ఎదిగిపోయాడు మనిషి,
తనను తాను మరచేంత
ఎత్తుకు ఎదిగిపోయాడు,
ఎదుగుదలే శ్వాసగా
పేరు ప్రతిష్ఠలే ఊపిరిగా,
ఎదిగిపోయాడు!!
పక్షిలా నింగిలోకి ఎగిరాడు,
చేపలా నీటిలో ఈదాడు,
నడచిన నేలనే మరచి ఎదిగిపోయాడు,
ప్రపంచమే తన గుప్పిట్లో
ఒదిగేలా ఎదిగాడు!!
అంతరిక్షాన్ని జయించి,
అంతరాత్మను మరచి,
అంతర్ముఖుడిగా,
ఎదిగిపోయాడు,
ఈ పెద్దమనిషి!!
పరదేశంలో ముక్కూ
మొహం తెలియని
వారితో చెలిమిచేసే
స్ధాయికి ఎదిగాడు,
ప్రక్కింటి మనిషిని
పట్టించుకోలేనంత
తీరుబడిలేని-
మనిషిగా మారాడు!!
సప్తసముద్రాల ఆవల
వారితో ఆప్తబంధం,
వెల్లు విరిసేలా,
సప్తపది నడచిన,
ఆలితో అల్లంతదూరం,
నడచేలా తనకు తాను ఎదిగిపోయాడు
మహా మనిషి!!
అంతంలేని చదువే
అసలైన విద్య అనే
ముసుగులో-
ఎన్నో పట్టాలు పట్టాడు,
ఒదుగులేని ఎదుగు
ఒక ఎదుగు కాదనే,
ధ్యాసనే మరచిమరీ,
ఎదుగుతూ, సాగుతున్నాడు,
ఈ విచిత్రమనిషి!!

సాగర్ రెడ్డిగారి పూర్తి పేరు పెనుబోలు విద్యాసాగర్ రెడ్డి. స్వంత ఊరు నెల్లూరు జిల్లా, నెల్లూరుపల్లి కొత్తపాళెం గ్రామము. ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్య నెల్లూరుపల్లి కొత్తపాళెంలోని ప్రాదమిక మరియు జిల్లాప్రజాపరిషిత్ పాఠశాలలో పూరి చేశారు. ఎన్ బి కె ఆర్ సైన్స్ అండ్ ఆర్ట్స్ కళాశాలలో ఇంటర్మీడియట్ నుంచి బికాం వరకు చదివారు. చెన్నై లోని విక్కీ ఇండస్ట్రీస్‌లో మార్కెటింగ్ విబాగంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్నారు. కవితా రచనలు ప్రవృత్తి. ఇప్పటి వరకు 400 కవితలు రచించడం జరిగింది.
5 Comments
Sagar
సంచిక యాజమాన్యానికి నా ధన్యవాదములు
డా.కె.ఎల్.వి.ప్రసాద్
సాగర్
మీ కవిత చాలా బాగుంది.
మనిషి ఎదుగుదలను
అర్థవంతమైన సెటైర్లో రాసారు.
కవిగా ఈ కవిత
మీ ఎదుగుదలకు సంకేతం.
అభినందనలు సాగర్.
బి.జానీభాష
నేటి సమాజంలోని మనుషులలో వచ్చిన మార్పు గురించి విమర్శనతకంగా చక్కగా వర్ణించారు సర్.
Sagar
మీ స్పంధనకు ధన్యవాదములు జానీ.
కొంపెల్ల కామేశ్వరరావు
సాగర్ గారూ, మీ కవిత బాగుంది. తాను ఎదుగుతూ ఎంత సంకుచితంగా మారిపోయాడో వ్యంగ్యంగా రాశారు. పక్కవాణ్ణి పట్టించుకోని తీరుబడిలేని మనిషి మనకెదురవుతూనే ఉంటాడు. అలాంటి మనిషికి వేసిన చురక మీ కవిత.
కొంపెల్ల కామేశ్వరరావు