Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అనర్ఘరత్నాలు-12

[పద్య ప్రేమికుల కోసం, శ్లోకగతాభిమానుల కోసం శ్రీ పాణ్యం దత్తశర్మ నిర్వహిస్తున్న కాలమ్ ‘అనర్ఘరత్నాలు’. 4 సెప్టెంబర్ 26 న శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం సందర్భంగా ప్రత్యేక పద్యాన్ని అందిస్తున్నాము.]

శ్లో:

కృష్ణోరక్షతు నో జగత్త్రయగురుః
కృష్ణం నమస్యామ్యహమ్
కృష్ణానామరశతవో వినిహితాః
కృష్ణాయ తుభ్యం నమః
కృష్ణా దేవ సముత్థితం జగదిదం
కృష్ణస్య దాసోస్మ్యహమ్
కృష్ణే తిష్ఠతి సర్వమేతదఖిలం
హే కృష్ణ రక్షస్వమామ్

ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా గమనించండి. దీనిని ‘సార్వవిభక్తిక శ్లోకం’ అంటారు. శ్రీమాన్ కులశేఖర ఆళ్వారుల ఆధ్యాత్మిక కృతి ‘ముకుందమాల’ లోనిది ఈ శ్లోకం. దీనిలో ఏడు విభక్తులు ఉపయోగించి కులశేఖరులు శ్రీకృష్ణుని వర్ణించారు.

కృష్ణోరక్షతు : కృష్ణుడు రక్షించుగాక, నో: మమ్ములను. (అస్మాకం, నః) – ఇది ప్రథమా విభక్తి. (కృష్ణుడు) డు, ము, వు, లు.

అహం కృష్ణం నమస్యామి : నేను కృష్ణుడిని (కృష్ణుని) నమస్కరిస్తున్నాను. (కృష్ణుని): ద్వితీయా విభక్తి: నిన్, నున్, నన్.

కృష్ణానామరశశతవో వినిహితాః : కృష్ణుని చేత, రాక్షసులు సంహరింపబడినారు. (కృష్ణేన) కృష్ణుని చేత : తృతీయా విభక్తి. చేతన్ చేన్. తోడన్, తోన్.

కృష్ణాయ తుభ్యం నమః : కృష్ణాయ : కృష్ణుని కొరకు, తుభ్యం: నీ కొరకు, నమః : నమస్కారము. కృష్ణాయ : చతుర్థీ విభక్తి. కొరకున్. కై.

కృష్ణాదేవ సముత్థితం జగదిదమ్ : ఇదమ్ జగత్: ఈ ప్రపంచము. కృష్ణాత్+ ఏవ : కృష్ణుని నుండి (వలన) మాత్రమే, సముత్థితమ్ : ఉద్భవించింది. కృష్ణాత్ : కృష్ణుని నుండి (వలన):  పంచమీ విభక్తి. నుండి, వలనన్, కంటెన్.

కృష్ణస్య దాసోస్మ్యహమ్ : అహమ్: నేను; కృష్ణస్య : కృష్ణుని యొక్క, దాసః : దాసుడను: అస్మి : అయి ఉన్నాను : కృష్ణస్యః కృష్ణుని యొక్క. కిన్, కున్, యొక్క లోన్, లోపలన్ షష్ఠి విభక్తి.

కృష్ణే తిష్ఠతి సర్వమేతదఖలమ్ : ఏతత్ : ఈ, అఖిలమ్ : సమస్తము; కృష్ణే: కృష్ణుని యందే; తిష్ఠతి : ఉన్నది. సప్తమా విభక్తి. అందున్, నన్.

హే కృష్ణ! రక్షస్య! మామ్! : హే కృష్ణ! : ఓ కృష్ణా! మామ్ : నన్ను; రక్షస్వ : రక్షించు. సంబోధనప్రధమా విభక్తి.

సాహిత్యంలో ఈ పక్రియను ‘ఉదాహరణము’ అంటారు. శ్రీ నిడదవోలు వెంకటరావు గారు ‘ఉదాహరణ వాఙ్మయము’ అన్న గ్రంథాన్ని వ్రాశారు. దానిలో ఏఏ కవులు దేనిని సుసంపన్నము చేశారో వివరించారు.

శ్రీనాథ మహాకవి తన ‘హరవిలాసము’లో, ‘కిరాతార్జునీయము’ అనే ఘట్టములో, అర్జునుడు పరమేశ్వరుని స్తుతించిన సందర్భములో, ఒక్కో విభక్తికి ఒక్కో పద్యం వ్రాశారు. కానీ ఆ మహాకవి పంచమీవిభక్తిలో వ్రాయలేదు. ఎందుకో మరి! మొదట మూడూ కందాలు. నాల్గవది శార్దూలము. ఆరవది తేటగీతి. ఏడవది మళ్లీ కందము. సంబోధనప్రధమా విభక్తిని మత్తేభవృత్తంలో వ్రాశాడాయన. అది సంస్కృత సమాస భూయిష్టమైనా, సుబోధకంగా, అద్భుతంగా ఉంటుంది.

ఉదాహరణ కావ్యములే మనకు సాహిత్యములో ఉన్నాయి. ఇవి లఘు కావ్యములు. మొదటగా కవి, ఎనిమిది విభక్తులతో వృత్తములను వ్రాస్తాడు. తర్వాత కళిక, ఉత్కళిక అనీ ఛందస్సులో పద్యాలుంటాయి. చివరగా ఒక సార్వవిభక్తిక పద్యం వస్తుంది.

విభక్తులను సంస్కృతభాషలో పిల్లలకు నేర్పించ డానికి ‘శబ్దమంజరి’ లో అన్ని విభక్తులు ఉండే ఒక శ్లోకం ఉంది. “sరామో విరాజతే, రామో భూమండలమపాలయత్. రామచంద్రేణ భూయతే, రామేణోపార్జితా కీర్తిః..” ఇలా ఉంటుంది. ‘రామరక్షాస్తోత్రమ్’లో కూడా శ్రీరామచంద్రప్రభువును స్తుతించే చక్కని శ్లోకం ఉంది. ఇది బుధకౌశికముని కృతము. అది ఇది.

శా:
రామో రాజమణిః సదా విజయతే రామం రమేశం భజే
రామేణాభిహతా నిశాచరచమూః రామాయ తస్మై నమః
రామాన్నాస్తి పరాయణంపరతరం రామస్య దాసోస్మ్యహం
రామే చిత్తలయస్సదా భవతు మే భో రామ మాముద్ధర!

(ఇందులో రామో ప్రథమ, రామం ద్వితీయ, రామేణ తృతీయ, రామాయ చతుర్థి, రామాన్నా పంచమి, రామస్య షష్ఠి, రామే సప్తమి, భోరామ సంభోధన విభక్తులు)

బమ్మెర పోతన కూడా శ్రీమద్భాగవతములో ఈ ప్రక్రియను పండించాడు. అవి ఒక చోట లేవు.

  1. నల్లనివాడు, పద్మనయనంబులవాడు: ప్రథమ ( నవమస్కంధం, 361)
  2. నీ పద్యావళులాలకించు చెవులున్: ద్వితీయ (దశమస్కంధం – 408)
  3. తాటంకా చలనంబుతో..: తృతీయ (అష్టమ స్కంధం – 102)
  4. పంకజనాభాయ, సంకర్షణాయ: చతుర్థీ (చతుర్థ స్కంధం-792)
  5. నీ కంటినొండెరుంగము: పంచమి (అష్టమ స్కంధం – 231)
  6. శ్రీకైవల్య.. లోకరక్షైకారంభకు..: షష్ఠి (ప్రథమ స్కంధం – నాందీ పద్యం)
  7. నీయంద సంభవించును: సప్తమి (అష్టమ స్కంధం 222)
  8. ఓ కమలాప్త! యో వరద! : సంభోధన (అష్టమ స్కంధం 902)

విభక్తులు లేని భాష ఉండదు. వీటినే ఆంగ్ల భాషలో ‘Prepositions’ అంటారు. ప్రథమ, ద్వితీయ విభక్తులను Nominative case, accusative case అంటారు. తృతీయ (with), చతుర్థి (for), పంచమి (by, than), షష్ఠి (of), సప్తమి (in) ఇలా.

ఉదాహరణములు ఒక లఘుకావ్యరూపంలో వ్రాసిన వారు తక్కువే. కాని విడిగా చూస్తే, పద్యకావ్యములలో ఒక విభక్తిని అందంగా, లయాన్వితంగా ఎందరో మహా కవులు ఉపయోగించారు. నన్నయ్య ‘రాజకులై కభూషణుడు’, పోతన్న, ‘అమ్మలగన్నయమ్మ’, పాల్కురికి సోమన ‘శ్రీగురులింగ తత్పరుడు’ ప్రథమావిభక్తికి (ఇంకా చాలా ఉన్నాయి); మారన ‘ఆదిత్యున్..’, రాయల వారి ‘దొడ్డ కెందమ్మి కందోయివాని’; త్యాగరాజస్వామి వారి కీర్తన ‘నగుమోముగలవాని’ మొదలైనవి ద్వితీయా విభక్తికి చక్కని ఉదాహరణలు.

‘ఉదాహరణము’ అనే ప్రక్రియ గురించి, శ్రీ బెజ్జాల బాలకృష్ణ మోహన రావు గారు, శ్రీ గొట్టుముక్కల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, శ్రీ టి. రంగస్వామిగారు.. ఇంకా ఎందరో కృషి చేసి, దీనిని వెలుగులోకి తెచ్చినారు. వారందరికీ కృతజ్ఞతలు.

Exit mobile version