[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన జి.ఎస్.ఎస్. కళ్యాణి గారి ‘ధైర్యం మన తోడుంటే..’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]


రామాపురం ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో ఒకే ఒక్క బడి ఉంది. ఆ బడికి ప్రధానోపాధ్యాయుడు ఆదినారాయణ. ఆదినారాయణ తన ఉద్యోగ ధర్మాన్ని బాధ్యతాయుతంగా నిర్వహించేవాడు. బడికి సంబంధించిన అన్ని విషయాలనూ తనే స్వయంగా దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవాడు. ఆదినారాయణకు పాఠాలు చెప్పడంలోనూ, పిల్లల ఆలోచనాధోరణిలోని చిన్న చిన్న లోపాలను సరిదిద్ది వారిని ఉత్తములుగా తీర్చిదిద్దడంలోనూ ఎంతో అనుభవం ఉంది. అంతేకాదు. తమ బడిలో చదువుకుంటున్న విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి, వారికి తగు ప్రోత్సాహాన్ని అందివ్వడంలో కూడా ముందుండేవాడు ఆదినారాయణ. పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే వాళ్ళు బాగా చదువుకోవాలని అంటూ, చదువు విలువ గురించి అందరికీ చెప్తూ, తమ గ్రామంలో పేదవారైన పిల్లలకు తన సొంత ఖర్చులతో ఉచితంగా చదువు నేర్పించేవాడు ఆదినారాయణ. అందుకే ఆదినారాయణ అంటే రామాపురంలోని వారందరికీ ఎంతో గౌరవం, అంతకు మించిన అభిమానం ఉండేవి. ఆదినారాయణ వల్ల ఏదో ఒకరోజు తమ గ్రామానికి మంచి పేరుప్రతిష్ఠలు వస్తాయని అనుకుంటూ ఉండేవాళ్ళు రామాపురం గ్రామ ప్రజలు.
ఆదినారాయణ చదివిస్తున్నవారిలో ఎనిమిదవ తరగతి చదువుతున్న సీత కూడా ఉంది. రెండు పూట్లా కడుపు నిండా భోజనం కూడా చెయ్యలేనంత పేదరికంలో పుట్టిన సీత, చదువు ప్రాముఖ్యత గురించి ఆదినారాయణ చెప్పిన మాటల వల్ల తెలుసుకుని, అతడిచ్చిన ప్రసంగాల వల్ల ప్రేరణను పొంది బడిలో చేరి చదువుకుంటోంది. సీత చాలా తెలివైన పిల్ల. ఆ తెలివితేటలకు తోడు బాగా చదువుకుని జీవితంలో పైకి రావాలన్న పట్టుదల కూడా మెండుగా ఉంది సీతకు. అందుకే తమ తరగతిలో ఏ పరీక్ష పెట్టినా సీతకే ప్రథమ స్థానం వస్తూ ఉండేది. కష్టపడి బాగా చదివే విద్యార్థులంటే ఉపాధ్యాయులకు ఒకలాంటి ఆప్యాయత ఉంటుంది కదా? అలాంటి ఆప్యాయతే సీత అంటే ఆదినారయణకి కూడా ఉంది.
ఒకరోజు బడిలో తన పని చేసుకుంటున్న ఆదినారాయణకు ‘ఆనందాంబుధి’ అనే స్వఛ్ఛంద సంస్థ నుండీ ఒక లేఖ అందింది. రామాపురంతో సహా ఆ చుట్టుపక్కలనున్న ఊళ్ళల్లోని పాఠశాలలలో చదువుకుంటున్న విద్యార్థినీవిద్యార్థులకు ‘మానవత్వం’ అనే అంశంపై రాష్ట్రస్థాయిలో ఉపన్యాస పోటీలు నిర్వహిస్తున్నారన్నది ఆ లేఖ సారాంశం. అటువంటి లేఖను అందుకున్న పాఠశాలలు మాత్రమే ఆ పోటీలో పాల్గొనగలవు. అందువల్ల రామాపురం బడిపిల్లలకు ఆ పోటీలో పాల్గొనే అవకాశం ఇంతవరకూ రాలేదు.
లేఖను చదివిన ఆదినారాయణ, ‘నేను ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అవకాశం ఇన్నాళ్ళకి వచ్చింది. ఈ పోటీలో విజయం సాధిస్తే రామాపురం గ్రామం పేరు రాష్ట్రమంతటా మార్మోగిపోతుంది! మా బడిలో చదువుకుంటున్న పిల్లల సత్తా లోకమంతా తెలుస్తుంది. అప్పుడు మా బడికి మరిన్ని నిధులు వస్తాయ్. వాటితో పిల్లల కోసం బడిలో మెరుగైన సౌకర్యాలను ఏర్పాటు చెయ్యచ్చు!’, అని అనుకున్నాడు.
అయితే, పోటీకి ఎవరిని పంపాలా అని బాగా ఆలోచించిన ఆదినారాయణకు సీత గుర్తుకువచ్చింది. వెంటనే సీతను తన వద్దకు రమ్మన్నాడు ఆదినారాయణ. సీత వచ్చి ఆదినారాయణ ఎదుట కాస్త బెరుకుగా నిలబడింది.
ఆదినారాయణ సీత కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ‘ఆనందాంబుధి’ సంస్థవారు నిర్వహిస్తున్న పోటీ గురించి చెప్పి, “నువ్వు మన బడి తరఫున ఈ పోటీలో పాల్గొంటున్నావు!”, అన్నాడు.
“నేనా?!!”, భయంతో పూడుకుపోయిన కంఠంతో అంది సీత.
“అవును! ఈ పోటీలో నువ్వు తప్పకుండా విజయం సాధిస్తావని నాకనిపిస్తోంది. ప్రయత్నించు!”, అన్నాడు ఆదినారాయణ.
“కానీ సార్!”, అంటూ ఏదో చెప్పబోయింది సీత.
“నువ్వింకేమీ చెప్పద్దు! రెండు రోజుల్లో ‘మానవత్వం’ మీద నువ్వు మాట్లాడదల్చుకున్నది ఒక వ్యాసంగా రాసి నాకు చూపించు”, సీతను గంభీరమైన కంఠస్వరంతో ఆదేశించాడు ఆదినారాయణ.
చేసేదిలేక, “సరే సార్!”, అని బదులిచ్చి తన తరగతి గదికి వెళ్ళిపోయింది సీత.
రెండురోజుల తర్వాత, ‘మానవత్వం’ పై తను రాసిన వ్యాసాన్ని ఆదినారాయణకు ఇచ్చింది సీత.
వ్యాసాన్ని చదివిన ఆదినారాయణ, “వ్యాసం బాగుంది సీతా! నువ్వు ఉపన్యాస పోటీలలో పాల్గొంటావని నేను నిర్వాహకులకు సమాచారాన్ని పంపించాను. పోటీకి మరో రెండు వారాలు సమయం ఉంది. బాగా సాధన చెయ్యి!”, అన్నాడు.
సీత భయపడుతూ తల దించుకుని, “సార్! దయచేసి పోటీకి వేరే ఎవరినైనా పంపండి. నాకు అందరిముందూ నిలబడి మాట్లాడాలంటే చాలా భయం!”, అంది.
“భయమా? భయమెందుకూ? నువ్వు చెప్పదల్చుకున్నదాంట్లో తప్పేమీ లేదే! ధైర్యంగా చెప్పు. నీ వెనుక నేనున్నాను”, అన్నాడు ఆదినారాయణ.
“సార్! ప్లీజ్ సార్! నావల్ల కాదు. అర్థం చేసుకోండి”, ప్రాథేయపడుతున్నట్లు అడిగింది సీత.
“సీతా! నీ గురించి నువ్వు తక్కువ అంచనా వేసుకోకు. ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకెయ్. అంతా బాగా జరుగుతుంది”, సీతకు ధైర్యం చెప్పాడు ఆదినారాయణ.
ఏడుపు ముఖం పెట్టి తన అయిష్టతను చెప్పకనే చెప్పింది సీత.
అది గమనించిన ఆదినారాయణ, “ఒక పని చేద్దాం సీతా! ఇవాళ బుధవారం. వచ్చే శనివారం నాడు మన బడిలో అందరి ముందూ నువ్వు నీ ఉపన్యాసాన్ని వినిపించు. అందరూ తెలిసినవాళ్ళే కాబట్టి నువ్వు ఏదైనా తప్పు చేసినా ఎవ్వరూ పట్టించుకోరు. ఆ అనుభవం నీకు పోటీలో పాల్గొనడానికి కొండంత ధైర్యం ఇస్తుంది. సరేనా?”, అని అడిగాడు.
“సరే సార్!”, చెయ్యలేనని ఎలా చెప్పాలో అర్థంకాని పరిస్థితుల్లో ఆదినారాయణ చెప్పినదానికి ఒప్పుకుంది సీత.
శనివారం రానే వచ్చింది. బడిపిల్లలందరినీ ఒక చోటకి చేర్చి, చిన్న వేదికను ఏర్పాటు చేసి, ఉపన్యాసం ఇవ్వమంటూ సీతను వేదిక మీదికి పిలిచాడు ఆదినారాయణ. సీత మెల్లిగా వేదికపైకి ఎక్కి అందరిముందూ నిలబడింది. అందరూ సీతవైపే చూస్తున్నారు. వారిని చూడగానే వెన్నులోంచీ వణుకు పుట్టి కాళ్ళూ, చేతులూ చల్లబడిపోయాయి సీతకు. ఉపన్యాసం మొదలుపెడదామంటే సీతకు గొంతు పెగలట్లేదు. ముచ్చెమటలు పట్టేసి భూమి గుండ్రంగా తిరిగినట్లనిపించి కళ్ళు తిరిగి వేదికపైన పడిపోయింది సీత. ఆదినారాయణతో సహా అక్కడున్నవారంతా కంగారుగా సీతపై నీళ్ళు చల్లి లేపి, కాసిని నీళ్ళు తాగించి కొంచెం తేరుకున్నాక సీతను ఇంట్లో దిగబెట్టి వచ్చారు. ఆ మరుసటి రోజు, అంటే ఆదివారం ఉదయం, సీత తండ్రి కిట్టయ్య ఆదినారాయణ ఇంటికి వచ్చి ఆదినారాయణ ముందు చేతులు కట్టుకుని వినయంగా నిలబడ్డాడు.
“ఏమిటి విషయం కిట్టయ్యా? సీతకెలా ఉందీ?”, ఆప్యాయంగా కిట్టయ్య భుజంపై చెయ్యివేసి అడిగాడు ఆదినారాయణ.
“అయ్యా! సీతకు రాత్రంతా ఒకటే జ్వరం. ఆ పోటీ విషయంలో తెగ కంగారు పడిపోతోంది సీత. వెళ్ళలేనని గట్టిగా చెప్తే మీరు నొచ్చుకుంటారని మీ దగ్గర అది ఎదురు మాట్లాడట్లేదు. దానికి మీరంటే ఎంతో అభిమానం. మీ మాట సీత ఎన్నటికీ కాదనదు. కానీ ఈ ఉపన్యాసం అనేది దాని శక్తికి మించిన పనయ్యా. మీరే ఎట్టాగో ఈ సమస్యను పరిష్కరించాలి”, అన్నాడు కిట్టయ్య.
“అయ్యో అలాగా!! సీత రాసిన వ్యాసం నువ్వు చదివావా కిట్టయ్యా?”, అడిగాడు ఆదినారాయణ.
“లేదయ్యా! నాకు చదువు రాదు కదా!”, మొహమాటంగా చెప్పాడు కిట్టయ్య.
“ఎంత అద్భుతంగా రాసిందనుకున్నావ్? సీత వ్యాసాన్ని వేరే వారిచేత ఉపన్యాసంగా చెప్పించి సీతకు రావలసిన పేరునూ, కీర్తినీ వేరెవరికో కట్టబెట్టలేను కిట్టయ్యా. ఒక పని చెయ్యి! రేపు సీతను నా దగ్గరకి తీసుకురా! నేను చెయ్యవలసిన ప్రయత్నం చేస్తాను. తల్లిదండ్రులుగా నీ భార్యా, నువ్వూ సీతను చక్కగా ప్రోత్సహించండి. ఆ పై భగవంతుడి దయ!”, అన్నాడు ఆదినారాయణ.
“అట్టాగే అయ్యా! మీరేది చేసినా మా సీత మంచికే చేస్తారు. వస్తానయ్యా”, అంటూ తమ ఇంటికి వెళ్ళిపోయాడు కిట్టయ్య.
అన్నట్లుగానే మరుసటి రోజు ఉదయం సీతను వెంటబెట్టుకుని ఆదినారాయణ ఇంటికి వచ్చాడు కిట్టయ్య.
“కిట్టయ్యా! నేను ఇవాళ సీతను నాతో వనకోనకు తీసుకుని వెడుతున్నాను. సాయంత్రానికల్లా తిరిగి వచ్చేస్తాం”, అన్నాడు ఆదినారాయణ.
“సరేనయ్యా! మీతో ఉంటే సీత క్షేమంగానే ఉంటుంది. దానికి మీరు తండ్రిలాంటోరు”, అంటూ వెళ్ళిపోయాడు కిట్టయ్య.
“సీతా! మనం వనకోనకు బయల్దేరేముందు నువ్వు ఒక ప్రసంగం వినాలి. సుముఖి అనే అమ్మాయి ‘దయాగుణం’ మీద ఇచ్చిన ఈ ప్రసంగం గత ఏడాది ‘ఆనందాంబుధి’ సంస్థవారు నిర్వహించిన పోటీలలో ప్రథమ బహుమతి గెలుచుకుంది”, అంటూ ప్రసంగాన్ని తన సెల్ ఫోనులో సీతకు వినిపించాడు ఆదినారాయణ. సీత ప్రసంగాన్ని శ్రద్ధగా వినసాగింది.
పది నిమిషాలపాటూ ప్రసంగ రూపంలో మాటల ప్రవాహం అనర్గళంగా సాగిన తర్వాత, “యా దేవి సర్వభూతేషు దయా రూపేణ సంస్థితా..”, అంటూ ఆ స్తోత్రానికున్న అర్థాన్ని క్లుప్తంగా వివరించి తన ప్రసంగాన్ని ముగించింది సుముఖి.
“అబ్బ! ఎంత బాగుందో!”, అంది సీత.
“ఈ ప్రసంగానికి మొదటి బహుమతి ఎందుకొచ్చిందంటావు సీతా?”, అడిగాడు ఆదినారాయణ.
“ప్రసంగంలో సుముఖి చెప్పిన విషయాలూ, వాటిని చెప్పిన విధానమూ చాలా బాగున్నాయి సార్”, అంది సీత.
“సుముఖి పలికిన ప్రతి మాటలో అపారమైన ధైర్యం, తనపై తనకున్న నమ్మకం, అందరూ చెయ్యవలసిన పనిపై తనకున్న స్పష్టతవంటివి ప్రతిధ్వనించాయి. ఆమె గొంతులో ఆత్మస్థైర్యాన్ని గమనించావా?”, సీతను అడిగాడు ఆదినారాయణ.
“అవును సార్! అది పోటీ అని అసలెక్కడా భయపడినట్లు లేదు సుముఖి”, అంది సీత.
“సుముఖితో మాట్లాడతావా?”, సీతను అడిగాడు ఆదినారాయణ.
“మాట్లాడతాను సార్”, అంది సీత ఉత్సాహంగా.
ఆదినారాయణ సుముఖికి ఫోను చేసి మాట్లాడమని సీతకు ఫోను ఇచ్చాడు. సీత తనని తాను పరిచయం చేసుకుని సుముఖికి అభినందనలు చెప్పింది. సుముఖి మాట్లాడుతున్నంతసేపూ తనకు ఎప్పటినుంచో పరిచయం ఉన్నవాళ్లతో మాట్లాడుతున్నట్లు అనిపించింది సీతకు. మాటలనుబట్టి సుముఖికి కూడా తనలాగే అవసరంలో ఉన్నవారికి సహాయపడటమంటే ఎంతో ఇష్టం అని గ్రహించింది సీత.
“సీతా! నేను ఇప్పుడు ‘ఆనందాంబుధి’ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న వనకోన వైద్య శిబిరంలో ఉన్నాను. నన్ను కలవడానికి ఎప్పుడైనా వస్తావా?”, అడిగింది సుముఖి.
“అరె! నేను మా సార్‌తో కలిసి ఇవాళ వనకోనకే వస్తున్నాను. వీలైతే నిన్ను తప్పక కలుస్తాను”, అంది సీత.
అది విన్న ఆదినారాయణ, “సీతా! మనం సుముఖిని కలవడానికే వనకోనకు వెడుతున్నాం”, అన్నాడు చిరునవ్వుతో.
“అలాగా సార్?”, అంటూ విషయం సుముఖికి చెప్పి ఆదినారయణ కారును సంతోషంగా ఎక్కి కూర్చుంది సీత.
గంట ప్రయాణం చేసి వనకోన చేరుకున్నారు ఆదినారాయణ, సీతలు. వైద్య శిబిరం డాక్టర్లతో, నర్సులతో, స్వఛ్చంద సేవకులతో, శిబిరానికి వచ్చిన రోగులతో కిటకిటలాడుతోంది. కొందరు రోగులకు వైద్య పరీక్షలు చేస్తున్నరు. కొందరు రోగులకు చికిత్సలు అందిస్తున్నారు. అక్కడి వాతావరణం చాలా హడావిడిగా ఉంది. ఆదినారాయణ శిబిరం పర్యవేక్షణ చేస్తున్న అధికారి వద్దకు వెళ్ళి తాము సుముఖిని కలవాలని అనుకుంటున్నట్లు చెప్పి, అందుకు అనుమతిని కోరాడు. అధికారి ఒప్పుకుని సుముఖిని రమ్మని కబురుపంపి ఆదినారాయణనూ, సీతనూ అక్కడున్న కుర్చీలలో కూర్చోమని చెప్పాడు. కొద్దిసేపటి తర్వాత ఒక యువతి ఆదినారాయణ వద్దకు వచ్చి, “సార్! బాగున్నారా?”, అని సీత వంక చూస్తూ చిరునవ్వుతో, “సీతా! నేనే సుముఖిని”, అంది.
సుముఖిని చూసిన సీతకు నోట మాట రాలేదు. ఎందుకంటే సుముఖి కేవలం మూడున్నర అడుగుల ఎత్తే ఉంది. ఆమెకు చేతులూ, కాళ్ళూ సరిగ్గా ఎదగకపోవడంవల్ల చక్రాల కుర్చీలో ఉంది.
సీత ఆశ్చర్యాన్ని అర్థం చేసుకున్న సుముఖి, “నేనెందుకిలా ఉన్నాననా నీ సందేహం? నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు మా అమ్మకు జ్వరం వచ్చిందట. అప్పుడు వైద్యం చేసిన డాక్టరు ఏవో మందులిచ్చారట. అవి మా అమ్మ కడుపులో ఉన్న నా మీద ప్రభావం చూపాయి. దాంతో నేనిలా పుట్టాను. అయితే మా అమ్మ నాకున్న లోపాలను కాకుండా నాకున్న ప్రతిభనూ, సామర్థ్యాలనూ చూపిస్తూ పెంచి, నాలో అంతులేని ధైర్యాన్ని నింపింది. నేను పుట్టినప్పటినుండీ చక్రాల కుర్చీలోనే ఉన్నా! కానీ సాధ్యమైనంతవరకూ నా పనులన్నీ నేనే చేసుకుంటా. అక్కడితో ఆపేస్తే నాకూ ఇతరులకూ తేడా ఏముంటుందీ అని అనిపించి ఒక మనిషిగా పుట్టినందుకు సాటి మనుషులకు సహాయపడాలని నాకు నేనే ఒక నిర్ణయం తీసుకున్నా. నా ఆశయం తెలుసుకున్న ‘ఆనందాంబుధి’ సంస్థవారు ఇక్కడ నాకు ఇతరులకు సహాయపడే అవకాశాన్ని ఇచ్చారు”, అంది.
“అమ్మా సుముఖీ! ఈ ఏడాది ఉపన్యాస పోటీలకు సీత వెడుతోంది. కానీ అందరిముందూ మాట్లాడేందుకు తను భయపడుతోంది”, అన్నాడు ఆదినారాయణ.
సుముఖి చిరునవ్వుతో, “అలాగా సార్?!”, అని సీతతో, “సీతా! భయమెందుకూ? నేను చెయ్యగలిగిన పనిని నువ్వు ఖచ్చితంగా బాగా చేస్తావు. నన్ను నమ్ము. నీ మాటలనుబట్టి ఇతరులకు సహాయపడే విషయంలో మన ఇద్దరి ఆశయం ఒకటే అని నాకు అనిపించింది. ఆ ఆశయం నెరవేర్చుకోవడానికి ‘ఆనందాంబుధి’ సంస్థవారు నిర్వహిస్తున్న పోటీ ఒక చక్కటి మార్గం. వాళ్ళు తలపెట్టే కార్యక్రమాలన్నీ మన ఆశయానికి చాలా దగ్గరగా ఉంటాయి. పోటీ రూపంలో వచ్చిన అవకాశాన్ని వదులుకోకు. దాన్ని ఉపయోగించుకుని నిన్ను నువ్వు నిరూపించుకో. భయపడకుండా అడుగు ముందుకేస్తే జీవితంలో నువ్వనుకున్నది సాధించగలవు!”, అంది.
ఆ మాటలు సీత మనసుకు తగిలాయి. ఆలోచనలో పడిన సీత ఆదినారాయణతో కలిసి రామాపురానికి తిరుగు ప్రయాణం అయ్యింది.
దారిలో ఆదినారాయణ, “సీతా! సుముఖికి ఉన్నదీ నీకు లేనిదీ ఏమిటో చెప్పగలవా?”, అని అడిగాడు.
“ధైర్యం! అమితమైన ఆత్మస్థైర్యం సార్!!”, సుముఖి ధైర్యాన్ని తలుచుకుంటూ విప్పార్చిన కళ్ళతో బదులిచ్చింది సీత.
“ధైర్యం మన తోడుంటే జీవితంలో ఎటువంటి కష్టాన్నైనా ఎదిరించి విజయం సాధించగలమని నిరూపిస్తోంది సుముఖి! సుముఖిని చూసి మనం నేర్చుకోవలసినది చాలా ఉంది”, అన్నాడు ఆదినారాయణ సీతతో.
అంతలో సీతావాళ్ల ఇల్లు వచ్చింది. ఆదినారాయణ సీతను కిట్టయ్యకు అప్పగించి, సీత తలను ఆప్యాయంగా నిమురుతూ, “సీతా! నీకున్న ప్రతిభను వెలికితీయాలనే తాపత్రయంతో నిన్ను ఉపన్యాసపోటీలలో పాల్గొనమని చెప్పాను. నీకది మరీ కష్టమని అనిపిస్తే వద్దులే! ఈ రాత్రికి ఆలోచించి రేపు ఉదయం నీ తుది నిర్ణయం చెప్పు!”, అన్నాడు.
మరుసటి రోజు ఉదయం సీత ఆదినారాయణ వద్దకు వెళ్ళి, “సార్! నేను పోటీలో పాల్గొనేందుకు సిద్ధం!”, అంది హుషరుగా.
“మంచి నిర్ణయం!”, అని ఆదినారాయణ సీతను మెచ్చుకుని ప్రోత్సహించాడు.
సీత ఉపన్యాస పోటీలలో అద్భుతమైన ప్రతిభను కనబరచి ప్రథమ బహుమతిని సొంతం చేసుకుంది. రామాపురం ప్రజలు సీతను కొనియాడి ఆమెకు విజయ నీరాజనాలు ఇచ్చారు.
సీత తను గెలుచుకున్న బహుమతితో నేరుగా ఆదినారాయణ వద్దకు వెళ్ళి, “సార్! ఈ విజయం మీరిచ్చినదే!”, అంటూ ఆదినారాయణ పాదాలకు నమస్కరించింది.
తన కల నిజమైనందుకు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైపోయిన ఆదినారాయణ సీతను లేవనెత్తి, “భేష్! మొత్తానికి పోటీలో విజయం సాధించావు సీతా! మన బడికి మంచి పేరు తేవాలన్న నా ఆశయం నీ గెలుపువల్ల నెరవేరింది!”, అన్నాడు.
“అంతా మీరిచ్చిన ప్రోత్సాహమే సార్! ఈ అనుభవంతో ధైర్యం విలువ ఎంత గొప్పదో తెలుసుకోగలిగాను. ఇక సుముఖిలాగా నేను కూడా అవసరంలో ఉన్నవారికి నాకు సాధ్యమైనంత సహాయం చేస్తా!”, అంది సీత నవ్వుతూ.
“సుముఖి నీలో విజయానికి కావలసినంత స్ఫూర్తిని నింపినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది! నువ్వనుకున్నట్లు మానవత్వపు పరిమళాన్ని ప్రపంచమంతా చాటి నీ ఆశయాన్ని నెరవేర్చుకో! విజయోస్తు!!”, అని సీతను మనస్ఫూర్తిగా దీవించాడు ఆదినారాయణ.
ఆంధ్ర ప్రదేశ్ లోని మచిలీపట్నంలో జన్మించిన జి.ఎస్.ఎస్. కళ్యాణి హైదరాబాద్‌లో పెరిగారు. ప్రస్తుత నివాసం అమెరికా. వీరి బాల్యమంతా ‘చందమామ’ కథలు చదువుతూ, అమ్మా, నాన్నా, అమ్మమ్మలు చెప్పిన కథలు వింటూ గడిచింది. తల్లిదండ్రులకు కర్ణాటక సంగీతమన్నా, తెలుగు సాహిత్యమన్నా ఎంతో ఇష్టం ఉండడం వల్ల కళ్యాణి గారికి కూడా సంగీత సాహిత్యాలపట్ల అభిమానం ఏర్పడింది. వీరి మొదటి రచన టీటీడీ వారి ‘సప్తగిరి’ మాస పత్రికలో ప్రచురితమయింది. 2018వ సంవత్సరంలో ‘తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ శాక్రమెంటో (TAGS)’ వారు నిర్వహించిన ‘శ్రీ UAN మూర్తి మెమోరియల్ రచనల పోటీ’లో వీరి మొట్టమొదటి కథ ‘సంక్రాంతి సంబరం – ఒక మధుర జ్ఞాపకం’ కన్సోలేషన్ బహుమతిని గెలుచుకుంది. ఆ తరువాత వీరు రాసిన కథలు పలు వెబ్-పత్రికలలోనూ మరియు ప్రముఖ ఆధ్యాత్మిక పత్రిక ‘భారత ఋషిపీఠం’లోనూ ప్రచురితమయ్యాయి. వీరు ఇంతవరకూ రాసిన కొన్ని కథలు ‘కదంబవన కుసుమాలు’ అన్న పేరుతో మూడు కథాసంపుటాలుగా ప్రచురించడం జరిగింది.