[కస్తూరి మురళీకృష్ణ అందిస్తున్న ‘చరిత్ర విశ్లేషణ – అంబేద్కర్ దృక్కోణం’ అనే వ్యాసపరంపర.]


“The origin of Untouchability lies buried in a dead past which nobody knows. To make it alive is like an attempt to reclaim to history a city which has been dead since ages past and present it as it was in its original condition. It cannot but be that imagination and hypothesis should play a large part in such a work.” (- Preface to the book ‘Untouchables’)
చరిత్ర విశ్లేషణలో డా. అంబేద్కర్ దృష్టి ప్రధానంగా, భారతీయ సమాజంలో అంటరానివారిగా గుర్తింపు పొంది, సమాజం అంచులలో అతి దుర్భరమైన పరిస్థితులలో జీవిస్తున్న వారి గురించిన సత్యాలను ఆవిష్కరించటం. చరిత్రకు సంబంధించిన ఇతర అంశాల లాగా అంబేద్కర్ ఆవిష్కరించాలనుకున్న చరిత్రకు ఆధారాలు లభించవు, శాసనాలు దొరకవు. నాణేలు, తాళపత్రాలు లభిస్తే సరిపోదు. “The present attempt to explain the origin of Untouchability is not the same as writing history from texts which speak with certainty.”
చరిత్ర రచనల లాగా కచ్చితమైన ఆధారాలు లభించే వీలు లేని చరిత్రను రచిస్తున్నాడు తాను అన్న విషయంలో సంపూర్ణమైన అవగాహన ఉంది అంబేద్కర్‌కు. అందుకే ‘imagination and hypothesis should play a large part’ అని స్పష్టంగా సూచించారు. ఊహ, పరికల్పనల పైన ఆధారపడకపోతే అంటరానితనం చరిత్రను రచించటం కుదరదు. ఈ సందర్భంలోనే చరిత్ర రచనలో అంబేద్కర్ పద్ధతి, దృక్కోణాలు స్పష్టంగా తెలుస్తాయి.
ఎక్కడయితే శాసనాలు, నాణేలు, చరిత్ర కథనాలు అసలయిన విషయాన్ని చెప్పవో, అక్కడ ఊహ ద్వారా, పరికల్పన ద్వారా విషయన్ని ఊహించవచ్చు. ఆ ఊహ ప్రాతిపదికగా పరికల్పన చేయవచ్చు. విమర్శకులు ఇది ‘ఊహ’ అని కొట్టివేయకుండా, ఊహ కాబట్టి ఈ ప్రతిపాదనలు స్వీకరించటం కుదరదని వదిలివేయకుండా, ఆ ప్రతిపాదనలను విశ్లేషించాలి. కాబట్టి ఒక ప్రాతిపదిక ‘ఊహ’ ఆధారంగా రూపొందినదయినా, అది విషయాలను సంతృప్తికరంగా విశ్లేషిస్తున్నదా? లేదా? వివరిస్తున్నదా లేదా, ఇంతకన్నా సంతృప్తికరంగా వివరించే ప్రతిపాదన ఇంకోటి ఉన్నదా? అన్న కోణాల ఆధారంగా విశ్లేషించాలి తప్ప, ఈ ప్రతిపాదనకు ‘ఊహ’ ఆధారం కాబట్టి ఇది పనికిరానిది అని నిర్ధారించకూడదు అన్నది అంబేద్కర్ దృష్టి.
భారతీయ సమాజంలో అంటరానితనం గురించి ప్రత్యక్ష చారిత్రక ఆధారాలు లభించటం కష్టం. కాబట్టి ప్రాచీన సాహిత్యం, కావ్యాల ఆధారంగా, అవి చెప్పకుండా దాచిన విషయాలను గ్రహించి, ఊహించి, వాటి ఆధారంగా చరిత్రను reconstruct చేయవచ్చునన్నది అంబేద్కర్ విశ్వాసం. ఆయన అలానే చరిత్రకు సంబంధించిన ప్రతిపాదనలు చేశారు. సురవరం ప్రతాపరెడ్డి ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’లో వ్యక్తపరిచిన అభిప్రాయం అంబేద్కర్ ప్రతిపాదనను సమర్థిస్తున్నట్లుంటుంది.
“రాజుల రాజ్యాల చరిత్ర వ్రాయుట అంత కష్టముకాదు. కాని, సాంఘిక చరిత్ర వ్రాయుట కష్టము. దీని కాధారములు తక్కువ. తెనుగు సారస్వతము, శాసనములు, స్థానిక చరిత్రలు (కైఫీయత్తులు), విదేశీజనులు చూచి వ్రాసిన వ్రాతలు, శిల్పములు, చిత్తరువులు, నాణెములు, సామెతలు, ఇతర వాఙ్మయములలోని సూచనలు, దానపత్రములు, సుద్దులు, జంగము కథలు, పాటలు, చాటువులు, పురావస్తు సంచయములు (Collections) – ఇవి సాంఘిక చరిత్రకు పనికివచ్చు సాధనములు.”
అయితే సురవరం ప్రతాపరెడ్డి రాయదలచుకున్న సాంఘిక చరిత్రకు ఇవి పనికివస్తాయి కానీ, ఇవేవీ అంబేద్కర్ రాయదలచుకున్న అంటరానివారి చరిత్రకు అంతగా సహాయపడవు. కానీ ఇందులో, పైన చెప్పిన అంశాల ద్వారా చెప్పని అంశాలను ఊహించి, అంటరానివారి చరిత్రను నిర్మించే వీలుంటుంది. అలా నిర్మించిన చరిత్రను ‘ఊహ’ ఆధారంగా నిర్మించిందని పరిశీలించకుండా తిరస్కరించవద్దంటున్నారు అంబేద్కర్. అందుకే తాను రచిస్తున్న చరిత్రను ఆయన లభించిన ఎముకలు, దంతాలు, వంటి వాటిని ఆధారం చేసుకుని అంతరించిన జీవుల ఆకారాన్ని పునర్నిర్మించటం వంటిదని పోల్చి చెప్పారు. అందుకే తాను రాస్తున్నది చరిత్ర అనే కన్నా, అధికంగా ‘కళ’గా భావించవచ్చు అని ప్రకటించారు.
అందుకే ఆయన పవిత్ర గ్రంథాలను కూడా పవిత్ర గ్రంథాలుగా కాక, తన పరిశోధనకు సరిపోయే రిఫరెన్స్ పుస్తకాలుగానే పరిగణిస్తాననీ, వాటిని దైవవాక్కులుగా భావించనని స్పష్టంగా ప్రకటించారు. ఇది అంతకు ముందు ఆయన చెప్పిన చరిత్ర విశ్లేషకులకు ఉండాల్సిన లక్షణాలతో సరిపోతుంది. అపోహలతో, చారిత్రక ఆధారాలను పరిశీలించకూడదు. ‘ఇది భగవద్వాక్యం’ అనుకున్న మరుక్షణం ఆ వాక్యాన్ని ప్రశ్నించటం కుదరదు. కాబట్టి ‘sacred’, ‘profane’ ల నడుమ ఎలాంటి విభేదం చూపకుండా కేవలం సత్యాన్వేషణ దృష్టితోనే ఆయా గ్రంథాలను విశ్లేషించాలంటారు అంబేద్కర్.
ఈ సందర్భంగా, పవిత్ర గ్రంథాల విశ్లేషణలో తన దృష్టికీ, అప్పటికే ప్రచలితంలో ఉన్న అగ్రవర్ణాల చరిత్ర విశ్లేషకులకూ ఉన్న తేడాను స్పష్టంగా విప్పి చెప్పారు. పవిత్ర గ్రంథాలను, పవిత్రంగా, దైవదత్తంగా భావించటం అగ్రవర్ణాల వారికి, ముఖ్యంగా బ్రాహ్మణులకు స్వాభావికం. కానీ తాను బ్రాహ్మణేతర విశ్లేషకుడు కాబట్టి తన దృష్టికీ, వారి దృష్టికీ తేడా తప్పనిసరిగా ఉంటుందని నిర్ద్వంద్వంగా ప్రకటించారు అంబేద్కర్. తనని తాను ‘non-Brahmin scholar’ గా చెప్పుకున్నారు. అంతే కాదు, బ్రాహ్మణ చరిత్ర విశ్లేషకుల దృష్టికీ, బ్రాహ్మణేతర చరిత్ర విశ్లేషకుల దృష్టికీ ఉన్న తేడాలను కూడా ఆయన స్పష్టగా వివరించారు.
బ్రాహ్మణుల దృష్టిలో పవిత్ర గ్రంథాలు ప్రశ్నలకు అతీతం. అవి గౌరవనీయమైనవి. నిత్య పారాయణార్హమైనవి. పైగా ఈ గ్రంథాలను సమర్థించటంలో బ్రాహ్మణుల స్వార్థం కూడా ఉంది. ఆయా పవిత్ర గ్రంథాలు బ్రాహ్మణుల ఆధిక్యతను సమర్థిస్తాయి. అగ్రవర్ణాల ఔన్నత్యాన్ని స్థిరపరుస్తాయి. కాబట్టి ఆయా గ్రంథాలను దైవ వాక్కులుగానో, ఉల్లంఘించ వీలు లేని ఆజ్ఞలు గానో భావించి, ప్రచారం చేయటంలో లాభాలున్నాయి. కానీ బ్రాహ్మణేతరుల దృష్టి ముఖ్యంగా, తరతరాలుగా అణచివేతకు గురవుతున్న వారి దృష్టి మరో రకంగా ఉంటుంది.
“Knowing that what is called the sacred literature contains an abominable social philosophy which is responsible for their social degradation, the non-Brahmin reacts to it in a manner quite opposite to that of the Brahmin. That I should be wanting in respect and reverence for the sacred literature of the Hindus should not surprise anyone if it is borne in mind that I am a non-Brahmin, not even a non-Brahmin but an Untouchable.” (The Essential Writings of Ambedkar, by Valerian Rodrigues)
(ఇంకా ఉంది)
