[శ్రీ వారాల ఆనంద్ రచించిన ‘దారిపక్క దయామయి’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]


దారిపక్క నిన్ను
ఎవరో నాటితే ఊపిరి పోసుకున్నావు
వాననీ ఎండనీ గాలినీ
ఊతంగా చేసుకుని నిలబడ్డావు
కొమ్మలు సాచి విస్తరించావు
నువ్వు ఆకాశాన్ని చూసి నవ్వుతావు
నేలకేసి చూసి మురుస్తావు
నీకు కిరీటాల్లేవు భుజకీర్తుల్లేవు
సింహాసనాల్లేవు మేడలో రత్నాల హారాల్లేవు
నువ్వు రాజువి కాదు రాణివీ కాదు
కానీ
దారినపోయే బాటసారికి నీడనిస్తావు
ఊపిరి తీసుకోను గాలినిస్తావు
అలసట తీర హాయినిస్తావు
గమ్యం చేర సత్తువనిస్తావు
అయినా ఎవరయినా ఎట్లా అంటారు
నువ్వొట్టి దారిపక్క ఒంటరి వృక్షానివని
నోరులేని మూగ జీవానివని
మనిషన్నవాడెవరయినా
సేదదీరిన శరీరంతో
నీకు దండం పెట్టకుండా
నీ పాదాల్ని స్పృశించకుండా
తల్లిలా నిన్ను స్మరించకుండా
ఊరికే ఎట్లా దాటేసి పోతాడు
మనిషన్నవాడు
నీకూ నిన్ను నాటిన వాడికీ
పాదాభివందనం చేస్తాడు
వాడే
కృతజ్ఞుడయిన మానవుడు

కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద పురస్కార గ్రహీత
1 Comments
అల్లూరి Gouri Lakshmi
అవును. చెట్టు తల్లి దయామయి.బాటసారులు సేదదీరాక నమస్కరించి వెళ్లాల్సిందే! బావుంది ఆనంద్ గారూ కవిత.