[శ్రీమతి పైడిమర్రి పద్మ రచించిన ‘అపాయంలో ఉపాయం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]


“ఏమండీ!!, మా పిన్ని కూతురు పెళ్లికి వెళ్ళాలనుకున్నాం కదా!, ఇంకా తయారవ్వలేదేమిటి?. అదే మీ వాళ్ల ఇంట్లో పెళ్లి అయితే, పెళ్లి కొడుకు కన్నా ముందుగా తయారై కూచుంటారు. మా వాళ్ళు అనేటప్పటికి
వీలైనంత ఆలస్యం చేస్తారు. ఎంత బాగా చూసినా మీ బుద్ధి మారదు.” అంటూ దండకం మొదలుపెట్టింది రాధ.
“నువ్వు ఎంత అరిచినా, ఆ హల్దీలు, సంగీత్, అందరూ కలసి డ్యాన్స్ చెయ్యడాలు నా వల్ల కాదు. ముందు నువ్వు వెళ్లి ఎంజాయ్ చెయ్. నేను తరవాత వస్తా.” అన్నాడు గోపాలం.
“మరి కిందటి నెలలో, మీ మేనమామ కూతురి పెళ్లిలో మీ వాళ్లందరితో కలసి పిచ్చిడాన్సులు తెగ చేసారుగా!! అప్పుడే ఏమైందో?” అంది రాధ.
“నువ్వే అంటున్నావుగా పిచ్చి డ్యాన్స్ అని, అందుకే ఇంకెక్కడా చెయ్యదలచుకోలేదు.” అన్నాడు గోపాలం నవ్వుతో.
“నిజమేలెండి! మీరు వచ్చి మొహం మాడ్చుకుని కూచునే కన్నా తరువాత రావడమే నయం.” అంటూ పెళ్లికి బయలుదేరింది రాధ.
“నేను నా బట్టలు అన్నీ తీసుకుని వెడుతున్నా. మీ బట్టలు మీరు సరిగ్గా సర్దుకురండి. మగపెళ్లివారిని ఆహ్వానించేటప్పుడు, స్నాతకానికి, ఎదురుసన్నాహాలకీ, పొద్దున్నా, రాత్రి, భోజనాలకు, అలా అన్నిటికీ విడివిడిగా ఒకొక్క జత పెట్టుకోండి.” అని చెప్పింది రాధ.
“ఇలా అస్తమానం బట్టలు మార్చుకుంటుంటే పెళ్లి పనులు ఎలా చేస్తాం?, పెళ్లి ఎప్పుడు చూస్తాం.” అన్నాడు గోపాలం చిరాగ్గా.
“చెప్పింది అర్థమైందిగా, వెడుతున్నా! తొందరగా వచ్చేయ్యండి.” అని పెళ్లికి వెళ్ళిపోయింది రాధ తనని కాదన్నట్టు.
‘హమ్మయ్యా!! తుఫాను వెలిసినట్టు వుంది.’ అనుకుంటూ భోజనం చేసేసి టీవీ పెట్టుకుని కూర్చున్నాడు గోపాలం. ఇంక పడుకుందాము అనుకునే సమయానికి ఫోన్ మోగింది.
‘ఎవరు చేశారో?’ అనుకుంటో, ఫోన్ చూసి ‘అమ్మో రాధ!! ఇప్పుడు చేసింది ఏమిటీ? కొంపతీసి ఇప్పుడే రమ్మనదు కదా!’ అనుకుంటూ “ఏంటి? రాధా! ఫోన్ చేశావు?” అన్నాడు నిద్రలో వున్నట్టుగా.
“మరీ ఎక్కువ నటించెయ్యకండీ! మీరు అప్పుడే పడుకోరని తెలుసు. హల్దీ అప్పుడు అందరం పసుపు రంగు చీరలు కట్టుకుందామనుకున్నాం. నా పసుపురంగు చీర బీరువాలో వుండిపోయింది. అది తీసి రాపిడోలో పంపించండి. పసుపు మీద ఎర్ర చుక్కలు వుంటాయి.” అంది రాధ.
“అబ్బా!! అవన్నీ నాకేమి తెలుస్తాయి? ఏదో ఒకటి కట్టుకో” అన్నాడు గోపాలం.
“అదే తెలుస్తుంది, ముందు బీరువా తియ్యండి.” అంది రాధ.
బీరువా తెరిచిన గోపాలానికి అది చిన్న బట్టల కొట్టులా అనిపించింది. అందులోంచి ‘పసుపు మీద ఎర్ర చుక్కలా! తియ్యగలనా?’ అనుకున్నాడు గోపాలం.
“కనిపించిందా? సరిగ్గా చూడండి” అంది రాధ.
“చూసానే, తెలియడం లేదు.” అన్నాడు గోపాలం దిగులుగా.
“ఎలా తెలుస్తుందీ? ఎప్పుడైనా నేను కట్టుకున్నప్పుడు చూసి మెచ్చుకుంటే అర్థమై చస్తుంది. ఆ పేపర్ లోంచీ తలెత్తరు. ఇప్పుడెలా తెలుస్తుంది?” అంది రాధ కోపంగా.
“హమ్మయ్య! కనిపించిదే, పసుపుమీద ఆకుపచ్చ పువ్వులు వున్నాయి.” అన్నాడు గోపాలం మొత్తానికి సాధించాను అన్నట్టుగా.
“నా ఖర్మ! పువ్వులు కాదండీ, ఎర్రచుక్కలు. మీవల్ల కాదుగానీ, నేను ఏదో ఏడుస్తా, కనీసం మీ మరదలికి కిందటిసారి నేను దసరాకి కొనుక్కున్న చీర నచ్చిందిట. ‘నీలానికి ఎరుపు అంచు’ అదైనా చూడండి. లేకపోతే మన పరువు పోతుంది.” అంది రాధ ధుమధుమలాడుతూ.
‘ఏంటీ? చీర దొరక్కపోతే! పరువుపోతుందా?’ అని ఆశ్చర్యపోయాడు గోపాలం.
ఈసారి ఎలాగైనా పరీక్షలో పాస్ అవ్వడానికి చాలా తీవ్ర కృషి చేసాడు గానీ పాపం పాస్ అవ్వలేకపోయాడు గోపాలం.
ఇంతలో ఫోన్ లోంచీ ‘బాబాయ్! నాకు పిన్నిది ఆరంజ్ ప్లెయిన్ చీర వుంది కదా! అది పంపించవా?’ అని ముద్దుగా అడిగింది రాధ చెల్లెలి కూతురు.
“వింటున్నారా?, నా పుట్టినరోజుకి కొనుక్కున్న చీర అది. గుర్తుందా?” అంది రాధ.
“గుర్తు రావడం లేదు. అయినా చెయ్యి లాగేస్తోంది, వెతకలేకపోతున్నా. నా వల్ల కాదే.” అన్నాడు గోపాలం ఏడుపు గొంతేసుకుని.
“అవును లెండి!! అంత జ్ఞాపకశక్తి వుంటే, ఏ ‘కలెక్టరో’ అయ్యేవారు. దేనికైనా అదృష్టం వుండాలి. నా రాత ఇలా వుంటే ఏమిచేస్తాం?, అందరిలో తలెత్తుకోకుండా చేసారు.” అంటూ కోపంగా ఫోన్ పెట్టేసింది రాధ.
గోపాలానికి ఏమీ చెయ్యాలో అర్ధంకాలా. ‘ఇది తన తెలివితేటలకే పరీక్ష. ఎలాగైనా రాధకి అడిగిన చీరలు చేరాలి. రేపు పెళ్లిలో అందరి ముందు రాధ నుంచీ ఎదురయ్యే అపాయం నుంచీ తను ఎలాగైనా ఉపాయంగా తప్పించుకోవాలి’ అనుకున్నాడు.
అక్కడ పెళ్లివారి ఇంట్లో పనుల్లో హడావిడిగా వున్న రాధను వాళ్ళ నాన్న “రాధీ! ఒకసారి ఇలా రామ్మా!! నీకు ట్రక్‌లో పెద్ద బీరువా వచ్చిందే. నువ్వు సంతకం పెడితే గాని దింపడంట.” అని అరిచాడు.
అంతే!! ఆ అరుపు విని రాధతో పాటు అందరూ ‘బీరువా రావడం ఏమిటి? ఎవరు పంపారో?’ అనుకుంటూ బయటకు పరిగెత్తుకుని వచ్చారు.
తన ఇంట్లో వుండవలసిన బట్టల బీరువా, అలా ట్రక్‌లో చూసేసరికి రాధకు ఏమీ అర్థం కాలా.
“అమ్మా!! ఈ బొకే గూడా మీకే,” అంటూ బీరువా తెచ్చిన అతను రాధ చేతిలో బొకే పెట్టాడు.
బొకేకి ఒక చిన్న కార్డు, దాని మీద – ‘ఎవరికి నచ్చిన చీర వాళ్ళు కట్టుకోండి. ప్రేమతో, గోపాలం.’ అని వుంది.
అది చదివిన రాధ నోట మాట రాక వుండిపోయింది.

నాపేరు పద్మ. నేను ఆంధ్రా యూనివర్శిటీ నుంచి ఎం.ఎ. చేశాను.
కథలు వినడం, చదవడం ఇష్టం.
ఆ క్రమంలో కథలు రాయగలనని అనిపించి ఈ మధ్యనే మొదలు పెట్టాను.