[‘అమెరికా జనహృదయ సంగీతం- కంట్రీమ్యూజిక్’ అనే ఫీచర్లో భాగంగా కాన్వే ట్విట్టీ పాడిన ‘హౌ మచ్ మోర్ కెన్ షీ స్టాండ్’ అనే పాటని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]
- కాన్వే ట్విట్టీ – హౌ మచ్ మోర్ కెన్ షీ స్టాండ్
- ఆల్బమ్ – హౌ మచ్ మోర్ కెన్ షీ స్టాండ్ (1971)
- రచన – హారీ కాంప్టన్
- నిర్మాత – ఓవెన్ బ్రాడ్లీ
~
హెరాల్డ్ లాయిడ్ జెంకిన్స్ (సెప్టెంబర్ 1, 1933 – జూన్ 5, 1993) కాన్వే ట్విట్టీగా కంట్రీ మ్యూజిక్ ప్రపంచంలో కొన్ని వందల గీతాలను అందించారు. ఈయన గాయకుడు, పాటల రచయిత కూడా. ట్విట్టీ తన పాటలలో శృంగార భావోద్వేగ ఇతివృత్తాలను గొప్పగా పలికించేవారు. హాస్యనటుడు జెర్రీ క్లోవర్ ట్విట్టీకి ‘ది హై ప్రీస్ట్ ఆఫ్ కంట్రీ మ్యూజిక్’ అనే పేరు పెట్టాడు. ట్విట్టీ తన కెరీర్లో బిల్బోర్డ్ హాట్ కంట్రీ సాంగ్స్ చార్ట్‌లో 40 సార్లు అగ్రస్థానంలో నిలిచారు. ఈ రికార్డు జార్జ్ స్ట్రెయిట్ అధిగమించే దాకా రెండు దశాబ్దాల పాటు ట్విట్టీ పేరునే కొనసాగింది. బిల్బోర్డ్ హాట్ కంట్రీ సాంగ్స్‌లో పదకొండు చార్ట్-టాపింగ్ హిట్లను ట్విట్టీ రాశారు.


‘హౌ మచ్ మోర్ కెన్ షీ స్టాండ్’ అనే పాట హ్యారీ కాంప్టన్ రాస్తే కాన్వే ట్విట్టీ రికార్డ్ చేశారు. ఇది మార్చి 1971లో ‘హౌ మచ్ మోర్ కెన్ షీ స్టాండ్’ ఆల్బమ్ నుండి మొదటి సింగిల్ గానూ, టైటిల్ ట్రాక్గానూ విడుదలైంది. ఈ పాట ట్విట్టీ పాడిన ఆరవ నంబర్ వన్ సోలో కంట్రీ హిట్. దీన్ని టామీ వైనేట్ ‘స్టాండ్ బై యూర్ మేన్’కు జవాబు పాట అని సంగీత ప్రియులు అంటారు. ఆ దిశగా చూస్తే ఈ పాటలోని అర్థం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. టామీ వైనేట్ తన గీతంలో ఎన్ని బలహీనతలున్న నీ మగని పక్కన నిలబడు అని స్త్రీని బంధిస్తే ఈ పాటలో ఎన్నాళ్ళని ఆమె నన్ను భరించగలదు, నేను ఎన్నో బలహీనతలున్నవాడిని, ఆమెను ఎంతో బాధపెడుతున్నాను, నన్ను నేను మార్చుకోలేకపోతున్నాను అంటూ ఓ పురుషుడు తన భార్య తన కోసం నిలబడడం తనను అన్ని వేళలా క్షమించడంలోని ఆమె త్యాగాన్ని గురిస్తూ ఇంకెన్నాళ్లు ఆమె నాతో బాధలుపడుతుంది, ఎందుకిలా అనుకోవడం చూస్తాం. ఆశ్చర్యంగా ఓ స్త్రీ నీ మగని బలహీనతలను క్షమించు అని పాడితే ఇక్కడ ఓ పురుషుడు ఎన్నాళ్లామె నన్ను భరించాలి ఎందుకోసం అంటూ స్త్రీల కింద బాధ అవసరమా అని ప్రశ్నించడం వింతగా అనిపిస్తుంది. కాని ఏమైనా పురుషుడు బలహీనుడని, ఒక్క స్త్రీతో ఉండడం అతనికి అసాధ్యం అని అందుకే అతనితో స్త్రీ జీవితం ఎప్పుడు సంఘర్షణాత్మకమే అనే విషయాన్ని ఈ పాట ఒప్పుకుంటుంది.
There’s a devil in my body that I just can’t satisfy
Other women haunt me even though I love my wife
It’s because I really love her I try to save her heart with lies
But I know she knows, I can see it in her eyes
(నా శరీరంలో నేను ఎప్పటికీ తృప్తి పరచలేని ఓ దెయ్యం ఉంది. నా భార్యను నేను ఎంతగా ప్రేమిస్తున్నా పరాయి స్త్రీలు నన్ను వెంటాడుతూనే ఉంటారు. ఆమెంటే నాకు నిజంగా ప్రేమ కాబట్టే అబద్ధాలతో ఆమె మనసును కాపాడుతూ ఉంటాను. కాని నాకు తెలుసు ఆమెకు నేను చేస్తున్న మోసం నా కళ్ళల్లో కనిపిస్తూనే ఉంటుంది)


I tried to stay at home, love only her, play with the kids and watch TV
But then my mind becomes unsure about the kind of love I need
My reasons for cheating, they’re as good as lies can be
How much more can she stand and still stand by me
(నేను ఇంట్లోనే ఉండాలని ప్రయత్నిస్తాను. ఆమేనే ప్రేమించాలని అనుకుంటాను. పిల్లలతో ఆడుకుంటూ టీవీ చూస్తూ గడుపుతాను. కాని నా మెదడు నాకెలాంటి ప్రేమ కావాలన్న విషయం పట్ల అస్పష్టతతో నిండిపోతుంది. ఆమెను మోసం చేసే నా చర్య వెనుక ఉండే కారణాలు అన్నీ అబద్ధాలే. ఆమె నా కోసం ఎంత సహిస్తుంది ఇంకా ఎన్నాళ్లు నా పక్కన నిలబడి ఉంటుంది?)
అతను భార్యనే ప్రేమించాలని కుటుంబానికి ద్రోహం చేయకూడదని అనుకుంటూనే ఉంటాడు. భార్యతో ఇంట్లోనే ఎక్కువసేపు ఉండే ప్రయత్నం చేస్తాడు, పిల్లలతో గడుపుతాడు. కాని అతని మనసులో తనకేం కావాలన్నదానిపై స్పష్టత కొరవడుతుంది. మనసు ఇంకేదో కావాలని పరుగులు తీస్తుంది. ఆమెను మళ్లీ మళ్ళీ అతను మోసం చేస్తాడు. దానికి కారణాలు పెద్దవేం కావు. ఎన్ని కారణాలు వెతికి చెప్పినా అవన్నీ అబద్ధాలే. లోపం అతనిలోనే ఉంది. మోసం చేయడం అతని బలహీనత. అలాంటి తనను ఆమె ఎన్ని సార్లని క్షమిస్తుంది? ఎంత కాలం తన పక్కన తోడుగా నిలబడి ఉంటుంది?
It’s so hard for me to call her, I can hardly dial the phone
I did wrong again last night, now, I just want to go back home
She knows that I lied, Lord, she’ll cry where I can’t see
How much more can she stand and still stand by me
How much more can she stand and still stand by me
(ఆమెకు ఇప్పుడు ఫోన్ చేయడం అతనికి చాలా కష్టం అనిపిస్తుంది. ఫోన్ డయల్ చేయలేనంత నీరసం ఆవహిస్తుంది. మళ్ళీ నిన్న రాత్రి తప్పు చేసాను, ఇప్పుడు ఇంటికి త్వరగా వెళ్లిపోవాలని ఉంది. ఆమెకు తెలుసు నేను అబద్ధం చెప్పానని, భగవంతుడా నేను చూడకుండా ఆమె మళ్ళీ ఏడుస్తుంది. ఇలా ఎంత కాలం ఆమె నా పక్కన నిలబడి ఉంటుంది? ఎంత వ్యథ ఎంత వరకు అనుభవిస్తుంది)
భార్యను మోసం చేసి మళ్ళీ ఆమె అతను పశ్చాత్తాపపడతాడు. త్వరగా ఇల్లు చేరాలని తాపత్రయపడతాడు. కాని ఆమెకి అతను చెప్పే అబద్ధాలు అర్థం అవుతాయి. ఇలా భర్త వచ్చిన ప్రతిసారి ఆ అభిమానవతి అతని కంట పడకుండా గుండే పగిలేలా ఏడుస్తూనే ఉంటుంది. ఇది అతనికి తెలుసు, దానికి బాధపడతాడు కాని తనను నియంత్రించుకోలేడు. అలాంటి బలహీన మనస్కుడితో ఆమె ఎంత కాలం కలిసి ఉండగలదు? ఎంత బాధను భరించగలదు? ఇంకెన్నాళ్లు ఈ నరకాన్ని సహించగలదు?
భర్త బలహీనతలను ప్రతి నిముషం క్షమిస్తూ బతికే స్త్రీ ఎంత వ్యథను అనుభవిస్తుందో ఈ పాటలో వినిపిస్తాడు గాయకుడు. నిజానికి ఇది అతి విషాదంగా పాడతాడు ట్విట్టీ. పురుషుడు బలహీనుడని ఒప్పుకోక తప్పదు కాని దానికి అతని క్షమించాలనీ అనిపించదు. పాటలో ఆ పురుషుడు మళ్లీ మళ్ళీ తప్పు చేసి పశ్చాత్తాపంతో రగులుతూ తన బాధ చెప్పుకుంటున్నా అతని మాటల ద్వారా అతని భార్య పడే వ్యథ మనలోని చొచ్చుకుపోతుంది. అంటే అపరాధి నోటి ద్వారా అపరాధాన్ని వింటూ అతని నిస్సహాయతను అర్థం చేసుకుంటూనే అదంతా జీవితాంతం భరించే ఆ భార్య స్థితి లోని విషాదం మనసుల్ని తాకుతుంది. బలహీనుడైన భర్తను అర్థం చేసుకుని జీవించడం అంత సులువైన పని కాదని అది చెప్పినంత తేలికైన పని అసలే కాదని ఈ పాటలో ఆ బలహీనుడైన మగాడే చెప్తున్నాడు. పైగా తనను భరించే ఆ భార్య ఉనికి అతనికి తనలోని బలహీనతను పదే పదే గుర్తుకు తెస్తూ నిరంతరం బాధపెడుతూనే ఉంటుంది.
సున్నితమైనది భావోద్వేగభరితమైన అనుభూతులను ట్విట్టీ తన గానంలో పలికించగలగడంలో దిట్ట. అదే ఈ పాటకు ఒక బాలెన్స్ ఇచ్చింది. ఈ పాట పురుషుని లోని అపరాధభావాన్ని, అతని బలహీన మనస్తత్వాన్ని చెబుతూనే స్త్రీ పట్ల గౌరవాన్ని, ఆమె జీవితంలో ముందుకు పోవలసిన అవసరాన్ని కూడా సమపాళ్లల్లో ప్రకటిస్తుంది. ఇలాంటి పాటను అందరూ పురుషులు పాడి మెప్పించలేరు. తాను చేస్తున్న పాపాన్ని చెప్పుకుంటూ అందులో విషాదాన్ని పలికించడం, దాన్ని శ్రోతలు ఆమోదించేలా చేయడం అందరికీ సాధ్యం కాదు. ఆశ్చర్యంగా ఈ పాటలో ఒక రకమైన ఆహ్లాదత కూడా ద్వనిస్తుంది. ట్విట్టీ గొంతులోని విశిష్టత ఈ పాటలో మనకు అవగతం అవుతుంది.
ఈ పాటని యూట్యూబ్‌లో ఈ లింక్ లో వినవచ్చు.
(మళ్ళీ కలుద్దాం)
