[కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత శ్రీ ఎలనాగ సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా జాతీయ, అంతర్జాతీయ కవితలని అనువదించి ‘అనువాద మధు బిందువులు’ పేరిట అందిస్తున్నారు.]


సాహిత్యకారుని మానిఫెస్టో
~
చెదపురుగులు మొత్తం యిల్లునే తినేస్తాయి
ఒక కీటకం పెద్దచెట్టును కింద పడేలా చేస్తుంది
ఒకవ్యక్తి ప్రభుత్వాన్ని పడగొడతాడు
ఒక క్రిమి ప్రపంచాన్ని తలకిందులు చేస్తుంది
మనం ఒంటరిగా ఉండటం నేర్చుకుంటాం
రోజు మొత్తం నిద్రలో గడిచిపోతుంది
వండుకోవటం తినటం
కళల స్థాయికి చేరుకుంటాయి
మనం కళలను మళ్లీమళ్లీ రచిస్తాం
నా ఇమెయిల్ నా మిత్రుని
మరణాన్ని ప్రకటిస్తుంది
శోకం నా ముంగిలిని ముంచెత్తుతుంది
మనకు శ్రోతలు మిగలరు
ప్రాథమ్యాలను గాల్లో ఎగరేసి
గారడి చేసే అవసరం లేదు
సిసిఫస్ మంచులో గడ్డకట్టుకుపోయాడు
ఇప్పుడు శిలువ అంటే ‘ఉద్వాసన చేయడం’
ఆంగ్లమూలం: ప్రమీలా వెంకటేశ్వరన్
అనువాదం: ఎలనాగ

వృత్తిరీత్యా వైద్యులైన శ్రీ ఎలనాగ (డాక్టర్ నాగరాజు సురేంద్ర) ప్రవృత్తి రీత్యా సాహితీవేత్త. కవిగా, భాషావేత్తగా, విమర్శకుడిగా, అనువాదకుడిగా సుప్రసిద్ధులు.
కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత. తెలుగులోనూ, ఆంగ్లంలోనూ రచనలు చేసే ఎలనాగ గారు సుమారు 40 గ్రంథాలు వెలువరించారు.
‘ఫేడెడ్ లీవ్స్ అండ్ ఫ్లైస్’, ‘ఇంప్రెషన్-ఇమేజెస్’, ‘మెమొరబుల్ మెలోడీ మేకర్స్ అండ్ అదర్ పోయెమ్స్ ఆన్ మ్యూజిక్’ మొదలైనవి ఆయన తెలుగు నుండి ఆంగ్లంలోకి తెచ్చిన కవితా సంపుటాలు.
వట్టికోట ఆళ్వార్ స్వామి, దాశరథి కృష్ణమాచార్య, కాళోజీ నారాయణరావు వంటి సుప్రసిద్ధ తెలుగు రచయితల కథలను, నవలలను ఆయన ఆంగ్లంలోకి తీసుకువచ్చారు. వివిధ దేశాల సాహిత్యాన్ని కూడా ఆయన తెలుగు పాఠకులకు అందించారు. వాటిలో ఉత్తమ లాటిన్ అమెరికన్ కథలు, ఉత్తమ ఆఫ్రికన్ కథలు, సోమర్సెట్ మామ్ కథలు ఉన్నాయి.
వివిధ దేశాల కథల అనువాద గ్రంథం ‘కథాతోరణం’ వెలువరించారు. పవన్ కె. వర్మ రాసిన ‘గాలిబ్: దమ్యాన్, ద టైమ్స్’ గ్రంథాన్ని ‘గాలిబ్ నాటి కాలం’ అనే పేరుతో తెలుగులోకి తెచ్చారు.