కానీ ఇద్దరూ ఒకరిమీద ఒకరు పడి దొర్లుతూ కొట్టుకుంటున్నారు.
“వెధవల్లారా.. ఇదేం అల్లరి రా ఛ.. ఛ.. బొత్తిగా క్రమశిక్షణ లేదు.” అంటూ ఇద్దరినీ విడదీసి, చెరో దెబ్బ వేసింది.
అంతే.. ఇద్దరూ పెద్దగా ఏడుస్తూ వాళ్ల అమ్మల దగ్గరికి వెళ్లారు.
ఒక వైపు నుంచి వదిన, ఇంకో వైపు నుంచి అక్కా, వంటింట్లో పని చేసుకుంటున్న తల్లి.. అందరూ హాల్ లోకి వచ్చారు.
అక్కడ సోఫాలో కూర్చుని బుక్ చదువుకుంటూన్న వింధ్యను చూపించారు రాగాలు తీస్తూ.. ‘ఈవిడే మమ్మల్ని కొట్టింది’ అన్నట్టు.
“ఏంటే వింధ్యా! చక్కగా ఆడుకుంటున్న పిల్లలను ఎందుకు కొట్టావ్?” అంటూ అక్క సంధ్య, నిలదీసి అడిగింది వింధ్యను.
“చక్కగా ఆడుకుంటున్నారా.. నీకేం తెలుసు వీళ్ళేం చేస్తున్నారో.. సోఫాలు తొక్కుతూ, దెబ్బలాడుతూ, కొట్టుకుంటూ ఉంటే.. మీకేమీ పట్టనట్టు హాయిగా కబుర్లు చెప్పుకుంటూ, టీవీ చూస్తూ కూర్చున్నారా. నిన్నటికీ నిన్న బంతితో క్రికెట్ ఆట ఆడుతూ నేను టూర్ కెళ్ళినపుడు తెచ్చుకున్న ఫ్లవర్ వాజ్‌ను బద్దలు కొట్టేశారు. ఇంకొక రోజు పక్కన పిల్లవాడిని రాయి పుచ్చుకుని కొట్టాడు ఈ వెధవ. వాళ్ళు కూడా మన ఇంటికి వచ్చారుగా గొడవ చేయడానికి” అంటూ..
“ఇలాంటివి రోజూ ఏదో ఒక గొడవ ఇంటి మీదికి తెస్తూనే ఉన్నారు. అసలు వీళ్ళను ఇలా పెంచారేమిటి. ఒక క్రమశిక్షణ అంటూ ఏమీ లేదు. ఇప్పుడే ఇలా ఉంటే పెద్దయ్యాక రౌడీ వెధవలౌతారు తెలుసా. చదువులో కూడా అంతంత మాత్రమే ఉన్నారు వీళ్ళు.. మీరు ఇప్పుడే జాగ్రత్త పడండి” అంటూ వదిన శైలజనూ, అక్క సంధ్యనూ చూసి చెప్తోంది.
“పెళ్ళికాని నువ్వు మాకే పాఠాలు నేర్పుతున్నావా పిల్లల పెంపకం గురించి.” అన్నది వదిన విసురుగా.
“పెద్దవాళ్ళతో ఇలాగేనా మాట్లాడేది. అయినా ఇప్పుడేం కొంపలు మునిగి పోయాయని.. పిల్లలన్నాక అల్లరి చేస్తారు. కొట్లాడుకుంటారు.. మళ్ళీ వాళ్ళే కలసి పోతారు. పెద్దవాళ్ళలాగ ఒక మూలన కూర్చుంటారుటే” అని శ్యామలమ్మ, పిల్లలిద్దరినీ దగ్గరకు తీసుకుంటూ అన్నది.
“అది కాదమ్మా!.. నేను మెడిసిన్ ఎంట్రెన్స్‌కు చదువుకుంటున్నాను.. వీళ్లేమో ఇలా అల్లరి చేస్తున్నారు. నేనెలా చదువుకోనూ?” అన్నది వింధ్య దీర్ఘం తీస్తూ.
అప్పుడే లోపలికి వస్తున్న చక్రపాణి “సంవత్సరమంతా వేస్ట్ చేసావు సినిమాలు, షికార్లు అంటూ.. సరిగ్గా పరీక్షల ముందు చదివితే సీట్ ఎలా వస్తుంది. డాక్టర్ కావాలని ఆశయం ఉంటే చాలదు. దాన్ని నెరవేర్చుకోవాలనే పట్టుదల కూడా ఉండాలి” అన్నాడు.
“అది కాదు నాన్నా.. నేను బాగానే చదువుతున్నాను. హాస్టల్లో ఉండి చదివితే బాగుంటుంది అంటేనేమో మీరు ససేమిరా కాదన్నారు.” అన్నది వింధ్య.
“నీవు చదువుకోవాలనుంటే మేడ మీద గదిలో చదువుకోరాదూ.. ఇంటికొచ్చిన పిల్లలు ఎక్కడికి వెళతారు. ఇంట్లోనేగా ఆడుకోవాలి” అన్నది శ్యామలమ్మ.
“అమ్మా! ..ఇకనుంచి వింధ్య చదువు అయిపోయేవరకూ మేము మీ దగ్గరకు రాము. మమ్మల్ని చూడాలనుంటే మీరే మా దగ్గరకు రండి.. చూద్దాం రేపు పొద్దున ఈవిడ గారికి పెళ్లై పిల్లలు పుడితే ఎంత క్రమశిక్షణతో పెంచుతుందో” అని అక్క నిష్ఠూరంగా. శ్యామలమ్మతో అన్నది.
“అయ్యో! వింధ్య చిన్నపిల్ల.. అదేదో తెలియక అన్నదని మీరూ అలా పంతానికి పోతే ఎలానే” అన్నది శ్యామలమ్మ.
వింధ్య ఆ రోజే అనుకున్నది.. తనకు పిల్లలు పుడితే మంచి క్రమశిక్షణతో పెంచుతుంది.
***
వింద్యకు మెడిసిన్‌లో సీట్ రాలేదు.
తన వయసే ఉన్న పిన్ని కూతురికి మెడిసిన్‌లో సీట్ వచ్చిందని పిన్ని మహా సంబరంగా ఫోన్ చేసి చెప్పింది. శ్యామలమ్మ కూడా సంతోషపడ్డది తన చెల్లెలు కూతురు డాక్టర్ అవబోతుందని. వింధ్యకు మాత్రం అవమానం అనిపించింది.
కనీసం డాక్టర్‌ను పెళ్లి చేసుకోవాలనే కోరిక కూడా తీరలేదు.
***
వింధ్యకు శ్రీకర్‌తో పెళ్లైంది.. అతను ఒక ప్రభుత్వ అధికారి. వాళ్లకు ఒక్కగానొక్క కొడుకు, వరుణ్.
వింధ్యకు కనీసం తన కొడుకునైనా డాక్టర్‌ను చేయాలని కోరిక.. తన ఆశయం, కోరిక వరుణ్ ద్వారా తీర్చుకోవాలని ఉంది తనకు. అందరూ వాడిని బాగా గారం చేసేవాళ్ళు. దానితో వాడు ఆడింది ఆటగా పాడింది పాటగా అయిపోయింది. వింధ్యకు మాత్రం మహా భయంగా ఉండేది.. కొడుకు ఎక్కడ పాడై పోతాడో అని.
“నీదంతా చోద్యం లేవే.. పిల్లలు ఈ వయసులోనే కదా అల్లరి చేసేది. మనంత వయసు వచ్చాక అల్లరి చేయమన్నా చేయరు. మనల్ని చేయమంటే చేస్తామా” అని నవ్వుతూ వింధ్య మాటలు కొట్టి పారేసేది శ్యామలమ్మ.
వాడికి అయిదేళ్ల వయసు వచ్చేటప్పటికి కాస్త అల్లరి కూడా పెరిగింది. చుట్టుపక్కల పిల్లలతో, స్కూల్లో పిల్లలతో అప్పుడప్పుడూ గొడవ పడుతూ ఉండడం, టీచర్లు తమకు ఫిర్యాదు చేయడం లాంటివి జరుగుతూ ఉండేవి.
ఇక లాభం లేదనుకుంది వింధ్య! ఇక ఎవ్వరి మాటా వినకూడదనుకుంది. ఇలాగే ఉంటే వాడి అల్లరి ఎక్కువ అయి, చదువును నిర్లక్ష్యం చేస్తాడేమో అని భయం పట్టుకున్నది.
***
వాడికి మార్కులు తక్కువ వచ్చినా.. చుట్టుపక్కల పిల్లలతో గొడవ పడినా, ఇంట్లో ఏ వస్తువు పాడు చేసినా కాస్త గట్టిగా దండించేది.
“వాడిని ఇప్పుడే డాక్టర్ చేస్తావా ఏమిటి?” అంటూ వేళాకోళం చేసేవాడు శ్రీకర్.
చదువు విషయంలో ఎక్కడ లేని శ్రద్ధ తీసుకునేది. ఎప్పుడూ ఫస్ట్ ర్యాంక్ రావాల్సిందే. ఒక్క మార్క్ తక్కువ వచ్చినా తను ఆందోళన పడుతూ వాడినీ ఆందోళనకు గురి చేసేది. వాడు అంత ఒత్తిడికి తట్టుకోలేక పోయేవాడు.
తండ్రి దగ్గరకు వెళ్ళి ఏడ్చేవాడు. “నాన్నా నేను అంత ఎక్కువ సేపు చదవలేను” అంటూ.
“పిల్లాడిని అంత శ్రమ పెట్టడం భావ్యం కాదు వింధ్యా” అంటే, “మీకు తెలీదు ఊరుకోండి. నేను చదివే రోజుల్లో అంత శ్రద్ద పెట్టి చదవలేదు. మా పెద్దవాళ్ళు కూడా ఎప్పుడూ చదువుకోమని గట్టిగా చెప్పలేదు. అందుకే నాకు సీట్ రాలేదు. చూడండి ఇప్పుడు ఎవరు చూసినా మెడిసిన్, ఇంజనీరింగ్ చదువుతున్నారు. విదేశాలకు వెళ్తున్నారు. మరి నా కొడుకు అలా చదివి విదేశాలకు వెళ్ళాలని కోరుకోవడం తప్పా?” అన్నది.
“నీవు అలా ఆశించడంలో తప్పు లేదు. కానీ వాడి శక్తికి మించిన చదువు, చదవాలంటే వాడికి ఎంత కష్టం” అన్నాడు శ్రీకర్.
“ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చదువుతాడు?” అంటూ భర్త మాటలను త్రోసిపుచ్చేది.
వరుణ్, తల్లితో కన్నా తండ్రి తోనే ఎక్కువ చనువుగా ఉండేవాడు. ఏం కావాలన్నా తండ్రినే అడిగేవాడు.
దీనితో వింధ్య మరింత కంగారుపడి, సైకియాట్రిస్ట్ ఆయిన తన స్నేహితురాలు, శిల్పకు ఫోన్ చేసి..”వరుణ్ నా దగ్గరికే రాడు. వాడు నన్ను ద్వేషిస్తున్నాడేమో అని భయంగా ఉంది” అన్నది.
అంతా విన్న శిల్ప “అలా ఏం జరగదులే. లేని పోని అపోహలు పెట్టుకోకు. ఎప్పుడూ చదువు.. చదువు.. అంటూ వాడి వెంటపడి సతాయించకుండా, వాడితో పాటు ఆటలలో పాల్గొను.. వాడికిష్టమైన విషయాల గురించి మాట్లాడు. అప్పుడు వాడు నీ దగ్గరకు కూడా వస్తాడు” అని సలహా ఇచ్చింది.
కొన్ని రోజులు అలాగే చేసింది. వాడు బాగానే ఉండేవాడు.
కానీ వాడు పెద్ద క్లాసులకు వచ్చేటప్పటికి ఆ సలహా గాలికి వదిలేసింది.
ఇంత కాంపిటీషన్ ఉన్న ఈ రోజులలో అలా టైమ్ వేస్ట్ చేయడం వింధ్యకు అస్సలు నచ్చలేదు.
***
వాడు 10వ తరగతి మంచి మార్కులతో పాస్ అయ్యాడు. వాడిని ఇంటర్మీడియట్లో సైన్స్ గ్రూప్‌లో చేర్చింది వింధ్య. వాడు “అమ్మా.. నేను సైన్స్ గ్రూప్‌లో చేరను” అన్నా వినలేదు వింధ్య.
***
కాలేజీలో వాడికి వచ్చే మంచి మార్కులు చూసి ఊపిరి పీల్చుకుంది.
కానీ “మెడిసిన్‌లో సీట్ రావాలంటే ఇంకా ఎక్కువ కష్టపడాలి. అది ఇంట్లో కూచుని చదివితే లాభం లేదు, హాస్టల్లో చేర్పించండి” అని కాలేజ్ వాళ్ళు అనడంతో అదీ నిజమే అనిపించింది వింధ్యకు.
వరుణ్ ఏడుపు మొహం పెట్టాడు. శ్రీకర్ కూడా దానికి ఒప్పుకోలేదు. “పోనీలే వింధ్యా! వాడికి ఇష్టం లేదు. వాడిని బలవంతం చేయకు” అని ఎంతో చెప్పి చూసాడు. అయినా వింధ్య మొండి పట్టుదల వీడలేదు.
వాడిని హాస్టల్లో చేర్పించారు. హాస్టల్‌కు వెళ్ళడానికి రెండు రోజుల ముందు నుంచి వరుణ్ ఎవరితోనూ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. వాడిని అలా చూసిన శ్రీకర్‌కు కాస్త బాధేసింది.
***
హాస్టల్లో చేరిన రెండు నెలలకు ఒక రోజు హాస్టల్ నుంచి ఫోన్ వచ్చింది, “మీ అబ్బాయి పొద్దుటి నుంచి కనబడడం లేదు. మీ ఇంటికేమైనా వచ్చాడా” అని.
కంగారు పడిపోయారు వింధ్య, శ్రీకర్లు.
హుటాహుటిన హాస్టల్‌కి వెళ్ళారు. హాస్టల్ వార్డెన్ కంగారుగా ఎదురొచ్చాడు “మీ అబ్బాయి ఈ మధ్య అదోలా ఉంటున్నాడండి. ఎవరితోనూ మాట్లాడడం లేదు. ఏమోలే ఎక్కువ శ్రద్ధగా చదువుకుంటున్నాడేమో అని ఊరుకున్నాం. రాత్రి భోజనం చేసి కాసేపు చదువుకుని పిల్లలంతా పడుకున్నారు. పొద్దున లేచి చూసేసరికి పక్క మీద లేడు. తోటి పిల్లలను అడిగితే ఈ మధ్య భోజనం కూడా సరిగా చేయడం లేదని చెప్పారు. హాస్టల్ మొత్తం వెతికాము. ఎక్కడా లేడు. మీ దగ్గరికి వచ్చాడేమో అనుకుని మీకు ఫోన్ చేశాము. హాస్టల్ జీవితానికి అలవాటు పడని కొంత మంది పిల్లలు ఇలా చేస్తూ ఉంటారు” అన్నాడు.
గుండె దడదడలాడింది వింధ్యకు, శ్రీకర్‌కు. వెంటనే ఇద్దరి తల్లి తండ్రులకు ఫోన్ చేసారు. అక్కడికి ఏమైనా వచ్చాడేమో అని. వాళ్ళు కూడా కంగారు పడుతూ అక్కడికి రాలేదని చెప్పారు.
వింధ్య వాళ్ల అన్నకూ, అక్కకూ కూడా చేశారు.. వరుణ్ అక్కడకూ వెళ్ళలేదు. స్నేహితులందరికీ ఫోన్ చేస్తే.. వాడు అక్కడా లేడనే సమాధానం. వింధ్య బోరుమని ఏడవసాగింది.
పోలీసు రిపోర్ట్ ఇవ్వాలని నిర్ణయించారు. దానికి హాస్టల్ వార్డెన్, ప్రిన్సిపాల్ పోలీస్ రిపోర్ట్ ఇవ్వవద్దని బ్రతిమిలాడారు. అలా చేస్తే కాలేజ్ పరువు ప్రతిష్ఠలు దెబ్బతింటాయి అంటూ వారించారు.
శ్రీకర్ కోపంతో మండి పడ్డాడు. “మా పిల్లాడు ఏమైనా ఫరవాలేదు కానీ మీ కాలేజ్ పరువు ప్రతిష్ఠలు మాత్రం పోకూడదు. పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారో ఏమి చేస్తున్నారో.. అసలు తింటున్నారో లేదో తెలుసుకోవాల్సిన బాధ్యత మీకు లేదా.. మీ మీద కేసు వేస్తాను” అంటూ భార్యను తీసుకుని బయటికి వచ్చాడు.
వింధ్య ఏడుస్తోంది.. నిన్న రాత్రి టీవీలో వచ్చిన న్యూస్ పదే పదే గుర్తుకు వస్తోంది.. ఎవరో అమ్మాయి హాస్టల్లో ఉండలేక, ఆ ఒత్తిడికి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నది.. ఇదీ ఆ న్యూస్..
ఆ న్యూస్ విన్నప్పటి నుంచీ వరుణ్ గురించి భయపడుతూనే ఉంది. అంతలో పొద్దున్నే ఇలా జరిగింది. కొంపతీసి వరుణ్ కూడా అలా ఆత్మహత్య చేసుకున్నాడా.. ఆ తలంపే వింధ్యను వణికిస్తోంది.
ఇంతలో వింధ్య స్నేహితురాలు శిల్ప ఫోన్.. “మీ అబ్బాయి మా ఇంట్లో ఉన్నాడు.. కంగారు పడకండి” అంటూ.
ఈ చల్లని వార్త విని ఇద్దరూ కాస్త స్థిమిత పడ్డారు. వెంటనే శిల్ప ఇంటికి బయలుదేరారు. శిల్ప తన ఇంటి గేట్ వద్ద వీళ్ల కోసం ఎదురు చూస్తూ ఉంది.
వీళ్ళు కారు దిగగానే “ఆగండి.. ఆగండి..” అంటూ.. “వింధ్యా! నువ్వు అసలు ఏడవకూడదు. నీ గొంతు వింటే మీతో కలవడానికి, మాట్లాడడానికి అసలు ఇష్ట పడకపోవచ్చు” అంటూ హాల్ లోనే కూర్చోబెట్టింది.
“శ్రీకర్ గారూ! వరుణ్ లోపల బెడ్ రూమ్‌లో ఉన్నాడు. మీరు మాత్రం వెళ్లి వాడిని బుజ్జగిస్తూ మాట్లాడండి” అంటూ శ్రీకర్‌ను మాత్రం లోపలికి పంపింది. హాల్లో కూర్చున్న వింధ్య “శిల్పా! వాడు మీ ఇంటికే ఎందుకు వచ్చాడు?” అడిగింది.
“నీకు గుర్తుందా వింధ్యా! వాడికి చిన్నప్పటినుంచీ ఏ సమస్య వచ్చినా ఒక సైకియాట్రిస్ట్‌గా నన్నే పిలిచేదానివి. వాడు ఎక్కువ అల్లరి చేస్తున్నాడని, బాగా చదువుకోవడం లేదంటూ నీవు ఊరికే కంగారు పడేదానివి. ఎప్పుడూ వాడి మీదనే ధ్యాసే. నేను ఎప్పుడూ చెప్పేదాన్ని. వాడిని అందరిలాగా పెంచు అంటే నీవేమో వినేదానివి కాదు. నేను వాడితో చదువు కాకుండా వాడికి ఇష్టమైన విషయాల గురించి మాట్లాడేదాన్ని. అందుకే వాడు మా ఇంటికి వచ్చాడేమో.
వాడికి నీవంటే ప్రేమ కన్నా భయమెక్కువ. నువ్వేమో బలవంతంగా నీకు నచ్చిన చదువు చదివించాలనుకోవడంతో వాడు ఇలా తయారయ్యాడు. వాడు బాగా తెలివైనవాడు. ఏ ఫీల్డ్ లోకి వెళ్ళినా రాణించగలడు. నువ్వు ఇప్పుడు వాడిని భయంతో కాకుండా ప్రేమగా చూసుకో.. నీ అభిరుచులు వాడి మీదకు రుద్దకు..” అంటూ వింద్యని కూడా వరుణ్ గదిలోకి పంపింది.
గదిలో ఏం జరిగిందో తెలీదు కానీ మరో అరగంటకు అందరూ నవ్వుతూ బయటికి వచ్చారు.