[‘అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్!!!’ అనే శీర్షికలో ప్రముఖ గీత రచయిత సాహిర్ గారి పాటలని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]


ఈ వారం విశ్లేషిస్తున్న పాట చిత్రం ‘నీల్ కమల్’ (Neel Kamal, 1968) చిత్రం లోని ‘బాబుల్ కీ దువాయే లేతీ జా’. గానం రఫీ. సంగీతం రవి.
~
మాట మనిషిలోని భావోద్వేగాలను వ్యక్తీకరించే ప్రక్రియ. మాటకు రాగం జోడించి రసానుభూతిని వ్యక్తీకరిస్తే అది పాట అయి నేరుగా శ్రోతల హృదయాలను చేరుకుంటుంది. కవి మనసులోని ఆనందాన్ని, దుఃఖాన్నీ, ఆలోచనలని అదే భావోద్వేగంతో శ్రోతలు అనుభూతించడానికి పాట గొప్ప మాధ్యమం. పాట మెదడునో మేధనో కాదు మనిషి హృదయాన్ని తాకాలి. అప్పుడే అది పది కాలాల పాటు నిలిచి ఉంటుంది. దీనికి కవి పదాలలో లోతు ఉండాలి. ఆ పదాలు పలికించే అనుభూతులను వ్యక్తీకరించగల రాగాన్ని వాటికి జోడించాలి. ఆ భావాన్ని అంతే భావయుక్తంగా, రాగయుక్తంగా పలికించగల గానం దానికి తోడవ్వాలి. రచన, రాగం, గానం ఒకే స్థాయిలో కలిసినప్పుడు పుట్టిన పాటే శ్రోతల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోతుంది. అంటే ఆ పాటను ఆ స్థాయికి చేర్చడానికి రచయిత, సంగీత దర్శకుడు, గాయకుడు ముగ్గురు ఒకే స్థాయిలో ఆ భావాన్ని తమ హృదయాలలోకి చొప్పించుకుని పలికించగలగాలి. అంటే ముగ్గురు కళాకారులు ఒకే హృదయంగా మారి సృష్టించినదే అద్భుతమైన పాట అవుతుంది.
ఒకప్పుడు ఈ మూడు రంగాలకు చెందిన కళాకారులు కలిసి కూర్చుని పాటలను తయారు చేసేవారు. పాటల రచయిత సంగీతం నుండి, ఆ పదాలను గాయకులు గానం చేయడం దాకా దగ్గర ఉండి పర్యవేక్షించేవారు. గాయకుడు, సంగీత దర్శకుడు తాను పదాలలో పెట్టిన భావాన్ని అర్థం చేసుకోవడానికి గేయ రచయితలు దగ్గర ఉండి తోడ్పడేవాళ్ళు. ప్రస్తుతం ఎవరికి వారు విడిగా పని చేసుకుంటూ సృష్టించే పాటలకు, ఆనాటి పాత మధురాలకు నడుమ ఉన్న తేడాని అర్థం చేసుకోవాలంటే ఆ నాటి పాటలను వినాలి. అప్పుడే కదా నేటి పాటలలోని లోటు అర్థం అయ్యేది.
ఆ రోజుల్లో సినిమాలలో హీరో హీరోయిన్లకే కాదు సహాయ నటులకూ ఎంతో విలువ ఉండేది. కథకు వారంతా నిండుతనాన్ని తీసుకొచ్చేవాళ్లు. అందుకే సందర్భానుసారంగా ఆ కారెక్టర్ నటులకీ పాటలు ఉండేవి. అవి మొక్కుబడి పాటలు కావు. ప్రతి పాటకు ఓ నిండుదనం, వ్యక్తిత్వం ఉండేది. కొన్నిసార్లు అన్నిటికి మించి ఈ కారెక్టర్ నటులపై చిత్రించిన పాటలు ఆ సినిమాకే హైలైట్‌గా నిలిచేవి. వాటిని రచయిత కాని, సంగీత దర్శకులు కాని, గాయకులు కాని ఏ మాత్రం తక్కువ చేసి చూసేవాళ్లు కాదు. అందుకే వక్త్ సినిమాలో ‘ఐ మెరే జొహరే జబీన్’, ప్యాసా సినిమాలో ‘సర్ జో తేరా చక్రాయే’, మెరైన్ డ్రైవ్ లో ‘అబ్ వో కరం కరే కె సితం’, ధరంపుత్ర లో ‘మేరే దిల్బర్ ముఝపర్ ఖఫా నా హో’, షగున్ సినిమాలో ‘తుం అప్నా రంజో గం’ ఇలాంటి ఎన్నో పాటలు అప్పటి సినిమాలలో కనిపిస్తాయి. చాలా సందర్భాలలో హీరో హీరోయిన్లపై చిత్రించిన పాటల కన్నా ఈ సపోర్టింగ్ నటుల పై చిత్రించిన పాటలు ఆ సినిమాకు ఓ ఐడెంటీటీ తీసుకొచ్చిన తీపి గుర్తులుగా మిగిలిపోయాయి. ప్రతి పాట పట్ల ఆ రోజుల్లో ఆ కళాకారులు ప్రదర్శించిన శ్రద్ధ దీనితో అర్థం చేసుకోవచ్చు.
సాహిర్ ఎవరికి రాసినా తన పాటల్లో ఒక్క వాక్యాన్ని కూడా రాజీపడి రాయలేదు. అందుకే ఆయన పాటలు ఎవరికి రాసినా అవి ఉన్నతమైన సాహితీ విలువలతో ఉండేవి. సాహిర్ మనిషితనాన్ని తన పాటలలో వ్యక్తీకరించేవారు. అది కేవలం స్త్రీ పురుష ప్రేమ దగ్గర ఆగిపోలేదు. మనిషి, జీవితంలో అనుభవించే ప్రతి ఎమోషన్‌కు ఆయన తన పాటలో రూపం ఇచ్చారు. దేశభక్తి, ప్రకృతి చిత్రణ, సామాజికత, దోపిడి పై తిరుగుబాటు, మాతృత్వ భావన, బడుగు వర్గాలు స్త్రీల పై జరుగుతున్న అన్యాయాలు, దైవ భక్తి, వేదాంతం, వైరాగ్యం ఫిలాసఫీ ఇవన్నీ ఆయన పాటల్లో సమపాళ్లలో కనిపిస్తాయి. ఒంటరి స్త్రీల జీవన పోరాటాన్ని ఆయన ఎంత గౌరవంతో ప్రస్తావించేవారో ఇంతకు ముందు చర్చించుకున్నాం. మాతృత్వాన్ని ఆయన పూజించారు. తన పాటలలో తల్లి పట్ల ఆ పూజ్య భావన మనకు కనిపిస్తుంది. అలాగే తండ్రి మనసును ఆయన అత్యద్భుతంగా ఆవిష్కరించారు. నీల్ కమల్ సినిమాలో ‘బాబుల్ కీ దువాయే’ అన్న పాటను సాహిర్ రచించిన విధానం ఆడపిల్లలు తండ్రుల మనసులను ఆ పాట ద్వారా వ్యక్తీకరించిన తీరు బహుశా మరెవ్వరూ ఆ స్థాయిలో ఇప్పటిదాకా సినీ సాహిత్యంలో చేయలేదంటే అతిశయోక్తి కాదు.
ఇక ఈ పాటలో బలరాజ్ సాహ్ని అభినయం రఫీ గానం, చెప్పడానికి నాకే కాదు భాషా పండితులకూ పదాలు సరిపోవు. ఈ పాటను వింటే తప్ప ఆ కళాకారుల ప్రతిభ అర్థం కాదు. ఈ పాటను సాహిర్ ఎంత గొప్పగా రాసారంటే దాన్ని లీనమై గానం చేస్తున రఫీ నిజంగానే ఏడ్చేసారంట. పాట చివరలో ఆయన గానంలో వినిపించే వేదన ఆయన హృదయంలోనించి వచ్చిందే. ఈ పాట పాడటానికి ఒక్కరోజు ముందు మహమ్మద్ రఫీ కూతురి వివాహం నిశ్చయమయింది. రెండు రోజుల తరువాత వివాహం జరగాల్సివుంది. ఈ పాటలో వ్యక్తమయిన భావాలు సినిమాకు, పాత్రకుమాత్రమే కాక, రఫీకి వ్యక్తిగతంగా, సార్వజనీనంగా వర్తిస్తాయి. అంటే, రఫీ బల్రాజ్ సహానీ పాత్రకోసం కాదు, తనకోసమూ, సమస్త ప్రపంచంలోని తండ్రులకోసమూ, వారి హృదయ స్పందనకు తమ హృదయ స్పందనను జోడించి, ఆ సామూహిక హృదయస్పందనలను తన స్వరంలో ప్రతిఫలింపచేస్తూ విశ్వ హృదయ స్వరం పాడే గీతంలా ఈ గీతాన్ని పాడేడనమాట. అందుకే ఈ పాట వింటున్న శ్రోతల కళ్లు చెమర్చకుండా ఉండవు. అదీ ఆడపిల్లల తండ్రులయితే ఈ పాట విని గుండెలు నీరయి మౌనంలోకి జారుకోవడమో, వలవలా కన్నీళ్ళూ కార్చడమో చేస్తారు. ఆడపిల్లలు లేనివారి, ఇంట సున్నితమైన భావాలు అనుభవించే భాగ్యం తమకు లేదన్న సున్నితమైన దుఃఖంతో కన్నీళ్ళు పెట్టుకుంటారు.
కవి ప్రతి ఒక్క అనుభవాన్ని తన జీవితం నుండి తీసుకుంటాడనుకోవడం తప్పు. సాహిర్ జీవితంలో వివాహం చేసుకోలేదు. ఆయనకు తండ్రిగా స్వీయానుభవాలు లేవు. ఆయన కన్న తండ్రి పరమ కిరాతకుడు. సాహిర్‌ని హత్య చేయంచడానికి కూడా ప్రయత్నించాడట. సాహిర్ తల్లి కోడిలా తన రెక్కల క్రింద సాహిర్‌ని కాపాడుకుంటూ జీవించింది. అందుకే సాహిర్‌కి తల్లి అంటే అంతులేని ప్రేమ. ఒంటరి తల్లులంటే మరీను. తండ్రి అంటే పరమ అసహ్యం. స్త్రీలపై అతను చూపే గౌరవం, స్త్రీల పక్షాన అతను అనుక్షణం నిలిచి ఆలోచించడం వెనుక తల్లితో అతను గడిపిన జీవితం కారణం అనుకోవచ్చు. తండ్రి వల్ల , తండ్రి ఇంట్లో తల్లి పడ్డ బాధలను, అనుభవించిన కష్టాలు సాహిర్ కు తెలుసు. ఒక అమ్మాయి జీవితం పెళ్ళితో ఎంత అనూహ్యంగా మారిపోతుందో సాహిర్ కు తెలుసు. అత్తగారింట్లో అమ్మాయిలు పడే బాధలూ సాహిర్ కు తెలుసు. ఈ పాట రచించటం కోసం సాహిర్ చేయాల్సిందల్లా ఆ అమ్మాయిల స్థానంలో తనని ఊహించుకుంటూ, ప్రేమగా పెంచుకున్న అమ్మాయి అలాంటి బాధలు పడుతూంటే పిల్లలను ప్రేమించిన తండ్రిలా తాను ఎలాంటి బాధ అనుభవిస్తాడో తలచుకుని దానికి అక్షర రూపం ఇచ్చాడీ పాటలో.
సాహిర్‌లో ఓ గొప్ప లక్షణం ఉంది. తాను నమ్మని, అనుభవించని ఏ భావాన్ని ఆయన పాటగా మార్చలేదు. అలాంటి కథా సందర్భాలలో చమత్కారంగా తన భావాలనే మరో రకంగా ప్రస్తావిస్తూ ఆ పాటలను రక్తి కట్టించడం ఆయన రచనా శైలికి నిదర్శనం. గొప్ప ప్రేమ గీతాలలో కూడా ప్రేమకు మించిన గొప్ప భావాలు బాధ్యతలెన్నో ఉన్నాయంటూ ప్రస్తావించారు. స్త్రీ ప్రేమను, పొందును కోరుకుంటూ కూడా నిన్ను మించిన అందాలూ ఆనందాలు ఇక్కడే ఉన్నాయంటూ చెప్తారు. ఈ కాంట్రడిక్షన్స్ జీవితపు వాస్తవాన్ని ప్రస్తావిస్తాయి కాని ఆ పాట సందర్భాన్ని తక్కువ చేయవు. పైగా అవి గొప్ప ప్రేమ గీతాలుగానూ ప్రసిద్ది కెక్కాయి అది సాహిర్ శైలి. మరి అలాంటి వ్యక్తి ఇక్కడ తండ్రి ప్రేమను ఇంత అద్భుతంగా ఎలా వర్ణించారు? దానికి కారణం సాహిర్ వ్యక్తిగా సమాజాన్ని పరిశీలించిన విధానం. తన అక్క చెల్లెళ్లకు తండ్రిగా మారిన ఆయనలోని పెద్ద మనసు కావచ్చు. ఏమైనా తాను జీవితాంతం అసహ్యించుకునే తన జీవితంలోని తండ్రిని మర్చిపోయి అసలు సహజమైన తండ్రి మనసు బిడ్డ కోసం ఎలా స్పందిస్తుందో అనుభవించి మరీ ఈ గీతాన్నిమనకు అందించారు. అది సాహిర్ కలం గొప్పతనం.
బాబుల్ కీ దువాయే లేతీ జా, జా తుఝ్ కో సుఖీ సంసార్ మిలే
బాబుల్ కీ దువాయే లేతీ జా, జా తుఝ్ కో సుఖీ సంసార్ మిలే
మయ్కే కి కభీ నా యాద్ ఆయే ససురాల్ మే ఇతనా ప్యార్ మిలే
బాబుల్ కీ దువాయే లేతీ జా జా తుఝ్ కో సుఖీ సంసార్ మిలే
(తండ్రి దీవెనలు తీసుకుంటూ వెళ్లు, నీకు సుఖమైన సంసారం దొరుకుతుంది వెళ్లు. పుట్టింటిని మరపించేంత ప్రేమ అత్తవారింట నీకు దొరకాలి. ఈ తండ్రి దీవెనలు తీసుకుని వెళ్లు)


బిడ్డకు పెళ్ళి చేసి అత్తింటికి పంపిస్తున్నాడు తండ్రి. అంత కాలం ఆమే లోకంగా అతను బతికాడు. ఇప్పుడు ఆమె ఆ ఇంటి మనిషి కాదు. ఆమెకో జీవితం ఉంది. ఆమె తన ప్రపంచంలోకి వెళ్ళిపోతుంది. అందులో ఇప్పుడు తండ్రి అతిథి మాత్రమే. ఆ సంగతి ఆయనకు తెలుసు. అందుకే మనస్పూర్తిగా బిడ్డను దీవిస్తూ, ఆమెను అత్తింటికి పంపిస్తున్నాడు. ఆ బిడ్డకు సుఖప్రదమైన సంసారం రావాలని కోరుతున్నాడు. అది ఎంతటి సుఖం అవ్వాలని అనుకుంటున్నాడంటే ఆక్కడ ఆమెకు పుట్టిల్లు అసలు గుర్తుకు రాకూడదట. తనని తన బిడ్డ గుర్తు చేసుకోకూడదని ఆ తండ్రి అనుకోవడంలో ఆనందమూ ఉంది, బాధా ఉంది.
ఆడపిల్ల తన పుట్టింటిని గుర్తు చేసుకునేది అత్తింట్లో కష్టాల మధ్య, అక్కడి అసౌకర్యాల నడుమ. అందుకే ఆమెకు తన పుట్టిల్లే గుర్తుకు రాకూడన్నంత ఆనందం ఆ అత్తింట్లో ఉండాలని కోరుకుంటున్నాడు ఆ తండ్రి. అంటే తన అవసరం ఆ బిడ్డకు రావద్దని ఆయన కోరిక. తండ్రి బిడ్డను వేరే ఇంటికి పంపుతూ ఆమెకు పరాయిగా మిగిలిపోతూ ఆ బిడ్డకు తాను ఎప్పుడు గుర్తుకు రాకూడదని కోరుకోవడంలో ఎంత త్యాగం ఉందో అర్థం చేసుకుంటే ఆ తండ్రి ప్రేమకు శ్రోతల కళ్లు చెమరుస్తాయి. సరళమైన పదాలు “నీకు పుట్టిల్లు గుర్తుకు రానంత ప్రేమ అత్తింట్లో దొరకాలి” తండ్రి హృదయాన్ని, ఆయన బిడ్డను ప్రేమించే తీరును, బిడ్డ సుఖపడాలనే బలమైన కోరికను ఆయన ఈ వాక్యంలో ఎంత గొప్పగా వ్యక్తీకరిస్తున్నారో చూడండి. ఎంత అందమైన గాఢమైన భావ వ్యక్తీకరణ ఇది.
సాహిర్ వ్యక్త పరచింది సహజమైన భావన. తల్లితండ్రులు తమ పిల్లలు సుఖంగా, సంతోషంగా వుండాలని కోరుకుంటారు. వారి సుఖంకోసం తమ జీవితాలను హారతిలా సంతోషంగా, స్వచ్చందంగా కరగించివేస్తారు. ఇంతకాలం ఒక పద్ధతిలో జీవించినవారు ఇప్పుడు కొత్త పధ్ధతులకు అలవాటు పడాలి. తమకు తమ పిల్లలు అపురూపం. కానీ, ఆమె ఏ ఇంట్లో జీవితం గడిపేందుకు వెళ్తోందో ఆ ఇంట్లోవారికి ఆమె సాధారణ యువతి. పైగా, ఆ ఇంటికి వారసురాలవుతుంది. కాబట్టి అసూయలు, ద్వేషాలూ తట్టుకోవాల్సివుంటుంది. తన ప్రమేయం లేకుండానే ఆమె కుట్రలలో, కుటుంబ రాజకీయాలలో ఒక పాత్ర ధరించాల్సివస్తుంది. వాటిని అమ్మాయి ఎలా తట్టుకుంతుందో? వారి ప్రేమను ఎలా పొందుతుందో? అక్కడ ఎలా నెగ్గుకొస్తుందో? ఎన్నెన్ని కష్టాలు పడుతుందో? అన్న బాధ మనస్సును తొలుస్తూనే వుంటుంది. అందుకే, ఆమె సుఖ సంతోషాలతో వుండాలన్న తల్లితండ్రుల దీవెన పిల్లలను వెన్నంటే వుంటుంది. దాన్నే సాహిర్ ‘బాబుల్ కి దువాయే లేతీజా’ అన్న భావన ద్వారా వ్యక్త పరచాడు. అంటే, తాను ఆమె సుఖంగా వుండాలని దీవిస్తున్నాడు. ఆ దీవెనలు ఆమె వెన్నంటే వుంటాయి. వాటితో పాటూ, అంటే, వాటిని వెంట తీసుకుని అత్తగారింటికి వెళ్ళమని అంటున్నాడు.
బీతే తేరే జీవన్ కీ ఘడియా ఆరామ్ కీ ఠండీ చావ్ మే
కాంటా భీ నా చుబ్నే పాయే కభీ మేరీ లాడ్లీ తేరే పావో మే
ఉస్ ద్వార్ సె భీ దుఖ్ దూర్ రహే జిస్ ద్వార్ సె తేరా ద్వార్ మిలే
మయ్కే కి కభీ నా యాద్ ఆయే ససురాల్ మె ఇత్నా ప్యార్ మిలే
బాబుల్ కీ దువాయే లేతీ జా
(నీ జీవితంలోని అన్ని ఘడియలు సౌకర్యవంతంగా చల్లని నీడలో గడవాలి. నీ కాలి పాదాలలో చిన్న ముల్లు కూడా గుచ్చుకోకూడదు తల్లీ, నీ ఇంటి తలుపు పరిసరాలలో ఏ దుఃఖమూ, బాధా ఉండకూడదు. అత్తింట్లో నీకెంత ప్రేమ దొరకాలంటే పుట్టిల్లు ఎప్పుడూ నీకు గుర్తు రాకూడదు. ఈ తండ్రి దీవెన తీసుకుంటూ వెళ్లు తల్లి)


ఈ పాట రెండు సందర్భాలలో వస్తుంది. మొదటి సందర్భంలో కూతురు పెళ్ళి చేసి అత్తింటికి సాగనంపుతుండగా ఆ తండ్రి పడుతున్న వేదన ప్రస్తావన కొస్తుంది. అక్కడ ఒక్క చరణం మాత్రమే ఉంటుంది. కాని అందులో బల్రాజ్ సాహ్ని నటన మర్చిపోలేం. గుండెలపై పెంచుకున్న బిడ్డను పెళ్ళి చేసి అత్తింటికి పంపే ప్రతి తండ్రి వేదనను బల్రాజ్ ఎంత గొప్పగా తనలో ఆవహించుకుని చూపిస్తారంటే ఆయన నటన ప్రభావంలో పడని వాళ్లు ఉండరు. భారతదేశం గర్వించదగ్గ నటులు బల్రాజ్. ఈ తరం ఆయనకు గుర్తు పెట్టుకుని ఆయన నటనను పరిశీలిస్తే బావుంటుంది.
ఈ పాటను చర్చించుకునే క్రమంలో నేను సినిమాలో చిత్రీకరణనే అనుసరిస్తున్నాను. అలా అయితేనే ఈ పాటను విశ్లేషించుకోవడం బావుంటుంది. తరువాత మళ్ళీ ఆ కూతురు అత్తింట్లో కష్టాలు పడుతూ తండ్రిని ఆ ఇంటికి రానివ్వకుండా, అతనికి తన పరిస్థితి తెలియకుండా ఉండడానికి తనను చూడడానికి వచ్చిన అతన్ని ఆ ఇంటి నుండి పంపేస్తూ ఆ ఇంట్లో అష్ట కష్టాలు పడుతూ ఉండగా బాక్గ్రౌండ్లో మళ్లీ ఈ పాట వస్తుంది. అప్పుడు ఈ పైన వచ్చిన చరణమే ఆఖరి చరణంగా సన్నివేశంలో వస్తుంది. ఆ తండ్రి ఎన్ని కోరికలతో, ఆశలతో, ఆ ఇంటికి ఆ బిడ్డను పంపించాడో, దానికి విరుద్ధంగా ఆ బిడ్డ జీవితం ఎలా గడుస్తుందో, చూస్తున్న శ్రోతలు, ఆ తండ్రి, బిడ్డ స్థితికి ఎంత వేదన అనుభవిస్తూ ఉంటాడో ఊహిస్తూ ఆ తండ్రి దుఃఖాన్ని తమది చేసుకుంటారు. అంతే కాదు, చిత్రీకరణ పాట అర్ధమయ్యే విధానాన్ని మారుస్తుంది. మొదటిసారి తండ్రి కూతురిని అత్తారింటికి పంపిస్తూ పాడతాడు. అప్పుడు ఆమెకి దూరమవుతూన్న దుఃఖం, ఆమె జీవితం ఆనందమయంగా వుండాలన్న ఆకాంక్షలు రఫీ స్వరం ధ్వనిస్తుంది. రెండవసారి ఈ చరణం వచ్చినప్పుడు, ఆమె ఇల్లు తుడుస్తూంటుంది. ఠండీ చావ్ అన్నప్పుడు ఆమె భర్త ఫోటో ఆమె చేతిలో వుంటుంది. దానిపై కన్నీటి చుక్క పడుతుంది. ఇలా అతనామె ఎలా సుఖంగా వుండాలని కోరుకున్నాడో పూర్తిగా దానికి విరుద్ధంగా వుంటుంది. ఇప్పుడు రఫీ స్వరంలో దుఃఖానికి కారణం వేరు.
బిడ్డ జీవితం చల్లని నీడలో గడిచిపోవాలి. ఆమె సుఖ సంతోషాల నడుమ గడపాలని, ఆ లేత పాదాల్లో ఏ చిన్నముల్లూ గుచ్చుకోకూడదని కోరుకుంటూ అత్తింటికి పంపిన ఆ బిడ్డ, నిరంతరం అవమానాల మధ్య, తీవ్రమైన శారీరక శ్రమను అనుభవిస్తూ, ఆమె మనసు గాయాల పాలవుతుంటే మౌనంగా జీవిస్తూ ఉండడం ఏ తండ్రి భరించగలడు?
నాజో సే తుఝే పాలా మైనె, కలియోం కి తరహ్ ఫూలోం కీ తరహ్
బచ్పన్ మె ఝులాయా హై తుఝ్కో బాహో నే మేరీ ఝూలోం కీ తరహ్
మెరి బాగ్ కి ఐ నాజుక్ డాలి తుఝె హర్ పల్ నయీ బహార్ మిలే
మయ్కేకి కభీనా యాద్ ఆయె ససురాల్ మే ఇత్నా ప్యార్ మిలే
(అపురూపంగా ఓ పూవులా, లేత మొగ్గగా నిన్ను పెంచుకున్నాను తల్లి, నీ చిన్నతనంలో నా బాహువులే ఊయలగా చేసుకుని నిన్ను ఊపాను. నా తోటలోని సుతిమెత్తని తీగవు నువ్వు, నీకు ప్రతి క్షణం సరి కొత్త వసంతం దొరకాలి. పుట్టిల్లే గుర్తుకు రానంత ప్రేమ నీకు అత్తింట్లో దొరకాలి)


ఎంత మమకారం ద్వనిస్తుందో ఈ చరణంలో. బిడ్డ కందిపోతుందేమో అని నేల పై కాలు పెట్టనివ్వకుండా అపురూపంగా పెంచుకున్నాడు ఆ తండ్రి. ఆమె ఆనందంగా ఉండాలి, జీవితంలో ఎప్పుడూ ఎక్కడా తన లోటు ఆమెకు అనుభవంలోకి రాకూడడని కోరుకుంటున్నాడు. ఒక తండ్రి ప్రేమలోని త్యాగాన్ని నిస్వార్ధమైన మమకారాన్ని ఎంత గొప్పగానో అనుభవంలోకి తీసుకొచ్చే పాట ఇది.
పాట చిత్రీకరణలో, తండ్రి వ్యక్త పరచిన ఆశలకు భిన్నమైన దృశ్యం కనిపిస్తుంది. పూలు, మొగ్గలను ప్రేమగా పెంచినట్టు ఆమెను పెంచాడు. ఇక్కడ ఆమె, ఇల్లు తుడుస్తూ, బట్టలు ఉతుకుతూ, అంట్లు తోముతూ, తినటానికి సరైన తిండి లేక, ప్రేమ అన్నదే లేక, అవహేళనలు, అవమానాలు, ఈసడింపుల నడుమ జీవించాల్సి వస్తోంది. కాలు క్రింద పెడితే కందిపోతుందని చేతుల్లో ఉయ్యాలలూపిన అమ్మాయి ఇప్పుడిలా కఠినమైన పనులు చేయాల్సిరావటం ఊహిస్తేనే ఆ తండ్రి హృదయం బ్రద్దలవుతుంది. అయితే, ఏ ఆడపిల్ల అయినా ఆ కాలంలో సర్వ సాధారణంగా చేసేపనులివి. కానీ, ఈ పనులు సంతోషంగా, స్వచ్చందంగా, ప్రేమపూరిత వాతావరణంలో చేస్తే కష్టంగానే అనిపించవు. ఇష్టంగా చేసే పని కష్టం కాదు. బలవంతాన చేసే సుఖవంతమయిన పని కూడా కష్టమే!
జిస్ ఘర్ సే బంధే హై భాగ్ తేరే ఉస్ ఘర్ మే సదా తేరా రాజ్ రహే
హోఠో పె హసీ కీ ధూప్ ఖిలె మాథే పె ఖుషీ కా తాజ్ రహే
కభీ జిస్కీ జ్యోత్ నా హో ఫీకీ తుఝె ఐసా రూప్ సింగార్ మిలే
మయ్కే కీ కభీ నా యాద్ ఆయే ససురాల్ మె ఇత్నా ప్యార్ మిలే
(ఏ ఇంటికి నీ అదృష్టం కట్టుబడి ఉందో ఆ ఇల్లే ఎప్పుటికీ నీ రాజ్యం కావాలి. నీ పెదాలపై ఎప్పుడూ నవ్వులు విరబూయాలి. నీ నుదిటిపై ఆనందాల కిరీటం ఉండాలి. ఎవరి కంటి జ్యోతులనూ మసిబారనివ్వనట్టి రూప లావణ్యాలను నువ్వు పొందాలి. పుట్టిల్లే గుర్తుకురానంత ప్రేమ నీకి అత్తింట్లో దొరకాలి)


ఆ తండ్రి కూతురు వెళ్తున్న ఆ ఇంటికి ఆమె రారాణి కావాలని కోరుకుంటున్నాడు. ఎప్పుడూ పెదవులపై చిరునవ్వుతో ఆనందంతో ఆ ఇంట ఆమె రాజ్యం చేయాలని అతని కోరిక. ఆమెను చూసిన వారందరు ఆనందంతో వెలిగిపోవాలని ఆశిస్తున్నాడు. ఆమె ఈర్ష్యా అసూయలకు దూరంగా స్నేహ పరిమళాల నడుమ ఆనందంగా జీవించాలని ఆ తండ్రి కోరిక.
ఏ తండ్రి అయినా తన బిడ్డ సంతోషాలతో భోగ భాగ్యాలతో తులతూగాలని కోరుకుంటాడు. కాని, పదాలలో దాన్ని చెప్పగలిగే వాళ్ళు చాలా తక్కువ. తండ్రి ప్రేమకు బీదా గొప్పా తేడాలుండవు. ప్రతి తండ్రి తనలోని ప్రేమను బైటికి వ్యక్తీకరించలేకపోవచ్చు. అలాంటి ఆడపిల్లల తల్లితండ్రులందరి తరుపున సాహిర్ రాసిన గీతం ఇది. తండ్రి మనసులోని ప్రతి ఒక్క కోరికను, బిడ్డ భవిష్యత్తు పై ఆ మనసులోని ఆశను, అద్భుతంగా స్వరపరచిన గీతం ఇది.
కొన్ని పాటలు రఫీ కోసమే పుట్టాయనిపిస్తుంది. అది రఫి తప్ప మరొకరు గానం చేయలేరు అనిపిస్తుంది. అలాంటి గీతం ఇది. ఇందులో రఫి పలికించే ఆ భావావేశాలు, కురిపించే ప్రేమ ఝడిలో తడవని వాళ్లు ఉండరు. విన్న ప్రతి ఒక్కరి కళ్ళు చెమ్మగిల్లకుండా ఉండవు. ఆయన గొంతు లోతుల్లోంచి వచ్చే ఆ ఆనందంతో కలిసిన విషాదాన్ని అనుభవిస్తే తప్ప దాని రుచి తెలియదు. సాహిర్ తన పాట ఎవరు పాడినా దాని గొప్పదనం తగ్గదు అని చెప్పేవారు కాని ఈ విషయంలో ఈ పాట దగ్గర మాత్రం నాకు సాహిర్‌తో విభేదించాలనిపిస్తుంది. ఇది రఫీ మాత్రమే పాడదగ్గ పాట. ఈ పదాలు రఫీ గొంతు కోసమే పుట్టాయి. నిజం ఇది ఎంతగా సాహిర్ పాటో అంతగా రఫీ పాట కూడా.. సాహిర్ సాబ్ మన్నించాలి. కొన్ని వాక్యాలలో ఎందుకో రఫీ మిమ్మలను కూడా పక్కకు తోసేసారేమో అనిపిస్తుంది..అయితే, సాహిర్ పదాలకు బాణీ కుదిర్చి, రఫీతో పాడించిన సంగీత దర్శకుడు రవి ని కూడా మరచిపోకూడదు. ముగ్గురూ ఇప్పుడు ఆ పై లోకంలోనే కలిసి ఉండి ఉంటారు. మీరు రాసిన ఈ వాక్యాలను రఫీ గొంతునుండి మరో సారి వినండి.. చిత్రీకరణ తండ్రి ఊహలకు ఆశలకూ పూర్తిగా భిన్నమైన దృశ్యాన్ని చూపిస్తుంది.
బీతే తేరే జీవన్ కీ ఘడియా ఆరామ్ కి ఠండీ చావోం మే
కాంటా భీ నా చుబ్నే పాయే కభీ మేరీ లాడ్లీ తేరే పావోం మే
ఉస్ ద్వార్ సె భీ దుఖ్ దూర్ రహే జిస్ ద్వార్ సె తేరా ద్వార్ మిలే
మయ్కే కి కభీ నా యాద్ ఆయే ససురాల్ మె ఇత్నా ప్యార్ మిలే
బాబుల్ కీ దువాయే లేతీ జా జా తుఝ్కో సుఖీ సంసార్ మిలే
బాబుల్ కీ దువాయే లేతీ జా
సాహిర్ రఫీల కలయిక సినీ సంగీత లోకంలో ఓ అద్భుతం..
Images Source: Internet
(మళ్ళీ కలుద్దాం)
