[దంత సంరక్షణ కోసం డా. కె. ఎల్. వి. ప్రసాద్ గారు నిర్వహిస్తున్న ప్రశ్నలు జవాబులు ఫీచర్ – ‘దంతవైద్య లహరి’.]
ముందస్తు దంతవైద్య పరీక్షలు:
ప్ర: డాక్టర్ గారూ, వచ్చే సంవత్సరం జనవరి నెలలో నేను, మా వారు, అమెరికాలో వున్న మా పిల్లలు దగ్గరకు వెళదాం అనుకుంటున్నాం. అక్కడ మేము కనీసం ఆరునెలలు ఉంటాం. ఈ కాలంలో ఎలాంటి దంతసమస్యలూ రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పండి.
-శ్రీమతి ఆశాలత, మౌలాలి.
జ: ఆశాలత గారు, చాలా మంచి సందేహం వెలిబుచ్చారు. మీకు మాత్రమేకాదు, మీలాంటి చాలా మందికి, ఈ సందేహ నివృత్తి అవసరమే! ఎందుచేతనంటే ఈ రోజుల్లో అమెరికాకు వెళ్లని వారు ఎవరున్నారు? అందుచేత అందరికీ అవసరమే!
మీరు అడిగినట్టు, జాగ్రత్తలు అవసరమే. ఆ జాగ్రత్తలలో ప్రధానమైనది, ముందస్తు దంత వైద్య పరీక్షలు. అలవాటు వున్న దంతవైద్యుల దగ్గరకు వెళ్లి పూర్తి దంత వైద్య పరీక్షలు చేయమని అడగాలి. అప్పుడు మీకు తెలియకుండా ఏమైనా దంత సమస్యలు ఉంటే వారు మీకు వివరిస్తారు. మీ ఇష్టాన్ని బట్టి చికిత్స చేస్తారు.
మనం వూహించదగ్గ కొన్ని దంతసమస్యలు:
పిప్పిపన్ను:
పంటికి రంధ్రం లేనంత మాత్రాన, పిప్పిపన్ను లేదు అనుకోకూడదు. దీనిని స్వయంగా పరీక్షించుకోవచ్చును. ఒక గుండుసూదిని తీసుకుని దంతం మీద సున్నితంగా అటు ఇటు తిప్పినప్పుడు గుండు సూది ఆగకుండా ముందుకు సాగిపోతే, పిప్పి లేనట్టు.
అలా కాకుండా సూది మధ్యమధ్యలో ఆగిపోతే ఆ పంటికి పిప్పిపన్ను ప్రారంభం అవుతున్నట్టు భావించి ఫిల్లింగ్ చేయించుకోవాలి.
పిప్పి స్థాయి డెంటీన్ పొరకు మాత్రమే పరిమితమై వున్నా కూడా ఫిల్లింగ్ చేయించుకోవాలి.
పిప్పి డెంటీన్ స్థాయి దాటి పల్ప్ కుహరాన్ని చేరితే, దానికి ఫిల్లింగ్ పనికిరాదు. ఇలాంటి పళ్లకు మూల చికిత్స (రూట్ కెనాల్ ట్రీట్మెంట్) చేయించుకోవాలి.
జ్ఞానదంతం:
జ్ఞాన దంతాలు అందరికీ ఇబ్బంది పెట్టాలని లేదు. ఇబ్బందిపెట్టే అవకాశం ఉంటే తప్పక తీయించుకుని అమెరికా వెళ్లడం మంచిది. ఈ సమస్య అక్కడకు వెళ్ళాక వస్తే మెడికల్ ఇన్సూరెన్స్ లేనివాళ్లు దానికయ్యే ఖర్చు తట్టుకోవడం కష్టం.
పంటి గార:
పంటిగార(టార్టార్/కాలిక్యులస్) ఉన్నట్లు గమనిస్తే, అది క్లిన్ చేయించుకోవాలి. లేకుంటే పళ్ళు కదిలే అవకాశం ఉంటుంది.
చిగుళ్ల వాపు – రక్తం కారడం:
చిగుళ్ళవాపు గాని, చిగుళ్ళనుండి రక్తం కారడం గాని ఉంటే, ఈ సమస్యలు తగ్గించుకున్నాకనే, ప్రయాణం పెట్టుకోవాలి. ఈ సమస్యలవల్ల పళ్ళు కదలడం, నోటి దుర్వాసనతో పాటు చిగుళ్ళనుండి వెలువడే చీము -రక్తం, మామూలు రక్తప్రసారంలో కలిసి శరీర ఆరోగ్యంపై ప్రభావం చూపించవచ్చు.
ఇక బ్రష్‌లు గాని, పేస్టులు గానీ, మౌత్ వాష్‌లు గానీ, ఇతర మందులు గానీ కూడా తీసుకు వెళ్లాలనుకుంటే, రిజిస్టర్డ్ దంతవైద్యుని ‘ప్రిస్క్రిప్షన్ పాడ్’ మీద రాయించుకుని తీసుకువెళ్ళాలి.
~
బ్రక్సిజం:
ప్ర: మా బాబు వయసు పన్నెండు సంవత్సరాలు. నిద్రలో పళ్ళు నూరుతూ పెద్ద శబ్దం సృష్టిస్తాడు. అలా ఎందుకు చేస్తున్నావంటే ఏమో నాకు తెలీదు మమ్మీ అంటాడు. ఎందుకు ఇలా అవుతుంది? పరిష్కారమార్గం చెప్పగలరు.
-ఉషశ్రీ. ఎం, విశాఖపట్నం.
జ: మీరు చెప్పినట్టుగా పళ్ళు కొరకడాన్ని లేదా నూరడాన్ని ‘బ్రక్సిజం’ అంటారు. ఈ అలవాటు కొందరికి రాత్రిళ్ళు ఉంటే కొందరిలో రేయింబవళ్లు ఉంటాయి.


బ్రక్సిజం వల్ల అరిగిపోయే పళ్లు
దీనికి కారణాలు అనేకం ఉంటాయి. అందులో అసంకల్పిత స్థితి, ఒత్తిడి, ఆందోళన ఉన్నవారిలో ఇది రావచ్చు. దీని వల్ల పళ్ళు త్వరగా అరిగిపోయే ప్రమాదముంది. పళ్ళు అరిగిపోతే జివ్వుమని గుంజడం మొదలుపెడతాయి. చల్లని గాలిని తట్టుకోలేరు. చల్లని వస్తువులు తినలేరు. చల్లని పానీయాలు త్రాగలేరు. ఈ పరిస్థితిలో వీరికి ఫిజీషియన్‌తో పాటు దంతవైద్యుల అవసరం పడుతుంది.


రాత్రిపూట ధరించే టూత్ గార్డ్స్


రాత్రిపూట ధరించే టూత్ గార్డ్స్
టూత్ గార్డ్ అనే అప్లియన్స్తో పళ్ళు తిరగకుండా జాగ్రత్తపడవచ్చు. తక్షణమే వైద్యులను సంప్రదించండి. మీకు సరైన పరిష్కారమార్గం సూచిస్తారు.
డా. కె. ఎల్. వి. ప్రసాద్, సివిల్ సర్జన్ (రిటైర్డ్), 9866252002
~
పాఠకులు తమ దంత సమస్యలకు సంబందించిన ప్రశ్నలు (ఎన్నైనా, ఇందులో ఎలాంటి నియమం లేదు) ‘సంచిక’ సంపాదకులకు kmkp2025@gmail.com అనే మెయిల్ ఐడికి, ప్రతి గురువారం లేదా అంతకంటే ముందు పంపవచ్చు. ప్రశ్నలు పంపేవారు విధిగా తమ పూర్తి పేరు, ఊరు, మొబైల్ నంబరు రాయాలి.

వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.
8 Comments
గోనుగుంట మురళీకృష్ణ
దంత సమస్యలు రాకుండా ముందుగా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి చాలా చక్కటి అవగాహన కల్పించారు. అందుకే prevention is better than cure అన్నారు.
డా కె.ఎల్.వి.ప్రసాద్
మురళీకృష్ణ గారూ
మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు
sagar
నేడు వివరించిన ముందు జాగ్రత్తలు చాలా అమూల్యమైనవి సర్. ఇలాంటి సలహాలతో అందరికీ పరిష్కారం చూపుతున్న మీకు ధన్యవాదములు సర్.
డా కె.ఎల్.వి.ప్రసాద్
సాగర్ ధన్యవాదాలు
J.Mohan Rao
అమెరికా వెళ్ల బోయే ముందు దంత ఆరోగ్య పరంగా వివిధ దంత, చిగుళ్ళు సమస్యలు, ముందు జాగ్రత్తలు చక్కగా వివరించారు .
అలాగే నోటి దుర్వాసన, పళ్లు కొరకటం నివారించుట, మొదలగు వాటి గురించి మంచి అవగాహన కల్పించారు. Dental doctor prescription కూడా వెంట తీసుకొని వెళ్ళమని
Practical సూచన చేశారు .
ధన్యవాదాలు .Sir
J. మోహన రావు
డా కె.ఎల్.వి.ప్రసాద్
క్రమం తప్పకుండా
ఈ శీర్షికను ప్రోత్సహిస్తున్న మీకు
హృదయ పూర్వక ధన్యవాదములు సర్.
Bhujanga Rao
ఈ సంచికలో దంత పరిరక్షణకు కావాల్సిన ముందస్తు వైద్య పరీక్షలతో పాటు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు చాలా అవసరమైనవి.జ్ఞాన దంతం, పంటిగార, చిగుళ్ల వాపు మరియు పళ్ళు కొరుకుట వాటి నివారణ చర్యలు ఇంకా ఎన్నో అమూల్యమైన సలహాలు అందిస్తున్న మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు సర్
డా కె.ఎల్.వి.ప్రసాద్
భుజంగరావు గారు
మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియ చేసారు
ధన్యవాదాలు.