కొన్ని సమయాలు
దుఃఖాన్ని వర్షిస్తూనే ఉంటాయి
మౌనం,
పొగమంచులా
మనసు చుట్టూ కప్పుకునే ఉంటుంది
బాధ,
గుండెలోంచి గొంతులోకి
అటునుంచి కళ్ళలోకి
ఆపై మళ్ళీ గుండెలోకి
అలా అలా అంతులేని
చక్కర్లు కొడుతూనే ఉంటుంది
బేలతనం,
బింకాన్ని చాటుచేసుకుని
ముఖంలో తొంగిచూస్తుంటుంది
జ్ఞాపకాలు,
పాతవేవో కొత్తవేవో తెలియకుండా
ఒకటి తరువాత మరొకటి వచ్చి
పరికించి పలుకరించి వెళుతుంటాయి
విషాదం,
అందేంత దూరంలో కూచుని
విచిత్రంగా విసుగ్గా గమనిస్తూ ఉంటుంది
విరక్తి,
మెల్లమెల్లగా దగ్గరకు వచ్చి
అంతా తాత్కాలికమే అని చెబుతూ
అనునయింపుల జ్ఞానబోధ చేస్తూంటుంది
ఒంటరితనం,
అన్నింటిపై అజమాయిషీ చేస్తూ
సమూహంలో కూడా
ఏకాంతాన్ని ఏర్పాటు చేస్తూ
వర్షిస్తున్న దుఃఖంలో తడిసిపొమ్మంటుంది
ఇది నిజం
అవును ఇదే నిజం
కాలం
కదిలినట్లు కనిపించనంతకాలం
ఆ కాలం
ముందుకు కదిలిందా
కదిలినట్లు అనిపించడం మొదలైందా
ముందు కొంతా, ఆ తర్వాత అంతా
అంతా అంతా మామూలే

చౌడారపు శ్రీధర్ చక్కని కవి. దీర్ఘ కవితలు వెలయించటంలో దిట్ట.
12 Comments
దోసపాటి వెంకట రామచంద్రరావు dvramachandaraorao@gmail.com
చాలా హృద్యంగావుంది.
శ్రీధర్ చౌడారపు
ధన్యవాదాలు మీ సహృదయ స్పందనకు
Koturi Sucharita roy
Prathi manasulo vunna bhavodvegalanu kluptanga vivarincharu kallaki addhinattu varnincharu..

శ్రీధర్ చౌడారపు
నీ స్పందన కూడా ఓ కవితలానే ఉంది సుచరితా. స్పందన తెలియజేసి ప్రోత్సహించినందుకు ధన్యవాదాలు
సేతుపతి
నూతన నిర్వచనాలా…కవి భావం ఏమిటో!
శ్రీధర్ చౌడారపు
దుఃఖం అనుభవంలోకి వచ్చినపుడు మనిషిలో కలిగే ఉద్వేగాలు వాటి వెన్నంటి ఉండే భావపరంపర. మీకు నా భావం అర్థం చేయించలేకపోయినందుకు మన్నించగలరు.
Narmada
So much truth in your wonderful and touching words Sridhar Garu
Chaalaa baavundi
శ్రీధర్ చౌడారపు
ధన్యవాదాలు నర్మదా. నేను బాలుగారి మరణాన్ని ఈ రీతిగానే ఇన్ని భావోద్వేగాలతోనే భావించాను. అనుభవించాను. ఓరోజంతా నాచుట్టూ మౌనం రాజ్యమేలింది. నేను పేర్కొన్నవన్నీ నా అనుభవంలోకి వచ్చినవే. ఆఖరి చరణమే నిత్యసత్యాన్ని తెలుపడం కోసం రాసాను. అంతే.
Ganesh
చాలా బాగుంది సార్
చదువుతున్నంత సేపు ఇవన్నీ నాకు కూడా కలిగిన, కలుగుతున్న అనుభవాలే అన్నట్లుగా అనుభూతి పొందాను.
Tirupathireddy
ఒంటరి విషాదంలో బేలగా బాధ పడే వారికి, శ్రీ ధర మౌన కాల జ్ఞాపకాల అక్షర రూప ఓదార్పు.
M.Kurma Rao
మీ అనుభవంలోకి వచ్చిన విషయం
కవితలో పొందు పరిచారు. మనోవల్మీకంలోని అనిశ్చితి
కనబడుతోంది. ముగింపు
మరింత నిర్దుష్టంగా భావస్పోరకం
గా వుండాల్సింది.
యద్దనపూడి సుధాకర్
శ్రీధరా! కవిత అంతా చాలా బావుంది…చివర్లోనే నా మట్టిబర్రకి అర్థం కాలేదు.