Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చిన్నప్రాణం

ఆకలి కడుపుకే కాదు మనసుకీ ఉంటుందనీ, చిరిగిన స్నేహాల్ని పిగిలిపోకుండా కుట్టుకుంటుండాలనీ చెబుతున్నారు శ్రీరామోజు హరగోపాల్ “చిన్నప్రాణం” కవితలో.

కొంచెం నెలవంకను అవతలికి నెట్టు
ఆకాశాన్ని
పాతజ్ఞాపకాలతో అలికిపెట్టిన
చుక్కలు
ముగ్గులకోసం
ఎదురుచూస్తున్నయి

మెరుపుతాళ్ళతో భూమ్మీదికి దిగిన
వానకారుపిల్ల
జతగాడు దొర్కక
కన్నీటిసెలయేళ్ళయింది….
ముట్టుకుంటే మాసిపొయ్యే వన్నెలు.
గుండెల్లో పెట్టుకుంటే
కరిగి నీరైపొయ్యే భ్రమలు

రాతినిచెక్కి నిలబెట్టిన విగ్రహానికి పూజ
రాయసొంటి నిన్ను
ఎన్నేండ్లు ఉలితో చెక్కినా
ఏదే ఎవ్వరడుగరు?
కడుపుకు తిండొక్కటేనా
మనసుకు కూడా ఆకలుంటది
అపుడపుడు చిరిగిన స్నేహాల్ని
పిగిలిపోకుండా
కుట్టుకుంటుండాలె

వాసనలు పట్టి నిన్ను
వెతుక్కుంటది మోహం
దేహందొన్నెతో ఈదులాట
కదిలి,వొదులైపోయిన
రాత్రికీళ్ళను,కీలకాలను
నిద్దురలేపనంతో
నువ్వు వొస్తావుకదా

Exit mobile version