(భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గత సంవత్సరం ఆగస్ట్ 14ను దేశ విభజన భయానక జ్ఞాపకాల సంస్మరణ దినంగా ప్రకటించారు. ఆ పిలుపు ఆధారంగా సంచిక తెలుగు పాఠకుల కోసం అందిస్తున్న విశేష వ్యాస పరంపర ఇది. దేశ విభజనకు దారితీసిన కారణాలను మూలాలనుంచి పరిశోధించి, విశ్లేషిస్తూ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న వ్యాస పరంపర ఇది.)
మీకు తెలుసా? మన నాగరికత ఆనవాళ్లు ఎక్కడున్నాయో? వేదాల్లో అతి ప్రాచీనమైనదీ.. పవిత్రమైన వేద వాఙ్మయంలో మొట్టమొదటిది అయిన ఋగ్వేద సూక్తాలు ఆవిష్కారమైన ప్రాంతం ఎక్కడున్నదో మీకు తెలుసా? ఋగ్వేద మంత్ర ద్రష్టలైన మహర్షులు అనేక మంత్రాలను దర్శించిన అనేక దివ్య నదీ తీరాలు ఎక్కడున్నాయో తెలుసా మీకు? అత్యద్భుతమైన దివ్యజీవన నాగరికత సుసంపన్నమైన సప్త సింధు నదులు ఏమైపోయాయో తెలుసా? భారత దేశాన్ని సస్యశ్యామలం చేసి ప్రపంచంలోనే సంపన్న ఆర్థిక వ్యవస్థ నిర్మాణానికి దోహదపడిన నదులు ఇప్పుడు ఎక్కడున్నాయి? భారతీయ అతి ప్రాచీన నాగరికతకు ఆలవాలమని భావిస్తున్న హరప్పా, మొహంజోదారో వంటి ప్రాచీన నగరాలు ఇప్పుడు ఎక్కడున్నాయి? మన ప్రాచీన సంస్కృతికి ఆధారభూతమైన నగరం.. అర్జునుడి మనవడు పరీక్షిత్తు పరిపాలించిన రాజధాని.. వైశంపాయనుడు మొట్టమొదట మహాభారతాన్ని వినిపించిన పవిత్రమైన ప్రాంతం తక్షశిల నగరం ఇప్పుడు ఎక్కడున్నది..?
ఇవన్నీ ప్రశ్నలే.. మనం చరిత్ర పుస్తకాల్లో రాసుకోవడానికి, చదువుకోవడానికి మాత్రం పనికొస్తున్నాయి. కానీ ఇవేవీ కూడా ఇవాళ మనకు కాకుండా పోయాయి. మన మూలాలు ఎక్కడున్నాయని ఎవరైనా ప్రశ్నిస్తే.. పక్కన పాకిస్తాన్ వైపు వేలు చూపించాల్సి వస్తున్నది. మన నాగరికత ఆనవాళ్లు ఎక్కడున్నాయని ఎవరైనా అడిగితే.. అదిగో పాకిస్తాన్లో అని అటువైపు చూడాల్సి వస్తున్నది. మన చరిత్ర, సంస్కృతి మూలాలు.. పరమ సుసంపన్నమైన సరస్వతీ నదీ నాగరికతావైభవంలో అధికభాగం పాకిస్తాన్లో కలిసిపోయింది.
ఒకనాడు ఋగ్వేదం ప్రవచించిన కుభా.. ఇవాళ కాబూల్ నదిగా మారిపోయింది. కుర్రమ్ నది.. కృమిగా పేరు మార్చుకొన్నది. గోమతి కాస్తా.. గోమల్గా గోల్మాల్ అయిపోయింది. ప్రాచీన భారతీయ చరిత్రలో అత్యంత ముఖ్య ప్రాంతమైన సువస్తు నగరం ఇప్పుడు స్వాత్గా రూపాంతరం చెందింది. ఆఫ్గనిస్తాన్, పంజాబ్ మధ్య ఉన్న ప్రాంతం (ఇవాళ్టి పాకిస్తాన్) అంతా ఒకనాడు సప్త సింధు ప్రాంతం. 1. కుభా (కాబూల్), 2. సింధు 3. వితస్త (ఝీలమ్), 4, అసిక్న (చినాబ్), 5. పరుష్ణి (రావి), 6. విపాశ (బియాస్), 7. శతద్రు (సట్లెజ్).. ఇవి సప్త సింధు నదులు. వీటి పేర్లు ఇప్పుడు ఇలా పూర్తిగా మారిపోయాయి.
ఇమం మే గంగే యమునే సరస్వతి
శతుద్రి స్తోమం సచతా వరుష్ణ్యా
అసిక్న్యా మరుద్వృధే వితస్తా యార్జీకేయే
శృణు హ్యా సుషోమయా
నదీ సూక్తం లోని ఈ మంత్రాన్ని కొంచెం భావుకతతో ఒక్కసారి పఠించండి. మీ కంటి ముందు సంపూర్ణ భారతదేశం ఆవిష్కారమవుతుంది. మన ఉనికికి, జీవనానికి సర్వాధారమైన మాతృభూమిని ఆరాధించిన పవిత్ర నదీసూక్తమిది. మనకు అతి ప్రాచీనమైన సింధు నాగరికత ఇక్కడే విలసిల్లింది. ధాన్యాల్లో మనుషులకు అత్యంత బలవర్ధకమైన గోధుమలను సింధు నాగరికత కాలంలోనే పండించి.. ఆహారంగా స్వీకరించిన జాతి మనది. ఇప్పటికీ పంజాబ్, పశ్చిమ పాకిస్తాన్లో ఎక్కువగా పండేది గోధుమే. సింధు ప్రాంతం శైవ మత మూలాలకు ఆలవాలం. భగవద్ధ్యానానికి కీలకమైన యోగమార్గం ఆరంభమైన ప్రాంతం. భారతీయ ధర్మంలో అంతర్భాగమైన బౌద్ధం తన స్తూపాలతో, చైత్యాలతో, విహారాలతో విస్తరించి ఘనమైన సాంస్కృతిక బంధాన్ని పెనవేసిన ప్రాంతం ఈ సింధు. చైనా నుంచి మన దేశానికి వచ్చిన ఫాహియాన్, హ్యుయాన్స్వాంగ్ వంటి యాత్రికులు ఈ ప్రాంతాల్లో ఎన్నో భారతీయ నాగరికత అవశేషాలను దర్శించినట్టు వర్ణించారు.
ఈ పవిత్ర సింధూ ప్రాంతం భారతీయత యొక్క ఆత్మ. ఈ ఆత్మ శరీరం నుంచి విడిపోయి సరిగ్గా 75 సంవత్సరాలు అయిపోయింది. మన చరిత్ర మనకు కాకుండా పోయింది. మన మూలాలు మనకు దూరమైపోయాయి. మెజార్టీ, మైనార్టీ వాదాల నడుమ.. హిందూ ముస్లిం మతాల వైరుధ్యాల నడుమ.. సోషలిజం, సెక్యులరిజం ముసుగుల చాటున జరిగిన కుట్రలకు భారత వర్షమన్న అద్భుత దేశం మూడుగా విచ్ఛిన్నమైంది. దేశ అఖండైక్యత ముక్కలైపోయింది. దేశానికి తూర్పున, ఉత్తరాన వినూత్న ఖడ్గసృష్టి జరిగింది. మిగిలిన ఈ దేశంపై వేటు వేయడానికి ఈ రెండు ఖడ్గాలు మరింత పదునుదేలి నిరంతరం దాడులకు తెగబడుతున్నాయి.
ఒక్కోసారి ఆశ్చర్యమేస్తుంది. ఎవరిది ఈ దేశం???.. ఎవరిది ఈ సంస్కృతి??? ఎవరిది ఈ నాగరికత??? ఎవరిది ఈ దివ్యజీవన సమాజం??? దీన్ని వాడెవడో వచ్చి విడగొట్టడమేమిటి??? దాన్ని మనం జీ హుజూర్ (బాంచెన్ దొరా అని అర్థం) ఒప్పుకోవడం ఏమిటి???ఎవడో వస్తాడు.. దాడి చేస్తాడు.. ఆక్రమిస్తాడు.. పాలిస్తాడు.. వాడే చిత్తం వచ్చినట్టు టేబుల్‌పై మ్యాప్ పెట్టుకొని గీతలు గీసి ముక్కలు చేసి తలా ఒకటి పప్పుబెల్లాల్లా పంచేస్తాడు. ఏదో ఒకటి మనకు దక్కిందే చాలు మహాభాగ్యమని కండ్లకద్దుకొని మిగిలినదాన్ని తీసుకొని.. సంబరపడిపోతాం. ఆహా మనకు స్వతంత్రం వచ్చిందంటూ జెండాలు ఎగురేసుకొంటాం. ‘మాదీ స్వతంత్ర దేశం.. మాదీ స్వతంత్ర జాతి..’ అని పాటలు పాడుకొంటాం. ఏది మన స్వతంత్ర దేశం.. ఏది మన స్వతంత్ర జాతి..? దేశ విభజన పేరుతో అస్తిత్వాన్నే పోగొట్టుకొన్న దౌర్భాగ్యమైన జాతి మనది. విచిత్రమేమిటంటే.. విభజించి పాలించు అన్న సూత్రంతో బ్రిటిష్‌వాడు ఈ దేశాన్ని విభజించాడని మనం ఇంతకాలం చెప్పుకొంటున్నామే కానీ.. దీని వెనుక అంతకుముందు వెయ్యేండ్లుగా జరిగిన కుట్రను కనీసంగా కూడా గ్రహించలేకపోవడం దురదృష్టం. ప్రస్తుత క్యాలెండర్ 622వ సంవత్సరంలోనే విభజనవాదానికి తొలి అడుగు పడిన సంగతి తెలుసా? అది 1947 దాకా అది ఇంతింతై వటుడింతై నభోవీధినల్లంతై అన్నట్టు కాలక్రమేణా ఒక మహావిషవృక్షంలా ఎదిగి దేశాన్ని మూడు ముక్కలు చేయగలిగింది. దేశం ముక్కలైనా కూడా ఈ విభజన విషవృక్షం మరింత వికృత శక్తిని సంతరించుకుంటోంది, మరిన్ని వికృతరూపాల్లో దర్శనమిస్తోంది. ఈ విషవృక్షానికి విభజన అంతంకాదు, ఆరంభం అన్న భావన కలిగిస్తూ ఈ నాటికీ దేశం విభజన విషవృక్ష నీడలోనే విషపుపాముపడగనీడలో వున్నట్టునది. ఆ విషవృక్షపు విషపు ప్రచండవాతూలహతి విషప్రభావాన్నుంచి తప్పించుకోలేకపోతోంది.
(సశేషం)
కోవెల సుప్రసన్నాచార్య గారి తనయుడు జర్నలిస్టు కోవెల సంతోష్ కుమార్. చక్కని రచయిత. వీరి టీవీ సీరియల్ పుస్తకం దేవ రహస్యం అమ్మకాలలో రికార్డ్ సృష్టించింది.
2 Comments
Budda venkatesham
Good start.. congratulations Mr. Kovela Santosh Kumar.. pls go deep to narrate what they did wrong for the country and people. Still those anti hindu forces working against this nation from all angles 360 degrees. Many anti nationals, anti hindus are getting undue respect, it must be uncovered by your writings. Once again congrats for your efforts.
విజయకుమార్ వేదగిరి.
ప్రారంభం మంచి భావాత్మకంగా ఉన్నది.