[స్వాతీ శ్రీపాద గారు రచించిన ‘ఎక్కడ’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]


వెలుగులు కనుమరుగవుతూనే
మత్తెక్కిన కనురెప్పలు వాలి తలవంచుకు
గడ్డకట్టిన గతం నదీ తీరాలవెంట
నగ్నంగా నడక సాగిస్తాయి
అప్పుడో ఇప్పుడో
ఆగి ఆగి లోలోపలి వెచ్చదనం ఆస్వాదిస్తున్న
మైమరపు పైకి తేలి పరవశిస్తుంటే
విసిరిన మోహపు వలలో చిక్కిన చుక్కలు
విలవిలలాడుతూ
రహస్యపు కలల జిలుగులను
దోసిళ్లతో ఒలకబోస్తాయి.
ఎప్పటికప్పుడు వ్యక్తమవుతున్న అవ్యక్తం
అరచేతిలో ఒదిగిపోయిన పాలపుంత ఒకటి
తలుపులూ కిటికీలూ లేని తలపుల్లో
చుక్కలు చుక్కలుగా రాలుతున్న
మధువై మావి చిగురై
పసికూన చిరునవ్వై
పదికాలాలు పల్లవిస్తుంది.
పుప్పొడి దారుల్లో విహరిస్తున్న
సీతాకోక చిలుకల రెక్కలను తాకి
పులకరింతల మధ్య పున్నాగ తలపుల మధ్య
వికసిస్తున్న వ్యామోహపు లయలో లయించి లుప్తమై
దారి తప్పిన ఉనికి.
సూర్యాస్థమయాల మధ్య
ఎన్ని జీవన వలయాలు చెరిగిపోయి
అదృశ్యమై
అదృశ్య రూపధారులై తిరుగాడుతున్న సమయాన
ఆటవికత ఎక్కడ? ఆధునికత ఎక్కడ?

అసంఖ్యాకంగా కవితలు, వందకు పైగా కథలు, అనేక నవలలు రాసిన స్వాతీ శ్రీపాద అనువాదాల ద్వారా తెలుగు సాహిత్యానికి ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చారు. స్త్రీ ఎల్లప్పుడూ అభ్యుదయపథంలో సాగాలనేదే ఆమె ఆకాంక్ష. తెలుగు, ఆంగ్లాల్లో పోస్ట్ గ్రాడ్యుయేటైన స్వాతీ శ్రీపాద వార్త దినపత్రికలో వారం వారం చెలి పేజీలో ‘మానస సంచరరే’ శీర్షిక నిర్వహించారు.