నేనో అవ్వని…
వత్సరాలుగా
కుటుంబీకులకు
మెతుకులు
వెతికిపెట్టిన బువ్వని…
ఇంట్లో అందరూ
ఈ మూస బ్రతుకుతో
అలసిపోయారు…
వలసపోయారు…
పండక్కో పబ్బానికో
చాటంత మొహంతో
చాటంత ఫోనుతో
నాలుగు రోజులిక్కడ
వెలుగుతారు…
కూడబెట్టి కూడా తెచ్చిన
రూకల కట్ట
విలాసాల కులాసాల్లో
కరిగి తరిగిపోగా
మళ్ళీ పోదాం నగరం…
కూలిగా అదే స్వర్గం…
కన్న ఊరూ
ఉన్న ఊరూ వదలి
పాడీ పంటా వీడీ
రంగుల కలల్లో తేలుతూ
ఒక అస్పష్ట చిత్రానికి
ఇతివృత్తమై
చపలచిత్తమై
ఒయాసిస్సుకై
సంసార శ్రేయస్సుకై
ఓ సుందర ఉషస్సుకై…!

2 Comments
శ్రీధర్ చౌడారపు
వలసబతుకుల నేపథ్యంలో వాళ్ళ తల్లిదండ్రుల మానసాన్ని భలేగా చిత్రించిన మీ కవిత బాగుంది.
KV Subrahmanyam
caalaa baaguMdaMDI jOgaaraao gaaru,