వలస కూలి నీ బతుకు జాలి
ఎండకు ఎండి, ఆకలికి మండి, నిలిచిపోయెను నీ బ్రతుకు బండి
కరోనా కాటు అయ్యేను నీకు పోటు
పట్టెడన్నం కోసం పొట్ట పగిలే పడిగాపులు
రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులు
కూటి కోసం గుటినొదిలి వలస పక్షుల ఆగని పరుగులు
ప్రాణాలు అరచేతినబెట్టుకొని ఆకలి కేకలతో యుధ్దం చేస్తూ
కంటికైనా కానరాదే, తిండికైనా లేకపాయే
కడుపు నిండకపాయే, గొంతులెండవట్టె సూడు
ఏమి మాయ కాలం వచ్చే, ఎంత భారం మోసుకొచ్చేను…
రహదారి, పట్టాలపై కాలి బాటన నడుచుకుంటూ
ఎంత గోస, ఎంత దు:ఖం, ఎంత దయనీయం
గమ్యం ఎరుగక, తోవ కానరాక
వేల కిలోమీటర్లు కాలినడకన సాగిపోతూ
వలస కూలీ పాదాలు అడుగులతో మారెను తోవ రక్తపు మడుగులా
కడుపులోని బిడ్డను మోస్తూపురిటి నొప్పులను ఓర్చుకుంటూ
బిడ్డను ప్రసవించిన 150 కిలోమీటర్లు రక్తపు అడుగులు వేస్తూ
ఆకలి మంటలతో కుక్క మాంసమర్జించే
అలసి సొలసి నేలకొరికి
భూమాత ఒడిలోన కన్నుమూసి సేదతిరే
ఈ దేశ ముఖచిత్రంపై శాశ్వతమాయే నీ చెరగని ముద్రలు…

సామల ఫణికుమార్ వర్ధమాన కవి. యువ రచయిత. ట్రిపుల్ ఐటి బాసరలో 12వ తరగతి చదువుతున్నారు. ఇప్పటి వరకు 200కి పైగా కవితలు, మూడు పాటలు, రెండు సీసపద్యాలు ఒక శతకం రచించారు. రెండు పుస్తకాలు వెలువరించారు.