[స్పానిష్ సినిమా El Infierno ని విశ్లేషిస్తున్నారు డా. కాళిదాసు పురుషోత్తం.]
El Infierno 2010లో విడుదలైన స్పానిష్ భాషా చిత్రం. ఈ చిత్ర దర్శకుడు లూయి ఎస్ట్రాదా.


సినిమా చూస్తున్నంత సేపు భయంకరమైన హింసా దృశ్యాలు, జుగుప్స, భయంతో వణికిపోయాను.
మెక్సికో దేశం ఆర్థికంగా చితికిపోయి, నిరుద్యోగం, నేర ప్రవృత్తి, నైట్ క్లబ్బులు, జూదగృహాలతో నిండిపోయి, బాహాటంగా మారణాయుధాలు ప్రతివాడికీ అందుబాటులో ఉండి అక్కడి ప్రజల జీవితాలు సర్వనాశనమయ్యాయి.
ప్రధాన పాత్ర బెన్నీ (బెంజిమన్) ఇరవై ఏళ్ళ క్రితం ఏదో విధంగా అమెరికాలో ప్రవేశించాడు. అక్కడి పోలీసులు అతణ్ణి నిర్బంధించి మళ్ళీ మెక్సికోకు పంపించారు. మధ్య వయస్సు దాటిన బెన్నీ స్వగ్రామం – చిన్న టౌన్‌కు వస్తాడు. ఇరవై ఏళ్ళ క్రితం యువకుడిగా ఎన్నో ఆశలతో, కలలు కంటూ అమెరికాకు ప్రయాణమై తల్లి ఆశీర్వాదాలు తీసుకునే దృశ్యం, ఇప్పుడు మళ్ళీ వృద్ధురాలైన ఒంటరి తల్లిని చూస్తాడు.
బెన్నీ నివసించిన టౌన్ అలాగే ఉంది కాని, అక్కడి పరిస్థితులన్నీ మారిపోయాయి. అతని తమ్ముడు మరణించాడు, 16 సంవత్సరాల కుమారుడితో తమ్ముడి భార్య నైట్ క్లబ్లో పని చేస్తూ, శరీరాన్ని అమ్ముకుంటూ జీవిస్తోంది. బెన్నీ ఆ కుటుంబానికి అండగా వుండి తమ్మడి కుమారుణ్ణి పైకి తీసుకొని రావాలని భావిస్తాడు.
టౌన్లో ఒక బంధువు ట్రక్కు టైర్లు పంక్చర్ వేసి జీవించే వ్యక్తి ఉంటాడు. మరొక మిత్రుడు కోచిలోకో – ఆ టౌన్ లోనే మాదక ద్రవ్యాలు విక్రయించే డాన్ – హాసే రేయస్ – వద్ద పని చేస్తుంటాడు. తనతో పాటు డాన్ దగ్గర పని చేయమని అతను పిలిచినా, అటువంటి పనులు తనకు సమ్మతం కాదంటాడు బెన్నీ, కాని చివరకు డాన్ ముఠాలో సభ్యడిగా చేరవలసి వస్తుంది. డబ్బు పుష్కలంగా ముడుతూ ఉండడంతో బెన్నీ తమ్ముడి భార్యతో సహజీవనం మొదలుపెట్టి తమ్ముడి కుమారుడిని వృద్ధిలోకి తీసుకొని రావాలని భావిస్తాడు. బెన్నీ త్వరగానే కొత్త జీవితానికి అలవాటు పడి, డ్రగ్ కార్టల్ ముఠా నాయకుడి అభిమానాన్ని, నమ్మకాన్ని సంపాదించుకొంటాడు. డాన్ ముఠా సభ్యుడిగా కిడ్నాపింగ్‌లు, మత్తు మందుల వ్యాపారం, హత్యాకాండలలో పాల్గొంటూ అందరికీ భయం గొలిపే నాయకుడిగా ఎదుగుతూ, గుర్తింపు పొందుతాడు. ఈ క్రమంగా విలాసవంతమైన జీవితానికి, హోదా, కార్లు, అమ్మాయిలు, కొత్త రకం తుపాకులు, మారణాయుధాలు అన్నీ సొంతం అవుతూంటాయి. ఇదంతా సాగుతున్నా బెన్నీలో న్యాయం, నీతి వంటి భావాలు పూర్తిగా తుడిచిపెట్టబడలేదు. హింస, అవినీతిని ప్రశ్నిస్తూనే ఉంటాడు.


తమ్ముడి భార్య లూపితా ఇప్పుడు క్లబ్ డాన్సర్ పని మాని బెన్నీతో కలిసి జీవిస్తూ, ఒక గృహిణి హోదాలో భద్రజీవితం అనుభవిస్తూ సంతృప్తిగా ఉంటుంది.
బెన్నీ ఈ కొత్త జీవితం కూడా త్వరలోనే విచ్ఛిన్నమవుతుంది. మత్తు మందులమ్మే కార్టెల్ ముఠాలు ఎటువంటి దయాదాక్షిణ్యాలు లేనివి. ఒకరి పట్ల విశ్వాసంగా వ్యవహరించటం కూడా శాశ్వతం కాదు ఈ ముఠాలకు. బెన్నీ పనిచేస్తున్న ముఠా – డాన్ – నాయకుడు తన అనుచరుల్లో ముఖ్యుడు, బెన్నీ మిత్రుడు అయిన కోచిలోకోని చంపమని ఆజ్ఞాపిస్తాడు అనుచరులను. మిత్రుడు కోచిలోకో హత్యతో బెన్నీ హృదయం పగిలిపోతుంది. తను ప్రవేశించిన ఈ మత్తుమందు వ్యాపార ప్రపంచం ఎంత నిర్దాక్షిణ్యమైనదో గ్రహిస్తాడు. ఒకసారి కోచిలోకో బెన్నీని తన ఇంటికి తీసుకొని వెళ్ళి భార్యను, చిన్న చిన్న బిడ్డలను పరిచయం చేస్తాడు. కోచిలోకో ఆ చిన్నారుల భవిష్యత్తు కోసం ఈ హింసామార్గాన్ని అనుసరించి, అందులోనే కాలి భస్మమయ్యాడు. తను చేస్తున్న పనిలో క్రూరత్వం, అమానుషత్వం కోచిలోకో మర్డర్‌తో బెన్నీకి పూర్తిగా అర్థమవుతుంది. తాను ఏదో మంచి జీవితాన్ని ఆశించి ప్రవేశించిన ఈ రహస్య, మత్తుమందు వ్యాపార లోకం ముగింపు లేని హత్యలు, దారుణ కృత్యాలకు తప్ప ఎందుకూ పనికిరాదని అతనికి బోధపడుతుంది.
బెన్నీ నిర్వేదంతో ఆధారాలన్నీ పోగుచేసి పోలీసు అధికారిని కలిసి తన ముఠా గురించిన రహస్యాలన్నీ చెప్పేస్తాడు. పోలీసు అధికారి కూడా కార్టెల్ ముఠాకు అమ్ముడుపోయిన మనిషే. అతడు బెన్నీ బాస్‌కు ఫోన్ చేసి “నీ మురాలో ఒకడు నా వద్ద ఉన్నాడు, నీ గుట్టుమట్లన్నీ ఇప్పుడు నా చేతిలో ఉన్నాయి” అని బేరం పెడతాడు. పోలీసులు బెన్నీని డాన్‌కు అప్పగించడానికి తీసుకొని వెళుతూంటారు. “మీకు ఎంత వస్తుంది, నన్ను అప్పగిస్తే?” అని అడుగుతాడు. “మాకు 6000 మెక్సికన్ డాలర్ల ముడ్తాయి” అంటారు.


ఇద్దరు పోలీసు ఆఫీసర్లతో “నేను మీకు చెరి ఏభై వేల అమెరికా డాలర్లు ఇస్తాను, నన్ను విడిచిపెడితే” అని అంటాడు. వాళ్లు అంగీకరించడంతో తనను తన తమ్ముడి సమాధి వద్దకు తీసుకొని వెళ్ళమని కోరతాడు. తాను తన ధనాన్నంతా పూడ్చినది తవ్వి తీస్తాడు. పోలీసులు దురాశతో బెన్నీని కాల్చి పడేసి అతడు దాచుకొన్న ధనమంతా తీసుకొని వెళ్ళిపోతారు.
పోలీసులు కాల్చినపుడు బెన్నీ స్పృహ తప్పి పడిపోయినా, తెల్లవారి స్పృహ వచ్చి, ఎలాగో తల్లి వద్దకు చేరుకొని కొన్ని నెలల్లో కోలుకుని స్వస్థత పొందుతాడు.
బెన్నీకి తన జీవితం, ఆ మత్తుముందు నేరపూరిత వ్యాపారం, ఆ కార్టెల్ డాన్లు – అన్నిటి మీద జుగుప్స కలుగుతుంది. తన డాన్ హోసే రేయస్ ఇప్పుడు ఆ టౌన్‌కు ఎన్నికయిన గవర్నరు. మెక్సికో 200 సంవత్సరాల స్వాతంత్ర దినం చాలా ఘనంగా జరుగుతోంది. డాన్ హోసే రేయస్ గవర్నరు హోదాలో జండా వందనం చేస్తూంటాడు. అప్పుడే జనంలో ఉన్న బెన్నీ ఆటోమేటిక్ రైఫిల్‌తో అక్కడు సమావేశమైన నాయలందరినీ డాన్‌తో సహా కాల్చి పడేస్తాడు. పోలీసులు బెన్నీని కాల్చేస్తారు. కథ ముగుస్తుంది.


ఇందులో ఉప కథ బెన్నీ సోదరుడు – డాన్ హోసే రేయస్ సోదరుడి ముఠాలో పనిచేస్తుంటాడు. డాన్ హోసే కుమారుణ్ణి యువరాజులాంటి వాడ్ని – ప్రత్యర్థులు కాల్చేస్తారు, తన కుమారుడి రహస్యస్థావరం గుట్టును తన ముఠాలోని కోచిలోకో (బెన్నీ ఆత్మీయ మిత్రుడు) చెప్పాడని అతణ్ణి చంపుతారు. కాని రహస్య స్థావరం గుట్టు చెప్పింది బెన్నీ తమ్ముని కుమారుడు – 16 సంవత్సరాల బాలుడని చివరన తెలుస్తుంది. ఆ బాలుడికీ ఓ కారణం ఉంది. డాన్ తన తండ్రిని హత్య చేయించినందుకు ప్రతీకారం తీర్చుకోవడం.
బెన్నీ కుమారుడు వ్యక్తుడై మళ్ళీ ఈ డ్రగ్ కార్టెల్సులో చేర్తాడని మనం భావించవచ్చు. రక్తసిక్తమైన ఈ హత్యాకాండకు, అమానుషత్వానికి అంతం ఉండదు అనే స్ఫురణతో సినిమా ముగుస్తుంది.
సినిమా చూస్తున్నపుడు ఈ గన్ కల్చర్, డ్రగ్స్ వ్యాపారాలతో కోటీశ్వరులైనా నిరంతరం మరణ భయంతో బ్రతకడం – ఆ సమాజం గూర్చి ఒక పార్శ్వాన్ని ఈ చిత్రం వివరంగా పరిచయం చేస్తుంది.
ఆ చిన్న టౌన్లో వీధుల్లో ఆడుతూ కనిపించే పసివాళ్ళ, హింసామార్గంలో జీవించే వారి కుటుంబాల అభద్రతను గురించి కూడా ఆలోచిస్తాము. డాన్ హోసే రేయస్ ముఠా బెన్నీ తమ్ముడి భార్యను కూడా చంపేస్తారు. బెన్నీ అమెరికా కల, మెక్సికోలో శాంతియుతంగా జీవించాలన్న ప్రయత్నం ఏదీ సాగవు.

డా. కాళిదాసు పురుషోత్తం గారిది ప్రకాశం జిల్లా తూమాడు అగ్రహారం. వీరి తండ్రిగారు గొప్ప సంస్కృత పండితులు. నెల్లూరులో స్థిరపడ్డారు. జననం 1942 మే. ముగ్గురు అక్కలు, ఒక అన్నయ్య. పెద్దక్క, రచయిత మిగిలారు. పెద్దక్క 97వ ఏట ఏడాది క్రితం స్వర్గస్తులయ్యారు.
రచయిత బాల్యంలో నాయనగారి వద్ద సంస్కృతం కొద్దిగా చదువుకున్నారు. నెల్లూరు వి.ఆర్.హైస్కూలు, కాలజీలో విద్యాభ్యాసం, యం.ఏ. తెలుగు ఉస్మానియాలో ఫస్ట్ క్లాసులో, యూనివర్సిటీ ఫస్ట్ గానిలిచి, గురజాడ అప్పారావు స్వర్ణ పురస్కారం ఆందుకున్నారు. హైదరాబాద్, స్టేట్ ఆర్కైవ్సు వారి జాతీస్థాయి స్కాలర్షిప్ అందుకొని వెంకటగిరి సంస్థాన సాహిత్యం మీద పరిశోధించి 1971 సెప్టెంబర్‌లో డాక్టరేట్ అందుకున్నారు. 1972లో నెల్లూరులో శ్రీ సర్వోదయ డిగ్రీ కళాశాలలో చేరి, ఆ కళాశాల ప్రిన్సిపల్‌గా రిటైరై నెల్లూరులో విశ్రాంత జీవితం గడుపుతున్నారు. ఫొటోగ్రఫీ, సినిమాలు, పర్యటనలు ఇష్టం. 15 సంవత్సరాలు మిత్రులతో కలిసి కెమెరా క్లబ్, ఫిల్మ్ సొసైటీ ఉద్యమం, దాదాపు పుష్కరకాలం నడిపారు. సాహిత్యం, సినిమా, యాత్రానుభవాలు వ్యాసాలు భారతినుంచి అన్ని పత్రికలలో అచ్చయ్యాయి.
2007లో దంపూరు నరసయ్య – ఇంగ్లీషు లో తొలి తెలుగు వాడిమీద పరిశోధించి పుస్తకం. 1988లో గోపినాథుని వెంకయ్య శాస్త్రి జీవితం, సాహిత్యం టిటిడి వారి సహకారంతో. డాక్టర్ మాచవోలు శివరామప్రసాద్ గారితో కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాచ్య పరిశోధన శాఖ వారికోసం పూండ్ల రమకృష్ణయ్య అముద్రిత గ్రంథచింతామణి సంపుటాలనుంచి మూడువందల పుటల “అలనాటి సాహిత్యం” గ్రంథానికి సంపాదకత్వం, 2011లో కనకపుష్యరాగం పొణకా కనకమ్మ స్వీయచరిత్ర ప్రచురణ. మనసు ఫౌండేషన్ సహకారంతో AP Sate Archives లో భద్రపరచిన గురజాడ వారి రికార్డు పరిశీలించి స్వర్గీయ పెన్నేపల్లి గోపాలకృష్ణ, మనసు రాయుడు గారితో కలిసి “గురజాడ లభ్య సమగ్ర రచనలసంకలనం” వెలువరించారు. మనసు ఫౌండేషన్ వారి జాషువ సమగ్ర రచనల సంకలనంకోసం పనిచేశారు. 2014లో “వెంటగిరి సంస్థాన చరిత్ర సాహిత్యం” గ్రంథ ప్రచురణ.
2021లో పెన్నేపల్లి గోపాలకృష్ణతో కలిసి అనువదించిన”letters from Madras During the years 1836-39″ గ్రంథం ‘ఆమె లేఖలు’ పేరుతో అనువాదం. (ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్-ఎమెస్కో సంయుక్త ప్రచురణ).
పూండ్ల రామకృష్ణయ్య అముద్రిత గ్రంథచింతామణి ఆనాటి సాహిత్య దృక్పథాలు మీద మాచవోలు శివరామప్రసాద్, అల్లం రాజయ్య నవలలు, కథలు మీద కుమారి ఉభయ భారతి పిహెచ్.డి పరిశోధనలకు పర్యవేక్షణ. ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ సంస్థాపక సభ్యులు, ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సభ్యత్వం.