[శ్రీమతి అల్లూరి (పెన్మత) గౌరీలక్ష్మి గారి ‘అమ్మకో అబద్ధం’ కథాసంపుటిని సమీక్షిస్తున్నారు శ్రీమతి పుట్టి నాగలక్ష్మి.]
మారుతున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు update అవుతూ ఆయా పరిస్థితులను అవగాహన చేసుకుంటూ ప్రముఖ రచయిత్రి శ్రీమతి అల్లూరి (పెన్మెత్స) గౌరీలక్ష్మి మనకందించిన ‘అష్టాదశ కథల సమాహరమే’ అమ్మకో అబద్ధం’ కథలు.
ఈ సంపుటిలోని కథలు మనకు ఎదురయ్యే సమస్యలను చర్చించి, విశ్లేషించడమే కాదు. సమస్యా పరిష్కార మార్గాలనీ చూపుతాయి.
నేటి అపార్ట్మెంట్ సంస్కృతిలో తల్లిదండ్రుల సంతృప్తి కోసం అబద్ధాలాడినా తప్పులేదని ‘అమ్మకో అబద్ధం” కథ చెపితే/బాధ్యత లేని పిల్లలతో సంఘర్షించకుండా వృద్ధా(ఆనందా)శ్రమంలో తోటి స్నేహితులతో కలిసిమెలసి బ్రతకమని ‘ఆనందాశ్రమం’ కథ చెపుతుంది.
కుటుంబ సభ్యులందరూ సమయానుకూలంగా పిల్లలకి ప్రేమను పంచితే సత్పౌరులు తయారవుతారని ‘వంతెన’ కథ చెపితే/ పిల్లలు ఆకర్షణకి లోనయి మతాంతర వివాహాలకు సిద్ధమయినపుడు వారికి అర్థమయ్యే రీతిలో పరిస్థితులను వివరించి ఆలంబనగా నిలవాలని ‘అడుగెయ్ నిబ్బరంగా’ కథ తేలియజేస్తుంది.
ఉన్నంతలో సంతృప్తిగా బతకాలని ‘జీవనది’, మారుతున్న పరిస్థితులను అర్థం చేసుకుని ఉన్నతంగా ఎదగాలని ‘ఆత్మజ్యోతి’, మనకు నచ్చిన ఎన్నుకున్న రంగంలోనే పయనించాలని ‘నీ దారే రహదారి’, చరవాణి అందించే సందేశ స్నేహపు చల్లదనం, ఆత్మవిశ్వాసాల గురించి ‘చలువచెట్టు’, మంచి సందేశాలనిస్తాయి. లేటువయసులో కూడా సేవలందించవచ్చని, పర్యావరణ హితాన్ని గురించి ప్రచారం చేయొచ్చని ‘గో-గ్రీన్’ కథ మనకు చల్లచల్లగా పచ్చపచ్చగా చెపుతుంది.
తెలంగాణా ఉద్యమ సమయంలోను, విజయవంతమైన తరువాత పరిస్థితులను గురించి ‘పరిష్కారం’, ‘సత్యం’, ‘కొత్తమట్టి’ కథలు వివరిస్తాయి. ప్రాంతీయ బేధాలను వీడి కలిసిమెలసి ఉండాలనే తపన, ఆకాంక్ష ఈ కథలలో తేటతెల్లమవుతాయి. ఆయా పాత్రలలోని తెలంగాణా మాండలికాన్ని గమనిస్తే ఆ మాండలికం పట్ల ఆమెకు గల సాధికారత అర్థమవుతుంది.
ఈ కథలలో స్థానికతకు ప్రాముఖ్యమిచ్చి రాయడం గొప్ప విశేషం.
మన బాల్యంలో చిల్లరకొట్టుకు సరుకులకోసం వెళ్ళే పిల్లలకు కొసరుగా బెల్లం పెట్టేవారు. అటువంటి కొసరే ‘అపురూపం మా అంతర్వేదిపాలెం’ లో ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసి’ ని సుసంపన్నం చేశారు. రచయిత్రికి తన జన్మభూమి పట్లగల అవ్యాజానురాగం ఈ ‘చిత్ర సమ్మిళిత కథనం’తో తేట తెల్లమవుతుంది.
మనమూ సహానుభూతిని పొందాలంటే ఈ కథలు చదివి తీరవలిసిందే.
***


అల్లూరి (పెన్మత్స) గౌరీలక్ష్మి
పేజీలు: 152
వెల: ₹ 90/-
ప్రతులకు: సాహితి ప్రచురణలు,
33-22-2, చంద్రం బిల్డింగ్స్,
సి.ఆర్.రోడ్, చుట్టుగుంట,
విజయవాడ 520004
ఫోన్: 81210 98500
ఆన్లైన్లో:
https://logilitelugubooks.com/book/ammako-abbadam-alluri-gouri-lakshmi

2 Comments
G. S. Lakshmi
The commenter acts as a real person and verified as not a bot. Passed all tests against spam bots. Anti-Spam by CleanTalk.
The Real Person Badge!
చక్కటి పుస్తకానికి ఎంచక్కని సమీక్షను అందించారు నాగలక్ష్మి గారూ.
మీకూ, గౌరీలక్షిగారికి అభినందనలు.
డా కె.ఎల్.వి.ప్రసాద్
The commenter acts as a real person and verified as not a bot. Passed all tests against spam bots. Anti-Spam by CleanTalk.
The Real Person Badge!
గౌరి లక్ష్మి గారి కథల పుస్తకంలోని కథలను
పుస్తకం కొని చదివేలా సమీక్ష చేసారు.
మీ ఇద్దరికీ హృదయపూర్వక అభినందనలు.
——-డా.కె.ఎల్వీ.