(25 సెప్టెంబరు 2022 న శ్రీ ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం గారి వర్ధంతి సందర్భంగా ఈ కవిత అందిస్తున్నారు శ్రీ సాగర్ రెడ్డి.)
సాహితీ వనములో
వికసించిన పుష్పమా-
గగనమంత ఘనకీర్తితో-
దివికేగిన గాన గంధర్వా..!
నీ గాత్ర మాధుర్యంతో..
సంగీతపు సిగలో ఒదిగి
మెరిసిన అనర్ఘరత్నమా!!
భౌతికంగా నీవు దూరమైనా –
నీ గాత్రం ఎన్నడూ ఆగని స్తోత్రమై,
నీ రూపాన్ని కనులముందుంచింది
నీ పాట మహత్యాన్ని నలుదిక్కుల ఎలుగెత్తి చాటుతోంది!!
నాదశరీరాపరా అని
శంకరుడిని కీర్తించినా..
ప్రేయసి తొలి రాత్రిని
కదలని రాత్రిగా-
వర్ణించి విలపించినా..
చిన్నారిపొన్నారి కిట్టయ్యగా-
గారాలు అభినయించినా..
నా పాట పంచామృతమని,
సంగీత ప్రావీణ్యం కనబరచినా..!
ఆ అద్భుత ప్రతిభకు కొలమానమేది?? –
నీ అమృత గాత్రానికి
ప్రత్యామ్నాయమేది??
పదహారు భాషలలో..
నలభై వేల పాటలతో,
పదుల సంఖ్యలో నందులతో..
సత్కారం పొందిన పాటసారీ…
నీకు అక్షర అశ్రుతర్పణం!!

సాగర్ రెడ్డిగారి పూర్తి పేరు పెనుబోలు విద్యాసాగర్ రెడ్డి. స్వంత ఊరు నెల్లూరు జిల్లా, నెల్లూరుపల్లి కొత్తపాళెం గ్రామము. ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్య నెల్లూరుపల్లి కొత్తపాళెంలోని ప్రాదమిక మరియు జిల్లాప్రజాపరిషిత్ పాఠశాలలో పూరి చేశారు. ఎన్ బి కె ఆర్ సైన్స్ అండ్ ఆర్ట్స్ కళాశాలలో ఇంటర్మీడియట్ నుంచి బికాం వరకు చదివారు. చెన్నై లోని విక్కీ ఇండస్ట్రీస్‌లో మార్కెటింగ్ విబాగంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్నారు. కవితా రచనలు ప్రవృత్తి. ఇప్పటి వరకు 400 కవితలు రచించడం జరిగింది.
4 Comments
డా కె.ఎల్.వి.ప్రసాద్
మంచి నివాళి అందించారు
సాగర్ రెడ్డికి
అభినందనలు.
-కె.ఎల్.వి.ప్రసాద్
హన్మకొండ.
sagar
ధన్యవాదములు సర్
సుమలత
సాగర్ రెడ్డి గారు, మీ కలం నుంచి జాలువారిన మరో ఆణిముత్యం ఈ కవిత. చాలా బాగుంది. అభినందనలు!
sagar
ధన్యవాదములు మేడమ్