[గరెత్ డి జోన్స్ ఆంగ్లంలో రచించిన ‘ఎంగెల్‌బర్ట్’ అనే సైన్స్ ఫిక్షన్ కథని అనువదించి ‘ఎడారి లోకి..’ పేరిట అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
జరిగినదాంట్లో అతని తప్పేం లేదు. ఎవరూ అతడిని నిందించలేదు. కానీ ఎంగెల్‌బర్ట్ మాత్రం తన మిత్రుడిని కోల్పోయినందుకు తీవ్రంగా బాధపడ్డాడు, భరించలేని అపరాధ భావనకు లోనయ్యాడు. సాధారణంగా ఉండేందుకు ప్రయత్నించాడు, తోటి విశ్లేషకులతో కలిసి పని చేద్దామనుకున్నాడు, కానీ ప్రతీదీ శూన్యంగా, అర్థరహితంగా అనిపించసాగింది. అతని మెదడు లోని ‘నానోమెషీన్స్’ అతడినింకా తికమకకి గురిచేస్తున్నాయి. కాసేపు బయటకు వెళ్ళొస్తాననీ, తనని సంప్రదించడానికి ప్రయత్నించవద్దని బక్కర్‌కి చెప్పాడు. ఏ సప్లయిలూ, పరికరాలు తీసుకోకుండానే ఎడారిలోకి వెళ్ళిపోయాడు. అదే చివరిసారి అతను కనబడడం!
ఆగండి. కథ ముగియలేదు. మళ్ళీ మొదటికి వెళ్ళండి.
***
“నాకు అర్థం కావడంలేదు,” అన్నాడు ఎంగెల్‍బర్ట్. యార్డ్ చుట్టూ చూస్తూ, నోట్లోని ఆహారాన్ని లయబద్ధంగా, ఆలోచనాత్మకంగా నములుతూ, “వాళ్ళు నన్ను ఒంటరిగా ఎందుకు వదిలేయకూడదు?” అన్నాడు, ఆ ప్రశ్నకి జవాబు తన నోట్లోని ఆహారంలోనే ఎక్కడో ఉన్నట్లుగా.
“వాళ్ళు నిన్ను ఒంటరిగా వదలరు,” చెప్పాడు యూసఫ్. “ఎందుకంటే నువ్వు చాలా ఆసక్తికరంగా ఉన్నావు.” యూసఫ్ పొట్టిగా , బలిష్టంగా ఉన్నాడు, అతని నల్లటి జుట్టుకి చక్కని మీసం తోడైంది.
“నన్ను పొగుడుతున్నావని అనుకుంటున్నా.”
యూసఫ్ పక్కనే నడుస్తూండగా, ఆ యార్డ్ ప్రాంగణమంతా కలయతిరిగాడు ఎంగెల్‍బర్ట్. రెండు వైపులా తీగల కంచెలు, మిగిలిన రెండు వైపులా తెల్లటి తక్కువ ఎత్తున్న భవనాలు ఉన్నాయి. ఆ ప్రాంతమంతా వేడిగా ఉంది, దుమ్ముతో నిండి ఉంది. కంచె అవతల దృశ్యాలన్నీ భీకరమైన ఎండలో మసకగా గోచరిస్తూ, చాలా దూరం వరకూ విస్తరించి ఉన్నాయి.
“నువ్వు నిజంగా అంతలా విసిగిపోయుంటే మనం వెళ్ళిపోదాం” అన్నాడు యూసఫ్.
“వెళ్దాం.” అంటూ ఒంటె (ఎంగెల్‍బర్ట్) కంచెలను, వంగిపోయిన గేటును చూసింది. అవి ప్రత్యేకంగా సురక్షితంగా ఉండేలా రూపొందించబడలేదు. ఆ యార్డ్ ఏదో జైలుకు చెందినదేం కాదు, ఓ పరిశోధనా కేంద్రానికి చెందినది.
“లేదా నీకు విరామం అవసరమని చెప్పు” అన్నాడు యూసఫ్.
“చెప్పి ఏం చేయాలి?” అని అడుగుతూ ఎండిపోయిన భూమిపై ఎంగెల్‍బర్ట్ గట్టిగా చప్పుడు చేస్తూ ఉమ్మాడు. “జర్నలిస్టులు, లేదా పిచ్చివాళ్ళు, లేదా ధూర్త శాస్త్రవేత్తలు, లేదా ప్రభుత్వ ఏజెంట్లు నన్ను తమ స్వార్థ ప్రయోజనాల కోసం వెంటాడుతున్నారు.”
“ఇది కాస్త నాటకీయంగా ఉంది.” అంటూ నెమ్మదిగా తల అడ్డంగా ఊపి నవ్వాడు యూసఫ్. “నువ్వు నిజంగా అంత ముఖ్యమైన వాడివని అనుకుంటున్నావా?” అడిగాడు.
“ఖచ్చితంగా. నేను ప్రత్యేకమైనవాడిని.”
యూసఫ్ యార్డ్‌లోని నీడనిచ్చే ఒకేఒక మూలకు వెళ్లి గోడకు ఆనుకుని వంగి కూర్చున్నాడు. వారా మధ్యాహ్నం మిగిలిన సమయాన్ని తమకే పరిమితం చేసుకున్నారు. ఎంగెల్‌బర్ట్ నుండి పొందిన తాజా డేటాను విశ్లేషకులు పరిశీలించగా, అతని నానోప్రాసెసర్ అమర్చబడిన మెరుగైన మెదడుని, నానోమెషిన్ అమర్చబడిన మెరుగైన శరీరతత్త్వపు సామర్థ్యాలను గణించడానికి ప్రయత్నించారు. ఎంగెల్‌బర్ట్ ఇంకా నమలుతునే, యూసఫ్ పైకి వంగాడు.
“మనం వెళ్దాం,” కొన్ని క్షణాల మౌనం తర్వాత యూసఫ్ అన్నాడు. అతను అకస్మాత్తుగా, పట్టుదలగా లేచి నిలబడ్డాడు. అతను పొట్టి మనిషే, కానీ అతని మనస్సుని ఒక దిశలో కేంద్రీకరించనప్పుడు అతను చాలా గట్టిమనిషిగా కనిపిస్తాడు.
“ఇప్పుడేనా?” అన్నాడు ఎంగెల్‌బర్ట్.
“ఇప్పుడే.” అంటూ యూసఫ్ గేటు వైపు నడిచాడు. అతను కోడ్ అంకెలు నొక్కి ప్యాడ్ లాక్‌ను విప్పి, గేటులో ఒక సగ భాగాన్ని గట్టిగా తెరిచాడు, ఎంగెల్‌బర్ట్ అనుసరించేంత ఖాళీతో.
“నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు?” ప్రశ్న వినవచ్చింది.
ఆ గొంతు విశ్లేషకులలో ఒకరైన బక్కర్‌ది. నల్లగా ఉన్న ఓ కిటికీలోంచి వంగి చూస్తున్నాడు. వదులుగా ముడి వేయబడిన అతని టై కిటికీ ఫ్రేమ్‌పై సడలకుండా వేలాడుతోంది.
“కొంచెం స్వచ్ఛమైన గాలి పీల్చుకుని వస్తా!” బదులిచ్చాడు యూసఫ్. అతను వారి వెనుక ఉన్న గేటును జాగ్రత్తగా మూసేసాడు. ఒంటెతో కలసి గుంతలు పడ్డ రోడ్డుపైకి వెళ్ళాడు.
కొద్ది సేపటి క్రితం ఎంగెల్‌బర్ట్ చెప్పిన భయంకరమైన ప్రవచనాలు నిజమవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. వారు రోడ్డు పక్కన ఒక మైలు దూరంలో ఉన్న చిన్న పట్టణాన్ని సమీపించగానే, ధూర్తులు గుంపుగా గుమిగూడసాగారు. వారు ఎంగెల్‌బర్ట్ డొక్క వైపు చేరి, యూసెఫ్‌ను నెట్టేసారు; అతని తల్లిదండ్రులిద్దరినీ తిడుతూ అసభ్యకరంగా అరిచారు; శిక్షణ పొందిన జంతువులా ఎంగెల్‌బర్ట్ తమ కోసం ప్రదర్శన ఇవ్వాలని డిమాండ్ చేశారు; ప్రకృతికి అవమానమంటూ అతన్ని శపించారు.
చివరికి వాళ్ళు నిలిచిపోయారు, అడుగు ముందుకు వేసే కొద్దీ దారి మరింత భారంగా మారింది. ఒక పోలీసు కనిపించాడు, ఖాకీ యూనిఫాం ఎండకి వెలిసిపోయింది, తొడకి వేలాడుతున్న హోల్‌స్టర్‌లో తుపాకి ఉంది. అతని ముఖంలో అహంకారపూరితమైన చిరునవ్వు ఉంది.
“ఎందుకు గొడవ చేస్తున్నావు?” అని అడిగాడు.
“మనం వెనక్కి వెళ్దాం,” అన్నాడు ఎంగెల్‌బర్ట్, గోలగోల చేస్తూ, క్షణక్షణానికి పెరుగుతున్న జనసమూహాన్ని తప్పించుకోడానికి ప్రయత్నిస్తూ.
“మేమేం సమస్య సృష్టించలేదు,” చెప్పాడు యూసఫ్. “ఈ మనుషులని మీరు ఏదైనా చేయాలి.” అంటూ గొడవ చేస్తున్న పట్టణ ప్రజలను ఉద్దేశించి సైగ చేశాడు యూసఫ్. బదులుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిట్టారు. గొడవ పెరిగింది, అయితే ఎవరెవరు పాల్గొన్నారో చెప్పడం కష్టం.
“నీ యార్డ్‌కి తిరిగి వెళ్ళు” అన్నాడు పోలీసు.
జనం తోసుకుంటూండగా, ఎవరో పోలీసు వెనుక వైపుకి దూసుకెళ్లాడు. పోలీసు తన తుపాకీని తీసి బెదిరింపుగా చుట్టూ ఊపాడు.
జనసమూహం కాస్త తగ్గిపోయింది, దాంతో యూసఫ్, ఎంగెల్‌బర్ట్ తమ స్థావరం వైపు కొన్ని అడుగులు వెనక్కి వేశారు. ఇంతలో మళ్ళీ పోరాటం ప్రారంభమైంది.
ఎంగెల్‌బర్ట్ జనసమూహానికి ఎదురుగా ముందుకు దూసుకుపోతూ, తన పెద్ద తలతో ప్రజలను పక్కకు తన్నాడు. అతని పక్కగా ఉండడంతో యూసఫ్ ఇబ్బంది పడ్డాడు. పోలీసు తుపాకీ పేలింది, గాలిలోకి కాల్పులు జరిపింది. ప్రజలు తోసుకుంటూ, పరిగెత్తుకుంటూ, అరుస్తూ, శాపనార్థాలు పెట్టారు. ఎవరో యూసఫ్ ముఖంపై బలంగా కొట్టారు. అతను వెనక్కి తగ్గాడు, ఎంగెల్‌బర్ట్ వెనక్కి తిరిగి కోపంగా ఉన్న మరో ఇద్దరు స్థానికులపైకి దూసుకెళ్లాడు. వారిలో ఒకరు యూసఫ్‌ని నేలపై తోసేశాడు. దాంతో ఎంగెల్‌బెర్ట్ గట్టిగా పడిపోయాడు. అతని తల ఒక బండరాయిని ఢీకొట్టింది, శరీరం నిశ్చలమై పోయింది.
ఎంగెల్‌బర్ట్ తన స్నేహితుడికి రక్షణగా నిలబడ్డాడు, ఎంత వేగంగా పోగయ్యిందో అంతే వేగంగా మాయమైందా గుంపు. పోలీసు ఎంగెల్‌బర్ట్ వైపు చూసి తన పిస్టల్‌ను హోల్‌స్టర్‌లో పెట్టుకున్నాడు. అతను యూసఫ్ పక్కన వంగి అతని తలపై ఉన్న గాయంతో, ఎండిన నేలపై రక్తం మడుగులో ఉండటం చూశాడు. అతని నాడిని పరీక్షించాడు. ఊపిరి ఆడుతోందో లేదో తనిఖీ చేశాడు.
“అతను చనిపోయాడు,” అని అతను అన్నాడు.
ఆగండి. అది కూడా కథకి ప్రారంభం కాదు. దానికి ముందు ఏదో ఉంది, ఆ యార్డ్‌కి ముందు ఏదో ఉంది.
***
ఎంగెల్‌బర్ట్ మొదట్లో చాలాసార్లు గందరగోళానికి గురయ్యాడు. బయోఇంజనీరింగ్ చేసి, అతని మెదడులోకి నానోప్రాసెసర్‌లను ఇంజెక్ట్ చేయడం ద్వారా అమితమైన జ్ఞాన శక్తిని పొందాడు. అతని జీవితం తినడం, సుదీర్ఘ నడకలను ఆస్వాదించడం అనే సాధారణ ఉనికి నుండి, ప్రత్యేకమైన జీవిగా – ప్రపంచంలోనే మొట్టమొదటి, ఏకైక చేతనశీలమైన ఒంటెగా – సెలబ్రిటీగా మారింది. ఈ పరివర్తనకు నిధులు సమకూర్చిన ధనవంతుడైన షేక్ – ఎంగెల్‌బర్ట్‌తో అనేక సంభాషణలు జరిపాడు, కానీ అతని నూతన సృష్టి తన కొత్త స్థితికి సర్దుబాటు చేసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు స్పష్టమైనప్పుడు – త్వరగా అసహనానికి గురయ్యాడు.
తన చుట్టూ ఉన్న ప్రపంచం అకస్మాత్తుగా మారిన చాలా నెలల తర్వాత, ఎంగెల్‌బర్ట్ ఈ పరిశోధనా కేంద్రానికి మారాడు. ఇక్కడ ప్రపంచం చాలా చిన్నదిగా, కాస్త తక్కువ గందరగోళంగా ఉంది. ఒక యార్డ్, ఒక ప్రయోగశాల, ఒక శాల, ఇంకా యూసఫ్. ఆ వ్యక్తి అతని తొలి, ఏకైక స్నేహితుడయ్యాడు. యూసఫ్ ఎంగెల్‌బర్ట్‌ను ఒక వింతజీవిలా కాకుండా ఒక వ్యక్తిలా చూసుకున్నాడు. ప్రపంచాన్ని ఎదుర్కోవడానికి సహాయం చేశాడు.
అది నిజమే. మొదట అదే జరిగింది. కానీ ఇంకా ఏదో ఉంది.
***
“అతను మరణించి ఉండడు,” అన్నాడు ఎంగెల్‌బర్ట్.
“ఓయ్ లొట్టిపిట్టా, నేను అతన్ని చూసినప్పుడు చనిపోయాడని నాకు తెలిసింది. ఇంతకు ముందు నేను చనిపోయిన వాళ్ళని చూశాను. అతను చనిపోయాడు.” పోలీసు నెమ్మదిగా నిలబడి ఒంటె వైపు చూశాడు, తరువాత దాని వైపు తన వీపును తిప్పి వాకీటాకీ బయటకు తీశాడు. అతను దానిలో వేగంగా మాట్లాడి నిశ్శబ్దంగా ఉండిపోయాడు.
ఇంతలో, భుజం మీద టై వేలాడుతూ, రోడ్డు మీదకు పరుగెత్తుకుంటూ వచ్చాడు బక్కర్.
“ఏమైంది?” అంటూ, కొద్ది అడుగుల దూరంలో ఆగి నేలపై ఉన్న మృతదేహాన్ని చూస్తూ ఉండిపోయాడు. “యూసుఫ్? అతనేనా..” అన్నాడు.
“చచ్చిపోయాడు.” అంటూ పోలీసు వాకీటాకీని దాని హోల్‌స్టర్‌లోకి తోశాడు. “ఇతని కోసం ఒక ట్రక్కు పంపుతున్నారు.” అని చెప్పి, అతను రోడ్డు దాటి ఒక రాతి బెంచ్ మీద కూర్చోవడానికి వెళ్ళాడు.
అక్కడికి చేరిన విశ్లేషకులు యూసఫ్ పక్కన కూర్చున్నారు.
“నేను అతన్ని కాపాడగలను,” చెప్పాడు ఎంగెల్‌బర్ట్. “నా నానోమెషీన్లు కాపాడగలవు.” అన్నాడు.
బక్కర్ తలెత్తి చూసాడు. “నువ్వు చెప్పింది నిజమే కావచ్చు. కానీ అవి ఒంటె శరీరతత్త్వానికి అనువుగా ప్రోగ్రామ్ చేయబడ్డాయి, మానవ శరీరతత్త్వానికి కాదు.”
“నేను చాలా లోతుగా నేర్చుకున్న విషయాలలో మానవ శరీరశాస్త్రం ఒకటి” అన్నాడు ఎంగెల్‌బర్ట్. “నా నానోప్రాసెసర్లు ఇప్పటికే రీప్రోగ్రామింగ్ ప్రారంభించాయి.” చెప్పాడు.
“నువ్వు సజీవంగా ఉండగా అలా చేయలేవు,” అంటూ నిరసన వ్యక్తం చేశాడు బక్కర్. “మేము ప్రయోగశాలలో ఒక ప్రత్యేక బ్యాచ్‌ను సృష్టించాలి.” అన్నాడు
“ఇప్పుడంత సమయం లేదు,” అన్నాడు ఎంగెల్‌బర్ట్. “ జరిగిన నష్టం శాశ్వతమైనది మారడానికి ఇంక కొన్ని నిమిషాలే ఉన్నాయి.” అన్నాడు.
“నానోమెషీన్లు ఇప్పుడు నీ శారీరక ప్రక్రియలో అంతర్భాగం. వాటి సరైన కాన్ఫిగరేషన్ లేకుండా నువ్వు మనుగడ సాగించలేవు. అవి నీ జీవవిధులకు మద్దతు ఇస్తున్నాయి.”
“నాకు తెలుసు.” అంటూ ఎంగెల్‌బర్ట్ యూసెఫ్ ముఖం మీద పెద్ద తునకలా ఉమ్మి వేశాడు.
“ఏమిటిది?” అంటూ విశ్లేషకులు అతని కాళ్ళ వైపు ఎగిరి దూకారు.
“అత్యంత సమర్థవంతమైన డెలివరీ పద్ధతి,” చెప్పాడు ఎంగెల్‌బర్ట్ చెప్పాడు. తన జీవ ప్రక్రియకై ఆధారపడవలసి వచ్చిన ఊతకర్రను కోల్పోవడంతో అతను మోకాళ్లపై పడిపోయాడు.
యూసఫ్ వణుకుతూ, కదిలాడు, అతని కళ్ళు తెరుచుకున్నాయి. అతను దృష్టి మరల్చకుండా పైకి చూశాడు, తరువాత మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు, విశ్రాంతి తీసుకుంటున్నాడు, అపస్మారక స్థితిలో ఉన్నాడు కానీ సజీవంగా ఉన్నాడు.
బక్కర్ ఒంటె పక్కన కూర్చున్నాడు. “అది పనిచేసింది,” అన్నాడు.
“మంచిది.” ఎంగెల్‌బర్ట్ మెడ వాలిపోయింది. “మీకో విన్నపం. నాకు ఎలాంటి ఆస్తులు లేవు. వీలునామా లేదు. నా దగ్గర ఉన్నది నా పేరు మాత్రమే.” అన్నాడు.
***
యూసఫ్ కళ్ళు తెరుచుకున్నాయి. అతను పరిశోధన కేంద్రంలో తన సొంత బంక్‌లో ఉన్నాడు. బక్కర్ అతని పక్కనే ఉన్నాడు.
“ఎంగెల్‌బర్ట్ నిన్ను కాపాడాడు,” మెల్లగా చెప్పాడు బక్కర్.
“అతను బాగున్నాడా?” అని యూసుఫ్ అడిగాడు.
బక్కర్ నెమ్మదిగా తల అడ్డంగా ఊపాడు.
బక్కర్ వద్దు వద్దన్నప్పటికీ, యూసఫ్ లేచి ఎంగెల్‌బర్ట్ మృతదేహం పడి ఉన్న ప్రయోగశాలకు వెళ్ళాలని పట్టుబట్టాడు. ప్రతిదీ తెలిసినట్లు అనిపించింది, కానీ అతని జ్ఞాపకశక్తి అయోమయంగా ఉంది. డెజావు మెరుపులా వచ్చింది.
“అతను నువ్వు అతని పేరు పెట్టుకోవాలని కోరుకున్నాడు,” చెప్పాడు బక్కర్.
“ఎవరు?” అంటూ యూసఫ్ ఒంటె శరీరం వైపు చూసాడు. ఇంతకు ముందు ఎప్పుడూ ఈ భవనంలో ఉన్నట్లు అతనికి గుర్తులేదు.
“ఎంగెల్‌బర్ట్.”
“నాకు అతను తెలుసా?”
“అవును. అతను నీ స్నేహితుడు.”
“ఖచ్చితంగా అయ్యుంటాడు.” అంటూ యూసఫ్ సుపరిచితమైన ల్యాబ్ వైపు చూశాడు. “నేను నడకకు వెళ్ళినట్లు గుర్తుంది.”
“అన్నీ నీకు జ్ఞాపకం వస్తాయి. నానోమెషీన్లు నీ మెదడును తిరిగి వైరింగ్ చేస్తున్నాయి.”
“నాకు విషయాలు గుర్తున్నాయి, కానీ అవి సరైన క్రమంలో లేనట్లుంది” చెప్పాడు ఎంగెల్‌బర్ట్.
సమాప్తం
మూల రచయిత పరిచయం:
(ఈ సైన్స్ ఫిక్షన్ కథలో, ఎంగెల్‌బర్ట్ అనే మగ ఒంటె సామర్థ్యాలని బయో ఇంజినీరింగ్ సహాయంతో మెరుగుపరుస్తారు శాస్త్రవేత్తలు. ఈ ఒంటె సమాజంలో ఇమడలేదు, సమాజం ఒంటెని అంగీకరించదు. ఒంటె తన నానో ప్రాసెసర్‌ని ఇవ్వడం ద్వారా తన స్నేహితుడైన యూసఫ్‌ను గుంపు దాడి నుండి రక్షిస్తుంది. కానీ దీని తర్వాత, యూసఫ్, ఎంగెల్‌బర్ట్‌ల జ్ఞాపకాలు కలగలిసిపోయి, యూసఫ్ తనను తాను ఒంటెలా భావించి ఎడారిలోకి వెళ్లిపోతాడు.)
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’ అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ అనువదించారు. ప్రముఖ హిందీ గీత రచయిత ఆనంద్ బక్షి జీవితచరిత్రని తెలుగులోకి అనువదించగా, ఇటీవల పుస్తక రూపంలో వెలువడింది.
ఓ ప్రముఖ ప్రచురణ సంస్థ కోసం అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు (అముద్రితం).
ప్రస్తుతం డా. సాధనా శంకర్ రచించిన Ascendance అనే సైన్స్ ఫిక్షన్ నవలని, డా. సుధాంశు మణి గారి My Train 18 Story ని అనువదిస్తున్నారు.
‘దేవుడికి సాయం’, ‘ఆహ్లాదపురం ఆరో వీధి’ అనే కథాసంపుటాలు, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.
