Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఎమోషన్స్ కేఫ్

[మణి గారు రాసిన ‘ఎమోషన్స్ కేఫ్’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

అందరం కాన్ఫరెన్స్ హాల్‌లో సమావేశం అయ్యాం. ప్రతీ సంవత్శరం లానే, ఈ సంవత్సరం అప్‌గ్రేడ్ అయిన ఉద్యోగుల గురించి ప్రకటించడానికి, అందరినీ సమావేశపరిచారు. అందరూ అక్కడకి చెరుకున్న కొద్ది నిమిషాలకి ‘అప్‌గ్రేడ్’ అయిన వారి పేర్లు మైక్‌లో చదివారు. ఇదివరలో ప్రొమోషన్ అనేవారు. కానీ, ఏ.ఐ. మానవ యంత్రాలు వచ్చాక, అందరికీ అప్‌గ్రేడ్ అనే మాట వాడడం అలవాటు అయిపోయింది.

అక్కడ చేరిన వాళ్ళ మొహాలలో ఎటువంటి ఉత్సుకత లేదు. ఫార్మాలిటీ కోసం వచ్చినట్లు వచ్చారు. ప్రకటన అవగానే అందరూ చప్పట్లు కొట్టారు. అంతే మళ్ళీ అందరూ ఎవరి స్థానాలకి వాళ్ళు వెళ్ళిపోయారు. అప్‌గ్రేడ్ అయిన వాళ్ళకీ సంతోషం లేదు. అవని వాళ్ళల్లో నిరాశ కనపడలేదు.. అప్‌గ్రేడ్ అవని వాళ్ళల్లో నేనూ వున్నాను. నేనూ, నా కేబిన్‌కి వచ్చి కూర్చున్నాను.

ఫోన్‍లో మెస్సేజ్ వచ్చిన శబ్దానికి ఫోన్ తీసి చూసాను. పెళ్ళి రోజు శుభాకాంక్షలు. హెచ్. ఆర్. నుంచి. చూసి జేబులో పెట్టుకున్నా. అందరమూ పెర్ఫార్మన్స్ పేరామీటర్స్ వెనక పరుగులు పెడ్తూ వుంటే, ఏది గుర్తు వుంటుంది కనక?! పెళ్ళిరోజు అని,.. ఈ విధంగా కంపెనీ, హెచ్.ఆర్. ద్వారా గుర్తు చేయాల్సిందే. గుర్తు చేసినా మాత్రం, ఏమి తేడా వుంటుంది?.. ఇంటికి వెళ్ళే సమయం కూడా వృథా అనుకుంటూంటే. కానీ ఎందుకో, ఆశ్చర్యంగా ఇంటికి వెళ్ళాలి అనిపించింది. చాలా రోజులయింది ఇంటికి వెళ్ళి.

ఇంటికి వెళ్ళి రావడంలో, సమయం వృథా కాకుండా చాలామంది, ఇక్కడే గెస్ట్ రూమ్స్ లోనూ, డార్మెటరీస్ లోనూ, రాత్రి వుండిపోతారు. నేను కూడా, ఇంటికి వెళ్ళి మూడు వారాల పైగా అయింది.

అందరికీ టార్జెట్స్, డెడ్ లైన్స్, ప్రొడక్టివిటీ బెంచ్ మార్క్స్. పని నిన్ననే అయిపోవాల్సివచ్చేటంత ఒత్తిళ్ళు. నేనే కాదు అందరికీ అంతే..

రజని ఇంటికి వచ్చి, మూడు నెలల కి పైగా అయిపోయింది. రజని నా భార్య. ఆమె, సి.ఇ.ఒ. రేస్‍౬లో వుంది. ఇంకో రెండు మూడు సంవత్స రాలలో, సి.ఇ.ఓ అవుతుంది. వ్యక్తిగత మెస్సేజెస్ పెట్టడానికి అయినా, చదవడానికి అయినా సమయం వుండదు. వ్యక్తిగతమయిన మెస్సేజస్ ఏమయినా ఒకటి రెండు మాటలు అంతే. లేకపోతే చదవకుండానే వుండిపోతాయి. పిల్లలు వున్న వాళ్ళు, ఇద్దరూ ఉద్యోగస్థులు అవుతే, ఒక వారం ఒకరు, మరో వారం ఇంకొకరు, వంతులు వేసుకుని ఇంటికి వెళ్తారు.

ఇంటికి వెళ్ళాలా వద్దా అనుకుంటూ, నా కేలెండర్ చూసుకున్నా. పూర్తి కావాల్సిన పనులు, డెడ్ లైన్స్, చూస్తూ టైమ్ చూసాను. రాత్రి ఒకటి అవవస్తోంది.

‘ఇంటికి వెళ్ళి వస్తాను! ఉదయం తొమ్మిదికల్లా వచ్చేయొచ్చు.’ అనుకుంటూ, టేబిల్ లాక్ చేసి, బయటకి వచ్చాను. బయటకి నడుస్తూ, లోపలకి వచ్చే వాళ్ళు, బయటకి వెళ్ళే వాళ్ళు, పలకరిస్తూంటే, బదులు చెపుతూ, కారు దగ్గరకి చేరాను. కారు తలుపు తెరిచి, కారు స్టార్ట్ చేసాను.. ఇంజన్ స్టార్ట్, అయి ఆగిపోయింది. రెండు మూడు సార్లు ప్రయత్నించినా, ఏమీ ఉపయోగం లేకపోవడంతో, కారు తలుపు లాక్ చేసి, సర్వీసింగ్ వాళ్ళకి ఫోన్ చేసి, ఆఫీసు బిల్డింగ్ నుంచి, బయటకి రోడ్ మీదకి వచ్చి, కాబ్ బుక్ చేయబోయి ఒక్క క్షణం ఆగాను. దూరంగా శేఖర్ హడవిడిగా నడుస్తూ కనిపించాడు. అప్‌గ్రేడ్ అయిన వాళ్ళల్లో, శేఖర్ కూడా వున్నాడు.

శేఖర్‌ని చూస్తున్న నాకు, కాస్త దూరం నడుద్దామని అనిపించింది. నడుస్తూ ముందుకు వెళుతున్న నాకు, ముందు వున్న ట్రాఫిక్ కూడలి దగ్గర చాలామంది జనం వుండడం చూసి, కుతూహలంగా అటు వైపు నడిచాను. అక్కడ ‘ఎమోషన్స్ కేఫ్. ఇక్కడ ఎమోషన్స్ అమ్మబడును’ అని పెద్ద బోర్ద్ కనపడింది.

కుతూహలంతోనూ ఆసక్తి తోనూ నేనూ లోపలకి వెళ్ళాను.

అక్కడ పెద్ద హాల్. చాలా కౌంటర్స్.. అన్ని కౌంటర్స్ దగ్గర జనం క్యూ లో నిలపడి వున్నారు. ఒక్కొక్కరూ కౌంటర్ దగ్గర వున్న గ్లాస్ కాబిన్ లోనికి వెళుతున్నారు. కొన్ని కాబిన్స్‌లో మగవాళ్ళు, కొన్నిటిలో ఆడవాళ్ళు, వచ్చిన వాళ్ళతో మాట్లాడుతున్నారు.

చుట్టూ, ఆసక్తిగా చూస్తూ నేనూ, నాకు తెలియకుండానే ఒక కౌంటర్ దగ్గర క్యూ లో నిలపడ్డాను. లోపలకి వెళ్ళగానే, ఒక అమ్మాయి మొహం నిండా నవ్వుతో నన్ను ఆహ్వానించింది. “నా పేరు సుమతి. నేను మీకు ఎమోషన్ ఎంపిక చేసుకునే ప్రక్రియలో సహాయం చేయడానికి నియమించబడ్డాను. ముందుగా మీ వివరాలు ఈ ఫార్మ్‌లో నింపండి..”, అంటూ నవ్వుతూనే, ఒక పేపర్ నా చేతికి ఇచ్చింది.

నేను పేపర్‌ని తీసుకుని నా వివరాలు అన్నీ రాసి ఆమెకి ఇచ్చాను..

ఆమె ఆ పేపర్ చూస్తూ, “మీ పేరు కల్యాణ్.. ఊ!..ఎలా వున్నారు? బాగున్నారా? మీకు ఏ ఎమోషన్ కావాలి?..” అంది.

నేను ఏమి చెప్పాలో తెలియక ఆమె కేసే చూస్తున్నాను.

నా సందిగ్ధత చూసి. “పర్వాలేదు. మీరు నిర్ణయించుకోలేకపోతే మా కౌన్సిలర్, మిమ్మలని చేయి పట్టుకుని నిర్ణయం తీసుకునే దిశగా నడిపిస్తాడు.” ఆమె మొహంలో ఎక్కడా అలసట లేదు. పైగా చెదరని నవ్వు.

నాకేసే చూస్తూ “ముందుగా మీరు మా మెనూ కార్డ్ చూడండి. మీకు కాస్త అవగాహన కలుగుతుంది..” అంటూ ఒక కార్డ్ నా చేతికి ఇచ్చింది.

నేను మెనూ కార్డ్ చూసాను. కార్డ్‌లో ఎమోషన్స్, వాటి ఖరీదుతో సహా ఇవ్వబడ్డాయి. ఎమోషన్స్ లిస్ట్‌లో వరసగా ప్రేమ, దయ, స్నేహం, రొమాన్స్, కోపం, ద్వేషం, ఎంపతి, సంతోషం, దుఖం, ఆశ, నిరాశ.. వంటివి ఉన్నాయి.

ప్రేమ, దయ, స్నేహం, ఎంపతి, రొమన్స్ లకి మాత్రం, ‘వీటికి డిమాండ్ లేదు కాబట్టి ఆర్డర్ పైన మాత్రమే ఇవ్వడం జరుగుతుంది, డెలివరీకి, మూడు నుంచి నాలుగు వారాలు పడుతుంది’ అని బ్రాకెట్స్‌లో రాసి వుంది..

నేను. మెనూని పరీక్షిస్తున్నాను. మళ్ళీ ఆమె అంది. “కార్డ్‌లో రాసినట్లే., ప్రేమ, దయ, స్నేహం, ఎంపతీ, రొమాన్స్ లకి డిమాండ్ లేదు. అందుకే మా దగ్గర ఆ స్టాక్ లేదు.. అవి మాత్రం, ఆర్డర్ ఇవ్వాలి. ఆర్డర్ ఇచ్చిన. మూడు నాలుగు వారాలలో మీకు ఇవ్వడం జరుగుతుంది.”

“ఊ!.. ఊ..” అంటూ తల ఊపాను.

లిస్ట్ చదువుతూంటే, ఇంకో అనుమానం వచ్చింది. ‘అసలు ఇవి అవసరమా ఎందుకు కొనుక్కోవాలి?!’ అని అనుకుంటూనే ఆమె కేసి సందిగ్ధంగా చూసాను.

“మీరు కూడా, ఇవి కొనుక్కుంటూ వుంటారా?..” అంటూ అడిగాను.

“హా! మేమూ కొనుక్కుంటూ వుంటాం. మాకు, అఫ్కోర్స్ చాలా సబ్సిడీతో లభిస్తాయి.. అందరమూ 24×7 పని గంటలతో కుస్తీ పడుతూంటే, ఎమోషన్స్‌కి దూరం అవడం సహజం. ఏదయినా ప్రిన్సిపిల్ ఆఫ్ యూజ్ అండ్ డిస్‌యూజ్ తోనే కదా పనిచేస్తుంది. మనం పనిలో పడి ఎక్కువ యూజ్ చేయం కాబట్టీ ఎమోషన్స్ అంతరించి పోవడం చాలా సహజం.. మేము ప్రతీ పది రోజులకి, ఎంపతి, సంతోషం, లోడ్ చేసుకుంటూనే వుంటాం. లేకపోతే క్లైంట్స్‌ని సరిగా అటెండ్ అవలేము.. మేము ఎమోషన్స్ అమ్ముతున్నపుడు దానికి తగ్గ ఎమోటివ్ ప్రవర్తన మా దగ్గర లేకపోతే ఎవరి చేతనయినా ఎలా కొనిపిస్తాము?..”

మళ్ళీ అంది. “అప్పుడప్పుడయినా ఎమోషన్స్‌ని మనం ఫీల్ అవకపోతే మనమూ మనుషులమని మర్చిపోయే ప్రమాదం వుంది కదా?!” చెప్తున్న ఆమె కళ్ళల్లో ఒక చిన్న బాధ కనిపించీ కనిపించకుండా ఒక తెరలా కదిలింది.

ఎందుకో నాకు వున్నట్లుండి గుండెలో ఏదో గుచ్చుకున్నట్లు బాధ కలిగింది. ‘ఎప్పుడూ లేనిది ఏమిటిది?!’, అనుకుంటూ మెనూ చూస్తూ వున్నాను.

ఇంతలో పక్క కాబిన్ దగ్గర కాస్త కోలాహలం. నేను తల ఎత్తి ఆ వైపు చూడసాగాను. సుమతి కూడా విషయం తెలుసుకోవడానికి బయటకి వెళ్ళి, వెంటనే వచ్చేసింది.

నేను కుతూహలంగా ఆమె కేసి చూస్తూ “ఏమయింది?” అన్నాను.

“ఏ. ఐ., హుమనాయిడ్స్ రెండు,.. ఎమోషన్స్ కోసం వచ్చాయి..”

 “ఏ.ఐస్ కూడా కొనుక్కుంటాయా?”

“ఏ.ఐస్.కి మనుషుల ఎమోషన్స్ తెచ్చుకొని, పూర్తి మనుషుల్లా అవాలని వుంటుంది. ఆశ్చర్యంగా ఆ దిశగా ఎక్స్‌పెరిమెంట్స్ కూడా జరుగుతున్నాయి ఒక పక్క. ఇంకో పక్క వున్న మనుషులని యంత్రాల్లా మార్చాలని ఈ కార్పొరేట్స్ ప్రయత్నం. మనుషులు లానే ఏ.ఐస్ కూడా ఎమోషన్స్ కొనుక్కునే రోజులు ఇంక ముందు ముందు రావొచ్చు. ఇప్పుడు అవుతే మేము అమ్మే ఈ ఎమోషన్స్ మనుషులకే ఉపయోగ పడ్తాయి.”

“ఏ.ఐస్.కి ఉపయోగపడవు అంటే, అవి ఏమయినా గొడవ చేసాయా?”

“లేదు. అవి ‘క్యూఆర్’ కోడ్ స్కాన్ చేయడానికి ట్రై చేసాయి.. ఆ విధంగా డేటా ఏమయినా హేక్ చేస్తాయేమో అనే భయంతో అడ్డుకున్నారు” అంది నవ్వుతూ.

“ఓపెన్‌గా వున్నప్పుడు ఎవరయినా స్కాన్ చేస్తారు గదా!”

“ఓపెన్‌గా వుండవు. డబ్బులు కట్టే కౌంటర్‌లో కట్టెడప్పుడు చూపిస్తారు. అది కూడా కార్డ్ పేమెంట్స్ చేయలేకపోతేనే. అప్పటికే క్లైంట్‌ని అన్నివిధాలుగ నిశితంగా పరిశీలించడం చాలా వరకూ జరుతుంది. అందుకు రిస్క్ వుండదు. కానీ ఆ ఏ.ఐస్ తిన్నగా పెమేంట్ కౌంటర్ దగ్గరకి వెళ్ళి స్కాన్ చేయబోయాయి.”

“హా!..” నేను ఆశ్చర్యపోతూ అన్నాను,

కాస్సేపు ఇద్దరమూ నిశ్శబ్దంగా వుండి పోయాము.

ఆమె చేతిలో నాకు సంబంధించిన వివరాలు వున్న పేపర్‌ని చూస్తూ “ఇంతకీ మీరు, మీ అవసరాన్ని గురించి ఏమీ చెప్పలేదు?..” అంది.

ఆమె నేను ఏమీ చెప్పకపోవడంతో, తల ఊపుతూ, “మీరు నిర్ణయించుకోలేకపోతున్నారని తెలుస్తోంది.. మా కౌన్సిలర్ మీకు తప్పకుండా సహయంచేస్తారు.. రండి! వారి దగ్గరకి తీసుకు వెళ్తాను!” అంటూ, నన్ను ఇంకొ గ్లాస్ కాబిన్ దగ్గరకి తీసుకు వెళ్ళింది.

ఆ కాబిన్ కాస్త విశాలంగా వుంది. అక్కడ ఒక అతను కూర్చుని వున్నాడు.. మేము రావడంతో అతను తల ఎత్తి. మమ్మలని మొహం నిండా నవ్వుతో చూసాడు..

“ఇతను శ్రీకాంత్, మీకు నిర్ణయం తీసుకోవడానికి సహయం చేస్తాడు..” అంటూ నాకు చెపుతూ, అతనిని పరిచయం చేసింది,

“వీరు కళ్యాణ్.. ఇది వారి వివరాలు.” అంటూ అతనిచేతిలో నా వివరాలు వున్న పేపర్‌ని పెట్టింది.

అతను నవ్వుతూనే.. “తప్పకుండా!.. కూర్చోండి కళ్యాణ్!..” అన్నాడు.

నేను కూర్చోగానే సుమతి, “నేను వెళ్తాను!..” అంటూ వెళ్ళి పోయింది.

అతను నాకేసి చూసి. “మీ గురించి కాస్త చెప్పండి” అన్నాడు. అతని చేతిలో సుమతి ఇచ్చిన పేపర్ ని చూస్తూ. “నా వివరాలు అన్నీ, ఆ పేపర్‌లో వున్నాయి..” అన్నాను.

“ఊ!.. మీకు ఎమోషన్స్ కొనాలని ఎందుకు అనిపించింది?..”

“తెలియదు.. నేను అనుకోకుండా ఇక్కడకి రావడం జరిగింది.. ఈ దారిలో వెళుతూ, ఇక్కడ చాలామంది జనం వుండడం చూసి లోపలకి వచ్చాను.. ఈ షాప్ నేను ఇంతకి ముందు చూడలేదు.” అన్నాను నేను నవ్వడానికి ప్రయత్నిస్తూ.

“ఈ కంపెనీ పని చేయబట్టి, సుమారు మూడు ఏళ్ళయింది.. ఇక్కడ, ఇప్పుడు వున్న, కార్పొరేట్ కల్చర్‌లో మనుషులు, వారి వారి ఎమోషన్స్‌కి దూరం అవుతున్నారు. నెమ్మదిగా కోల్పోతున్నారు. అందుకే ఈ విధంగా, ఎమోషన్స్‌ని, వారి వారి అవసరాల బట్టి కొనుగోలు చేసే అవకాశాన్ని మా కంపనీ కల్పిస్తుంది. ఇది ఒక విధంగా మనిషి, అతని అస్తిత్వం కోల్పోకుండా సహాయపడడమే..”..చెప్తున్న శ్రీకాంత్ మొహంలో సంతోషంతో పాటు, కాస్త గర్వం కూడా, కనిపించీ కనిపించకుండా, ఒక్కక్షణం కనిపించింది.

“ఇక్కడకి వచ్చాకే తెలిసింది. నేను ఎమోషన్స్ కోల్పోయాను అని.. నాకే తెలియకుండా కోల్పోయాను.” అంటూ నవ్వాను.

అతను కూడా నవ్వుతూ – “ఈ మెనూ కార్డ్‌లో మీకు ఏమి కావాలని అనిపిస్తోంది, ఇప్పుడు?..” అని ప్రశ్నించాడు.

“ఈ కార్డ్ చూసాక నాకు ఒక సందేహం అవుతే వచ్చింది.”

‘ఏమిటి?’ అన్నట్లు చూసాడు శ్రీకాంత్.

“మీ కార్డ్‌లో ద్వేషం. కోపం, నిరాశ ఇలాంటి నెగేటివ్ ఎమోషన్స్ కూడా వున్నాయి. వాటిని ఎవరయినా కొనుక్కుంటారా, అని”

“అప్పుడప్పుడు వాటి అవసరం కూడా పడ్తూ వుంటుంది.. ఏదయినా పాజిటివ్ ఎమోషన్ లోడ్ చేయడానికి ముందుగా నెగటివ్ ఎమోషన్ పరిచయం చేయాల్సి వస్తుంది. అప్పుడే మీరు పాజిటివ్ ఎమోషన్ని ఎంజాయ్ చేయగలరు.”

అతను మళ్ళీ అన్నాడు. “ఈ రోజు మీకు ఎలా జరిగింది?..”, ఒకసారి టైమ్ చూసి అతను “అదే నిన్న!..” అంటూ నవ్వాడు.

“ఊ!.. నిన్న, మా కంపనీలో అప్‌గ్రేడ్ అయిన వాళ్ళ లిస్ట్ ప్రకటించారు.”

“ఓహ్!.. కంగ్రాట్స్!..”

“నేను అప్‌గ్రేడ్ అవలేదు..” అలా అంటున్నప్పుడు, నా గొంతులో కానీ నా మనసులో కానీ ఎటువంటి భావ ప్రకంపన నేను ఫీల్ అవలేదు. అతను కూడా అది సెన్స్ చేసినట్లు వున్నాడు.

“మీకు ఎటువంటి నిరాశా భావం కలగలేదా..” అడిగాడు.

‘లేదు..’ అన్నట్లు తల అడ్డంగా ఊపాను.

“ఈ రోజు మీ పెళ్ళి రోజు!.. ఏమి ప్లాన్?..”

“ఏమీ లేదు.. హెచ్.ఆర్. నుంచి గ్రీటింగ్స్ వస్తాయి. అంతే తప్ప.. ఏమీ మార్పు వుండదు..”

“ఎందుకు, అని మీకు అనిపించదా?..”

‘లేదు’ అన్నట్లు తల అడ్డంగా ఊపాను.

“అంటే అప్‌గ్రేడ్ కాకపోతే నిరాశా భావం రావాలి. పెళ్ళి రోజున, భార్యతో సరదగా సినిమాకో షికారుకో ప్లాన్ చేయాలి అని అనిపించాలి. కానీ అదేమీ అనిపించకపోవడం నిస్తేజంగా అనిపించదా?..”

“ఏమీ అనిపించదు.. చాలా ఏళ్ళయింది ఈ విధమయిన రొటీన్‌కి అలవాటుపడి.” అన్నాను నేను అతనికేసి కాస్త అయోమయంగా చూస్తూ.

“అంటే మీరు ఎమోషన్స్‌ని కోల్పోతున్నారన్న మాట.. అయినా పర్వలేదు. మొదటగా మీకు నిరాశని, పరిచయం చేస్తాను. తర్వాత వీలవుతే రొమాన్స్, ఆ తర్వాత సంతోషం.. రొమాన్స్‌కి మాత్రం మీతో పాటు మీ పార్ట్‌నర్ కానీ, గర్ల్ ఫ్రెండ్ కానీ వుండాలి. వారికి కూడా ఈ ఎమోషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఒక్కరికి ఇస్తే ఉపయోగం వుండదు. పైగా సైడ్ ఏఫెక్ట్స్ వుండే ప్రమాదం వుంది. ఒక్కసారి మీరు ఎమోషన్స్ ఫీల్ అవడం ప్రారంభించాక, మీరు చాలా మారిపోతారు..” అతను నవ్వుతూనే చెప్తున్నాడు.

నేను వింటున్నాను.

ఇంతలో ఒక వ్యక్తి కేబిన్ తలుపు తెరుచుకుని హడావిడిగా లోపలకి వచ్చాడు.

“శ్రీకాంత్! 13వ కౌంటర్‌లో కస్టమర్‌ని కౌన్సిల్ చేయడానికి బాస్ నిన్ను వెంటనే రమ్మన్నారు. అతను కొన్న ఎమోషన్ సరిగా పని చేయటం లేదని కంప్లైంట్ చేస్తున్నాడు.. నువ్వు వచ్చేవరకూ వీరిని నేను ఎంగేజ్ చేస్తాను..”

ఒకసారి నాకేసి, ఒకసారి అతనికేసి నవ్వుతూ చూసి, ‘అలాగే’ అన్నట్లు తల ఊపి,

“కల్యాణ్! నేను ఒక పది నిమిషాలలో వస్తాను. అంతవరకూ, మీరు ఇతనితో, మీ అనుమానాలన్నీ నివృత్తి చేసుకోవచ్చు. ఇతను వెంకట్..” అంటూ బయటకి వెళ్ళిపోయాడు.

వెంకట్, చిన్న కుర్రవాడిలా వున్నాడు. అప్పుడే కాలేజీ నుంచి వచ్చినట్లు వున్నాడు.

అతను నాకేసి చూస్తూ “నా పేరు వెంకట్!” అంటూ నవ్వుతూ, నాతో కరచాలనం చేస్తూ నా ఎదురుగా వున్న కుర్చీలో కూర్చుని, నా వివరాలు వున్న పేపర్‌ని, చూడడం మొదలుపెట్టాడు.

“చెప్పండి కల్యాణ్! శ్రీకాంత్ వచ్చేలోపు మీ సందేహాలు ఏమున్నా చెప్పడానికి సందేహించకండి. నేను సాధ్యమయినంత వరకూ మీకు సమాధానాలు చెప్తాను.. నేను ఇక్కడ ఇంటర్న్‌గా చేస్తున్నాను. చేరి ఒక సంవత్సరం అయింది..” అంటూ అతను అతని గురించి కొంచెం చెప్తూ అన్నాడు.

“నువ్వు ఇప్పుడే కాలేజీ నుంచి వచ్చినట్లువున్నావు. నువ్వు కూడా ఈ ఎమోషన్స్ కొనుక్కుంటావా?..” అడిగాను నేను.

“హ! నాకవుతే ఇంత వరకూ ఆ అవసరం రాలేదు. అంటే, నేను దూరంగా వున్న పల్లెటూరి నుంచి వచ్చాను. మాది వ్యవసాయ కుటుంబం. నేను చదివింది ప్రభుత్వ కళాశాల. కార్పొరేట్ కాదు. నాతో పాటు చేరిన ఇంకో ఇంటర్న్, కార్పొరేట్ కాలేజి నుంచి వచ్చాడు. అతను ఎమోషన్స్ కొనుక్కుంటాడు. మాకు చాలా డిస్కౌంట్స్‌తో, వస్తాయి..”. నవ్వుతూ చెప్పాడు అతను.

ఆసక్తిగా అతను చెప్పేది వింటున్నాను. “అతనికి, అదే.. నీతో పాటు చేరిన అతనికి, ఎందుకు ఎమోషన్స్ కొనే అవసరం పడింది..” అడిగాను.

“కార్పొరేట్ కల్చర్‌లో ఎమోషన్స్ కోల్పోవడం సహజంగా జరుగుతుందండి. కాలేజీ కావచ్చు, వర్క్ ప్లేస్ కావొచ్చు. రెండు చోట్లా రేసులే. ఏమీ తేడా వుండదు..”

మళ్ళీ అన్నాడు, గుస గుస లాడుతూ – “ఇది కూడా ఒక కార్పొరేట్ ఫ్రాడ్. వర్క్ ప్లేస్‍లో ఒత్తిడి తీసి వేసి, పని గంటలు తగ్గిస్తే, చాలు.. ఎవరూ ఎమోషన్స్ కోల్పోరు.. ఒక వైపు మనుషులని యంత్రాలు లాగ చేయడానికి ప్రయత్నిస్తూంటే, ఎమోషన్స్ ఎందుకు కోల్పోరు చెప్పండి? ఇప్పుడు తెల్లవారు జాము అవుతోంది. టైమ్ మూడు అవవస్తోంది. నేను, నిన్న మధ్యహ్నం, మూడు నుంచి పని చేస్తున్నాను. మీరు కూడా, బహుశః ఇక్కడనుంచి, ఇంటికి వెళ్ళకుండానే ఆఫీసుకు వెళ్ళిపోతారు.. మాకు ఇవన్నీ పరిపాటే..” చిన్నవాడైనా చాలా మెచూర్డ్‌గా మాట్లాడుతున్నాడు.

అతను మళ్ళీ అన్నాడు.. “వరసగా, అకాల వర్షాలు. పంటలు చేతికీ అందక, అప్పుల పాలవడంతో, ఇక్కడకి రావడం ఈ ఉద్యోగం చేయడం.. తప్పలేదు.”

వున్నట్లుండి అతను దూరంగా దృష్టి సారిస్తూ, దిగులుగా నెమ్మదిగా అన్నాడు.. “ఈ కార్పొరేట్ కల్చర్ అన్ని రంగాలకి అంతటా వ్యాపిస్తే అసలు మనిషికి అస్తిత్వం ఏమి మిగులుతుంది?”

ఇద్దరం కాస్సేపు మౌనంగా వుండిపోయాం. అతను వాతావరణాన్ని కాస్త తేలిక చేస్తూ ఒక నవ్వు నవ్వి అన్నాడు, “కొన్నాళ్ళు మీరు, మీ పని ఒత్తిడిలకి దూరంగా వుండండి. మీకు వీటి అవసరం రాకుండానే పరిపూర్ణమయిన మనిషి అవుతారు.”

అతను స్నేహపూర్వకమయిన నవ్వు, మొహంలో ఇంక చెదరని పసితనం, నన్ను కదిలించింది. ఎప్పుడూ లేని విధంగా నా శరీరంలో చిన్న భావ ప్రకంపన..

అంతలోనే శ్రీకాంత్ తిరిగి వచ్చాడు.. శ్రీకాంత్ రాగానే వెంకట్, మా ఇద్దరి దగ్గర శెలవు తీసుకుని వెళ్ళిపోయాడు.

“తీసుకున్న ఎమోషన్ పనిచేయకపోవడం కూడా వుంటుందా?” అడిగాను నేను.

“ఫ్రంట్ లైన్ కౌంటర్ వాళ్ళకి, అనుభవం లేక వాళ్ళు అడిగిన ఎమోషన్ వెంటనే ఇచ్చేస్తారు, ఉదాహరణకి, ఎమోషన్ కోల్పోయిన వాళ్ళకి సంతోషాన్ని అమ్మే ముందు కాస్తా దుఃఖాన్ని పరిచయం చేయాలి. అందుకే సంతోషాన్ని అడిగినా ముందు దుఖాన్ని ఇస్తాము.. ఒక పదిహేను రోజులు అయిన తర్వాత సంతోషాన్ని ఇస్తాము.. లేకపోతే ఈ విధంగానే, సంతోషం తీసుకున్నాం కానీ, పని చేయడం లేదు అంటారు..” అంటూ నవ్వాడు.

మళ్ళీ అన్నాడు. “మీకు అందుకే నిరాశతో మొదలుపెట్టి, రొమాన్స్‌ని కలిపి, సంతొషం వైపు తీసుకు వెళ్దామన్నాను..”

‘“హు!!..” అంటూ అర్థమయినట్లు తల ఊపాను.

“మీకు ఇంకా ప్రశ్నలు వుంటే అడగండి. లేకపోతే మనం సేల్స్ కౌంటర్‌కి వెళ్దాము” అన్నాడు, శ్రీకాంత్.

“నాకు, మీరు ఎమోషన్స్ టాబ్లెట్స్‌లా ఇస్తారా?” అడిగాను నేను.

శ్రీకాంత్ డ్రాయర్ సొరుగు తీసి, ఒక పాకేజ్ బయటకి తీసి నాకు చూపిస్తూ అన్నాడు “చూడండి! ఇది ఒక చిన్న చిప్. టాటూ స్టికర్‌లా వుంటుంది. శరీరం పైన ఎక్కడ అయినా సరే అంటించుకోవచ్చు. నీళ్ళు తగిలినా ఏమీ ఎఫెక్ట్ అవదు. శరీరంలోకి, ఇది నెమ్మదిగా దానిలోని కెమికల్స్‌ని రిలీజ్ చేస్తుంది. దీని ప్రభావం ఒక ఆరు నెలలు వుంటుంది. ఆరు నెలల తర్వాత మళ్ళీ రీఛార్జ్ చేసుకోవడమే.”

నేను ఆ పాకేజి చేతిలోకి తీసుకుని మౌనంగా కాస్సేపు చూసాను..

“మరి మీరు, నేను చేప్పిన దానికి ఒప్పుకుంటే, మొదటగా నిరాశని తీసుకోండి.. పదిహేను రోజుల తర్వాత మీ రెస్పాన్స్ బట్టి, తర్వాత ఎమోషన్‌ని ఎంచుకుందాం. ఈ పదిహేను రోజులలోనూ మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా మీరు నన్ను సంప్రదించండి.” అంటూ అతను అతని బిజినెస్ కార్డ్ ఇచ్చాడు..

నేను అంగీకారం తెలపడంతో అతను నన్ను సేల్స్ కౌంటర్ కి తీసుకు వెళ్ళాడు. కౌంటర్‌లో అతను చెప్పిన డబ్బులు చెల్లించి పాకేజ్ తీసుకున్నాను.

శ్రీకాంత్ “ఆల్ ది బెస్ట్!..” అంటూ కరచాలనం చేసి వెళ్ళిపోయాడు,

***

బయటకి వస్తూన్న నాకు శేఖర్ తారసపడ్డాడు.

“శేఖర్! నువ్వేమిటి ఇక్కడ?” అడిగాను.

“అప్‌గ్రేడ్ అయినా ఏమీ సంతోషం లేదు. అందుకే సంతోషం కొందామని”

“కొన్నావా?..”

“ముందుగా కాస్త నిరాశ, దుఖం కొనమన్నారు. నిరాశ ఒక వారం, దుఖం ఇంకో వారం, తర్వాత సంతోషం..”

“ఓకే..”

“నువ్వూ?..”

“అప్‍గ్రేడ్ కాకపోతే నిరాశ పడాలి కదా, అటువంటి ఫీలింగ్ ఏమీ నాకు రాలేదు. నేను ఎమోషన్స్ కోల్పోతున్నాను అని అన్నారు. అందుకే నాకూ నిరాశ ముందుగా పరిచయం చేసి తర్వాత నెమ్మదిగా సంతోషం వైపు.. అన్నారు.”

“..”

“ఈ షాప్ నీకు ముందే తెలుసా?..”

“హా! మా టీమ్‌లో కుమార్, ఇక్కడ రెగ్యులర్. అతనే చెప్పాడు. నాకూ ఇదే, మొదటిసారి..”

“నేను యాదృచ్ఛికంగా వచ్చాను.” అన్నాను.

“హా!..”

“వాళ్ళు చెప్పినట్లు పని ఒత్తిళ్ళలో ఎమోషన్స్ పోగొట్టుకుంటున్నాం..”

“అవును” అన్నాడు శేఖర్, నిర్లిప్తంగా.

 ఇద్దరమూ మౌనంగా కాస్సేపు నడిచాము. అందరమూ, మాట్లాడుకోవడం కూడా మర్చిపోయాం. అందుకే, ఏమి మాట్లాడాలన్నా కష్టంగా వుంటుంది.

“బై!..” అంటూ శేఖర్ వెళ్ళిపోయాడు.

***

నేను కాబ్‌లో ఇంటికి చేరుకున్నాను. స్నానం చేసి పడుక్కున్నానే కానీ, నిద్ర పట్టలేదు.

మంచం పక్కనే వున్న స్టూల్ మీద పెట్టిన, కొన్న పాకేజి కేసి చాలాసేపు చూస్తూ వుండి పోయా.

కాస్సేపు, వాడాలా వద్దా అని ఆలోచిస్తూంటే వెంకట్ మాటలు గుర్తుకు వచ్చాయి.

“కొన్ని రోజులు ఈ ఒత్తిళ్ళకి దూరంగా వుంటే చాలు ఏమీ వాడనవసరం లేదు.”

“మనుషులని యంత్రాలుగా మార్చే ప్రయత్నం ఒక వైపు, మరో వైపు యంత్రాలని మనుషులుగా చేయాలనే తాపత్రయం..” సుమతి మాటలు ఎంత నిజం?!

మంచం మీద కాస్సేపు అశాంతితో అటూ ఇటూ దొర్లాను.

మొబైల్ మెస్సేజ్ నోటిఫికేషన్, శబ్దం చేసింది

రజని మెస్సేజ్ చేసిందా అని మొబైల్ చూసాను.

ఆఫీస్ మేస్సేజ్ ‘డెడ్‌లైన్స్’ ని ముందుకు జరుపుతూ.

‘డెడ్‌లైన్స్‌లో అందరమూ జీవించడం మానేసామా?’ అనుకుంటూ అశాంతిగా లేచి కూర్చున్నాను.

లేచి బ్లాక్ కాఫీ కలుపుకున్నాను. కాఫీ తాగుతూ వెంకట్ మాటలు గుర్తుకు చేసుకున్నాను.

“ఈ పని ఒత్తిళ్ళకి తెలియకుండానే అందరమూ ఎన్నో పోగొట్టుకున్నాము. బాధ సంతోషం,.. ఏ ఎమోషన్ లేని అవస్థకి చేరుకున్నాము. ఏ ఆలోచనా లేకుండా,.. ఏ ఎమోషనూ లేకుండా.. ఈ అవస్థ ఇది నిర్వాణం లాంటిదా? లేదు. నిస్తేజమేమో?!”.. ఆలోచిస్తున్న నా పెదాల మీదకి నాకు తెలియకుండానే ఒక చిన్న నవ్వు చోటు చేసుకుంది.

‘ఇప్పటికయినా మించిపోయింది లేదు. పోగొట్టుకున్న ‘నేను’ని ఎందుకు తిరిగి పొందలేను?.. వెంకట్ చెప్పినట్లు, ఈ వాతావరణానికి, కొన్ని రోజులు దూరంగా వుండి చూస్తాను’, అనుకుంటూ లేచి రెండు జతల బట్టలు, ఒక బ్యాక్‌పాక్‌లో సద్దుకుని, ఇల్లు లాక్ చేసి బయటకి వచ్చాను. కనిపించిన బస్ ఎక్కి కూర్చున్నాను. చివరి స్టాప్ వరకూ టికెట్ తీసుకున్నాను. బాస్‌కి, లీవ్ మెస్సేజ్ చేసాను. రజనికి కూడా మెస్సేజ్ చేసాను “కొన్ని రోజులు బయటకి వెళుతున్నాను. ఆఫీస్ పనితో కాదు, నాకే కాస్త మార్పు అవసరం అనిపించింది” అని.

రజని ఈ మెస్సేజ్ చదువుతుందని నాకు అనిపించలేదు. అందరిలానే, ఆమె కూడా ఎమోషన్స్‌ని, పోగొట్టుకుంది.

అందరమూ యంత్రాలం కాదు, కానీ, యంత్రాల్లానే బతుకుతున్నాము. దీనికి ఎవరినీ తప్పు పట్టలేము. ఎప్పుడూ లేనిది, ఆలోచనలు ఒక దాని తర్వాత ఒకటి కమ్ముకుంటున్నాయి.

***

గమ్యం లేకుండా ఎన్ని రోజులుగా తిరిగానో నాకే తెలియదు. లెక్కపెట్టుకోవాలని కూడా అనిపించలేదు.

కంపెనీ నన్ను ఫైర్ చేస్తూ “నీ ప్రవర్తనని బాధ్యతా రహితంగా పరిగణించడం అయినది. అందు మూలంగా, నీకు ఎటువంటి సెవెరెన్స్ పే కూడా, ఇవ్వడం జరగదని తెలియచేస్తున్నాము” అంటూ మేస్సేజ్ చేసింది. ఆ మెస్సేజ్‍కీ, ఆశ్చర్యమూ కలగలేదు. బాధా కలగలేదు. బహుశః నా ఎమోషన్స్‌ని నేను పూర్తిగా పొందలేకపోయానేమో, అనుకున్నాను.

అలా ప్రయాణం చేస్తూ, ఒక నిర్జన ప్రదేశం చేరుకున్నాను, ఆ ప్రదేశం, గ్రామానికి దూరంగా వుంది. దగ్గరలో చిన్న చిన్న కొండలు. ఆ కొండల మధ్య నుంచి, ఒక ఏరు పారుతోంది. ఆ ఏరుకి, కొంచెం దూరంలో, పంట భూమి.. ఒక రైతు, నారులు వేస్తూ, కనపడ్డాడు. అప్పటికి మధ్యహ్నం అవవస్తోంది. నాకు ఆకలి వేయడం మొదలుపెట్టింది.

‘తెలియకుండా నడుచుకుంటూ వూరినుంచి చాలా దూరంగా వచ్చాను. ఇక్కడ ఎటువంటి హొటల్స్ వుండే అవకాశం లేదు’, అనుకుంటూ ఆ రైతు వున్న వైపు నడిచాను.

“ఇక్కడ హొటల్స్ దగ్గరలో, ఏమైనా వున్నాయా?..”

అతను నాకేసి ఒకసారి ప్రశ్నార్థకంగా చూసి, ‘లేవు!’ అన్నట్లు చేతులు ఊపాడు.

నాకు ఏమి చేయాలో తెలియక, అక్కడే పొలం గట్టు మీద కూర్చున్నాను. అతను నన్ను కాస్సేపు చూసి, దగ్గరకి వచ్చి పక్కన కూర్చున్నాడు.

“ఎక్కడకి వెళ్ళాలి?..” అడిగాడు.

“ఎక్కడికని లేదు. తిరుగుతూ తిరుగుతూ ఇలా వచ్చాను.. చూస్తే దగ్గరలో హొటల్స్ ఏవీ వున్నట్లు లేదు. ఆకలిగా వుంది.. ఇక్కడ నుంచి దగ్గరలో వున్న వూరికి చేరాలంటే, ఇంకా ఎంత దూరం నడవాల్సి వుంటుంది?” అడిగాను అతనిని.

“దగ్గర వూరికి వెళ్ళాలంటే ఒక అయిదు కిలోమీటర్లు పైగా నడవాలి. ఇక్కడకి బస్సులు రావు.”

“వూరికి దూరంగా ఈ కొండల మధ్య ఈ ప్రాంతం బాగుంది..” అన్నాను.

అతను తలకి కట్టుకున్న తువ్వాలు తీసి, ఒకసారి దులిపి మొహం చేతులు తుడుచుకుంటూ “ఊ!..” అన్నాడు.

“మీరు ఏ సాయం లేకుండా, ఒక్కరే చేను పని చేసుకుంటున్నారు?..”

“వూరికి దూరం కదా! ఎవరూ ఇటు రారు.. అయినా పర్వాలేదు. అదిగో దూరంగా కనిపిస్తోంది. తాటాకు ఇల్లు. అదే నా ఇల్లు. అవసరం అయితే, నా పిల్లలు, భార్య, అందరూ సాయం చేస్తారు.”

“హా!..” అన్నాను.

కాస్సేపుండి, అన్నాను “ఇక్కడ, చాలా ప్రశాంతంగా వుంది. మీరు ఒప్పుకుంటే, ఇక్కడ మీకు సాయం చేస్తూ, కొన్ని రోజులు వుంటాను.. మీరు నాకు తినడానికి ఇస్తే చాలు. డబ్బులు ఇవ్వక్కర లేదు.” అన్నాను.

నన్ను ఎగాదిగా చూసి, “నువ్వు చూస్తే కష్టపడి పనిచేసేవాడిలా కనపడటం లేదు. నువ్వేం చేస్తావ్?..” అన్నాడు అతను.

“ఒక్కసారి చెపితే చాలు. ఏదయినా తొందరగా నేర్చుకోగలను. కావాలంటే, మీరు పరీక్షించండి..”

అతను ఒకసారి నాకేసి కుతూహలంగా చూసి, “ఊ! ఆకలిగా వుందన్నావు. ముందు నాతో పాటు తిందువు గానీ రా!”, అంటూ ముందుకి దారి తీసాడు. పక్కనే గట్టు మీద, సంచి తీసుకుని ఏరు పైపు నడిచాడు. నేనూ అతని వెనకే వేళ్ళాను,

ఏరు పక్కన అతను సంచిలో వున్న బట్ట తీసి నేల మీద పరిచాడు. లోపలనుంచి కారియర్ గిన్నెలు అన్నీ తీసి బయట పెట్టి తనకి ఒక ప్లేట్, నాకు ఒక ప్లేట్ పెట్టి అన్ని వడ్డించడం మొదలు పెట్టాడు. “నా భార్య నా కారియర్‍లో ఇద్దరికి సరిపోయే విధంగా అన్నీ సద్దుతుంది. నీలానే అప్పుడప్పుడు కొంతమంది వస్తూ వుంటారు. ఈ మధ్య కాలంలో వచ్చిన వాళ్ళల్లో నువ్వు పదో వాడివి.”

నేను ఆశ్చర్యంగా అతనిని చూసాను.

“నీ లానే, వస్తారు. నాకు సాయం చేస్తూ కొన్నాళ్ళు వుంటారు. అలా నాకు అలవాటయింది..” అంటూ నవ్వాడు.

“ఊ! తిను! మొదలుపెట్టు!”

ఇద్దరమూ తినడం మొదలు పెట్టాము.

“వంటలు చాలా రుచిగా వున్నాయి. ఎన్నో ఏళ్ళు అయింది రుచికరమయిన భోజనం తిని..” అన్నాను.

“ఊ!.. నా భార్య బాగా వండుతుంది.” ఆ మాటలు అంటూంటే అతని మొహం ఒక వెలుగు వెలిగింది.

ఇద్దరమూ భోజనం చేసాక ఆ గిన్నెలు కడగడం లోనూ, మళ్ళీ సంచిలో సద్దడంలో అతనికి సాయం చేసాను. ఇద్దరమూ అక్కడే కాస్సేపు కూర్చున్నాం.

“ఇంతకి నీ పేరు చెప్పలేదు.. నా పేరు కృష్ణారావు..” అన్నాడు అతను చేను కేసి చూస్తూ.

“నా పేరు కళ్యాణ్” అన్నాను.

“హా!..” అన్నాడు అతను.

తర్వాత అతను నాకు నారులు వేయడం చూపించాడు. ఒక ఇరవై వరకూ నారులు అతను దగ్గర వుండి చూపించే సరికి నాకు బాగానే అర్థమయింది. పొద్దు పోయేసరికి, ‘నేను చాలానే చేసాను’, అనిపించింది.

అతను పని ముగించి చేతులు కడుక్కుంటూంటే, నేనూ చేతులు కడుక్కుంటూ, “రేపు, నేను ఇంకా వేగంగా చేయగలుగుతాను.. మిమ్మల్ని నిరాశ పరచను.”, అన్నాను నవ్వుతూ.

“ఊ!..” అంటూ అతను నవ్వాడు.

“చీకటిపడుతోంది రండి! మా ఇంటికి వెళ్దాం..”

“నేను, రాత్రికి ఇక్కడే, అదిగో ఆ కొండ మీద పడుక్కుంటాను..” అన్నాను కాస్త దూరంగా వున్న కొండని చూపిస్తూ.

“చలిగా ఉంటుంది మరి.”

“పర్వాలేదు. నాకు ఇష్టమే! “

“రాత్రికి ఒకవేళ మీకు చలి వేస్తే కప్పుకోవడానికి వుంటుంది..” అంటూ సంచీలో వున్న బట్ట తీసి ఇచ్చాడు.

సంచీలోంచి ఒక టిఫిన్ బాక్స్ కూడా తీసి “దీనిలో పెరుగు అన్నం వుంది. మీకు ఆకలి వేస్తే తినండి. మీకు నీళ్ళకి..” అంటూ ఒక నీళ్ళ సీసా కూడా అందించాదు.

వాటిని తీసుకుంటూ “ఊ!..” అంటూ తల ఆడించాను.

అతను వెళ్ళిపొయే వరకూ అక్కడే వుండి నేను కొండ ఎక్కాను.

చిన్న కొండ కాబట్టీ, కష్టం లేకుండానే ఎక్కాను. పైన రాతి ప్రదేశం. పడుక్కోడానికి వీలుగా కూడా వుంది. చేతిలో వున్నవి పక్కని పెట్టి, పైన ఆకాశాన్ని చూస్తూ పడుక్కున్నాను. చూస్తూండగానే రాత్రి చీకట్లు కమ్మేశాయి.

కడుపులో పేగులు శబ్దం చేస్తూంటే, లేచి బాక్స్‌లో వున్న పెరుగు అన్నం తిని కాస్త నీళ్ళు తాగి మళ్ళీ పడుక్కున్నాను.

ఆకాశం అంతా నక్షత్రాలతో నిండిపోయింది. వాటి మధ్య చంద్రుడు సగమే వున్నా కాంతులు చిమ్ముతున్నాడు. అంతా నిశ్శబ్దం..

అలా చూస్తూ వున్నకొలదీ మనసులో ఎక్కడో ఒక విధమయిన భావోద్వేగం.. దాని తాలుకు ప్రకంపన శరీరమంతా పాకింది. చాలా ఏళ్ళ తర్వాత, నాలో ఏదో చైతన్యం మేలుకుంటున్న భావన..

మెరుస్తున్న నక్షత్రాలతో పాటు నేనూ ఒక నక్షత్రంలా మారి ఆకాశాంలో మెరవటం లేదు కదా అని అనిపించేటట్లు నన్ను నేనే మరిచిపోయా. ఎప్పుడు నిద్ర లోకి జారానో కూడా తెలియలేదు.

***

కృష్ణారావుతో పాటు పని చేస్తూ, ఒక అయిదు రోజులు గడిచిపోయాయి.

“ఒక రోజు వున్నట్లుడి కృష్ణారావు అడిగాడు “మీరు ఎక్కడ నుంచి వచ్చారు, ఏమి చేసేవారు?” అని.

చెప్పాను, “చెన్నైలో. మల్టీ నేషనల్ కంపెనీ! వైస్ ప్రెసిడెంట్‍గా చేసేవాడిని”, అని.

“పెద్ద ఉద్యోగం చేస్తూ, కంఫర్ట్స్‌కి, అలవాటు పడిన మీరు, ఎందుకు ఇలా తిరుగుతున్నారు? ఎంత కాలం నుంచి తిరుగుతున్నారు?”

“కంఫర్ట్స్ కూడా అనుభవించడానికి తగిన సమయం వుండాలి కదా. పని ఒత్తిడిలో తినడం కూడా మర్చిపోతున్న పరిస్థితి. సుఖమో కష్టమో తేదా కూడా గ్రహించే సున్నితత్వం ఎప్పుడో పోయినట్లుంది. అందుకే మాకు వున్న సుఖాలు ఏవయినా వ్యర్థం గానే వుండిపోతాయి.. పని ఒత్తిళ్ళతో చాలా యాంత్రికమయి పోయింది జీవితం. క్రమేణా మమ్మల్ని మేము పోగొట్టుకుంటున్నాము అనిపించింది. ఇప్పుడు కొత్త డెవెలప్మెంట్ ఏమిటంటే ఎమోషన్స్ కేఫ్ అని ఎమోషన్స్ అమ్ముతున్నారు. యాదృచ్ఛికంగా నేను ఎమోషన్స్ కేఫ్‌కి వెళ్ళాను. అప్పుడు వాళ్ళు చెప్పారు. నేను ఎమోషన్స్‌ని పోగొట్టుకున్నాను అని. అప్పటివరకూ, నన్ను నేను పోగొట్టుకున్నాను, అని కూడా తెలియలేదు. మళ్లీ తిరిగి పొందలనే ప్రయత్నం ఇదంతా”, అంటూ ఎమోషన్ కేఫ్ గురించి, అక్కడ నాకు ఎదురయిన అనుభవాల గురించీ అంత వివరంగా చెప్పాను.

అంతా విని గట్టిగా నవ్వాడు అతను.

“కాస్తయినా ఎమోషన్ వుంటే తప్ప పనిచేయడానికి తగ్గ మోటివేషన్ కూడా వుండదు అనుకున్నారేమో కార్పొరేట్ పెద్దలు. అదీ.. అతను ఎవరు.. హా వెంకట్ అన్నారు కదూ. అతను చెప్పినట్లు ఇది కూడా కార్పొరేట్స్ మనిషికి వ్యతిరేకంగా చేసే కుట్రలో భాగమే. ఏ లాభం లేకపోతే ఏ కార్పొరేట్ అయినా ఎందుకు చేస్తుంది? కార్పొరేట్స్ అన్నీ ఒక విధమయిన నెట్‌వర్క్‌గా ఏర్పడి, ఒకరికి ఒకరు మద్దతుగా పని చేస్తూ వుంటారు. అందుకే, భవిష్యత్తులో ఎక్కువ ఎమోషన్స్ కేఫ్స్ ఓపెన్ అయినా ఆశ్చర్య పోవక్కరలేదు.”

“హా!..” బరువుగా నిట్టూర్చాను.

నా నిట్టూర్పుకి నేనే ఆశ్చర్య పోయాను, ‘చాలా ఏళ్ళ తర్వాత నిట్టూర్చాను’ మనస్సులో అనుకుంటున్నాను, అనుకుని, పైకే అనేసాను.

నా మాటలకి అతను నవ్వాడు.

“ఇంతకీ మీరు పోగొట్టుకున్నది మరి పొందారా?..”

“ఇంకా తెలియలేదు.”

“పెళ్ళి అయిందా?” అడిగాడు.

“అయింది. కానీ ఆమె పరిస్థితి ఇదే. నేను బయటకి వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. తను అది కూడా చేయలేని పరిస్థితిలో ఇరుక్కు పోయింది.”

“అంటే?..” భృకుటి ముడిచి అడిగాడు అతను.

“ఆమె ఇంకో రెండు మూడు సంవత్శరాలలో, ఆమె పని చేసే కంపనీకి సి.ఇ.ఓ. అవబోతోంది.”

“ఓహో!..” అర్థమయినట్లు తల వూపాడు అతను.

“మీరు?..” అంటూ అతని కేసి చూసాను.

అతను ఆకాశం కేసి దూరంగా చూస్తూ, చెప్పడం మొదలు పెట్టాడు.

“నేను కూడా అప్పట్లో, మల్టీ నేషనల్ కంపెనీలో పని చేసేవాడిని. నేను పని చేసే కంపనిలో, ఏ.ఐస్ ఎంగేజ్‌మెంట్‌కి సంబంధించిన విషయాలని చూసేవాడిని. ఆ ప్రక్రియలో ఏర్పడే పరిణామాలు ఆలోచిస్తూ చాలా నిరాశ, నిస్పృహ లకి లోనయ్యాను. కార్పొరేట్స్‌కి, ఖర్చులు ఎలా తగ్గించాలి, లాభాలు ఎలా పెంచాలి అనే దాని మీదే దృష్టి వుంటుంది. ఫండింగ్‌కి కార్పొరేట్స్ పైన ఆధారపడ్డ పొలిటికల్ పార్టీస్, ప్రభుత్వాలు, వాటికి వత్తాసు పలకడమే తప్ప ఏమి చేయగలుగుతాయి?

ఏ.ఐస్. వలన చాలామంది నిరుద్యోగులు అవుతారని తెలిసినా దానికి తగ్గ బ్యాకప్ ప్లాన్ ప్రభుత్వాల వద్ద లేదు. ఒత్తిడి తీసుకు వస్తే ఏదో కొంత డబ్బులు పెన్షన్స్‌లా ఇస్తారేమో.. కానీ, అది కూడా ఒక రకంగా ఉద్యోగస్తులని, అవమానించినట్లే..

ఇంక, కార్పొరేట్స్‌కి, ఈ విషయం ఆలోచించాల్సిన అవసరం లేదు, కనిపించదు,. సెవెరెన్స్ పే ని కూడా ఎంత వరకూ కుదించవచ్చు అనే ఆలోచిస్తాయి. వున్న ఉద్యోగస్తులు ఉద్యోగాలు పోతాయన్న భయంతో రోజుకి 24 గంటలు ఏమి ఖర్మ 25 గంటలు పని చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఆలోచిస్తూంటే, అందరూ కుమ్మక్కు అయి మనిషి మనుగడకే ఎసరు పెట్టేటట్లు వున్నారు, అని అనిపించింది..

నాకు ఇంక అక్కడ భవిష్యత్తు కనపడలేదు. అందుకే ఉద్యోగం రిజైన్ చేసి, ఇక్కడకి వచ్చి, ఈ భూమికొని వ్యవసాయంలో స్థిరపడ్డాను. నెమ్మదిగా కార్పొరేట్ వేళ్ళు ఇంతవరకూ విస్తరించే అవకాశం లేకపోలేదు. అంతవరకూ కాస్త ఊపిరి పీల్చుకోవచ్చు. పిల్లలని కూడా ఎటువంటి ఒత్తిళ్ళకి, ఎక్స్‌పోజ్ చేయకుండా, ఆరోగ్యంగా పెంచుకోవచ్చు అని కూడా అనిపించింది.

నేను నా భార్య బాగా ఆలోచించి ఈ కార్పొరేట్స్‌కి, ఆ కల్చర్‌కి, దూరంగా బతకాలని నిర్ణయించుకున్నాం.. మాకు ఇద్దరు పిల్లలు.. అబ్బాయిలు. ఇక్కడే పక్క గ్రామంలో వున్న హైస్కూల్‌లో చదువుకుంటున్నారు..”

ఆశ్చర్యంగా అతనిని చూస్తున్నాను. “కార్పొరేట్స్ చేతిలోకి అన్ని రంగాలు నెమ్మదిగా వెళ్ళిపోతున్నాయి వ్యవసాయం, మైనింగ్, అన్నీ! ఆ పరిస్థితే వస్తే, మనకి తప్పించుకునే అవకాశం, కూడా వుండదు..” అంటూ గట్టిగా నవ్వాడు.

“అవును” అంటూ తల ఊపుతూ అన్నాను.

“మనుషులు ఎమోషన్స్ పోగొట్టుకుంటున్నారు. ఏ.ఐస్ ఎమోషన్స్ పొందడానికి ప్రయత్నిస్తున్నాయి.. ఒకసారి ఏ.ఐస్ ఎమోషన్స్‌ని పొందితే కార్పొరేట్స్‌కి, మనుషులని నియంత్రించినంత తేలిక కాదు, ఏ.ఐస్ ని నియంత్రించడం..” అన్నాను నవ్వుతూ.

“ఏది ఏమయినా ఏ.ఐస్.ని అన్ని రంగాల లోనూ ఎంగేజ్ చేయడానికే నిర్ణయించుకుంటున్నారు కదా. నేను ఇక్కడకి వచ్చి ఏడేళ్ళు అయింది ఇప్పడు పరిస్థితి ఎలా వుంది?”

“హెచ్ ఆర్. ఫైనాన్స్ లలో ఏ.ఐస్ చాలా కార్పొరేట్స్‌లో వున్నాయి.. అవి కూడా అన్నివిధాలుగా మనుషులు లానే వుంటాయి.. ఎవరు ఏ.ఐ, ఎవరు కాదు అని కూడా తెలుసుకోవడం కష్టంగా వుంటుంది.”, చెప్తున్న నా మొహం మీద నాకు తెలియకుండానే నవ్వు కదిలింది.

మళ్ళీ అన్నాను,

“వాటికి ఎమోషన్స్ వుండవు కాబట్టి, చెప్పినా అర్ధం చేసుకోవు. చాలా నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తాయి. వాటి ప్రవర్తన కంపనీలకి చాల ఫేవరబుల్ గా వుంటుంది.. ఏ.ఐ, వున్న హెచ్.ఆర్.లో, లీవ్స్ ఏమీ శాంక్షన్ కావు. ఎటువంటి బెనిఫిట్స్ అయినా ఇవ్వడానికి, ఏ కారణం వాటికి రీజనబుల్‌గా అనిపించదు.. ఇంక ఫైనాన్స్‌లో ఎప్పుడూ ఖర్చులు తగ్గించడం, ఉద్యోగులని తీసి వేయడం, ఇదే ఎప్పుడూ చర్చనీయాంశం. మానవత్వపు విలువలని, యంత్రాల నుంచి ఆశించడం అవివేకమే అవుతుంది. ఆ విధంగా ఎక్జిక్యూటివ్స్ ఏ.ఐస్ వెనక దాక్కోవడం చాలా అమానుషమే. పొమ్మనక్కర్లేదు, పొగ పెడ్తే చాలు అనే సామెతని నిజం చేస్తూ ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ పరిస్థితికి, బాధపడో, కోపపడో, ఉద్యోగం వదిలి వెళ్ళిపోయేవాళ్ళు, వెళ్ళిపోతూంటారు..”.

“ఆలోచిస్తే, భవిష్యత్తు పెద్ద ఆశాజనకంగా ఏమీ అనిపించడం లేదు..” అన్నాడు కృష్ణారావు.

“అవును. మనిషి మనుగడకి, ముప్పు వాటిల్లేలానే వుంది.” అంటూ నేనూ నిట్టూర్చాను.

“మనిషి, ఇటువంటి చాలా రకాల సవాళ్ళు ఎదుర్కుంటూనే వస్తున్నాడు. ఇప్పుడూ ఏదయినా పరిష్కారం దొరకకపోదు. కానీ అది ప్రభుత్వాలు మనిషి మనుగడ కోసం ఎంతవరకూ నిజాయితిగా పనిచేయగలుగుతాయి అనే దాని మీద ఆధారపడి వుంటుంది.” సాలోచనగా దూరంగా చూస్తూ అన్నాడు.

“అవును. లేకపోతే ఇలానే ఎమోషన్స్ కేఫ్స్‌లో ఎమోషన్స్ కొనుక్కుంటూ.. ఆ విధంగా, అందరూ, వారి వారి, అస్తిత్వాన్ని గుర్తు చేసుకుంటూ బతకాల్సి వస్తుంది..”

ఇద్దరమూ, చాలా సేపు మౌనంగా వుండిపోయాము.

ఆకాశం కేసి, చుట్టూ వున్న కొండల కేసి చూస్తూ అన్నాను. “నాకు, మీలా ఇక్కడ సెటిల్ అవాలని వుంది. ఈ ప్రదేశం నాకు నచ్చింది. ఇక్కడకి వచ్చాక, నాలో, కొంచెం భావోద్వేగాల తాలుకు, చైతన్యం ఫీల్ అవుతున్నాను.. ఏమంటారు మీరు?”

“ఊ!.. ఆలోచించండి. నిర్ణయం తీసుకుని చెప్పండి. నాకు చేతనయిన సహాయం నేను చేస్తాను..”

“నేను వెనక్కి, వెళ్ళేది ఏమి లేదు..” నవ్వుతూ అన్నాను.

అతను, నవ్వాడు. “ఆ విధంగా మీరు నాకు ఇక్కడ, తోడు గా వుంటారు.. నాకూ సంతోషమే..” అంటూ.

Exit mobile version