[‘అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్!!!’ అనే శీర్షికలో ప్రముఖ గీత రచయిత సాహిర్ గారి పాటలని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]


ఈ వారం విశ్లేషిస్తున్న పాట చిత్రం ‘దాస్తాన్’ (Dastaan, 1972) చిత్రం లోని ‘న తూ జమీన్ కే లియె హై’. గానం మహమ్మద్ రఫీ. సంగీతం లక్ష్మీకాంత్ ప్యారేలాల్.
~
సాహిర్ గురించి తెలిసిన వారంతా కూడా అయన సమకాలీన కవులు, సంగీతకారులు, గాయకులతో రకరకాల సందర్భాలలో గొడవలు పెట్టుకోవడం, ఎవరి దగ్గరా రాజీ పడకుండా తన మాటే గెలవాలని పట్టుబడడం గురించి రకరకాలుగా చెప్తారు. కాని అత్యుత్తమ కవిత్వాన్ని ఒప్పుకోవడానికి దాన్ని తన గీతాలకు ప్రేరణగా మార్చుకోవడానికి సాహిర్ ఎప్పుడూ వెనుకాడలేదు. అరుదుగానే కాని కొన్ని సార్లు ఆయన ఇతర కవుల ప్రభావంతో పాటలు రాసిన సందర్భాలు ఉన్నాయి. హిందీలో కబీర్, మీరా భజన్లను, జానపద గీతాలను బావుల్ కళాకారుల పదాలలోని వాక్యాలు పద ప్రయోగాలను, ఆయన తాను రాసిన పాటలలో ఉపయోగించుకోవడానికి వెనుకాడలేదు.
‘దాస్తాన్’ సినిమా కోసం ప్రఖ్యాత ఉర్దూకవి ఇక్బాల్ (1877-1938) గజల్ లోని మొదటి వాక్యాన్ని సాహిర్ తన పాటకు పల్లవిగా తీసుకోవడం గమనించండి. తన పాటకు మరో కవి రాసిన వాక్యాన్ని సాహిర్ యథాతథంగా తీసుకున్నారు అంటే ఆ కవి రాసిన కవిత్వం ఆయనను అత్యంత ప్రభావితం చేసిందని అర్థం. ఇలాంటి ప్రయోగాలకు సాహిర్ కు ఉర్దూ కవిత్వంలో అల్లామా ముహమ్మద్ ఇక్బాల్ అంతటి స్థాయి ఉన్న కవులు కావాలి. మామూలు కవులకు ఆయన మనసులో స్థానం లేదు.
సాహిర్‌కి ఇక్బాల్ అంటే ఎంత ఇష్టం అంటే దాగ్ దెహల్వీ అనే ప్రఖ్యాత ఉర్దూ కవికి శ్రద్దాంజలి ఘటిస్తూ ఇక్బాల్ ఒక సందర్భంలో ఓ షేర్ చెప్పారు.
ఇస్ చమన్ మె హోంగే పైదా బుల్బుల్ – ఎ – షిరాజ్ భీ
సైకడో సాహిర్ భీ హోంగే, సాహబ్-ఎ-ఎజాబ్ భి
(ఈ తోటలో బుల్బుల్-ఎ-షిరాజ్కూడా పుడతాడు. లక్షల సాహిర్లు జన్మిస్తారు, అత్యుత్తమ గౌరవాన్ని అందుకునే వాళ్లూ కళ్ళు తెరుస్తారు.)
బుల్బుల్ అనే పక్షి కోకిలలా పాడుతుంది. షిరాజ్ అన్నది పర్షియాలో ఒక ప్రాంతం. పర్షియాకు చెందిన గొప్ప కవి షేఖ్ సది ఈ ప్రాంతానికి చెందినవాడు. బుల్బుల్-ఎ-షిరాజ్ అన్నది ఇరాన్ దేశపు గొప్ప కవి షేఖ్ సాధి పొందిన బిరుదు. అలాగే సాహిర్ అంటే మంత్రముగ్దులను చేసే మాంత్రికుడని అర్థం. ఈ షేర్లో కవిత్వ పూతోటను నిర్మించిన దాగ్ దెగల్వీ తన ప్రభావంతో ఎందరో గొప్ప కవుల జన్మకు అనువైన దారి నిర్మించారన్నది ఇక్బాల్ అభిప్రాయం. ఇది మొదటిసారి విన్నప్పుడు సాహిర్ యువకుడు. ఉర్దూలో కవిత్వం రాస్తూ తానూ ఓ కలంపేరు పెట్టుకోవాలని సరైన పేరు కోసం వెతుక్కుంటున్నాడు. ఇక్బాల్ రాసిన ఈ షేర్ ప్రభావంతో అందులోనించి సాహిర్ అన్న పదం నచ్చి తన పేరు సాహిర్గా మార్చుకున్నాడు అబ్దుల్ హయీ గా జన్మించిన సాహిర్ లుధియాన్వి. అప్పట్లో కలం పేరు పక్కన ఆ కవి నివసించే నగరం పేరుతో కవులు కవిత్వం రాసేవారు. అలా లుధియానా ప్రాంతంలో ఉంటున్న సాహిర్, సాహిర్ లుధియాన్వీ అనే కలం పేరుతో తన కవిత్వాన్ని ప్రజల మధ్యకు తీసుకురాసాగారు. ఇక్బాల్ కవిత్వం ఆయనపై అంత ప్రభావం చూపింది.
‘దాస్తాన్’ సినిమా కథానేపథ్యాన్ని విన్న తరువాత సాహిర్ ఇక్బాల్ రాసిన ఓ గజల్ లోని మొదటి వాక్యాన్ని యథాతథంగా పాట కోసం తీసుకుంటూ ఇక్బాల్‌పై తనకున్న గౌరవాన్ని మరోసారి ప్రదర్శించారు. అయితే ఇలాంటి ప్రభావంతో పాట రాయడానికి కూడా ఎంతో ధైర్యం కావాలి. ఎందుకంటే ఆ స్థాయి కవిత్వానికి ధీటుగా కవిత్వం అల్లడం ఆషామాషి వ్యవ్యహారం కాదు. పైగా ఆ గజల్ అప్పటికే చాలా మంది అభిమానులను సంపాదించుకుంది. అయినా సాహిర్ ఆత్మవిశ్వాసంతో ఆ వాక్యం తీసుకుని దానికి ఓ గొప్ప పాటను జత చేసారు. ఈ సినిమాలో అన్ని పాటలు మహేంద్రకపూర్ గానం చేసారు. అయితే ఈ ఒక్క పాట కోసం రఫీని ఎన్నుకున్నారు సంగీత దర్శకులు. ఈ పాటలోని భావాన్ని రఫీ మాత్రమే అనుకున్నట్లు వ్యక్తీకరించగలరన్నది వారి అభిప్రాయం. అవి కిషోర్ కుమార్ ఎదుగుతున్న రోజులు. ప్రజలు కిషోర్ మత్తులో మునిగితేలుతున్నారు. అయినా ఆ పాటలన్నిటిని మధ్య ఈ గీతం గొప్ప హిట్ పాటగా నిలిచింది. కొన్ని పాటలు రఫీ మాత్రమే పాడాలి అని మరోసారి నిరూపించింది.
ఇక్బాల్ ఒరిజినల్ కవితలో కవిత్వం ఇలా సాగుతుంది.
న తూ జమీన్ కే లియె హై న ఆసమాన్ కే లియె
జహా హై తేరే లియె తూ నహీ జహా కే లియె
(నువ్వు ఈ భూమి కోసం కాదు, ఆకాశం కోసం కూడా కాదు. ఈ ప్రపంచం నీ కోసం. కాని నువ్వు ఈ ప్రపంచానికి ఏమీ కావు)
ఇందులో మొదటి వాక్యాన్ని తీసుకుని సాహిర్ ఇలా రాసారు.
న తూ జమీన్ కే లియె హై న ఆసమా కే లియె (2)
తేరా వజూద్ హై
తేరా వజూద్ హై అబ్ సిర్ఫ్ దాస్తాన్ కే లియె
న తూ జమీన్ కే లియ హై న ఆసమా కే లియె
(ఈ భూమీ ఈ ఆకాశం నీవి కావు. నీ ఉనికి ఇప్పుడు కేవలం కథగా మారడానికి మాత్రమే)


సినిమాలో హీరో దిలీప్ కుమార్. తాను ఎంతో ప్రేమించిన భార్య, నమ్మిన స్నేహితుడు తనను మోసం చేసి అక్రమ సంబంధంలో ఉన్నారని తెలుసుకున్న క్షణం నిరాశలో కూరుకుపోయిన అతని మనసులోని ఉద్భవించే దుఃఖాన్ని ప్రేక్షకుల దగ్గరకు చేర్చే గీతం ఇది. అప్పటి దాకా తనది అని ఎంతో నమ్మకంతో ప్రేమతో నిర్మించుకున్న గూడు తనది కాదని, ఆ ప్రేమ మోసం అని తెలిసిన తరువాత ఓ మనిషి పడే ఆవేదన ఈ పాటలో ధ్వనిస్తుంది. ఇప్పుడు ఆ నేల ఆ ఆకాశం ఏవీ తనవి కాదు. తను కేవలం ఓ కథగా మిలిగిపోయాడు. ఓ పాత్రగా ఉండిపోయాడు. ఇది అతని స్థితి. అప్పటిదాకా అది అతని జీవితం కాని అది కేవలం ఓ నాటకం అని, తానో పాత్రనే తప్ప తనకక్కడ ఓ అస్తిత్వం లేదని తెలుసుకున్న ఆ నాయకుడి మనసు విషాదంతో ఆలపించే పాట ఇది.
పలట్ కె సూ-ఎ-చమన్ దేఖనే సె క్యా హోగా (2)
వో షాఖ్ హీ నా రహీ జొ థీ ఆషియా కే లియె
న తూ జమీన్ కే లియ హై న ఆసమా కే లియె
(వెనక్కు తిరిగి ఆ ప్రేమ తోటను చూస్తే ఏం దొరుకుతుంది? నీ గూటి కోసం అవసరమయ్యే ఆ కొమ్మే లేకుండా పోయింది. నువ్వు ఈ భూమికి చెందవు ఆ ఆకాశానికి చెందవు. ఓ కథగా నీ ఉనికి మిగిలిపోయింది)


ఈ వాక్యాలలో విషాదం నిజంగా మనసును పిండేస్తుంది. ముఖ్యంగా రఫీ పాడుతుంటే భావం తెలియని వారిలోకి కూడా ఈ విషాదం చొచ్చుకుపోతుంది. వెనక్కు తిరిగి గతాన్ని తరచి చూసుకుంటే ఏం వస్తుంది. దేన్ని ఆధారం చేసుకుని గూడు నిర్మించుకున్నాడో ఆ కొమ్మే తనది కాకుండా పోయింది. ఎవరిని నమ్ముకుని జీవితాన్ని గడిపాడో, ఆమె ప్రేమ అంతా నటన. ఇక ఆ నేల ఆ ఆకాశం కూడా తనవి కాకుండా పోయాయి. అతని జీవితమే ఓ కథగా మారిపోయింది.
గరజ్ పరస్త్ జహా మే వఫా తలాష్ న కర్ (2)
యే షయ్ బనీ థీ కిసీ దూసరె జహా కే లియె
తేరా వజూద్ హై
తేరా వజూద్ హై అబ్ సిర్ఫ్ దాస్తా కే లియె
న తూ జమీన్ కే లియ హై న ఆసమా కే లియె
(తమ గురించి మాత్రమే ఆలోచించుకునే స్వార్థపరుల ప్రపంచంలో ప్రేమను వెతకకు. ఈ ప్రపంచానికి కాదు మరో ప్రపంచం కోసం తయారయిన వస్తువు అది. ఈ నేల ఆకాశాలు ఇప్పుడు నీవి కావు. నీ ఉనికే ఓ కథగా మిలిగిపోయింది.)


అతను స్వార్థపరుల మధ్య జీవిస్తున్నాడు. వారి మధ్య ప్రేమను వెతుక్కుంటున్నాడు. కాని అది అక్కడ దొరకదు. తనది కాని ప్రపంచంలో అతను అప్పటిదాకా జీవిస్తున్నాడు. అతనికి కావలసిన ప్రేమ ఆ ప్రపంచంలో దొరకదు. అది మరో ప్రపంచం కోసం తయారయిన అనుభూతి. దాన్ని అక్కడ వెతుక్కోవడం అతని మూర్ఖత్వం. అతను ఉంటున్న ఆ నేల ఆకాశం అతనికి చెందవు. అది అంతా ఓ మోసపూరిత జీవితం. అది అంతా నిజం అని నమ్మి అతను మోసపోయాడు.
అయితే ఇంత విషాదంలోనూ సాహిర్ చూపించే ఆ పాజిటివ్ దృష్టి చూడండి. ప్రేమ అన్నదే మోసం అన్న భావంలోకి వెళ్ళడు. ఈ ప్రపంచంలో అది లేదు, దొరకదు. మరో ప్రపంచం కోసం అది తయారయిన అనుభూతి అంటాడు. అంటే ప్రేమ గొప్పదే. దాన్ని ఉపయోగించుకునే విధానంలో మనిషి స్వార్థం ఉంది. అందుకె ఈ ప్రపంచంలో ముఖ్యంగా అతనున్న ప్రపంచంలో దాన్ని వెతుక్కోవడంలో ప్రయోజనం లేదు అన్నది కవి భావం. ప్రేమలో మోసపోయినా దాని గొప్పతనాన్ని కవి తక్కువ చెయట్లేదు. ఇక్కది అది దొరకదని, ఈ ప్రపంచపు వస్తువు అది కాదని చెప్తున్నాడు.
జీవితంలో నమ్మినవాళ్ల చేతులో మోసపోయిన వారి వ్యథలోని విషాదాన్ని ఇంత వాస్తవికంగా రాయడం సాహిర్‌కే చెల్లుతుంది. నమ్మకాన్ని కోల్పోతే మనిషి మానసిక స్థైర్యం దెబ్బతింటుంది. అతనికి గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నీ చీకటిగానే కనిపిస్తాయి. అంతులేని ఒంటరితనం అతన్ని ఆవహిస్తుంది. ఈ పాట ఆ గాయపడిన మనసును ఆవిష్కరిస్తుంది.
గరజ్ పరస్త్ జహా మే వఫా తలాష్ న కర్ (2)
యే షయ్ బనీ థీ కిసీ దూసరె జహా కే లియె.
Images Source: Internet
(మళ్ళీ కలుద్దాం)
