[‘చిట్టితల్లి’ అనే మకుటంతో శ్రీమతి వి. నాగజ్యోతి ఆటవెలదులలో బాలబాలికల కోసం అందిస్తున్న పద్య శతకం.]


1.
పామరుండు వెలుగు పండితుల నడుమ
విరుల తావి యబ్బు గరికవలెనె
విజ్ఞు డెవడొ తెలియు విజ్ఞత పరికింప
చెప్పుచుంటి వినుము! చిట్టితల్లి!
~
2.
తాను చెప్పు కొనునె? తన గొప్ప వృక్షమ్ము
చేసిచూపు, బోధ చేరబోదొరులకు
సహనమున్న చోట సఫలత తథ్యమ్ము
చెప్పుచుంటి వినుము! చిట్టితల్లి!
~
3.
తత్వ మఱుక పడునె తనకు తాను చదువ
విదుడు విశద పఱుచ విదిత మౌను
మనసు నిలిపినంత మర్మ మంతదెలియు
చెప్పుచుంటి వినుము! చిట్టితల్లి!
~
4.
గురువు లెన్నడు తమ గొప్ప చెప్పుకొనరు
యెఱుక గన్న శిష్యు లెఱుక పఱచు
దివ్వె దాచ వచ్చు దీప్తి నాప తరమ?
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
5.
త్యాగ మెంత తనది తల్లి తెలుపకున్న
దేహజన్ము లరసి తెలియచేయు
నరయగలవు నీవు నమ్మవై నప్పుడె
చెప్పుచుంటి వినుము! చిట్టితల్లి!
~
6
కరుణ రసము చిందు కడకంటి చూపుల
నరయ గానె తొలగు నలమటంత
యట్టి గురువు మాట హద్దు మీరకెపుడు
చెప్పుచుంటి వినుము! చిట్టితల్లి!
~
7.
శక్తి యున్న గాని యుక్తితో మెలగుచు
శాంతి పథము నెంచి సాగు వారె
వెలుగు నందజేతు రిలలోన మెండుగా!
చెప్పుచుంటి వినుము! చిట్టితల్లి!
~
8.
చిన్న నాటి చెలిమి సిరులు జూడదెపుడు
నెదుగు చున్న కొలది మదిని చేరు
నెలమి దూరమౌను కలిమి లేములుజూడ
చెప్పుచుంటి వినుము! చిట్టితల్లి!
~
9.
గడన చేసి తనదు కార్యమ్ము జేయించి
యదనుచూచి వెనక హానిపఱచు
దుష్టబుద్ధి నెపుడు దూరముంచుటె మేలు
చెప్పుచుంటి వినుము! చిట్టితల్లి!
~
10.
బండలడ్డు పడిన ప్రవహించు నదివోలె
చిక్కు లెన్ని యున్న చెదర వలదు
అడుగు వేసినంత నడుగంటు వెతలన్ని
చెప్పుచుంటి వినుము! చిట్టితల్లి!
(ఇంకా ఉంది)

శ్రీమతి వరికేటి నాగజ్యోతి ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో జన్మించారు. పదవ తరగతి వరకే చదువుకున్న నాగజ్యోతి గారు దక్షిణ భారత హిందీ పరీక్షలలో భాషాప్రవీణ, హిందీ టైపింగ్ పరీక్షలు లోయర్, హైయ్యర్ పాసయ్యారు. వివాహానంతరం ఢిల్లీకి వచ్చి గృహస్థురాలి బాధ్యత స్వీకరించారు. సాహిత్యాభిలాషి. వీరు రాసిన కథలు, కవితలు, పద్యాలు పలు అంతర్జాల పత్రికలలో ప్రచురించబడ్డాయి.
పుస్తక సమీక్షలు కూడా చేస్తూ వుంటారు. ఇన్నేళ్ళ తరువాత కోవిడ్ కాలంలో శ్రీ పూసపాటి గురువుగారు, శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తి గురువుగారి ద్వారా పద్య రచన, ప్రాథమిక వ్యాకరణం నేర్చుకున్నారు. శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తి గురువుగారి సహకారంతో – ఆప్త మిత్రులు శ్రీ ధరణిగారు, సన్నిహితులు, తమ శ్రీవారి ప్రోత్సాహం వలన ‘చిట్టి తల్లి’ పద్య శతకం రాసారు.
గత పదిహేను సంవత్సరాలుగా ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్ నివాసి.
5 Comments
R.S.venkateswaran
పిల్లల గురించి ప్రత్యేకంగా పద్యాలు రాసిన పద్య శతకం మొత్తం ప్రచురిస్తున్నందుకు సంచిక పత్రికకు ప్రత్యేక అభినందనలు.
శాంతా దేవి
చిట్టితల్లికి నేర్పుతున్న పాఠాలు చ
అలా బాగున్నాయి జ్యోతి గారు. ఈ కాలం లో చందోబద్ధమైన నీతి శతకం వ్రాయడం సాహసం, అభినందనీయం. మీ కృషి ఇంకా బాగా సాగాలని నా ఆకాంక్ష.
స్వాతి
అలతి పదాల ఆటవెలదులలో ఎంతో చక్కని నీతి పద్యాలను రచించినందుకు అభినందనలు అండి.చక్కటి తెలుగు కనుమరుగు అవుతున్న సమయంలో చిన్న చిన్న పదాలే అయినా చిక్కని భావం.చిన్నపిల్లలకు నేర్పడానికి వీలుగా ఉన్నాయి
M. Geetalatha
It is a very interesting and inspiring poems. I congratulate the poetess for giving us a memorable poems.
రాఘవేంద్ర.
చిట్టితల్లి శతకం మొదలు చాలా బాగా రాశారు. చిన్న పిల్లలకు శులభంగా అర్థమైయే విధంగా ఉన్నాయి.