సంచికలో తాజాగా

డా. ఆచార్య ఫణీంద్ర Articles 26

డా. ఆచార్య ఫణీంద్ర తెలుగు కవి, సాహిత్య విమర్శకుడు, పరిశోధకుడు. వృత్తిరీత్యా శాస్త్రవేత్త. మెకానికల్ ఇంజనీరింగ్ లో పట్టభద్రుడు. తెలుగులో డాక్టరేట్ డిగ్రీని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి "19వ శతాబ్దంలో తెలుగు కవిత్వం" అనే విషయంపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించి సాధించారు. ముకుంద శతకం, పద్య ప్రసూనాలు, ముద్దుగుమ్మ, మాస్కో స్మృతులు, వరాహ శతకం, తెలంగాణ మహోదయం వంటి పద్యకవితా గ్రంథాలను రచించి మంచి పద్యకవిగా గుర్తింపు పొందారు. తెలుగు సాహిత్యంలో "మాస్కో స్మృతులు" పేరిట 'తొలి సమగ్ర విదేశ యాత్రా పద్య కావ్యా'న్ని రచించారు. తెలుగు వచన కవిత్వ సాహిత్యంలో "ఏక వాక్య కవితల" ప్రక్రియకు ఆద్యులు. ఆయన రచించిన తొలి ఏక వాక్య కవితల గ్రంథం "Single Sentence Delights" పేరిట ఆంగ్లంలోకి అనువదించబడింది.

ఆయన అనేక అవార్డులు, గౌరవాలను ప్రభుత్వం, ఇతర సాంస్కృతిక సంస్థల నుండి పొందారు. ప్రధానంగా - 'వానమామలై వరదాచార్య' స్మారక పురస్కారం, 'దివాకర్ల వేంకటావధాని' స్మారక పురస్కారం, 'పైడిపాటి సుబ్బరామశాస్త్రి' స్మారక పురస్కారం, 'ఆచార్య తిరుమల' స్మారక పురస్కారం, 'బోయినపల్లి వేంకట రామారావు' స్మారక పురస్కారం, "రంజని - విశ్వనాథ" పురస్కారం, 'సిలికానాంధ్ర' గేయ కవితా పురస్కారం, మూడు సార్లు విజయవాడ 'ఎక్స్ రే' పురస్కారాలు, 'కమలాకర ఛారిటబుల్ ట్రస్ట్' నుండి "వైజ్ఞానిక రత్న" పురస్కారం,  పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వ 'ఉగాది' సత్కారాలు పేర్కొనదగినవి. ఆయన 2012లో తిరుపతిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలలోనూ, 2014 లో అమెరికాలో, అట్లాంటాలో జరిగిన "నాటా" తెలుగు సభలలోనూ గౌరవింపబడ్డారు. ఆయన హైదరాబాదులో వి.ఎల్.ఎస్. లిటెరరీ అండ్ సైంటిఫిక్ ఫౌండేషన్ నుండి "పద్య కళా ప్రవీణ" బిరుదుని పొందారు. తూర్పుగోదావరి జిల్లా, ఏలూరు లోని నవ్య సాహిత్య మండలి నుండి "కవి దిగ్గజ" బిరుదుని పొందారు. హైదరాబాదులోని నవ్య సాహితీ సమితి నుండి "ఏకవాక్య కవితా పితామహ" పురస్కారాన్ని పొందారు. ఆయన ప్రస్తుతం "యువభారతి" సాహిత్య సంస్థకు అధ్యక్షులుగా, "నవ్య సాహితీ సమితి"కి అధ్యక్షులుగానూ, "నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం" కు ప్రధాన కార్యదర్శిగానూ ఉన్నారు. ఆయన ఆంధ్ర పద్య కవితా సదస్సు యొక్క పత్రిక "సాహితీ కౌముది" కి పదేళ్ళపాటు సహసంపాదకులుగా వ్యవహరించారు. ఆయనకు 2013 సంవత్సరానికి గాను తెలుగు విశ్వవిద్యాలయం వారు 'పద్య కవిత్వం'లో "కీర్తి పురస్కారం" ప్రదానం చేసారు. 2017 లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన "ప్రపంచ తెలుగు మహాసభల"లో డా. ఆచార్య ఫణీంద్ర "పద్య కవి సమ్మేళన" అధ్యక్షులుగా వ్యవహరించి సత్కరించబడ్డారు.

All rights reserved - Sanchika®

error: Content is protected !!