[‘చిట్టితల్లి’ అనే మకుటంతో శ్రీమతి వి. నాగజ్యోతి ఆటవెలదులలో బాలబాలికల కోసం అందిస్తున్న పద్య శతకం.]


61.
హితవు చెప్పుటేల నతిగ నెవ్వరికైన
తొలగి దూరమైన కలత రేగు
గౌరవమ్ము దక్కు కోరినప్పుడు దెల్ప
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
62.
దానమిచ్చు నపుడు తారతమ్యములేల?
యుక్తమగును బంచ నొక్క రీతి!
బ్రతిమ వేరు గాని భగవానుడొక్కడే
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
63.
గతమునంత తరచి గర్హించి వగచిన
నేడు కూడ గాదె నిష్ఫలమ్ము
నిగ్రహించి చూడ నెరవేరు కార్యముల్
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
64.
తనదు గౌరవమ్ము తననోట బలికిన
వెక్కిరింతు రమ్మ పెక్కువిధుల
చెలగి తనదు గొప్ప చెప్పుకొనునె పైడి?
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
65.
వినతి నేర్పు గురువె విసుగుచూప తరచు
సహన మేమి? యబ్బు చదువరునికి
ననుగులేని చోట మనగల్గ లేరమ్మ
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
66.
అరయ కలుషితమ్ము పెరుగుచుండుటచేత
తరుగుచుండె ధరణి హరువులన్ని
సావధానమొంద సంక్షయమ్మాగును
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
67.
పిన్నలాచరించి పెద్దల నడతల
నెదుటి వారి చెంత నెఱుక పఱతు
రభిచరించవలయు నందాల నడతల
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
68.
పలుకరించినంత పరిచయమ్ము పెరిగి
ఎదుటి వారి మనసు నెరుకపడుచు
నంతరాలు తొలగు మంతనాలవలన
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
69.
కట్టు బాట్లు కావు కాళ్ళ బంధనములు
ముప్పు నాపు నట్టి తిప్పలవియె
మెలపు తెలియు కొలది తొలగు నడ్డంకులు
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
70.
భక్ష్య మెదుట బెట్టి భజనచేయుమనిన
నాగ లేని నాల్క యదను చూచు
నదుపు జేయ మనసు నదియె దాసుండౌను
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
(ఇంకా ఉంది)

శ్రీమతి వరికేటి నాగజ్యోతి ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో జన్మించారు. పదవ తరగతి వరకే చదువుకున్న నాగజ్యోతి గారు దక్షిణ భారత హిందీ పరీక్షలలో భాషాప్రవీణ, హిందీ టైపింగ్ పరీక్షలు లోయర్, హైయ్యర్ పాసయ్యారు. వివాహానంతరం ఢిల్లీకి వచ్చి గృహస్థురాలి బాధ్యత స్వీకరించారు. సాహిత్యాభిలాషి. వీరు రాసిన కథలు, కవితలు, పద్యాలు పలు అంతర్జాల పత్రికలలో ప్రచురించబడ్డాయి.
పుస్తక సమీక్షలు కూడా చేస్తూ వుంటారు. ఇన్నేళ్ళ తరువాత కోవిడ్ కాలంలో శ్రీ పూసపాటి గురువుగారు, శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తి గురువుగారి ద్వారా పద్య రచన, ప్రాథమిక వ్యాకరణం నేర్చుకున్నారు. శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తి గురువుగారి సహకారంతో – ఆప్త మిత్రులు శ్రీ ధరణిగారు, సన్నిహితులు, తమ శ్రీవారి ప్రోత్సాహం వలన ‘చిట్టి తల్లి’ పద్య శతకం రాసారు.
గత పదిహేను సంవత్సరాలుగా ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్ నివాసి.