[డా. కొల్లు రంగారావు గారి వ్యాససంపుటి ‘ధర్మమే దైవం’ పై సమీక్ష అందిస్తున్నారు శ్రీ విహారి.]
డా॥ కొల్లు రంగారావుగారు తెలుగు సాహితీప్రియులకు సుపరిచితులు. తొమ్మిది కవితాసంపుటాల కవిగా పాఠకుల అభినందనల్ని అందుకున్నవారు. నాలుగు వ్యాససంపుటాల్లోని గవేషణాత్మక విషయ వివరణకు కవిపండిత విమర్శకుల ప్రశంసల్ని పొందినవారు. ఒక సంపాదకత్వ సంపుటి ‘స్వేచ్ఛా స్వరాలు’కూ ప్రముఖుల అభినుతుల్ని అందుకున్నారు.
డా॥ రంగారావుగారు ఈ 2025 సంవత్సరం ఏప్రిల్‌లో ప్రచురించిన వ్యాససంపుటి ‘ధర్మమే దైవం’ – సుప్రసిద్ధ జాతీయకవి, చిత్రకారులు, వక్త, వ్యాసకర్త, ‘సప్తపది’ ‘అష్టాక్షరి’ లఘు కవితాప్రక్రియల సృజనకర్త, పదప్రహేళికల నిర్మాత అయిన సుధామగారి భావస్ఫోరక ముఖచిత్రంతో వెలువడింది. వారిదే ముందుమాట కూడా వుంది.
ఆర్షధర్మ సంస్కృతిని అంతరాత్మలో కుదురుచేసుకుంటే అదే దైవారాధన. అది వ్యక్తిని దైవీయగుణ సంపద్వంతుని చేస్తుంది. వ్యక్తివికాసం, వ్యక్తిత్వ వికాసం – రెంటికీ పునాది ‘మూలకం’గా ధర్మం వుంటే – చిత్తశుద్దీ, ఋజువర్తన సాధ్యమవుతాయి. అర్థవంతమైన జీవిత గమనానికీ, పారమార్థిక చింతనకూ ‘ధర్మం’ చోదకశక్తి అయితే, దైనందిన చర్యల్లో కూడా – పాపం పుణ్యం విచికిత్స మంచివైపు సాగవలసిన నడతకు సహకరిస్తుంది. ధర్మమే ఆ వరుసలోని తర్వాతి మూడు పురుషార్థాల్ని నియంత్రించేటట్టు చూసుకోవాలంటారు విజ్ఞులు. ‘ధర్మో రక్షతి రక్షితః’ అని కదా సూక్తి.
‘ధర్మమే దైవం’ లో డా॥ రంగారావుగారు ఈ భావధారని చిన్నచిన్న వ్యాసాలుగా అందించారు. పుస్తకంలో 44 వ్యాసాలు ఉన్నాయి.
‘ధర్మమే దైవం’ అనే శీర్షిక గల మొదటి వ్యాసంలోని విషయ వివరణ ఫణితికి చిన్న ఉదాహరణగా ఈ క్రింది పేరాని చూడవచ్చు.
“ధర్మాధర్మాల మధ్య తేడా తెలిసిన వారు సత్కర్మలు మాత్రమే ఆచరిస్తుంటారు. అధర్మం దురాలోచనలను పెంచి పోషిస్తుంది. ఫలితంగా దుర్మార్గం పెచ్చరిల్లి ఇంటాబయటా ఎటు చూసినా అశాంతి వికటాట్టహాసం చేస్తుంది. ఫలితంగా వ్యక్తికి సమాజానికి జరిగే నష్టం పూడ్చలేనిది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా, నేర్పుగా పట్టుకోగలిగినా ప్రయోజనం అంతగా ఉండదు. ఇంకొంత ముందుచూపుతో మరీ ముఖ్యంగా ఆత్మవిమర్శతో అనుక్షణం జాగ్రత్తపడేవారు తమనుతాము ధర్మమార్గంలో ఉండేవిధంగా చూసుకుంటారు. ధర్మమార్గమే జీవన విధానమైనపుడు ఎటువంటి బాధలు భయాలు మనిషిని ఏమీ చెయ్యలేవు. అడుగడుగునా ఎదురయ్యే అవరోధాలు, ప్రలోభాలు తిప్పికొట్టగలిగే ధైర్యం ధర్మంవల్లనే సాధ్యపడుతుంది. నిత్యజీవితంలో ధర్మం మాటే వినిపిస్తుంది. మనోహర దృశ్యంగా బ్రతుకుబాటలో కనిపిస్తుంది.”
డా॥ రంగారావుగారి రచనాశైలికీ, దానిలోని సారళ్యానికీ కూడా ఇదే ఉదాహరణగా స్వీకరించవచ్చు. సులభగాహ్యమైన శైలి పాఠకాదరణకు మాత్రమే కాక, వారిలో ఆలోచనాత్మక నిర్ణయాలకూ దోహదపడుతుంది.
‘స్నేహ స్వరం’ ‘స్నేహాన్ని పదికాలాలపాటు కాపాడగలిగితే జీవితంలో విలువల నెన్నిటినో కాపాడుకోగలిగినట్లే’ అంటుంది. సంతానానికి తల్లిదండ్రులు వారసత్వంగా ఏ ‘మంచి’ని అందించి పోవాలో లక్ష్య సూచన చేస్తుంది ‘వారసత్వం’ వ్యాసం. చదువుని మించిన సంస్కారం ఆవశ్యకతని ఉద్ఘాటిస్తుంది ‘కనువిప్పు’. వృత్తి ప్రవృత్తుల్లో ‘శ్రద్ధాసక్తుల’ ప్రాముఖ్యాన్నీ, తద్వారా సత్ఫలితాల సాధన విధానాన్నీ వివరించింది – అదే పేరు గల వ్యాసం.
“జీవితం కోరికల పుట్టని ఒకరు చెబితే, అవసరాల గుట్టగా ఇంకొకరు అభివర్ణిస్తారు. కోరిక మనిషిని కుదురుగా వుండనివ్వదు. అవసరం అన్నివేళలా మనిషిని అతలాకుతలం చేస్తుంది. కోరికలు, అవసరాలు తీర్చుకునేందుకు, తీరని వాటి గురించి బాధపడడమే జీవితమనుకుంటే మనిషై పుట్టినందుకు ఎవరైనా సాధించగలిగేదేమేటి? కోరికలు, అవసరాలు శారీరకమైనవైనా, మానసికమైనవైనా మనిషిని స్థిమితంగా ఉండనీయవు. ఒకనాటి ఆడంబరం నేటి కనీస అవసరమై కూర్చున్నట్టు సమర్ధించుకున్నా, కోరికలు తీర్చుకోలేని జీవితం ఎందుకని ప్రశ్నించుకున్నా ఎవరి కొరిగేదీ ఏమీ ఉండదు.” అని భావాన్ని ఆలోచనా ప్రేరకం చేస్తూ, ‘సముచితం’ అనేది ఏదో దాన్ని నిర్ణయించుకుంటే – ‘మనయేవ మనుష్యాణాం కారణం బంధ మోక్షయ’ అన్న సంకెల నుండి విడివడవచ్చు అని సందేశం.
‘కరుణామృతం’ శీర్షికలోని ఈ వ్యాస భాగం – ధర్మమే దైవం -అన్న పేరులోని ఆంతర్యాన్ని స్ఫాటిక స్వచ్ఛంగా ఆవిష్కరిస్తోంది.
“ఎవరైనా సరే జీవితంలో ప్రతిఫలాపేక్షతో చేసే ప్రతి పనిలో స్వార్థం తొంగిచూస్తుందనేది నిష్ఠుర సత్యం. ఎదుటివారి హితాన్ని కోరి, వారి నుంచి ఏమీ ఆశించకుండానే వారికుపయోగపడాలనుకునే తీరు ఎవరినైనా మానవత్వానికి శాశ్వత చిరునామాగా మారుస్తుంది. ఆగ్రహం కన్నా అనుగ్రహం, విద్వేషం కన్నా క్షమాగుణం, భగవంతుని పట్ల చూపే శ్రద్ధాసక్తులకన్నా సాటిమనిషికి సాయపడాలనుకునే తీరు మనిషినే దైవంగా చూపుతాయి. నిజానికి దైవమెక్కడో దూరంగా వుందనుకుంటే పొరపాటు. అంతరంగంలో కరుణామృతాన్ని నింపుకొని ఆకలికి అన్నం, రోగానికి మందు, ఆపదల్లో ఆదుకొనే సుగుణం కాగలిగితే ప్రతి ఒక్కరూ దైవం స్వరూపాలే.”
ఉత్తమ మానవతీయ విలువల ఆచరణకూ, వాటి పరిరక్షణకూ ఎంతో స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని అక్షరీకరించారు డా॥ రంగారావుగారు. తద్వారా వారి హితాభిలాషనీ, మనోధర్మాన్నీ కూడా పఠితులకు ప్రేరణాత్మకం చేశారు.
ఇలా ‘ప్రసన్నత’; ‘సహనం’, ‘విజ్ఞత’, ‘సత్యనిష్ఠ’, ‘సున్నితత్వం’, ‘ఆత్మీయత’ వంటి సుగుణాఢ్యవర్తనకు అవసరమైన ప్రబోధాత్మక వ్యాసాలు ఈ సంపుటిని అవశ్య పఠనీయం మాత్రమే గాక వ్యక్తిత్వ వికాసానికీ ప్రయోజనాత్మకం అవుతున్నాయి.
‘కలకానిదీ విలువైనదీ’ ‘జీవితం’ అనేది శాశ్వత సత్యం. దాన్ని ఫలప్రదం, సుఖప్రదం, జయప్రదం చేసుకోమంటున్నాయి డా॥ రంగారావుగారి వ్యాసాలు. ఆ లక్ష్య సాధనకూ, కృషికీ ధర్మం బ్రతుకు గీత కావాలనేది అసలైన ప్రబోధం.
‘ధర్మమే దైవం’ ఏదో ఆధ్యాత్మిక వ్యాస సంపుటి అనే భావనతో పక్కన పెట్టవలసిన పుస్తకం కాదు. మనిషి ‘మనీషి’ కావటానికి అవసరమైన ఉపకరణాల్ని అందిస్తున్న జ్ఞానవిజ్ఞాన దీపిక ఇది! వ్యక్తిత్వ వికాస సాధనకు సవాలక్ష ‘మెట్లూ, గట్లూ’ చూసే వారికి ఆ శ్రమ లేకుండా గమ్యానికి దారిచూపే తోడుదీపం! పుస్తకాన్ని కొని చదవండి, చదివించండి!!
***
రచన: కొల్లు రంగారావు
కావ్య ప్రచురణ, కామారెడ్డి
పేజీలు: 93
వెల: ₹ 155/-
ప్రతులకు:
కె. రమ,
ఫ్లాట్ నం. 204 ఎ,
మైత్రి ది టౌన్ శైలి గార్డెనియా,
యాప్రాల్,
సైనిక్‌పురి,
సికింద్రాబాద్. 500087
విహారిగా సుప్రసిద్ధులైన శ్రీ జే.యస్.మూర్తి గారు 1941 అక్టోబర్ 15 న ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించారు. విద్యార్హతలు: ఎం.ఏ., ఇన్సూరెన్స్ లో ఫెలోషిప్; హ్యూమన్ రిసోర్సెన్ మేనేజ్మెంట్, జర్నలిజంలలో డిప్లొమాలు, సర్టిఫికెట్స్, జాతీయ, అంతర్జాతీయ సెమినార్లలో ప్రసంగాలు, వ్యాస పత్ర ప్రదానం.
తెలగులోని అన్ని ప్రసిద్ధ పత్రికల్లోను 350 పైగా కథలు రాశారు. టీవీల్లో, ఆకాశవాణిలో అనేక సాహిత్య చర్చల్లో పాల్గొన్నారు.
15 కథా సంపుటాలు, 5 నవలలు, 14 విమర్శనాత్మక వ్యాససంపుటాలు, ఒక సాహిత్య కదంబం, 5 కవితా సంపుటాలు, రెండు పద్య కవితా సంపుటాలు, ఒక దీర్ఘ కథా కావ్యం, ఒక దీర్ఘకవిత, ఒక నాటక పద్యాల వ్యాఖ్యాన గ్రంథం, ‘చేతన’ (మనోవికాస భావనలు) వ్యాస సంపుటి- పుస్తక రూపంలో వచ్చాయి. 400 ఈనాటి కథానికల గుణవిశేషాలను విశ్లేషిస్తూ వివిధ శీర్షికల ద్వారా వాటిని పరిచయం చేశారు. తెలుగు కథాసాహిత్యంలో ఇది ఒక అపూర్వమైన ప్రయోజనాత్మక ప్రయోగంగా విమర్శకుల మన్ననల్ని పొందింది.
ఆనాటి ‘భారతి’, ‘ఆంధ్రపత్రిక’, ‘ఆంధ్రప్రభ’ వంటి పత్రికల నుండి ఈనాటి ‘ఆంధ్రభూమి’ వరకు గల అనేక పత్రికలలో సుమారు 300 గ్రంథ సమీక్షలు చేశారు.
విభిన సంస్థల నుండి పలు పురస్కారాలు, బహుమతులు పొందారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు (1977) గ్రహీత. కేంద్ర సాహిత్య అకాడెమివారి Encyclopedia of Indian Writers గ్రంథంలో సుమారు 45 మంది తెలుగు సాహితీవేత్తల జీవనరేఖల్ని ఆంగ్లంలో సమర్పించారు. మహాకవి కొండేపూడి సుబ్బారావుగారి స్మారక పద్య కవితా సంపుటి పోటీలోనూ, సాహిత్య విమర్శ సంపుటి పోటీలోనూ ఒకే సంవత్సరం అపూర్వ విజయం సాధించి ఒకేసారి 2 అవార్డులు పొందారు.
అజో-విభో-కందాళం ఫౌండేషన్ వారి (లక్ష రూపాయల) జీవిత సాధన ప్రతిభామూర్తి పురస్కార గ్రహీత. రావూరి భరద్వాజ గారి ‘పాకుడురాళ్లు’ – డా. ప్రభాకర్ జైనీ గారి ‘హీరో’ నవలలపై జైనీ ఇంటర్నేషనల్ వారు నిర్వహించిన తులనాత్మక పరిశీలన గ్రంథ రచన పోటీలో ప్రథమ బహుమతి (రూ.50,000/-) పొందారు. (అది ‘నవలాకృతి’ గ్రంథంగా వెలువడింది).
కవిసమ్రాట్ నోరి నరసింహ శాస్త్రి సాహిత్య పురస్కార గ్రహీత.
6,500పైగా పద్యాలతో-శ్రీ పదచిత్ర రామాయణం ఛందస్సుందర మహాకావ్యంగా ఆరు కాండములూ వ్రాసి, ప్రచురించారు. అది అనేక ప్రముఖ కవి, పండిత విమర్శకుల ప్రశంసల్ని పొందినది. ‘యోగవాసిష్ఠ సారము’ను పద్యకృతిగా వెలువరించారు.
వృత్తిరీత్యా యల్.ఐ.సి. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ నుండి జనరల్ మేనేజర్‌గా పదవీ విరమణ చేశారు. ఫోన్: 9848025600
