[డా. సి. భవానీదేవి రచించిన ‘దాహం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]


పచ్చదనం కోసం నా దాహం
ఎప్పటికి తీరుతుందో తెలీదు
పొలాలని మింగేసిన ఆకాశహార్మ్యాలు
సూర్యరశ్మిని తాగేసిన చెరువు జలాలు
దట్టమైన అడవుల్ని కాటేయటానికి
మనమే తయారుచేసుకున్న గొడ్డళ్ళు
ఇంక ఆకుపచ్చ దాహం తీరేదెలా..
పొలాల అంచులకి వెళ్ళి
నా అరచేతిలో గువ్వపిట్టలా ఒదిగే
చిన్న గడ్డిపువ్వు కోసం వెదుక్కుంటాను!
సముద్ర తరంగాల మీద ఉప్పుగాలి
నా కురులను సవరిస్తూ ఎగరేస్తుంటే
నీలి ఆకాశం కడలితో కరచాలనం చేసే చోట
ప్రపంచానికి పలకబోయే ముగింపు కనిపిస్తుంది!
ప్రతి గాయమూ మంచులో తడిసిన తుమ్మెదే!
మధురమైన సవరణలు శ్రుతి చేస్తూ
ప్రతి చిగురుటాకు కొత్త వేకువని వినిపిస్తుంటే
ఎక్కడో.. ఈ కాలువ గలగలల్లోంచి
నా పూర్వీలుల హెచ్చరికలు ప్రతిధ్వనిస్తున్నాయి
ఇంక త్వరగా ఇంటికి వెళ్ళమని
సూర్యోదయానికి సంతకం ఇప్పుడే కాదని!!
వేదనే ప్రేమగా పరిణమిస్తుంటే
వేసవి లోనూ వినూత్న పల్లవాల కోసమే ఆరాటం!
పొదల పచ్చదనం గగన నీలిమైపోతుంటే..
ఇందులోంఛే నన్ను నడవనీయండి
భయం లేకుండా.. మునిగిపోకుండా..
ఇక్కడే ఇలా బతికే ధైర్యాన్నీయండి!
ప్రకృతి గాయాలను అనుభూతి చెందనీయండి
వాటిని మాన్పుకోవటం తెల్సుకుంటూ
మళ్ళీ మళ్ళీ నన్ను తలెత్తనీయండి!
4 Comments
నెల్లుట్ల రమాదేవి
డా . సి భవానీ దేవి గారి కవిత చాలా బావుంది . ప్రకృతిని చేజేతులా నాశనం చేసుకున్న మనిషి ప్రకృతి గాయాలను అనుభూతి చెంది వాటిని మాన్పుకోవడానికి ప్రయత్నం చేయాలన్న సందేశం ఎంతో నచ్చింది . అభినందనలు !
అల్లూరి Gouri Lakshmi
ప్రకృతి పట్ల మానవుడు చేసిన తప్పులను తెలుసుకుని దిద్దుకోవాలన్న తపన,సూచన ఉన్న ఈ’దాహం’ కవిత present situation ని కళ్లకి కట్టింది..poem with a Message..అభినందనలు భవానీ గారికి.
పుట్టి నాగలక్ష్మి
ప్రకృతి వినాశనమే అభివృద్ధి అనుకునే మూర్ఖుల మధ్య బతుకుతున్నాం.మనవంటి ప్రకృతి ప్రేమికులు ఈ దాహం తీర్చుకోవడం కోసం పడే వేదన, ఆవేదన కవితలో మెరిసి బాధించి.మంచి కవిత మేడమ్ గారూ! అభినందనలు

భవాని
ధన్యవాదాలు