కవి, రచయిత, సీ ఎస్ రాంబాబు రేడియోలో ప్రోగ్రాం ఎక్సెక్యూటివ్ గా పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా రచయిత కే ఎల్ వీ ప్రసాద్ ఆయనతో తన స్నేహానుబంధాన్ని సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు.
స్నే హం ఎప్పుడూ గొప్పదే! ఎంత గొప్పదైనా అన్ని స్నేహాలూ ఒకేలా వుండవు. కలకాలం నిలిచిపోయే స్నేహాలు పునాది స్థాయిలోనే అర్థం అయిపోతాయి. కొన్ని స్నేహాలు తెలియకుండానే జీవితాంతం మనతో కలసి పయనిస్తాయి. కష్టసుఖాలు పంచుకుంటాయి. అందులో అభిమానం ఉంటుంది, ఆత్మీయత ఉంటుంది, ప్రేమ ఉంటుంది, చివరికి విడదీయరాని బంధం అవుతుంది. ఆత్మీయ స్నేహబంధంగా మిగిలిపోతుంది. అలాగే ఊహించని విధంగా కొన్ని స్నేహాలు ఏర్పడతాయి. నిత్యం ఏదోరకంగా సంబంధం కలిగి ఉండడంతో అవి క్రమంగా బలపడి ఆత్మీయ అనుబంధంగా మారుతుంది. ఇక్కడ కులాలు, మతాలూ, ప్రాంతాలూ లెక్కలోకి రావు. ఈ స్నేహాల మధ్య ఆర్థిక అంతస్తులు అసలు అడ్డు రావు. ఒకరిపట్ల మరొకరికి ఎనలేని గౌరవం ఏర్పడుతుంది. ఇది కేవలం స్నేహితుల మధ్య కావచ్చు, స్నేహితుల కుటుంబాల మధ్య కావచ్చు. ఇలాంటి స్నేహాల వల్ల లాభనష్టాలు ఆలోచించే అవసరం రాదు. ఆస్తులు – అంతస్తుల గురించి అసలు సమస్య ఉండదు, కేవలం మానసిక ఆనందం, తెలియని ఒకరకమైన తృప్తి మిగిలిపోతుంది. ఆనందమయ జీవితానికి ఇలాంటి స్నేహాలు ఖచ్చితంగా పునాదిరాళ్లుగా నిలబడతాయి.


శ్రీ సి.ఎస్. రాంబాబు, అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్ (రిటైర్డ్), ఆకాశవాణి, హైదరాబాద్
ఈ స్నేహాలు, బాల్యానికి సంబందించినవి, ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల, కళాశాల, లేదా వృత్తిపరంగా, ప్రవృత్తిపరంగా, ప్రయాణాలలో ఇలా ఏవిధంగానైనా స్నేహితులు కావచ్చు. ఒకే రకమైన ఆలోచనలు, అభిరుచులు, కోరికలు, స్నేహాన్ని మరింత పటిష్టంగా కొనసాగిస్తాయి. స్నేహితులు అనుకున్నవారందరూ చివరివరకూ స్నేహితులుగా కొనసాగలేరు. చివరి కంటూ కొద్దిమంది మాత్రమే మిగులుతారు.
నాకు సంబంధించి ఎవరైనా ఒకసారి పరిచయమైతే, ఆ వ్యక్తి, ఆయన వ్యక్తిత్వం నాకు బాగా నచ్చితే, ఆ పరిచయం ఖచ్చితంగా స్నేహంగా రూపాంతరం చెంది, అది ఎప్పటికీ విడదీయరాని బంధం అయిపోతుంది. అలాంటివాళ్ళ విషయంలో మరో రెండో ఆలోచన నాకు ఉండదు. వృత్తిపరంగానూ ప్రవృత్తిపరంగానూ నాకు చాలామంది స్నేహితులు వున్నారు. ఆధునిక సమాచార సాధనం, మొబైల్ ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉండడం వల్ల ప్రతి దినం ఏదో ఒకసమయంలో ఆత్మీయంగా పలకరించుకునే వెసులుబాటు ఉండడం వల్ల ఏదో రూపంలో మిత్రులతో సంబంధాలు కలిగి వుంటాను. అలాంటి వాటిల్లో ప్రతి రోజు వాట్సప్‌లో ‘గుడ్ మార్కింగ్’ చెప్పుకోవడం. కొంతమందికి ఇది ఇష్టం లేకపోవచ్చు, అది వేరే విషయం. అలా, ప్రవృత్తిపరంగా నాకు చాలా మంది మిత్రులు వున్నారు. అందులో ఆకాశవాణికి సంబంధించి అత్యంత ఆప్తులైన మిత్రుల్లో శ్రీ చెన్నూరి సీతా రాంబాబు ఒకరు. ఈయన సి. ఎస్. రాంబాబుగా ప్రసిద్ధులు. నిజానికి నాకు ఆకాశవాణితో సంబంధం 1975 నుండి. విద్యార్థిగా యువవాణి కార్యక్రమాలలో పాల్గొనేవాడిని. దానికి ముఖ్య కారకుడు మిత్రుడు సత్యవోలు సుందరసాయి. ఆ విధంగా పాలకుర్తి మధుసూదన రావుగారు, మంత్రవాది సుధాకర రావు, రాఘవులు, భీమయ్య గారు మొదలైన వారు పరిచయం అయినారు. నా ఉద్యోగ పర్వంలో ఆకాశవాణి వరంగల్, ఎఫ్.ఎం. కేంద్రం 17 ఫిబ్రవరి 1990 నాడు ఏర్పడిన తర్వాత, వరంగల్ రేడియోతో నాకు సంబంధాలు ఏర్పడ్డాయి. అప్పుడు నేను మహబూబాబాద్‌లో పనిచేస్తున్నాను. రేడియో ఇంటర్వ్యూలో పాల్గొనడానికి వరంగల్ వస్తుండేవాడిని. అలా 1999 లో నాకు శ్రీ రాంబాబు పరిచయం చేయబడ్డారు. అప్పటికే మిత్రుడు శ్రీ మడిపెల్లి దక్షిణామూర్తి, వద్దిరాజు వెంకటరామారావు, అనీల్ ప్రసాద్, పెద్దలు వెంకటేశ్వర్లు గారు, చలపతి రావు గారు, శ్రీనివాస రెడ్డి, మంత్రవాది సుధాకర్ వంటివారు నాకు పరిచయమై వున్నారు.


శ్రీమతి & శ్రీ సి.ఎస్. రాంబాబు, హైదరాబాద్
అందరిలోనూ శ్రీ రాంబాబు ప్రత్యేకంగా ఉండేవారు. నిత్యం చెరగని నవ్వు, చక్కని మేనిఛాయ, నాకు మాదిరిగానే మిలమిల మెరిసే బాల్డ్ హెడ్, ఎప్పుడూ హడావిడిగా ఉంటూ పనిలో నిమగ్నమై ఉండేవాడు. అదే సమయంలో ఆయనతో పాటు శ్రీమతి సరోజా నిర్మలగారు కూడా పనిచేసినట్టు గుర్తు. తరచుగా నేను రేడియో కేంద్రానికి వెళ్లడం వల్ల రాంబాబు గారితో నాకు బాగా పరిచయం ఏర్పడింది. ఆరోగ్యానికి సంబందించిన కార్యక్రమాలు ఆయన చూస్తుండడం వల్ల మూడు నెలలకోసారి, దంత సంరక్షణకు సంబంధించి ఇంటర్వ్యూలు చేస్తుండేవారు. ఇంటర్వ్యూ చేయడంలో కూడా ఆయనలో ప్రత్యేకత ఉండేది. ఇంటర్వ్యూ చేసేముందు, అంశాన్ని కూలంకుషంగా చర్చించి తన డైరీలో కొన్ని ముఖ్యమైన అంశాలు రాసుకుని, చక్కని పరిపూర్ణమైన సమాధానాలు రాబట్టేవారు. ఆయన హయాంలో ఓ.బి. (outside broadcasting) కార్యక్రమాలు ఎక్కువగా రికార్డు చేసేవారు.
ఆయన ఆఫీస్ క్వార్టర్స్ లోనే ఉండడం వల్ల అప్పుడప్పుడూ అక్కడికి కాఫీ కోసం వెళ్ళేవాళ్ళం. నాకు తెలిసి రాంబాబు – ఆర్. వెంకటేశ్వర్లు, పాలకుర్తి మధుసూదన రావు, ఆదిత్య ప్రసాద్ గార్లు సంచాలకులుగా వున్న కాలంలో తన సేవలు అందించారు. అయితే శ్రీ రాంబాబు విశ్వరూపం శీ మంగళగిరి ఆదిత్యప్రసాద్ గారు సంచాలకులుగా పనిచేసిన కాలంలో బయట పడింది. ఈ జంట చేసిన వినూత్నమైన కార్యక్రమాలు వరంగల్ ప్రాంత రేడియో శ్రోతల హృదయాల్లో స్థిరంగా నిలిచిపోయి వున్నాయి. శ్రీ ఆదిత్య ప్రసాద్ గారికి మనసులో ఒక ఆలోచన మెదిలితే దానిని శ్రీ రాంబాబు కార్యరూపంలోకి తెచ్చేవారు, ఎంతటి క్లిష్టమైన కార్యక్రమం అయినా ఆ పని చేసి చూపించేవారు, ఆ నమ్మకంతోనే ఆదిత్య ప్రసాద్ గారు, ప్రతీది రాంబాబుకే అప్పగించి చేయించేవారు. రాంబాబు ఆ పనులన్నీ సంతోషంగానే చేశారు తప్ప పనిభారంగా ఎప్పుడూ తలచలేదు.


శ్రీ మంగళ గిరి ఆదిత్య ప్రసాద్, స్టేషన్ డైరెక్టర్ (రిటైర్డ్), ఆకాశవాణి-వరంగల్
శ్రీ రాంబాబులో కవి, కథా రచయిత వున్నారు. అయితే ఆయన వరంగల్ – రేడియో కేంద్రంలో పని చేసినంత కాలం, ఆయనలోని కవి మాకు కనిపించలేదు. అప్పుడప్పుడూ కథలు పత్రికల్లో వస్తుండేవి. చదవమని నాకు చెడుతుండేవారు. చదివి నా అభిప్రాయం చెబుతుండేవాడిని. కానీ వరంగల్‌లో పని చేసినంత కాలం రాయవలసినన్ని కథలు ఆయన రాయలేదు. ఆఫీసు పనికే ఎక్కువ సమయం కేటాయించేవాడు. కథలు రాయమని నేను వెంటపడి విసిగిస్తుండేవాడిని. ఎన్ని మాటలు అన్నా నవ్వి ఊరుకునేవాడు. రాత్రి తొమ్మిది అయినా స్టూడియోలో కూర్చుని ఏదో పని చేసుకుంటుండేవాడు. అలా ప్రతి క్షణం ఆఫీసు పనికే ఉపయోగించేవారు.


దక్షిణామూర్తి గారితో, రచయిత, రాంబాబు
2005వ సంవత్సరంలో నేను పదోన్నతి మీద జనగాం నుండి, కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి బదిలీ కావడం, రాంబాబు గారు, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రానికి బదిలీ కావడమూ జరిగింది. రాంబాబు హైదరాబాద్‌కు వెళ్లిన తర్వాత, ఆయన వృత్తిపరంగానే కాకుండా రచనా వ్యాసంగంలో కూడా ఎంతో మార్పు వచ్చింది. కథలు రాయడం ఎక్కువైంది, పత్రికలతో, పత్రికా సంపాదకులతో, రచయితలతో, రచయిత్రులలో మంచి పరిచయాలు ఏర్పడ్డాయి. ఆఫీసులో ఆయన ఒకసారి నాటక విభాగం మరోసారి సాహిత్యవిభాగం చూసే అవకాశం కలిగింది. ఇది ఆయనలో మరింత ఉత్సాహాన్ని రేకెత్తించి రచనా వ్యాసంగాన్ని మరింతగా ప్రేరేపించింది. తర్వాత ఒక కథా సంపుటిని తీసుకువచ్చే అవకాశాన్ని కలిగించింది. నవ్య వారపత్రిక ద్వారా జగన్నాథ శర్మ గారితోనూ, పాలపిట్ట మాసపత్రిక ద్వారా శ్రీ గుడిపాటి పరిచయమై, కథలతో పాటు, ఇంటర్వ్యూలు, పుస్తక సమీక్షలు, చేసే అవకాశాన్ని పొందారు. కొన్ని కథలకు వివిధ పత్రికల ద్వారా బహుమతులు కూడా పొందారు. రేడియోలో సీనియర్ కవులను, రచయితలను, వారి రచనలను ఇంటర్వ్యూల ద్వారా పరిచయం చేశారు. అలా ఇప్పుడు రాంబాబు అంటే తెలియని కవులు రచయితలు, నటులు బహు అరుదు.
సాహిత్యపరంగా శ్రీ రాంబాబు రెండవ దశ కవిత్వం. ఈ దశ ఎప్పటి నుంచి అన్నది ఇదమిత్థంగా నేను విభజన రేఖ గీయలేను గానీ, కథల వేగం తగ్గించి కవిత్వం వెంట పడ్డాడాయన. అందులోనూ సఫలీకృతుడైనాడు. ఈ రోజున మంచి కవిత్వం రాస్తున్న కవుల్లో ఆయన కూడా ఒకడిగా చేరిపోయినాడు. ఆయన కవిత్వం కూడా పుస్తక రూపంలో త్వరలో రానున్నది. ఇది ఆహ్వానించదగ్గ విషయం. వయసు రీత్యా వచ్చిన మార్పువల్లనో ఏమో గానీ శ్రీ షిరిడీ సాయిబాబా మీద కూడా ఒక పుస్తకం తీసుకొచ్చారు. ఇది ఆయన భక్తికి సంబంధించిన విషయం.


సి.ఎస్. రాంబాబు రచన నివేదన సాయిలహరి


సి.ఎస్. ఆర్. కథలు పసిడి మనసులు
రాంబాబు గారిని మరో విషయంలో నేను జీవితాంతమూ గుర్తుంచుకోవాలి. మా అమ్మాయి నీహార కానేటి, ఈరోజున ఆకాశవాణిలో ప్రోగ్రాం ఎక్సికుటివ్గా (program executive -PEx) పనిచేయడానికి పరోక్షంగా రాంబాబు గారు కారణం. అసలు మిత్రుడు శ్రీ దక్షిణామూర్తి ఒకసారి మా పాప దగ్గర “నీ వాయిస్ బాగుందమ్మా” అన్నారు. అది మా అమ్మాయి మనసులో ఉండిపోయింది. ఈ నేపథ్యంలో మా పాప హైదరాబాద్‌లో డిగ్రీ చేస్తున్న సమయంలో, ‘ఆర్.జె’ (రేడియో జాకీ)గా పార్టీ టైం చేస్తానని అడిగింది.


ఆకాశవాణి హైదరాబాద్ స్టుడియోలో శ్రీ దక్షిణామూర్తి, రచయిత,శ్రీ రాంబాబు


డా. ప్రసాద్ కె.ఎల్.వి. పుస్తకావిష్కరణ సందర్భంగా ఆకాశవాణి మిత్రులతో రచయిత, రాంబాబు


శ్రీ నక్కా సుధాకరరావు (ఆకాశవాణి, హైదరాబాద్), శ్రీ తోట సాంబశివరావు గార్లతో….
అప్పటికి రాంబాబు గారు హైదరాబాద్ లోనే ఉండడం వల్ల దానికి కావలసిన ఫార్మాలిటీస్ పూర్తి చేయమని ఆయనకు చెప్పాను. అలా ఆయన సహకారంతో మా పాప ఆకాశవాణి -హైదరాబాద్, రెయిన్బో ఛానల్ లో రేడియో జాకీగా సమర్ధవంతంగా పనిచేసింది. ఈ అనుభవాన్ని దృష్టిలోవుంచుకుని పరీక్ష/ఇంటర్వ్యూ లో నెగ్గి ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ అయింది. అలా దక్షిణామూర్తి, రాంబాబు గార్లు నాకు ఎంతగానో సహకరించారు. ఈనాటికీ చాలామంది వరంగల్ రేడియో శ్రోతలు ఈ ఇద్దరి గురించి అడుగుతుంటారంటే, ప్రజావాహినిలో వృత్తిపరంగా వీరు ఎంతగా కలసిపోయారో అర్థం చేసుకోవచ్చు. ఉద్యోగం కేవలం జీతం కోసం చేసీ వాళ్ళే ఎక్కువ శాతం మంది వుంటారు. కానీ రాంబాబు దీనికి భిన్నం. వృత్తిని దైవంగా భావించడమే కాక అందులో ఆనందాన్ని ఆస్వాదించగల గొప్పగుణం, సహృదయత ఆయనకు అబ్బాయి. ఆయన భవిష్యత్ జీవితాన్ని రచనా వ్యాసంగం ద్వారా ఆనందంగా మలుచుకోగలడనే నమ్మకం నాకుంది. మిత్రుడు సి. ఎస్. రాంబాబుకు అభినందనలు. ఆయన రిటైర్మెంట్ జీవితం మరింత సృజనాత్మకంగా, ఆనందంగా సాగిపోవాలని ఆశిస్తున్నాను.

వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.
18 Comments
డా కె.ఎల్.వి.ప్రసాద్
ఆకాశవాణి వరంగల్ నుండి హైదరాబాద్‌కు బదిలీ ఐన సందర్భంగా జరిగిన వీడ్కోలు సమావేశంలో నేను పాల్గొనే అవకాశం వచ్చింది.అప్పుడు నేన్ ఆయనను శాకుంతలం లోని శకుంతల చెలులతో పోల్చి చెప్పిన వారి పేర్లు అనసూయ,ప్రియంవద లు రాంబాబు కూడా అనసూయి ప్రియంవదుడే.
మీరు రాసిన రాంబాబు గురించిన సంచిక మీకూ వారికున్న మైత్రినే కాక వారి ప్రవృత్తిని చక్కగా పరిచయం చేస్తున్నది.
–రామశాస్త్రి
డా కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలండీ
శాస్త్రి గారు.
డా కె.ఎల్.వి.ప్రసాద్
చిరునవ్వులు చిందించే రాంబాబు గారి గురించి చక్కగా తెలిపారు. వృత్తినే దైవంగా భావించే రాంబాబు గారి శేష జీవితం ఆనందకరంగా సాగాలని కోరుతున్నా
—–జి.శ్రీనివాసాచారి
కాజీపేట.
డా కె.ఎల్.వి.ప్రసాద్
చారి గారూ
ధన్యవాదాలండీ.
Sagar
వృత్తిని అంకితబావంతో చేసి భవిష్యతరాలకు మార్గదర్శకులుగా నిలిచిన పెద్దలు శ్రీ రాంబాబు గారికి అభినందనలు మరియు పదవీ విరమణానంతరం వారి జీవితం ఆయురారోగ్యాలతో సాగిపోవాలని కోరుకుంటున్నాను సర్. మంచి నిబద్దత కలిగిన రాంబాబు గారిని పరిచయం చేసిన మీకు ధన్యవాదములు.
డా కె.ఎల్.వి.ప్రసాద్
సాగర్
నీ స్పందన కు ధన్యవాదాలండీ.
Shyam kumar chagal . MA astrology. Hyd
రచయిత గారు చెప్పినట్లుగా జీవితం గురించే కాకుండా చేసే ఉద్యోగానికి న్యాయం చేసే వారు చాలా అరుదు. పనిచేస్తున్న సంస్థను అందులో తను చేసే ఉద్యోగాన్ని ఆనందంతో అనుభవించే వా రే ఉద్యోగంలో సమర్థవంతంగా పనిచేసి ఉన్నత శిఖరాలను చేరుకుంటారని మన రాంబాబు గారి వృత్తాంతం తెలియజేస్తుంది.
రాంబాబు గారి కవితా ,రచన, వ్యాసంగ ప్రస్థానంలో డాక్టర్ కే ఎల్ వి పాత్ర కచ్చితంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. రౌతు కొద్దీ గుర్రం అన్నట్లుగా ఆదిత్య గారు కూడా గొప్ప వారే అనిపిస్తుంది.
వీరందరూ కూడా సంస్థ ను ముందుకు నడిపించడంలో గొప్ప పాత్ర వహించి పదవీ బాధ్యతల నుంచి విరమణ పొందడం అన్నది విశేషం. వీరి సేవలను మర్చిపోకుండా సమయాన సందర్భంగా సంచిక పత్రిక ద్వారా మన అందరికీ పరిచయం చేసిన డాక్టర్ కె ఎల్ వి ప్రసాద్ గారికి నా కృతజ్ఞతలు.
డా కె.ఎల్.వి.ప్రసాద్
నీ విశ్లేషణ
చాలాబాగుంది మిత్రమా నీకు
హృదయపూర్వక ధన్యవాదాలు.
డా కె.ఎల్.వి.ప్రసాద్
చాలా బాగుంది సార్. మీరు చెబుతుంటే అవి అన్నీ మనసులో గింగురుమంటున్నాయి. ఆ ఇద్దరితో నాకు కూడా మంచి సంబంధాలు ఉండేవి. ఆదిత్య ప్రసాద్ గారు వచ్చినాక రేడియో కార్యక్రమాలు ఆస్థాన విద్వాంసుల నుంచి బయటపడి ప్రజలకి చేరువయ్యాయి. నమస్తే సార్.
—ప్రొ.భక్తవత్సల రెడ్డి
చిత్తూరు.
డా కె.ఎల్.వి.ప్రసాద్
సర్
మీ స్పందనకు ధన్యవాదాలు.
Jhansi koppisetty
సి. యస్. రాంబాబు గారికి ఉద్యోగ విరమణ సందర్భంగా శుభాభినందనలు. వారి ప్రోత్సాహం కారణంగానే నేనూ AIR లో ఒక కథ చదివి వినిపించగలిగే అదృష్టం కలిగింది. అదొక మరపురాని అనుభూతి. రాంబాబుగారు చిరునవ్వుకు ప్రతిరూపం… అదీ పసిడి వన్నెల చిరునవ్వు
. ఈ సందర్భంగా డాక్టరు ప్రసాద్ గారు వారి గురించి రాయటం చాలా ఆనందంగా వుంది…
డా కె.ఎల్.వి.ప్రసాద్
ఝాన్సీ గారూ
ధన్యవాదాలండీ
Bhujanga rao
చిరునవ్వుల మృదుభాశి శ్రీ సి యెస్ రాంబాబు గారు ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా ఆకాశవాణి లో పదవి విరమణ చేసిన సందర్భంలో వారి స్నేహబంధాన్ని మరియు వారి సేవల గురించి ఈ సంచిక ద్వారా చక్కగా వివరించారు ధన్యవాదములు సర్.రాంబాబు గారికి ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు మరియు వారి శేష జీవితం ఆనందంగా సాగాలని కోరుకుంటున్నాము
డా కె.ఎల్.వి.ప్రసాద్
వారు
అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్ గా
పదవీవిరమణ చేసారండీ.
డా కె.ఎల్.వి.ప్రసాద్
మీ స్నేహ బంధం…గురించి
రాంబాబు గారు మిగతా ఆకాశవాణి మిత్రులతో ఉన్న అనుబంధాన్ని చక్కగా ఆవిష్కరించారు…
—-దాస్యం సేనాధిపతి
కరీంనగర్.
డా కె.ఎల్.వి.ప్రసాద్
స్పందనకు ధన్యవాదాలండీ
Naccaw Sudhacaraw Rau, Programme Executive AIR Hyderabad.
Dr ji good morning
. Your exhaustive and comprehensive article on CS Rambu is almost a biography in nutshell.
The whys ,whens and hows of friendship and fellowship and the psychological, social and spiritual aspects they offer are nicely explained.
The effable ,affable and fascinating characteristic nature and personality of CS Rambabu is beautifully expressed in the words”Chirunavvula, mrudhu bhashi,chakkani meni chaya, hadas vudi….
The contributions and services of CS Rambabu for AIR Warangal during his tenure under MS Aditya Prasad and the collective and team spirit of the Trinity of AIR Warangal..M Dakshina Murthy,Anil Prasad …a great recognition.
Dr ji, you have also acknowledged the other b casters like Srinivasreddy,Mantravadi Sudhakar, SarojaNirmala , Chalapathy Rao, Bheemaiah ,Sai Prasad et al … and their services.
The photos with CS, Sambasiva Rao and other b casters,books published, released and your gracious association with all these speak for your gracious love and commitment for b casting, literature and culture.
The entry of your daughter into AIR under the guidance and support of Dakshina Murthy and CS and later entry as a Pex is a gratitudinal acknowledgement of their guidence and mentorship.
The evolution of CS from Short stories to poetry to book review to introducing all the stalwarts of Telugu literature to the public through AIR Hyd is rightly summed up in letter and spirit.
As a veteran b caster , writer,poet, and literateur and as a columnist, patron and promoter of Telugu language and literature Dr KLV Prasad did an amazing job in presenting this article in arresting and awesome fashion. Thank you, Dr ji.
డా కె.ఎల్.వి.ప్రసాద్
Sir
Your analysis on my article is great.
Iam so grateful to you sir
Thank you somuch sir.