[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన అనూశ్రీ గౌరోజు గారి ‘ఏమీ అక్కర్లేదు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]


“ఏంటే నీ హడావిడి, పొద్దునే అల్మారా అంతా తీసి సర్దుతున్నావ్” ఉదయం నుండి అదే పనిగా గది సర్దుతున్న స్నేహితురాలు దీక్షను అడిగింది నివేద.
“అయ్యో నీకు విషయం తెలియదు కదూ.. మన ఝాన్సీ మేడం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారట. నాకు ఉదయమే ఫోన్ చేసి రమ్మన్నారు, సామాన్లు సర్దడంలో సహాయం చేయడానికి. అలాగే మనకు నచ్చిన వస్తువులు ఏమైనా ఉంటే తీసుకెళ్లామని చెప్పారు” ఒక వైపు సంతోషం మరోవైపు బాధ మిళితం చేసి చెప్పింది దీక్ష
“అవునా, ఝాన్సీ మేడం వెళ్ళిపోతున్నారా, ఎక్కడికి..!?..”
“వెళ్ళక ఏం చేస్తారే. ఆవిడకి ఇంకా ఒంట్లో ఓపిక ఉందా.. కొడుకుల దగ్గరకో కూతుర్ల దగ్గరకో వెళ్ళిపోతారు. హాయిగా విదేశాల్లో స్థిరపడతారు” అప్పుడే గదిలోకి వచ్చిన గగన అంది.
నేను ఈ వస్తువు తెచ్చుకుంటాను అంటే, నేను ఆ వస్తువు తెచ్చుకుంటాను అని ముగ్గురు లెక్కలు వేసుకున్నారు, కాసేపు తగవుపడ్డారు కూడా నేనడిగింది నువ్వు తీసుకోకూడదు నువ్వు అడిగింది నేను అడగకూడదు అని ఒప్పందానికి వచ్చారు చివరికి.
“నిజం చెప్పాలంటే చాలా బాధగా ఉంది ఆవిడ వెళ్లిపోతున్నారంటే..” కుర్చీలో కూలబడుతూ బాధగా అంది దీక్ష.
ముగ్గురు స్నేహితురాళ్ళు కూర్చుని కాసేపు ఝాన్సీ మేడం మంచితనాన్ని, ఆవిడ వీళ్ళకు చేసిన సహాయాన్ని.. నలుగురి మంచినీ కాంక్షించే ఆమె వ్యక్తిత్వాన్ని తలుచుకొని కన్నీళ్ళు పెట్టుకున్నారు.
గగన, దీక్ష, నివేద, ముగ్గురు దిగువ మధ్యతరగతికి చెందిన అమ్మాయిలు. స్కూల్ చదువు పూర్తయిన తర్వాత యాజమాన్యమే మెరిట్‌ని దృష్టిలో పెట్టుకొని ఈ ముగ్గురిని కాలేజీకి పంపించారు.
చదువు పూర్తయి ఇప్పుడు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ కొంత మొత్తాన్ని వారి వారి కుటుంబాల కోసం పంపిస్తూ ఉంటారు. వీళ్ళు చదువుకున్నది ఝాన్సీ మేడం పనిచేసిన కాలేజీలోనే. రంగురంగుల సీతాకోకచిలుకల్లా ఖరీదైన బట్టల్లో కాలేజీలో తిరిగే ఆడపిల్లల మధ్య ఈ ముగ్గురు సాదాసీదా అలంకరణతో భయం భయంగా చూస్తున్న తరుణంలో ఝాన్సీ మేడం అమ్మలా ఆదరించారు.
కాలేజీకి సెలవులు వస్తే ఇంటికి తీసుకువెళ్లి ఎంతో ఆదరంగా చూసుకునేవారు.
తనకున్న దాంట్లో ఈ ముగ్గురి చిన్న చిన్న అవసరాలను తీర్చేవారు. రిటైర్మెంట్ తర్వాత విదేశాల్లో ఉన్న కొడుకు, కూతుళ్ల దగ్గరికి వెళ్లి కొంతకాలం గడిపివచ్చేవారు. ఇప్పుడు ఒంటరిగా ఉండే ఓపిక లేక వెళ్ళిపోతున్నారు.
“సరే ఈ రెండు రోజులు ఆఫీస్‌కి లీవ్ పెట్టి మేడంతో గడుపుదాం. మళ్లీ ఎప్పుడు వస్తారో ఏమో..!” అనుకుని ఝాన్సీ దగ్గరికి వెళ్లడానికి సిద్ధమయ్యారు ముగ్గురు.
విశాలమైన నాలుగు, నాలుగు గదులతో ఉన్న రెండంతస్తుల భవనం ఇంటి చుట్టూ పూల మొక్కలు, పెద్ద పెద్ద వృక్షాలు.. గేటు తీసుకొని లోపల అడుగు పెట్టేసరికి రకరకాల సామాన్లన్నీ హాల్ నిండా పరిచి ఉన్నాయి. వాటిని ఆశ్చర్యంగా చూస్తూ లోపలికి అడుగు పెట్టారు ముగ్గురు.
“ఓ మై స్వీట్ బేబీస్, వచ్చారా మీ కోసమే ఎదురు చూస్తున్నా..” అంటూ కుర్చీలోంచి లేచి ఎదురుగా వచ్చి ముగ్గురిని దగ్గరికి తీసుకున్నారు. అమ్మ చేతి స్పర్శలా అనుభూతిని కలిగించింది వారికి ఆ స్పర్శ.
“మేడం మీరు మళ్ళీ ఇక్కడికి రారా..!” అడిగింది దీక్ష బెంగగా చూస్తూ.
“ఇక్కడికే కాదమ్మా ఇక ఎక్కడికీ రాను. నా చివరి రోజులు గడపటానికి మీ అందరికీ దూరంగా వెళ్ళక తప్పడం లేదు.”
“అంటే మీ పిల్లల దగ్గరికి వెళ్తున్నారా..”
“లేదమ్మా.. తల్లిగా అమ్మమ్మగా, నాయనమ్మగా నేను నిర్వర్తించాల్సిన బాధ్యతలు అయిపోయాయి. ఒంట్లో శక్తి ఉడిగిన నేనిప్పుడు ఎవరికీ అక్కరలేదు. వాళ్ల దగ్గరికి వెళ్లి అసహాయురాలిగా బ్రతకడం నాకు ఇష్టం లేదు” నిర్వేదంగా అన్నారు ఝాన్సీ.
“అంటే ఆశ్రమంలో ఉండడానికి వెళ్తున్నారా..”
“ఆశ్రమంలో ఉండవలసిన పరిస్థితి ఇప్పుడు లేదమ్మా..! అది కాస్త డబ్బున్న అమ్మలు నాన్నలు ఉండడానికి ఏర్పాటు చేసిన హోమ్. బాగానే ఉంది ఒక సింగిల్ రూం, అటాచ్డ్ బాత్రూం, బెడ్డు, ఫుడ్డు,. సర్వీస్ అంతా బాగుంది. కాకపోతే అవన్నీ డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి. నాకొచ్చే పెన్షన్ బొటాబొటీగా ఈ అవసరాలకు సరిపోతుంది. ప్రస్తుతానికి పరవాలేదు కానీ ఏదైనా జబ్బు చేస్తే ఈ ఇంటిని అమ్మేయాల్సిందే. అమ్మేస్తే ఇక డబ్బుకు ఢోకాలేదు. పిల్లలు ఉన్నత స్థితిలోనే ఉన్నారు కాబట్టి నా ఆస్తి మీద గాని నా మీద గాని వారికి ఎటువంటి ఆశలు లేవు. ఈ విషయంలో నేను స్వతంత్రురాలినే” నవ్వుతూనే చెప్పారు ఝాన్సీ.
“వెళ్లిపోవడానికి నిర్ణయించుకున్నప్పుడు ఏమీ అనిపించలేదు. కానీ ఇల్లు వదిలి వెళ్ళిపోతుంటే ఒక్కో జ్ఞాపకము నన్ను కట్టిపడేస్తోంది. నేను నా భర్త పడిన కష్టం కళ్ళ ముందు కదులుతోంది. ఎంతో అపురూపంగా ఏరి కోరి కొనుక్కొని ప్రతి గదిలో నింపుకున్న నా కలలు, ఆశలు నిరాశగా నా వైపు చూస్తున్నాయి.
బోలెడు పుస్తకాలు.. ఫోటో అల్బమ్స్.. అల్మారాల నిండా అవే, ఎన్నని నా వెంట తీసుకు వెళ్ళగలను? నేను ఉండబోయే ఆ ఇరుకైన గదిలో నా అనుభూతులకు స్థానం లేదు. ఇన్నాళ్లు ఎంతో ప్రేమగా దాచుకున్న వస్తువులే ఇప్పుడు నాకు భారంగా తోస్తున్నాయి. అందుకే ఇంట్లోని ప్రతిదీ దానం చేయాలని నిర్ణయించాను. నేను అపురూపమని భావించిన నా వస్తువులు వాళ్ళ కొన్ని అవసరాలు తీర్చినా నాకు సంతృప్తిగానే ఉంటుంది.
‘నాకు ఇష్టమైన నాలుగు పుస్తకాలు, ఏదైనా రాసుకోవడానికి డైరీ, ఐడీ కార్డు, సీనియర్ సిటెజెన్ సర్టిఫికెట్, హెల్త్ ఇన్స్యూరెన్స్ కార్డ్, ఏటీఎం కార్డు, బ్యాంకు పాస్ బుక్కు.. ఇక ఈ జీవితానికి ఇవే ఆస్తులు”
నిర్వేదంగా ఝాన్సీ మేడం చెప్పుకుపోతూ ఉంటే ముగ్గురు స్నేహితురాళ్లు అలాగే ప్రపంచాన్ని మరిచి వింటున్నారు.
అప్పటిదాకా ఇంటికి కాపలా ఉన్న రామయ్య వచ్చి రెండు బస్తాల్లోనూ తనకు కావలసిన సామాన్లు తీసుకొని “అమ్మగారు మీ మేలు మర్చిపోలేను” అని నమస్కరించి వెళ్లిపోయాడు. అలా ఇరుగుపొరుగు తెలిసిన వాళ్ళు కావలసినవన్నీ సర్దుకుని వెళ్ళిపోతున్నారు.
“ఎంత ఉత్సాహంగా తీసుకెళ్తున్నారో చూడు. వాళ్ళు కూడా ఏదో ఒక రోజు నాలా వదిలేయాల్సిందే” నవ్వుతూ అన్నారు ఝాన్సీ.
ఏవేవో వస్తువులు తీసుకువెళ్లాలని వచ్చిన ముగ్గురు స్నేహితురాళ్లు ఆమె చెప్పేది వింటూ, జరుగుతున్నది చూస్తూ శిలా ప్రతిమల్లా ఉండిపోయారు.
కాసేపటికి తెరుకున్న ఝాన్సీ “మాటల్లో పడి చెప్పడమే మర్చిపోయాను. నివేదా..! నువ్వు ఎప్పుడూ అడిగేదానివి కదా నేను కూర్చునే చైర్ నీకు చాలా ఇష్టమని, అది నువ్వు తీసుకెళ్ళు. దీక్ష నువ్వు కూడా నీకు నచ్చింది తీసుకెళ్ళు, అమ్మా గగనా..! ఆ బ్యాగులో స్వెటర్లు శాలువాలు ఉన్నాయి ముగ్గురు తీసుకోండి” అంది ప్రేమగా.
“నాకు ఇప్పుడు అర్థమవుతోంది మనం సంతోషంగా ఉండేందుకు పెద్దగా ఏమీ అక్కర్లేదని. ఈ వస్తువుల కోసం, ఈ సౌకర్యాల కోసం ఎన్నోసార్లు కొంతమందిని బాధపెట్టాను. ఇవి పోగేసుకోవడానికి ప్రతి రూపాయిని దాచుకున్నాను. ఈ వస్తువులన్నీ నావి అని గర్వంగా ఫీలయ్యాను, స్వార్థంగా ఆలోచించాను.. అవన్నీ ఇప్పుడు సిల్లీగా అనిపిస్తున్నాయి.
అమ్మాయిలూ.. రేపు మీరూ పెద్దవాళ్ళు అవుతారు. నా వయసులోకి వచ్చాక ఇవన్నీ మీకూ తప్పక ఎదురవుతాయి. కాబట్టి ఇప్పటినుండే ఒకటి నేర్చుకోండి. ఉన్నంతకాలం అక్కరకు రాని సమస్యల కోసం, జీవంలేని ఆడంబరాలకోసం వెంపర్లాడుతూ మీ సమయాన్ని వృథా చేసుకోకుండా ఏమున్నా లేకున్నా సంతోషంగా ఉండడం అలవాటు చేసుకోండి.
ఆరోగ్యంగా, ఆనందంగా ఉండండి. ఏదైనా పోగొట్టుకున్నప్పుడు ఎక్కువగా బాధపడకండి. ఎవరైనా బాధ పెట్టినప్పుడు కూడా క్రుంగిపోకండి.
ఏదీ మనది కాదు, ఎవరూ మనవాళ్ళు కారు. వచ్చేటప్పుడు, పోయేటప్పుడు ఎప్పటికైనా మనకు మనమే తోడు” మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ఆ ఇంటిని విడిచి ఆ పరిసరాలను విడిచి రెండు బ్యాగుల్లో తన అత్యవసరమైన సామాన్లు సర్దుకుని నిరాడంబరంగా వెళ్ళిపోతున్న మేడంని చూస్తే ఒక పరిపూర్ణమైన ఆత్మవిశ్వాసం నిండిన జీవితాన్ని చూసినట్టుగా గొప్పగా అనిపించింది వాళ్లకి.
ఎంతమంది చూపగలరు ఆ ఆత్మస్థైర్యాన్ని..!