[కళ్ళు తిరిగి పడిపోయిన నివేద ముఖంపై నీళ్లు జల్లి లేపుతారు ఆమె తల్లిదండ్రులు. ఏం జరిగిందో చెప్పమని అడిగితే చైత్రన్ నోరు విప్పడు. పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్తే అక్కడే నిజాలు ఒప్పుకుంటాడని స్టేషన్‌కి తీసుకువెళ్ళమని గన్మెన్లతో చెప్తాడు సూర్యదేవ్. వాళ్ళు తీసుకెళ్ళబోతుండగా, అన్నీ చెప్పేస్తాననీ ప్రాధేయపడతాడు. తనకి సిటీలో ప్రియాంక పరిచయం అవడం, ఆమెతో ప్రేమలో పడడం, ఆమెకి గర్భం వస్తే అబార్షన్ కోసం డా. సహస్ర వద్దకు వెళ్ళడం, ఆమె అబార్షన్ చేయననడం చెప్తాడు చైతన్. తరువాత తాను ఆమెని ఏ విధంగా మోసం చేసి వినీల్‌ని అసహ్యించుకునేలా చేశాడో చెప్తాడు. అతన్ని ఊరు వదిలి వెళ్ళద్దని హెచ్చరించి, నివేదతో కలిసి హైదరాబాదు వస్తాడు సూర్యదేవ్. వినీల్‌కి ఫోన్ చేసి ఒక హోటల్‌కి రమ్మంటాడు. హోటల్లో సూర్యదేవ్‌తో పాటు నివేదని చూసిన వినీల్ ఖంగుతింటాడు. సూర్యదేవ్ జరిగినదంతా చెప్తే, నిర్ఘాంతపోతాడు వినీల్. – ఇక చదవండి.]
“చైత్రన్ సిటీలో వుండాలంటే డబ్బు లేక వాళ్ళ ఊరు వచ్చి వున్నప్పుడు నువ్వు డబ్బు హెల్ప్ చేసి సిటీకి పంపావట కదా!”
“అవును పంపాను. సిటీకి వెళ్లి ఏదైనా జాబ్ వెతుక్కుంటాడని..”
“కానీ అతను జాబ్ వెతుక్కోలేదు. నువ్వు ఇచ్చిన డబ్బుతో సిటీకి వెళ్లి ప్రియాంక అనే అమ్మాయితో తన లవ్వును కంటిన్యూ చేసాడు. ప్రియాంక ప్రెగ్నెంట్ అయింది. అబార్షన్ కోసం డాక్టర్ సహస్ర దగ్గరకు వెళితే చెయ్యనన్నదట. చైత్రన్ అక్కడ వున్న టైం లోనే నీ నుండి సహస్రకు ఫోన్ వచ్చిందట. స్క్రీన్ మీద నీ ఫొటో చూసాడు. ఆ ఫోన్ టేబుల్ మీద పెట్టి ఆమె పక్కకు వెళ్ళగానే అందులో వున్న మీ ఇద్దరి చాటింగ్‌ని తన ఫోన్ లోకి పంపుకున్నాడు. మీ ఇద్దరి రిలేషన్ తెలిసి తట్టుకోలేకపోయాడు. సహస్ర మనసులో నిన్ను లేకుండా చెయ్యాలని ప్రియాంకను నీ లవర్‌గా డాక్టర్ సహస్రకు పరిచయం చేసాడు. ఆ తరువాత ఏం జరిగి వుంటుందో నువ్వు వూహించగలవు. ఇప్పుడు సహస్ర అరుణాచల్‌లో వుంది” అన్నాడు.
అది వినగానే వినీల్ మైండ్ బ్లాంక్ అయింది.
“చచ ఇలా జరిగిందేం సూర్యదేవ్? ప్రియాంక నా లవరేంటి? చెప్పినా ఎలా నమ్మింది?” అన్నాడు బాధగా.
“అతని ప్రయత్నం అతను చేసాడు వినీల్! వర్కవుట్ అయింది” అన్నాడు సూర్యదేవ్.
“దీని వల్ల నేనెంత లాస్ అయ్యానో అతనికి తెలియదు సూర్యదేవ్!” అన్నాడు బాధగా
“అతనికి కావలసింది నీ లాస్ కాదు వినీల్! ఆయాచితంగా నీ దగ్గర దొరికే డబ్బు. కేవలం డబ్బు కోసమే అలా చేసాడు. అందుకే డబ్బు ఇస్తాననగానే ఆశ పడేవాళ్ళను నమ్మకూడదు. ఒక రకంగా చెప్పాలంటే అతనికి అలా చెయ్యాలన్న దుర్మార్గపు ఆలోచన, అవకాశం అతనికి నువ్వు ఇచ్చిన డబ్బు వల్లనే వచ్చాయి”
“నేనిలా అనుకోలేదు సూర్యదేవ్! నేను చేసేది హెల్ప్ అనుకున్నాను. ఒక చిన్న అబద్ధంతో నా పతనాన్ని చూసాడు. ఒక డాక్టర్‌గా నా హోదా, పలుకుబడి మొత్తం పోయాయి. నా లైఫ్‌లో ఇలాంటి చెడు మార్పులు వస్తాయని నేను ఊహించలేదు. అతను నిజంగా మనిషి కాదు సూర్యదేవ్” అన్నాడు కోపంగా.
“ఇప్పుడు మనకు కావలసింది అతనేంటి అన్నది కాదు వినీల్! సహస్ర కావాలి. ఇదంతా సహస్ర నోటీస్‌కి చేరేలా చూడాలి. చూడటం కాదు మనమే ఆమె దగ్గరకి వెళ్ళాలి. నువ్వు ఒక్కడివే వెళితే ఉపయోగం లేదు. నేనూ, నివేద నీతో వస్తాం” అన్నాడు సూర్యదేవ్.
“నివేదనా?” ఆమె పేరు వినగానే దడుసుకున్నాడు వినీల్. నివేద వైపు చూడకుండా అవసరం లేకపోయినా మొబైల్ పట్టుకున్నాడు.
అది చూడగానే సూర్యదేవ్ పక్కన వున్న నివేద మెల్లగా లేచింది. ఎదురుగా వున్న వినీల్ దగ్గరకి వెళ్లింది. అతని పక్కన వున్న చైర్లో కూర్చుంది.
“బావా!” అంది.
“ప్లీజ్ నివేదా! వెళ్ళు. నాకు నీతో మాట్లాడటం ఇష్టం లేదు” అన్నాడు వినీల్ మొబైల్లోంచి చూపు తిప్పకుండా.
“అన్నయ్య చేసిన దానికి సిగ్గు పడుతున్నాను బావా! ఇలా చేస్తాడనుకోలేదు. అదెంత వెధవ పనో నాకు తెలుసు. అందుకే నీవైపు తలఎత్తి చూడలేకపోతున్నాను. నీ పక్కన కూర్చుని నీతో మాట్లాడాలంటేనే ఇబ్బందిగా వుంది. కారణాలు ఏమైనా నేను కూడా నిన్ను బాధ పెట్టాను. నాకు తెలుసు బావా నువ్వు మా ఇద్దరిని క్షమించవు. కానీ తప్పులు చెయ్యటం, తప్పులు మాట్లాడటం చెయ్యకుండా ఎవరైనా వున్నారా?” అంది. ఆమె ఇంకా ఏమో అనబోతుంటే ఆమె వైపు చేయి చూపి ఆపాడు వినీల్.
“ఓకే.. ఓకే నివేదా! నువ్వు ఏం మాట్లాడబోతున్నావో నాకు తెలుసు. గతాన్ని గుర్తు చెయ్యకు. నాకు ఇష్టం లేదు” అన్నాడు వినీల్.
ఒక్క క్షణం ఆమె మాట్లాడకుండా ఆగిపోయింది.
ఆ తరువాత “అలాగే బావా!” అంటూ ఎప్పట్లాగే వెళ్లి సూర్యదేవ్ పక్కన కూర్చుంది.
“వెరీ గుడ్ వినీల్! రేపు మన ముగ్గురం అరుణాచల్ వెళదాం. మా వాళ్లకి చెప్పి ప్లైట్ టికెట్స్ బుక్ చేయిస్తాను” అన్నాడు సూర్యదేవ్.
“ఓకే సూర్యదేవ్! అలాగే చేయించు” అన్నాడు వినీల్. అతనికి సహస్రను ఎప్పుడెప్పుడు చూద్దామా అని వుంది.
వెంటనే నివేద వైపు చూసాడు. ఆమె మాట్లాడే స్థితిలో లేదు. తల వొంచుకుని ఎటో చూస్తోంది.
“జరిగిందేదో జరిగిపోయింది. నా కారులో ఇంటికెళదాం రా నివేదా!” పిలిచాడు వినీల్.
“నేను రాను బావా!”
“ఎందుకు?”
“నా మీద మామయ్య కోపంగా వుంటారు”
“మరి ఎక్కడుంటావ్? ఊరు వెళతావా ఈ టైం లో..?”
“వెళ్ళను. మధురిమా హాస్టల్లో వుంటాను. ఇక ముందు అక్కడే వుంటాను. రోజూ కాలేజీకి వెళ్ళాలిగా” అంది నివేద.
“హాస్టల్లో వుండి కాలేజీకి వెళతావా?”
“హా.. హాస్టల్లో వుండే కాలేజీకి వెళతాను. ఇక ముందు ఎవరి ఇళ్లలో వుండను” అంది అభిమానంగా.
ఆమెలోని ఆత్మాభిమానం అర్థమైంది వినీల్‌కి. సూర్యదేవ్ ఆమె పక్కనే వున్నాడు.
“సరే నీ ఇష్టం. ఇక నేను వెళతాను సూర్యదేవ్” అంటూ చేయి చాపి సూర్యదేవ్ చేయి అందుకున్నాడు.
“అలాగే” అన్నాడు సూర్యదేవ్.
ఆ నలుగురు హోటల్ లోంచి బయటకొచ్చారు.
వినీల్ తన కారులో వెళ్ళిపోయాడు.
సూర్యదేవ్, నివేద వెహికిల్ ఎక్కగానే గన్మెన్లు ఎక్కారు.
వెహికిల్‌లో కూర్చోగానే “నువ్వు వినీల్‌తో వెళతావనుకున్నాను” అన్నాడు సూర్యదేవ్.
“నేను హాస్టల్ ముందు దిగిపోతాను” అంది నివేద.
“వద్దు. ఇక ముందు నువ్వు హాస్టల్లో ఉండటానికి వీల్లేదు”
“ఇంకెక్కడ వుంటాను? హాస్టల్లోనే వుంటాను. అలేఖ్య దగ్గరకి వెళ్లి వుండాలన్నా ఇప్పుడు కుదరదు. మల్లికార్జున్ వున్నాడు”
“అలేఖ్య దగ్గరనో, హాస్టల్లోనో నిన్నెలా వుంచుతాననుకున్నావ్!”
“మరెక్కడ వుంచుతారు?”
“ఎక్కడో దేనికి వేదా! మా ఇంట్లోనే వుంటావ్! అమ్మా, నాన్నగారు వున్నారుగా. తీసికెళ్ళి పరిచయం చేస్తాను. ఉదయాన్నే లేచి ఎయిర్‌పోర్ట్‌కి వెళదాం. ఓకే నా?” అన్నాడు.
“ఓకే” అన్నట్లు తల వూపింది.
అప్పుడే అలేఖ్యకు ఫోన్ చేసింది.
అలేఖ్య లిఫ్ట్ చేసి “చెప్పు వేదా! ఇప్పుడు ఎక్కడున్నావ్? ఏ.ఎస్.పి. గారు మీ ఊరు వచ్చారా? నాకు ఒకటే కంగారుగా వుంది” అంది.
“వచ్చారు. ఇప్పుడు ఆయనతోనే వున్నాను. నువ్వేమి టెన్షన్ పడకు. ఈ రాత్రికి ఏ.ఎస్.పి. గారి ఇంట్లోనే వుంటాను. నేను డ్రస్ లేమీ తెచ్చుకోలేదు. నువ్వు వెంటనే డ్రెస్ తీసుకుని ఏ.ఎస్.పి. గారి ఇంటికి రా” అని చెప్పి ఫోన్ పెట్టేసింది నివేద.
ఏ.ఎస్.పి. ఇల్లు రాగానే వెహికిల్ ఆగింది. గన్మెన్లు హడావుడిగా వెహికిల్ దిగి డోర్ తీశారు. పరిగెత్తుకుంటూ వెళ్లి గేటు తీశారు. సూర్యదేవ్, నివేద వెహికిల్ దిగి ఆఫీస్ రూమ్ వైపు వెళ్లకుండా నేరుగా మెట్లెక్కి ఇంట్లోకి వెళ్లారు.
సూర్యదేవ్ తల్లిదండ్రులు హాల్లో కూర్చుని వున్నారు.
నివేదను వాళ్ళ ముందు నిలబెట్టి “అమ్మా! ఈ అమ్మాయి నివేద. లెక్చరర్‌గా వర్క్ చేస్తోంది. నా ఫ్రెండ్ డాక్టర్ వినీల్ తెలుసుగా. అతని మేనత్త కూతురు. ఈ రాత్రికి మన ఇంట్లోనే వుంటుంది. గది చూపించు” అన్నాడు సూర్యదేవ్.
ఆమె కొడుకును ఎలాంటి ప్రశ్నలు వెయ్యకుండా లేచి వెళ్లి గది చూపించింది.
“ఇక నేను వెళతాను నివేదా! నీకేమైనా అవసరమైతే నన్ను పిలువు” అని నివేదతో చెప్పి ఆమె హాల్లోకి వచ్చింది. హాల్లో తండ్రి పక్కన కూర్చుని వున్న సూర్యదేవ్‌కి ఎదురుగా కూర్చుంది.
“ఆ అమ్మాయి చాలా బాగుంది సూర్యా! వినీల్‌కి కాబోయే భార్యనా?” అని ఆసక్తిగా అడిగింది.
“లేదమ్మా! వినీల్ ఒక డాక్టర్ని ప్రేమించాడు. ఆమెనే పెళ్లి చేసుకుంటాడు. కాకపోతే వాళ్ళిద్దరి మధ్యన చిన్న క్లాష్ వచ్చింది. ఆ పని మీదనే రేపు నేనూ, నివేద, వినీల్ కలిసి అరుణాచల్ వెళుతున్నాము” అన్నాడు.
చైత్రన్ వల్లనే వాళ్ళ మధ్యన క్లాష్ వచ్చిందని చెప్పలేదు. చైత్రన్ నివేద అన్నయ్య కాకపోయి వుంటే తప్పకుండా చెప్పేవాడు.
అంతలో అలేఖ్య నివేద కోసం డ్రెస్ తీసుకుని వచ్చింది. సూర్యదేవ్‌తో మాట్లాడి నేరుగా నివేద వున్న గదిలోకి వెళ్ళింది.
***
తెల్లవారి ఐదు గంటలకే నిద్రలేచి ప్రెషప్ అయ్యారు సూర్యదేవ్, నివేద. కారులో ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లారు. వాళ్ళు వెళ్ళేసరికే వినీల్ అక్కడ వున్నాడు.
ముగ్గురు ప్లైట్‌లో అరుణాచల్ వెళ్లారు.
సహస్ర వాళ్ళ అన్నయ్య మోహన్ మిలటరీ హాస్పిటల్లో డాక్టర్. ఆయన అడ్రెస్ తెలుసుకుని ఆయన్ని కలిశారు. పరిచయం చేసుకున్నారు. అరుణాచల్ చూడాలని వచ్చినట్లు చెప్పారు. సంతోషపడ్డాడు డాక్టర్ మోహన్. మోహన్ ఫ్రీ అయ్యాక వాళ్ళను క్యాంటీన్‌కి తీసికెళ్లాడు. కార్నర్లో వున్న టేబుల్ దగ్గరకి వెళ్లి కూర్చున్నారు. కొద్దిసేపు ఆ నలుగురు మౌనంగానే వున్నారు.
మోహన్ వినీల్ వైపు అభిమానంగా, ప్రేమగా చూసాడు.
“డాక్టర్ వినీల్! నేను అక్కడకి వచ్చినప్పుడు మీ గురించి సహస్ర చెప్పింది. పెళ్లి చేసుకుంటానంది. తను మీ గురించి చెప్పింది విన్నాక నాకేం అభ్యంతరమనిపించలేదు. ఎలాగూ మీకు సొంతంగా హాస్పిటల్ వుంది కాబట్టి సహస్ర కూడా అందులోనే వుండొచ్చు. త్వరగానే పెళ్లి చెయ్యాలనుకున్నాను. మీ వాళ్లతో మాట్లాడాలనుకున్నాను. కానీ నాతో మాట్లాడిన నెక్స్ట్ డే నే ‘అప్పుడే పెళ్లి వద్దు అన్నయ్యా నీతో వస్తాను. నీ దగ్గరే ప్రాక్టీస్ చేస్తాను. రిజైన్ చేసి వచ్చాను’ అంది. నాకేం చెయ్యాలో తోచలేదు. ఎందుకంటే మా మిలటరీ ఏరియాలో ప్రయివేటు ప్రాక్టీస్ ఉండదు. సివిల్ ఏరియాలో మెడికల్ షాపులు వున్నట్లే హాస్పిటల్ కూడా పెట్టుకోవచ్చు. బాగా ఆలోచించాను. కాంట్రాక్ట్ డాక్టర్‌గా అయితే మంచి ఫ్యూచర్ వుంటుందని సివిల్ డాక్టర్‌గా ప్రాక్టీస్ పెట్టించాను. సహస్ర ఇప్పుడు మిలటరీ క్యాంపు బయట మామూలు పౌరులకు వైద్యం చేస్తూ వుంది. డ్యూటీ అయ్యాక సహస్ర నా ఇంట్లో ఉండటానికి మిలటరీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. తనకో ఐడెంటిటీ కార్డు ఇచ్చారు. ఇప్పుడు నో ప్రాబ్లం. సహస్ర హ్యాపీగా వుంది” అన్నాడు.
బేరర్ మంచి భోజనం తెచ్చి వాళ్ళ ముందు పెట్టాడు. తింటూ మాట్లాడుకుంటున్నారు.
“ఓకే సర్! ఇప్పుడు మేము డాక్టర్ సహస్రను కలవాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి?” అడిగాడు సూర్యదేవ్.
ఎక్కడికి వెళ్లాలో, ఎలా వెళ్లాలో చెప్పాడు మోహన్.
నలుగురు భోంచేసారు.
“సర్ ఇక మేం బయలుదేరుతాం. సహస్ర గారిని కలిసి వెళ్ళిపోతాం” అన్నాడు సూర్యదేవ్.
మోహన్ “అలాగే” అంటూ సూర్యదేవ్‌తో చేయి కలిపాడు. తరువాత వినీల్ చేయి పట్టుకుని ప్రేమగా నొక్కాడు. మోహన్‌కి వినీల్ బాగా నచ్చాడు. సహస్ర పక్కన బాగుంటాడు అనుకున్నాడు. నివేదకు నమస్తే చెప్పాడు.
డాక్టర్ మోహన్ని చూస్తుంటే సహస్ర వినీల్ గురించి ఆయనకి ఏమీ చెప్పలేదని అర్థమైంది.
డాక్టర్ మోహన్ దగ్గర సెలవు తీసుకుని డాక్టర్ సహస్ర దగ్గరకి వెళ్లారు సూర్యదేవ్, వినీల్, నివేద.
ఆమెకు ఎదురుగా కూర్చున్నారు.
సహస్ర వాళ్ళను చూడగానే ముందు చేసిన పని వినీల్ వైపు కోపంగా చూడటం.
వాళ్ళు నోరు విప్పి మాట్లాడేలోపలే “ఈ అమ్మాయి ఎవరు? నేను అబార్షన్లు చెయ్యను మిస్టర్ వినీల్! ఆరోజు మీ అత్తయ్య గారబ్బాయి చైత్రన్ ప్రియాంకను తీసుకొచ్చినప్పుడు కూడా ఇదే మాట చెప్పాను. కానీ అతను వినలేదు. ఆ అమ్మాయి నీ తాలూకు అన్నాడు. అయినా నేను చెయ్యలేదు. వేరే డాక్టర్ని చెయ్యమన్నాను. మీరు కూడా డాక్టరేగా, ఆ మాత్రం మేనేజ్ చేసుకోలేరా? ఇదేంటి, ఈ నాన్సెన్సేంటి? ఈ అమ్మాయిని తీసికెళ్ళండి “ అంటూ నివేద వైపు చిరాగ్గా చూసింది.
ఆమె చూపులు నివేదను చీరేశాయి.
నివేద లేచి అక్కడ నుండి పారిపోవాలనుకుంది. సూర్యదేవ్ పట్టుకున్నాడు.
“నన్ను వదలండి ఏ.ఎస్.పి. గారు! ఇక్కడ ఒక్క క్షణం కూడా వుండను. మీరు కూడా వుండొద్దు. ఈ నాన్సెన్స్ అంతా మనకెందుకు చెప్పండి? అది వాళ్ళ ప్రాబ్లం. వాళ్లే చూసుకుంటారు. కావాలంటే అన్నయ్యతో మాట్లాడిపిద్దాం” అంది నివేద.
రోషంతో, కోపంతో, అవమానంతో ఆమె ముక్కు పుటాలు ఎర్రబడి అదురుతున్నాయి.
“కూల్ వేదా! ఆవిడకు నువ్వు ఎవరో తెలియక అలా అన్నారు” అన్నాడు సూర్యదేవ్.
“తెలియకపోతే అడిగి తెలుసుకోవచ్చుగా? అయినా నేను వుండను సర్! వెళ్ళిపోతాను” అంటూ వెళ్ళబోయింది.
గట్టిగా పట్టుకున్నాడు సూర్యదేవ్. ఆమె ఎంత బలంగా లాగినా అతను వదల్లేదు. అతని దగ్గర నుండి ఇంచి కూడా కదల్లేకపోతోంది.
“అసలు మనం ఇక్కడకి రావలసింది కాదు. అనవసరంగా వచ్చాం” అంటూ ఆవేశంగా సూర్యదేవ్ ముఖం లోకి చూసింది.
“మనం అనవసరంగా వచ్చామని ఎందుకనుకుంటావ్ వేదా? వినీల్ మానసికస్థితి ఎలా వుందో నీకు తెలియదా? అతను ఒక్కడే వచ్చి సహస్రగారితో మాట్లాడగలడా?” అన్నాడు సూర్యదేవ్.
అతనలా అంటుంటే మండిపోయింది నివేదకు.
“బావ గురించి తప్ప ఇంకేం ఆలోచించరా? అతను మీకు ఫ్రెండ్ అనా?” అంది.
“ఫ్రెండని కాదు వేదా! అతను నా ఫ్రెండ్ కన్నా ఒక మంచి సర్జన్. సహస్ర దూరమైందన్న బాధతో హాస్పిటల్‌కి దూరమయ్యాడు. వృత్తికి దూరమయ్యాడు. వినీల్ ఎందుకలా అయ్యాడో తెలిసాక కూడా అతన్ని అలాగే వదిలేద్దామా? అంత మంచి సర్జన్‌ని పోగొట్టుకుందామా? వాళ్ళిద్దరి మధ్యన వున్న ప్రాబ్లంని మనం పోగొట్టొద్దా? అలా అనుకునే కదా వచ్చాం”
“కానీ ఇప్పుడు నేను ఎలాంటి సిట్యుయేషన్లో వున్నానో, ఎలాంటి మాటలు విన్నానో, ఎలా హర్ట్ అయ్యానో మీరు నా ప్లేస్‌లో వుంటే తెలుస్తుంది. అయినా ఒక ఆడపిల్లను చూస్తే అలాంటి మాటలు తప్ప ఇంకేం రావా డాక్టర్లకి?”
“ఎలా వస్తాయి? ఆమె గత అనుభవం అలాంటిది. మీ అన్నయ్య ప్రియాంకను తీసికెళ్లినట్లే మేం నిన్ను ఇక్కడకి రహస్యంగా తీసుకొచ్చామను కున్నారేమో! ఒక్క వినీల్ తప్ప మనం ఎవరో, ఎందుకొచ్చామో ఆ డాక్టర్‌కి తెలియదుగా. నాకు మాత్రం బాధగా లేదా ఆ డాక్టర్ నిన్ను అలా అంటుంటే. కానీ ఆమెను కూడా మనం అర్థం చేసుకోవాలి. అయినా దీని కంతటికి కారణం ఎవరు? మీ అన్నయ్య కాదా? అలాంటి అన్నయ్యకు చెల్లెలు అయినందుకు ఇలాంటివి తప్పవు. కూర్చో. వచ్చిన పని అయ్యాకనే వెళదాం” అన్నాడు సూర్యదేవ్. ఆమె భుజం చుట్టూ చేయి వేసి తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఆమె చేతిని పట్టుకునే వున్నాడు.
“బావ నోరెత్తకుండా ఎలా కూర్చుని వున్నాడో చూడండి! వీళ్ళింతే సర్, నన్ను ఎవరేమన్నా పట్టించుకోరు. అప్పుడు అత్తయ్య కూడా అలాగే చేసారు. అందుకే వెళ్ళిపోయాను ఇంట్లోంచి. అది జరిగినప్పుడు బావ నన్నే అన్నాడు. ఇప్పుడు ఈవిడతో కూడా మాటలు పడ్డాను. అన్న మాటలు పోతాయా సర్?” అంటూ బాగా బాధపడింది నివేద.
“నీ బాధ నాకు తెలుసు వేదా! అయినా ఇప్పుడు వినీల్ ఏం మాట్లాడాలి? నువ్విలా బాధపడటం అతనికేమైనా సరదాగా వుందా? అతని బాధలో అతను లేడా?” అన్నాడు సూర్యదేవ్.
డాక్టర్ సహస్ర అవాక్కయి తలఎత్తి సూర్యదేవ్‌ని, నివేదను చూస్తోంది. వాళ్ళ మాటల్ని వింటోంది. నివేద బాధ పడటం, సూర్యదేవ్ ఓదార్చటం చాలా దగ్గరగా చూస్తోంది.
వినీల్ తలవొంచుకుని సహస్ర ముందున్న పేపర్ వెయిట్ తిప్పుతున్నాడు.
నివేద బాధ పడుతుంటే సూర్యదేవ్‌కి ఎప్పుడూ రానంత కోపం వచ్చింది.
మొబైల్ పట్టుకుని టకటకా నెంబర్ నొక్కాడు.
చైత్రన్ లిఫ్ట్ చేసి వీడియో కాల్లోకి వచ్చాడు. సూర్యదేవ్‌ని చూడగానే “నమస్తే ఏ.ఎస్.పి.గారు” అంటూ వణికిపోతున్నాడు చైత్రన్.
“చెప్పరా! నాకొచ్చే కోపానికి నువ్వు నా దగ్గర వుంటే అరెస్ట్ చేసి పడేసే వాడిని. ఇక్కడ మీ వినీల్, డాక్టర్ సహస్ర వున్నారు. నువ్వేం చేసావో, అసలేం జరిగిందో వాళ్లతో చెప్పు” అంటూ ఫోన్ తీసికెళ్ళి వినీల్‌కి సహస్రకు మధ్యలో వుంచాడు.
“నేను నివేదను కొద్దిసేపు బయటకు తీసికెళతాను వినీల్! తను బాగా హర్ట్ అయింది. మీరు చైత్రన్తో మాట్లాడుతూ వుండండి. నేను ఇప్పుడే వస్తాను. మేడం మీరు వాడిని వదలకండి. వాడు చేసిన వెధవ పని ఎలాంటిదో వినండి. విన్నాక వినీల్ గురించి ఆలోచించండి” అంటూ నివేదను తీసుకుని బయటకెళ్ళాడు సూర్యదేవ్.
ఫోన్ వైపు చూసింది సహస్ర.
“చెబుతాను మేడం” అంటూ వీడియో కాల్లో వున్న చైత్రన్ మాట్లాడుతున్నాడు.
వినీల్, సహస్ర వింటున్నారు. అంతా విన్నాక ఫోన్ కట్ చేసారు.
సహస్ర వైపు చూసి అప్పుడు నోరు విప్పాడు వినీల్.
“వింటుంటే షాకింగ్‌గా వుంది సహస్రా! ఇలాంటి వాళ్ళు కూడా వుంటారా? నమ్మలేకపోతున్నాను. సొంత అత్తయ్య కొడుకై వుండి నా జీవితంతో ఆడుకున్నాడు. వాడు మనిషి కాదు. డబ్బు పిశాచి” అన్నాడు వినీల్.
(సశేషం)
హలో అండీ! అందరికి నమస్కారం. నేను కందుకూరు టి ఆర్ ఆర్ గవర్నమెంట్ కాలేజిలో బి.యే తెలుగు చదివాను. ఇంటర్ చదువుతున్నప్పుడే మూడు కథలు, ఒక నవల రాసాను. ఆ నవల పేరు మధురిమ. అది ప్రగతి వారపత్రిక లో అచ్చయింది. అమ్మ నాకు అన్నం పెడితే నాన్న అక్షరం పెట్టారు. మా నాన్న గారు మామిడేల రాఘవయ్య గారు, అమ్మ వెంకట సుబ్బమ్మగారు. మా వారు బ్యాంక్ ఎంప్లాయ్. నాకు ముగ్గురు అబ్బాయిలు.
‘గుండెలోంచి అరుణోదయం’ కవితాసంపుటి, ‘జీవితం అంటే కధకాదు’ కథల సంపుటి తోపాటు 20 నవలలు వ్రాసాను. నా నవలల్లో కొన్ని నవ్య, స్వాతి, తెలుగు తేజం, విశాలాక్షి ప్రత్రికల్లో నే కాక ఆన్ లైన్ మేగజైన్ లలో కూడా సీరియల్స్ గా వచ్చాయి. వస్తున్నాయి.
నేను అందుకున్న పురస్కారాలలో కొన్ని 1) యద్దనపూడి గారి మాతృమూర్తి పురస్కారం. 2) ఉమ్మెత్త ల సాహితీ పురస్కారం. 3) భారత మహిళా శిరోమణి పురస్కారం. 4)హెల్త్ కేర్ ఇంటర్నేషనల్ పురస్కారం. 5) జాతీయ పురస్కారం. ఇకపోతే ఇప్పుడు సంచిక.కాం లో వస్తున్న నా ‘అందమైన మనసు’ నవలను మీరంతా చదివి ఆదరిస్తారని కోరుకుంటున్నాను.
-అంగులూరి అంజనీదేవి.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
కమ్మని ‘చిలక పలుకులు’
మాయమైన బడి
‘జీవన సంధ్య’ పుస్తకావిష్కరణ – ప్రెస్ నోట్
జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-48
ఆర్.వి. చారి నానీలు
సరైన దశ దిశలని నిర్దేశించే ‘శ్రీరాముని చింతన’ కథ – రామకథాసుధ
వారెవ్వా!-17
స్నేహమా ఇది!?!
సినిమా క్విజ్-49
ముసలి దంపతులు – చామ దుంపలు
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®