[వాడ్రేవు చినవీరభద్రుడు గారు రచించిన ‘ఎల్లలోకము ఒక్క ఇల్లై’ అనే పుస్తకాన్ని విశ్లేషిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
‘అతడి పార్థివతీర్ధయాత్ర ఒక కల’ (పేజీ-277), ‘ఆ అద్దం నిండా అతడి ప్రతిబింబాలు’ (పేజీ-286) అనే రెండు శీర్షికల్లో ఆస్ట్రియా కవి జార్జి ట్రాకల్ (Georg Trakl) కవిత్వం పరిచయంతో పాటూ నమూనాలుగా కొన్ని కవితల అనువాదం కూడా అందించాడు రచయిత.
ఇంత వరకూ ఈ పుస్తకంలో ‘రాండమ్’గా మనం పరిశీలించిన అనువాదాలను విశ్లేషిస్తే రచయిత ‘అనువాదం’లో ‘అవగాహన’ లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ‘అనుభూతి’ స్వరూపాన్ని వివరించినంత తీవ్రత అనువాదం లోతులో లేదని అనిపిస్తుంది. రచయిత స్వీయానుభూతి వర్ణన, పాఠకుడిని మానసికంగా అనువాద కవితలలో ఆ అనుభూతిని అనుభవించేందుకు సిద్ధం చేస్తుంది. కానీ అనువాదాన్ని ఆంగ్ల మూల కవితలతో పోలిస్తే, ఆంగ్ల కవితను సంపూర్ణంగానో, సరిగ్గానో అర్థం చేసుకోలేకపోవటం కనిపిస్తుంది. మరి కవితలో ప్రతీకలు, పద ప్రయోగాలు, వాటి వెనుక ఉన్న లోలైన భావనలు అర్థం కాకుండానే ఇంత తీవ్రమైన అనుభూతిని రచయిత ప్రదర్శించటం అయోమయాన్ని కలిగిస్తుంది. ఎక్కడో సమన్వయం కుదరదు. ఈ నేపథ్యంలో ట్రాకల్ కవితల అనువాదాలను పరిశీలించాల్సి ఉంటుంది.
రచయితకు ‘రూమీ’ తరువాత ‘ట్రాకల్’ అంతగా నచ్చినట్టున్నాడు. 15 కవితలను అనువదించి అందించాడు. ట్రాకల్ కవిత్వాన్ని గురించి వ్యాఖ్యానిస్తూ ‘నీకు ఒకపట్టాన ప్రవేశం దొరకని కవిత్వాన్ని నువ్వు అర్థం చేసుకోవాలంటే ఒక దగ్గరి దారి, నువ్వు ఆ కవిత్వాన్ని నీ మాతృభాషలోకి అనువదించుకోవటం. నేనూ ఆ ప్రయత్నమే చేశాను’ అని రాయటం కనిపిస్తుంది. అర్ధంకానిదాన్ని అనువదించటం అర్ధం చేసుకోవటానికి దగ్గర దారి అనటంలోనే లోపం కనిపిస్తుంది. అర్ధం కాకుండా చేసే అనువాదం అర్ధరహితం అవుతుంది.
మొదటి కవిత ‘ఆర్త రావం’ కవిత అనువాదంలో ఆంగ్ల పదాలతో అక్కడక్కడా తేడా కనిపించినా దాదాపుగా సమానార్థాలే కనిపిస్తాయి. కానీ కవిత మొత్తం చదివినా, కవితలో ఏదో ఉందనిపిస్తూంటుంది. కానీ, ఏముందో అర్థం కాదు.
ప్రతీకలు తెలుస్తూంటాయి. కానీ ప్రతీకలలో ఇమిడి ఉన్న అసలు సత్యం బోధపడదు. ఈ కవిత కూడా ఆంగ్లంలో చదివితే సులభంగా బోధపడుతుంది.
‘జార్జి ట్రాకల్’ జీవితంలో తీవ్రమైన సంఘర్షణలు కనిపిస్తాయి. ఆయా సంఘర్షణల స్వరూపాలు అతని కవితల్లో ద్యోతకమవుతాయి. ఈ కవిత పేరు ఆంగ్లంలో ‘De profroundis’. ఇది బైబిల్ లో 130వ కీర్తనలో వచ్చే పదం. దీనికి ‘ఓ దైవమా! పాతాళలోకపు లోతుల నుంచి చేస్తున్న ఆర్తనాదం ఇది’ అన్న అర్థం వస్తుంది. ఈ కీర్తనను పశ్చాత్తప సంకీర్తన అంటారు. తీవ్రమైన బాధ, దుఃఖం, మానసిక క్షోభతో కూడిన అత్యంత లోతైన ప్రార్థన ఇది. ప్రతి పదంలో ఆర్తి కనిపిస్తుంది. ఈ ఆర్తి ట్రాకల్ కవితలోని ప్రతి పదంలో, ప్రతి ప్రతీకలో కూడా కనిపిస్తుంది. ఆ ప్రతీకలు ట్రాకల్ సంస్కృతి, సంప్రదాయాలు, ధార్మికపుటాలోచనలను ప్రతిబింబిస్తాయి. అవి పరిచయం లేని మనకు, ఆ పదాలకు సరైన మన భాష పదం వాడినా, అవి బోధపడవు. కవి భావ తీవ్రతను మనం గ్రహించలేము. కాబట్టి, ఇలాంటి భావనల కవితలను యథాతథంగా అనువదిస్తే, కవిత అర్థమయినట్టే ఉంటుంది. కానీ కవితలో ఇమిడి ఉన్న భావ తీవ్రత పాఠకుడికి అందదు.
ఈ కవితలో ‘నల్లని వాన’ ఒక ప్రతీక. మిగతా పదాలు ఒక రకమైన శూన్యాన్ని వర్ణిస్తాయి. విషాదాన్ని ప్రదర్శిస్తాయి. సాధారణంగా వాన వల్ల ప్రకృతి శుభ్రమౌతుంది. కనీ ‘నల్లటి వాన’ అనటంలో శుభ్రపరచే వానకు అది వ్యతిరేకం. అది విషాదానికి, దిగజారుడుతనానికి ప్రతీక. ప్రకృతిలో శూన్యత్వం కవి హృదయంలోని శూన్యాన్ని ప్రతిబింబిస్తుంది. అతడి లోని దిగజారుడుతనాన్ని, విషాదాన్ని, ప్రతిబింబిస్తుంది. ఇది పూర్తిగా క్రిస్టియన్ మత సంబంధిత ప్రతీకలున్న కవిత.
Golden and round her eyes are gazing in the dust అన్న పదానికి ‘గుండ్రం, పసిడి సమానం, ఆ కళ్లు సాయం సంధ్యని మేస్తున్నవి’ అని అనువాదం. ఇది ఓ అనాథ గురించి. ఆ అనాథ పిల్ల అమాయత్వానికి, స్వచ్ఛతకు, తీరని కోరికలకు ప్రతీక. అయితే ఈ పదంలో ‘gazing’ అన్న పదాన్ని అనువాదకుడు ‘grazing’ గా పొరపడ్డట్టున్నాడు. ‘gazing’ అంటే దేనివైపైనా దీర్ఘకాలం చూస్తూండటం. Grazing అంటే మేయటం.
ఇళ్లను మరచి వస్తున్న పసులకాపరులకి
ఆ ముళ్ల పొదలో కనిపించినవి
నశిస్తున్న కొన్ని తీపిగుర్తులు
ఈ stanza ఆంగ్ల కవితకు దగ్గరగా ఉన్నట్టనిపించినా అర్థంలో దూరం అయింది.
Returning home
Shepherds found the sweet body
Decayed in the bramble bush.
‘Bramble bush’ పదానికి ముళ్ళ పొద సరైన అనువాదం కానీ ‘sweet body’, తీపి గురుతు కాదు. ఈ stanza పూర్తిగా బైబిల్ సంబంధిత గాథల ప్రతీకకు సంబంధించినది. ‘అనాథ’ అమాయకత్వానికి, పవిత్రతకు ప్రతీక. కాబట్టి ఆమె శవం ‘sweet body’ అయింది. కానీ అది కుళ్ళిపోయిందిప్పుడు. ఇంటికి తిరిగి వస్తున్న పశుకాపరులు.. క్రీస్తును విశ్వసించేవారు, క్రిస్టియన్లు. వారికి ఆ పవిత్ర శరీరం ముళ్ల పొదలలో కుళ్లి కనిపించింది. అమాయకత్వం స్థానాన్ని దిగజారుడుతనం ఆక్రమించింది.
బైబిల్ను, యూరోపియన్లు, గ్రీకుల పురాణగాథలను పరిశీలిస్తే, ‘ముళ్ల పొదలు’ పాపానికి, ఆధ్యాత్మిక జీవన తిరస్కృతికి, శాపానికి ప్రతీక. యేసుక్రీస్తు తలపై ముళ్లకిరీటం ఉంచుతారు. అది తాత్కాలిక బాధ. కానీ ‘ముళ్లపొదలు’ శాశ్వతమైన సమాధికి నిదర్శనం. అంటే నిష్కృతి లేని స్థితి అన్నమాట. అమాయకంగా ఉండే అమ్మాయి శరీరం ముళ్ల పొదలలో కుళ్లటం అంటే దైవాన్ని వదలి శాశ్వత భ్రష్టత్వం పొందటం. బైబిల్లో ‘ఆడమ్, ఈవ్’ లకు దేవుడిచ్చే శాపం కూడా భూమిలో ముళ్ల పొదలు మొలవాలని. ఆధునిక సమాజ ఆధ్యాత్మిక భ్రష్టత్వాన్ని సూచిస్తుందీ stanza. ‘తీపి గురుతులు’ అనటంతో ఈ భావం రాదు. ఇలాంటి సందర్భాలలోనే అనువాదకుడి అవగాహన ప్రశ్నార్థకమవుతుంది. కవిత్వాన్ని అనువదించటం ద్వారా దాన్ని అర్థం చేసుకోవటం అంత సాధ్యమయ్యే పని కాదేమో అనిపిస్తుంది. అర్థం చేసుకోటానికి అనువాదం చేయటం కన్నా అవగాహన చేసుకున్న తరువాత అనువదించటమే, సక్రమము, సవ్యమైన పద్ధతి. అర్థం కాకుండా అనువదిస్తే, పాఠకుడికి అర్థమవటం అటుంచి, అనువాదకుడు అభాసుపాలవుతాడు. పైగా ఇలాంటి ప్రతీకలున్నప్పుడు వ్యాఖ్యానం కూడా అవసరం. అదిలేకుంటే, కవితాసౌందర్యం గ్రహించటం కష్టం.
ఈ కవితలో రచయిత క్రిస్టియన్ ప్రపంచపు ప్రతీకలతో తన అంతరంగ సంఘర్షణను, తనలో తాను అర్థం చేసుకున్న దిగజారుడుతనపు వేదనను, నిరాశను ప్రదర్శిస్తున్నాడు. ఇది అర్థం కావాలంటే రచయిత జీవితం గురించి తెలియటంతో పాటు ఆయన నమ్మిన క్రైస్తవం లోని గాథలూ తెలియాల్సి ఉంటుంది.
‘నా నుదటి మీద చల్లటి ఇనపటడుగులు’ అన్నది ‘On my forehead cold metal forms’ కి అనువాదం. ‘cold metal forms’ ఇనపటడుగులు కాదు. ఇది చాలా గొప్ప అతి భయంకరమైన, ఒళ్లు జలదరించే ప్రతీక. కవితలలో ‘నుదుటి పై’ ఒత్తిడి తెచ్చే metal, కణతపై అనించిన, పేల్చటానికి సిద్ధంగా ఉన్న తుపాకీ barrel ని సూచిస్తుంది. ట్రాకల్ సైన్యంలో వైద్యుడిగా పని చేశాడు. అతడి మానసిక వ్యథకు అది ఒక తీవ్రమైన కారణం. ఇది మానసిక దృష్టిలో చూస్తే ‘cold metal forms’ అర్థమయ్యే తీరు.
ట్రాకల్ స్వయంగా డాక్టర్. ఆ దృష్టితో చూస్తే ‘cold metal forms’ డాక్టర్లు వాడే పని సాధనాలు. ఆ కాలంలో మానసిక రోగులను నియత్రించేందుకు కూడా వైద్య పరికరాలు వాడేవారు.మానసిక రోగులను అతి దారుణంగా ఇనుప సంకెళ్ళలో బంధించి హింసించేవారు. Dorothea Dix, Nellie Bly వంటివారు జరిపిన నిరంతర పోరాటంవల్ల అక్కడి పరిస్థితులు మారేయి. cold metal forms ఆనాటి ‘మెంటల్ అసైలం’లలో ఇనుపగొలుసుల అమానుష చికిత్సావిధానాన్ని సూచిస్తుంది. ఇక్కడ ఆ వాక్యం వ్యక్తి పక్షపాతంలాంటి భావనను వదలలేక పోవటాన్ని, నిర్బంధితుడవటాన్ని, తన మానసిక రుగ్మతలో తానే బందీ అవటాన్ని సూచిస్తుంది.
క్రైస్తవ మత దృష్టితో చూస్తే ‘cold metal forms’ మరో అర్థాన్నిస్తుంది. ఇది మానవ చైతన్యం ఘనీభవించటాన్ని సూచిస్తుంది. ఈ stanza కు ముందు stanza
The silence of God
I drank from the woodland well ను
చెట్ల మధ్య పారుతున్న ఊటలోంచి
భగవంతుడి నిశ్శబ్దం కడుపారా తాగాను
తో అన్వయించుకోవాల్సి ఉంటుంది.
దివ్యమైన మౌనాన్ని స్వీకరించటం భౌతికంగా సంభవించే మార్పులకు ప్రతీక ‘cold metal’. తన శరీరంలోంచి జీవం వెళ్లిపోతుంటే, శరీరం నిర్జీవమై శీతలమైపోవటాన్ని సూచిస్తుంది. అందుకే తరువాత వాక్యంలో ‘spiders look for my heart’ అని శవాన్ని వర్ణిస్తాడు కవి. ఇక్కడ ‘దేవుడి నిశ్శబ్దం’ కూడా ప్రతీక. నైతిక విలువల పతనం, అస్తిత్వ రాహిత్యంతో సహా మానవ విశ్వాసపు పరిమితులన్నింటినీ ప్రదర్శిస్తుంది ఈ పదం. మనిషి పతనమవుతుంటే దేవుడు నిశ్శబ్దంగా చూస్తూన్నాడు. దీన్ని ‘I drank from the woodland well’ తో పోల్చాడు. ‘ఆయన బావి నుంచి విషం త్రాగాడు’. ఆ దేవుడు మనిషి పతనాన్ని చూస్తున్నాడు. ఫలితంగా వ్యక్తి మరణించాడు, ఆ విషాదంలో, ఆ విషంతో. ఇది బైబిల్లో ‘Hester Panim’ అంటే మనిషి బాధతో ఏడుస్తున్నా దేవుడు కరగక మౌనంగా ఉండటాన్ని సూచిస్తుంది. Book of Jacob లో జాకబ్ ఎంత కష్ట పడుతూన్నా, దేవుడు నిశ్శబ్దంగా ఉంటాడు. శిలువపై యేసు బాధపడుతూ ‘My God, My God. Why have you forsaken me?’ అని ప్రశ్నిస్తాడు. ఇది దేవుడి నిశ్శబ్దానికి బైబిల్ ప్రతీక. ఇక్కడ కవి ఆ నిశ్శబ్దం గురించి ప్రస్తావిస్తున్నాడు. ఆ నిశ్శబ్దం తరువాత మరణమే! అందుకే cold metal. ఇదే ‘There is a light that fails in my mouth’. ‘నా నోట్లో మరణిస్తున్న దొక కాంతి’ అన్నది క్షీణిస్తున్న భౌతిక, మానసిక, ఆధ్యాత్మికతలకు నిదర్శనం అని ఇప్పుడు ‘light that fails in my mouth’ అనగానే అర్ధమౌతుంది. ‘నోట్లో కాంతి మరణించటం’ అంటే మాటలు కూడా రాని స్థితి. మనిషి ‘నోరు’, సత్యం పలకటానికి, సృష్టికి, ఇతరులతో సంభాషించటానికి ప్రతీక. కవికి అది తన కవితా సృజన ప్రజ్ఞ. దేవుడి మౌనం అతడి ప్రజ్ఞనూ దెబ్బతీసింది. భాష, మాట, ఆలోచనలు, సృజన, సర్వం పోయి మానసికంగా శూన్యంలోకి దిగజారేడు కవి. అతడిలోని ‘దీపం’ ఆరిపోయింది. ఆత్మ వదలి వెళ్లిపోయింది.
పలు విమర్శకులు ఈ వాక్యం కవి తను తీసుకునే మాదకద్రవ్యాల తీవ్రమైన ప్రభావాన్ని ‘Autonecrosis'( మాదకద్రవ్యాలు అధికంగా వాడటంవల్ల కండరాలు నశించటం), catatonia’( మాదకద్రవ్యాల వాడకంవల్ల శరీరం కదలకపోవటం, మనిషి స్థాణువయిపోవటం) లను వర్ణిస్తున్నట్టు భావిస్తున్నారు.
సమస్య ఏమిటంటే, కవితతో పాటు ఇంత వివరణ ఇవ్వటం కుదరదు. కానీ ఇది తెలియందే పాఠకుడు కవితను అనుభవించలేడు. కవిత నేపథ్యం, ప్రతీకలు, కవితలో ఒదిగి ఉన్న లోతైన భావనలను పాఠకుడు అనుభవించాలంటే, కవిత సంపూర్ణంగా అవగాహన కావాలంటే ఇవన్నీ పాఠకుడికి తెలియక తప్పదు. ఇలాంటి కవితల కవితల అనువాదంలో ఇది ప్రధాన సమస్య.
రాత్రి నేనొక గుట్ట మీద పడి ఉన్నాను
అక్కడంతా పొగుపడ్డ చెత్త, నక్షత్రధూళి
ఇంత వరకూ మనం కవి ప్రదర్శించిన ఆంశాల గురించి అనేక విషయాలు చర్చించటం వల్ల అతడు పడి ఉండటం అర్ధమవుతుంది. ‘చెత్త’ అన్నది దిగజారుడుతనానికీ, యుద్ధం వల్ల కలిగే భయంకర పరిణామాలకు, అవినీతికి ప్రతీక అని తెలుస్తుంది. నక్షత్రధూళి అన్నది భగవంతుడికి, అంతరిక్షానికి, ఔన్నత్యానికి సంబంధించినది అని అర్థమవుతుంది. ఇలా కవిత, ప్రతీకలు, దానిలో దాగిన సౌందర్యాల వివరణ లేకపోతే – దిక్కులేని పిల్ల, ముళ్లపొదలు, భగవంతుడి నిశ్శబ్దం, చల్లటి ఇనపటడుగలు, నోట్లో మరణిస్తున్న కాంతి, నక్షత్రధూళి వంటి వన్నీ పాఠకుడికి అర్థం కాని అంశాలవుతాయి. రచయిత ముందు కవిని పొగిడేడు. కాబట్టి ఈ కవితల్లో మనకు అర్థం కాని గహ్యమైన అంశాలేవో ఉండి ఉంటాయని పాఠకుడు సంతృప్తి పడతాడు. ఇంత గహనమైన కవితలలో లోపలి అర్థాలను అవగాహన చేసుకుని, అనుభవించి అనువదించి అందిస్తున్న రచయిత పట్ల అభిమానం పెంచుకుంటాడు. ఇది స్వాభావికం. కానీ, నిజానికి రచయిత తన అనుభూతిని వివరిస్తున్నాడు తప్ప. తన అనుభూతిని పాఠకుడికి చేరువ చేసి, పాఠకుడి అనుభూతి స్థాయిని అవగాహన స్థాయిని పెంచటం లేదు. ఈ సమస్య ఆంగ్ల అనువాదాలతో కూడా వస్తుంది. కానీ వారు ధార్మిక ప్రతీకలు,సాంస్కృతిక అలవాట్లుతో కాస్త పోలికలుండటం వల్ల, పైగా, వారి పాఠ్యబోధనలో గహ్యమైన కవితల విమర్శ, విశ్లేషణలు ఒక భాగం కావటం వల్ల అక్కడి పాఠకులకు ఇలాంటి ప్రతీకలను ధార్మిక ప్రస్తావనలను అర్థం చేసుకోవటం కష్టం కాదు. కాని మనకు ఇలాంటి రచనా సంవిధానం కానీ, ప్రతీకలు కానీ, విశ్లేషణ పద్ధతి కానీ తెలియక పోవటం వల్ల కేవలం అనువాదం చేస్తే, పాఠకుడు ఏదో ఉందనుకుంటాడు తప్ప, ఏముందో తెలుసుకోలేడు. అందరూ పొగిడే అర్థం కాని ఆర్టు సినిమా చూసి, ‘ఏదో గొప్పతనం ఉండి ఉంటుంది. అర్థం కాలేదంటే అందరూ నవ్వుతార’ని, తాను అర్థం అయినట్టు పొగిడేస్తాడు తప్ప ఆనందించలేడు. కానీ అనువాదాలు చదువుతుంటే, అనువాదకుడికి కూడా ఈ కవితలు సరిగ్గా అర్థమయినట్టు కానీ, ప్రతీకలు, భావాల లోతు కానీ అనువాదకుడు అనుభవించినట్టు కానీ అనిపించదు. అర్థమయితే అనువాదం కానీ, వాడిన పదాలు కానీ, వివరణ కానీ మరో రకంగా ఉండేది. ఈ లోపం దాదాపుగా ప్రతి అనువాద కవితలోనూ కనిపిస్తుంది.
జార్జి ట్రాకల్ 15 కవితల అనువాదాన్ని ఇలా పదం పదం విశ్లేషిస్తూపోతే ఇది ఒక ప్రత్యేక పుస్తకం అవుతుంది. అందుకని ఒకటి రెండు కవితలలో ప్రతీకలను స్పృశించి, అనువాదం ఆ ప్రతీకలను అర్థరహితం చేసిన విధానం తెలుసుకుని ట్రాకల్ను వదలి ముందుకు సాగాల్సి ఉంటుంది.
‘Summer’ అనే కవిత ‘వేసవి’గా అనువాదమయింది. ఆంగ్ల పదాల అర్ధాలు తెలుగులో దాదాపుగా సరిపోతాయి.
సాయంకాలానికి కోకిల రోదన
అడవిలో మూగపోతుంది
సస్యం మరింత కిందకి వాలుతుంది
ఆ ఎర్రటి పువ్వుతో సహా
ఆంగ్లంలో
At evening in the woods
the cuckoos withhold their misery.
The cornstalks slant deeper into themselves,
the red poppies.
పైపైన చూస్తే అనువాదం దాదాపుగా సరైనదే అనిపిస్తుంది. కానీ జార్జ్ ట్రాకల్ కవితను కానీ, ఆస్ట్రియా కవిత్వంలోని రంగుల ప్రాధాన్యం, red poppy ప్రతీకగా వాడిన విధానం, ముఖ్యంగా Expressionist poets (జార్జ్ ట్రాకల్ ను Expressionist poet గా పరిగణిస్తారు) red poppies ను cornstalks ను దేనికి ప్రతీకగా వాడేరో తెలుసుకుంటే, అక్షరమక్షరం అనువదించటం వల్ల అక్షరం మిగిలింది అర్థం ఆవిరైపోయిదని అనిపిస్తుంది.
సాయంకాలం అణిగిన ఉత్సాహాన్ని, ఉడిగిన శక్తిని సూచిస్తుంది. దీన్ని ‘atmospheric metaphor’ అంటారు. సాయంకాలం తరువాత వచ్చేది రాత్రి. అంటే మరణం. ట్రాకల్ గొప్పతనం ఎక్కడుంటుందంటే, అత్యంత వేడి, వెలుతురు ఉండే ‘వేసవి’ని అంటే అనందానికి, విజ్ఞానానికి సంకేతమైన వెలుతురు ద్వారా విషాదాన్ని, అజ్ఞాన సూచిక అయిన చీకటిని స్ఫురింప చేయటంలో ఉంది.
‘Red poppies’ ను ‘ఎర్రటి పువ్వు’ అనటంతో, మత్తు పదార్ధం వల్ల కలిగిన అచేతనను, రూపాంతరం చెందటాన్ని అది సూచిస్తుంది. మరో ఆస్ట్రియన్ కవి రైనర్ మరియా రిల్కె (1875-1926) కూడా ఈ red poppy ను కలకూ మరణానికీ నడుమ ఉన్న సరిహద్దుకు ప్రతీకగా వాడేడు. జార్జ్ ట్రాకల్ కూడా పలు కవితలలో red poppy ను జీవన బాధను మరచి, తాత్కాలికంగా నక్షత్రాల్లో విహరింపచేసి సాంత్వన నిచ్చే అంతరిక్ష వాహనంగా అభివర్ణించాడు. ఆస్ట్రియన్ కవులు సాధారణంగా red poppy ని గ్రీకు పురాణాల్లోని Hypnox (నిద్ర), Thanatos (మరణం)కు ప్రతీకగా వాడుతూ దీర్ఘ నిద్రనూ, మరణాంతర లోకానికి సరిహద్దుగా, సూచికగా వాడతారు. అదీ cornstalks, తనలో తాను ముడుచుకున్న red poppy ప్రాధాన్యం. red poppy ఎర్రటి పువ్వు కాదు. ఈ కవితలో కోల్పోతున్న చైతన్యాన్ని వర్ణిస్తాయి ఈ నాలుగు పాదాలు. కానీ అనువాదంలో ఈ భావన కలగదు. అందుకే అనువాదం అసంతృప్తిని కలిగిస్తుంది. అనువాదకుడు పదాలు అనువదించాడు తప్ప భావాన్ని అనుభవించి, పలవరించి, అనువాదాన్ని ఒక సృజనలా భావించి చేయలేదనిపిస్తుంది.యాంత్రిక అనువాదం చేశారనిపిస్తుంది.
The candle’s glowing silence
darkens the room.
Your silver hand
quenches it.
దీనికి తెలుగు అనువాదం
చీకటి గదిలో
నిశ్చలంగా కొవ్వొత్తి మినుకు
దాన్ని ఆర్పేస్తుందొక
వెండి చెయ్యి
కొవ్వొత్తి ప్రతీక అందరికీ తెలుసు. ఆంగ్లంలో ‘కొవ్వొత్తి నిశ్చలంగా మినుకు’ కాదు ‘glowing silence’. ఇది ఒక expressionist literary technique. దీన్ని synaesthesia అంటారు. ఈ పద్ధతిలో కనబడే వెలుతురు (glowing) ను శబ్దం (silence) తో కలిపి వాడతారు. దీపం నిశ్శబ్దంగా ఉందనటం వల్ల వాతావరణం ఎంత ఒంటరిగా, ఘనీభవించినట్టుందో తెలుస్తుంది. కొవ్వొత్తి జ్యోతిలో జీవం లేదు. వెలుగు నిశ్చలం. ఏదో జరగబోతోందని ఊపిరి బిగబట్టినట్టు కొవ్వొత్తి కూడా నిర్మోహంగా ఎదురు చూస్తూన్నది. దీపం తన చివరి శ్వాసలా ఉంది. అది ఎదురు చూస్తున్నది మరణం కాదు. ‘వెండి చెయ్యి’ దాన్ని అర్పేస్తుంది. అందుకే కవిత ‘to night, no wind no stay’, ‘గడ్డకట్టిన గాలి, చుక్కలేని రాత్రి’తో అంతమవుతుంది. మరణం తరువాత ఏముంటుంది? ఏమీ ఉండదు.
‘వెండి చెయ్యి’ మహిళ చేయికి, అస్పష్ట మూర్తికి ప్రతీక. వెండి చెయ్యి చంద్రుడిని కూడా సూచిస్తుంది. చంద్రుడిది వెండి వెలుగు. తన వెండి వెలుగుతో అన్నింటినీ రూపాంతరం చెందిస్తాడు చంద్రుడు. వెండి చెయ్యి దీపం అర్పేసింది. అంతా మారిపోయింది. ట్రాకల్ మానసిక స్థితిని అధ్యయనం చేసి, అతని కవితల్లో ప్రతిబింబించిన ఆయన మనస్సును విశ్లేషించిన మానసిక శాస్త్రవేత్త జాక్వెస్ లుకాన్, తత్వవేత్త మార్టిన్ హైడెగ్గర్, సాహిత్య విమర్శకులు నికొలస్ ఆబ్రహం, ఆండ్రు వెబర్లు జార్జ్ ట్రాకల్ మనస్తత్వంపై అతని చెల్లెలు గ్రెటెతో సంబంధం తీవ్రమైన ప్రభావం చూపిందని, అతని కవితల్లో ఆమె పలు సందర్భాలలో నేర భావనకు తన నాశనానికి దారితీయటానికి, దారి చూపే ఒక కనబడని వ్యక్తిలా కనిపిస్తందనీ, వెండి చెయ్యి ఆమెదేనని అభిప్రాయపడ్డారు. అందుకే ‘నీ చెయ్యి’ అన్నాడు. తెలుగులో అది ఒక చెయ్యి అయింది.
నిజానికి ట్రాకల్ ఒకో కవితను అతని జీవితానికి, మానసిక స్థితినీ ముడిపెడుతూ, ఆయా సామాజిక సాంస్కృతిక, ఆధ్యాత్మిక, ధార్మిక వ్యవస్థలతో అన్వయించి అర్థం చేసుకుంటే కానీ అందదు. అలాంటిది ఆయన కవిత గొప్పతనం చెప్పి ఊరించి, యాంత్రిక అనువాదంతో అర్థం చేసుకోవడం తీవ్రమైన అసంతృప్తి కలిగిస్తుంది.
(ఇంకా ఉంది)
కస్తూరి మురళీకృష్ణ ప్రసిద్ధ తెలుగు రచయిత. విస్తృతమైన రచనా సంవిధానాల్లో, విస్తారమైన సాహిత్యాన్ని అందిస్తున్నారు. కథ, నవల, వ్యాసాలు మొదలైన ప్రక్రియల్లో, చారిత్రిక కల్పన, కాల్పనిక, సాహిత్యవిమర్శ, వైజ్ఞానిక, వ్యక్తిత్వ వికాస, హారర్, క్రైమ్ తదితర పలు విభాగాలలో రచనలు చేస్తున్నారు. కాల్పనిక, కాల్పనికేతర విభాగాల్లో ఆయన రచించిన రచనలకు పాఠకుల ఆదరణ లభిస్తోంది.
కథాసంపుటాలు: 4 x 5, ఆ అరగంట చాలు, భారతీయ ప్రేమ కథామాలిక, ఉజ్జ్వల భారత మహోజ్జ్వల గాథలు, సైన్స్ ఫిక్షన్ కథలు, జాతక కథలు, థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు, ప్రపంచ ప్రేమ కథామాలిక,
నవలలు: ముస్సోలిని, పునఃసృష్టికి పురిటి నొప్పులు, సౌశీల్య ద్రౌపది, రోషనార, శ్రీకృష్ణదేవరాయలు, అసిధార, అంతర్మథనం, మర్మయోగం, అంతర్యాగం, ఆపరేషన్ బద్ర్, జగమే మారినదీ..,
అనువాద రచనలు: కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు, జోనరాజ రాజతరంగిణి, నీలమత పురాణం, నిజాం పాలన చివరి రోజులు,
వ్యాస సంపుటాలు: తీవ్రవాదం, శైశవ గీతి, అక్షరాంజలి, మనం మరువకూడని మహాయుద్ధం 1857, ప్రాచీన విజ్ఞానం, భారతీయ తత్త్వచింతన, భారతీయ వ్యక్తిత్వ వికాసం, రియల్ స్టోరీస్, క్రైమ్ స్టోరీస్-1, మన ప్రధానమంత్రులు, మన తెలుగు ముఖ్యమంత్రులు,
బయోగ్రఫీలు: మైకేల్ జాన్సన్, సంగీత సరస్వతి లతామంగేష్కర్,
సినిమా పుస్తకాలు: పాడుతా తీయగా, కమర్షియల్ క్లాసిక్స్, నవల నుంచి సినిమాకు,
సంపాదకత్వం/సంకలనాలు: తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు, కులం కథ, రైలు కథలు, క్రీడా కథ, దేశభక్తి కథలు, రామకథాసుధ
పురస్కారాలు/బహుమతులు: 1995లో ఆంధ్రప్రభ ‘దీపావళి’ నవలల పోటీలో ‘అంతర్యాగం‘ నవలకు ద్వితీయ బహుమతి. 1999 లో ఆంధ్రభూమి సస్పెన్స్ నవలల పోటీలో ‘ఆపరేషన్ బద్ర్ ‘ నవలకు ప్రత్యేక బహుమతి లభించాయి. 2017 సంవత్సరానికి తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం గ్రహీత.
~
కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు కన్నడంలోకి; థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు ఒడియాలోకి, మరాఠీలోకి అనువాదమయ్యాయి. ‘పాడుగా తీయగా’ హిందీలోకి అనువాదమవుతోంది.

