[శ్రీమతి పువ్వాడ శారద గారు రచించిన ‘ఎంత చేరువో అంత దూరము’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]


[కాలు బాగవగానే ఇంట్లోంచి వెళ్ళిపోవాలనుకుంటుంది ఊర్మిళ. కానీ పిల్లలిద్దరూ ముందరి కాళ్ళకు బంధాలయ్యారు. వాళ్ళని వదిలి ఎక్కడికి వెళ్ళను అనుకుంటుంది. పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పకముందే ఈ సమస్యని ఓ దారిలో పెట్టాలనుకుంటుంది. అందరూ సుఖంగా ఉండాలంటే, పిల్లలతో వెళ్ళిపోవాలని భావిస్తుంది. ఈ సమస్య పరిష్కారం కోసమే జానూ ఇల్లు వదిలి వెళ్ళిందని ఊర్మిళకు తెలియదు. మాలతికి కూడా తెలియదు. ఆమె కాసేపు జానూ కోసం చూసి, అన్నం తిని గదిలోకి వెళ్ళిపోతుంది. జానూ హైదర్గుడాలో ఉంటున్న నీలి కజిన్ ధృతిమతి ఇంటికి వెడుతుంది. నీలి అప్పటికే జానూ గురించి చెప్పి ఉండడంతో ధృతి జానూని ఆప్యాయంగా ఆహ్వానిస్తుంది. అక్కడ ఆ అమ్మాయితో సమయం గడుపుతున్న తల్లి గురించిన ఆలోచనలు జానూని వదలవు. సాయంత్రం వాకింగ్ చేస్తూంటే మాలతికి కళ్ళు తిరుగుతాయి. తలలో హోరులా అనిపిస్తుంది. తనకేదో అవుతోందని అర్థమవుతుందామెకు. జానూ ఎక్కడికి వెళ్ళిపోయావు అని కూతురుని తల్చుకుంటుంది. గుండె దడ, చేయి మొద్దుబారిన ఫీలింగ్ కలుగుతుంది. గార్డెన్లో ఉన్న బెంచి మీద జారిపోతుంది. ఇంతలో అన్నమ్మ వచ్చి మాలతి ముఖంపై నీళ్ళు జల్లుతుంది. ఊర్మిళ కనిపించిన భ్రమలో, వాళ్ళకి క్షమాపణలు చెప్తుంది మాలతి. జానూ జాగ్రత్తని చెబుతుంది. మగతలోకి జారుతుంది. అక్కడ ధృతి ఇంట్లో జాను అన్యమనస్కంగా ఉంటుంది. తానే పొరపాటు చేసినట్టు గ్రహిస్తుంది. అమ్మ ఎంత కంగారు పడుతుందో అనుకుంటూ, ధృతి వాళ్ళకి – అమ్మ మెడిసిన్స్ తన బ్యాగ్ లోనే ఉన్నాయని చెప్పి అర్జంట్‌గా వెళ్ళాలని చెప్పేసి, ఇంట్లోంచి బయటకొచ్చేస్తుంది. ధృతి వాళ్ళ నాన్న కారులో ఇంటి దగ్గర దింపుతారు. జానూ లోపలి వస్తుంటే, బయట అంబులెన్స్ కనబడుతుంది. ఓ బాడీని బయటకు తెస్తుంటారు. అది చూసి జానూ కుప్పకూలిపోతుంది. అక్కడే ఉన్న ఆనంద్ ఆమె వైపు పరుగెత్తుకెళ్తాడు. – ఇక చదవండి.]
అధ్యాయం 29
ఆనంద్ వచ్చేసరికి అన్నమ్మ మాలతి ముఖం మీద నీళ్ళు జల్లుతున్నది.
“మాలతీ!” అంటూ ముందుకు వంగిన ఆనంద్‌కు క్షణాల్లో పరిస్థితి అర్థం అయింది. వెంటనే అన్నమ్మకు ఊర్మిళను అంబులెన్స్‌కు ఫోన్ చేయమని చెప్పి, మాలతికి సి.పి.ఆర్. ఇవ్వడం మొదలుపెట్టాడు.
అత్యవసర వాహనం రానే వచ్చింది.
కూడా మాలతితో కదిలాడు ఆనంద్.
మాలతిని ఐ.సి.యు.లో అడ్మిట్ చేసుకున్నారు. వెంటిలేటర్ మీద ఉంచారు.
కార్డియాక్ అరెస్ట్ అయిన తక్షణం ఆనంద్ సి.పి.ఆర్. ఇచ్చాడు.
కాస్త ఆలస్యం అయినా బ్రెయిన్ డామేజ్ అయ్యేది అన్నారు డాక్టర్స్.
రెండు రోజులు గడిస్తే కానీ ఏమి చెప్పలేమన్నారు.
మాలతికి స్టెంట్స్ వేయాలని అన్నారు.
సమయానికి సి.పి.ఆర్. ఇచ్చి తీసుకు వచ్చినందుకు డాక్టర్స్ అభినందించారు.
“దట్స్ గ్రేట్!” అన్నారు.
ఆనంద్ గుండెల నిండా గాలి పీల్చుకున్నాడు.
‘థాంక్ గాడ్!’ అనుకుని చేతులు జోడించాడు.
***
ఇంతలో ఊర్మిళ నుండి ఫోన్ కాల్.
ఎప్పుడో మధ్యాహ్నం అనగా ఫ్రెండ్ ఇంటికని చెప్పి వెళ్ళిన జాహ్నవి ఇంకా ఇంటికి రాలేదని.
ఆనంద్ అలర్ట్ అయ్యాడు.
జాహ్నవికి అంత ఫ్రెండ్స్ ఎవరున్నారు హైదరాబాద్‌లో!
టైం తొమ్మిదిన్నర దాటిపోయింది. ఫోన్ ఇంట్లోనే పెట్టేసి వెళ్ళిందట.
జాహ్నవి ఇలా చేయడమేమిటీ?
అతనికి గాబరాగా ఉంది.
హైదరాబాద్ లాంటి మహానగరంలో ఇల్లు వదిలి వెళ్ళిన అమ్మాయి నుండి ఎటువంటి సమాచారం లేకుంటే ఎంత టెన్షన్!
మాలతికి తాను హాస్పిటల్లో ఉండి చేసేదేమి లేదు ఇంక. డాక్టర్స్ పర్యవేక్షణలోనే నడుస్తుంది అంతా!
అతను ఆదుర్దాగా వచ్చేసరికి గేట్ ముందు అసలే ఆందోళనలో ఉన్న జాహ్నవి ఏడుస్తూ కనిపించింది.
“జాన్వీ! అది అమ్మ కాదు తల్లీ! ప్రక్కింటి వాళ్ళు..” అంటూ గుండెల కదుముకుని ఓదార్చాడు.
***
రూమ్‌కు షిఫ్ట్ చేసి అంతా నార్మల్‌గా ఉన్నది అని చూసాక మాలతిని డిశ్చార్జ్ చేసారు.
మాలతి ఇంటికి వచ్చింది. ఆరోగ్యం కుదుట పడింది.
ఆశ్చర్యం!!
గమనిస్తే..
మాలతిలో ఎంతో మార్పు కనిపిస్తున్నది, హాస్పిటల్ నుండి వచ్చాక.
కోపం, ఉద్రేకము కనిపించడం లేదు.
ఊర్మిళపై అరుపులు వినిపించడం లేదు.
పిల్లలపై చిటుకు దెబ్బలు (నొప్పి కలుగని దెబ్బలు) ఒక్కటి కూడా పడలేదు.
‘అమ్మ ఇలా ఉండడం ఇప్పుడు చాలా అవసరం. అమ్మకు ఫిజికల్ గానే కాదు, మెంటల్‌గా కూడా ఇప్పుడు రెస్ట్ చాలా అవసరం’ అనుకుంది జాహ్నవి.
మాలతిని డాక్టర్స్ వాకింగ్ చేయమన్నారు. మెట్లు దిగి క్రిందకు వెళ్ళకుండా, డాబా కాంపౌండ్ వాల్ చుట్టూ వాకింగ్ చేస్తున్నది మాలతి.
అప్పుడే ఆనంద్ డాబా మీదకు వచ్చాడు. అన్నమ్మ చెట్లకు నీళ్ళు పోసే పైపు పైనే వదిలేసింది.
మాలతి అతన్ని చూసి ఆగిపోయింది.
ఆనంద్ కూడ ఆమె వంక చూసాడు.
ఇద్దరి చూపుల తీరం ఒకటే!
‘ఎంత గండం గడిచింది!’
మాలతికి ఆనంద్ భుజంపై వాలి తనివి తీరా ఏడవాలని ఉంది.
ఆనంద్‌కు రెండు చేతులు సాచి, గుండెలకు పొదువుకుని, “థాంక్ గాడ్! దేవుడు నిన్ను నాకు దక్కించాడు” అని చెప్పాలని ఉంది.
కాని ఎవ్వరి అడుగు ముందుకు పడలేదు.
తీరం తాకిన చూపులు (ఒకే భావంగా అర్థమయిన చూపులు) నిశ్శబ్దంగా వెనక్కు మళ్ళాయి.
కొన్నే అడుగులు – కానీ ఎన్ని మైళ్ళ దూరమో!
చేరువ కాలేని దూరం.
ఆనంద్ పైప్ అందుకుని వెళ్ళిపోయాడు.
మాలతి నడకలో వేగం మందగించింది.
***
మాలతి కోలుకుంది. జాహ్నవి సమస్య అలాగే ఉండిపోయింది.
“అమ్మా..!!” చెప్పాలని ఆగిపోయింది.
మాలతి అర్థం చేసుకుంది.
“వెళ్ళిపోదాం అనే కదా!” అంది.
అవునన్నట్టు తల్లి వంక చూసింది.
“అలాగే! వెళ్దాం” అంది.
ఆశ్చర్యపోవడం జాహ్నవి వంతు అయింది.
***
సీన్ కట్ చేస్తే..
చుక్ చుక్ బండి వెళ్ళిపోతూంది.
బండిలో జాహ్నవి – మాలతి.
జీవితంలో ప్రతి వాళ్ళు ఎక్కే బండి, ఆశల బండి. ఆ బండి ఎవర్ని దింపేస్తే వాళ్ళు దిగిపోవాల్సిందే. జాహ్నవిని కూర్చోబెట్టుకుని తండ్రికి దగ్గర చేసింది, ఆనంద్‌ను దూరం చేసి మాలతిని లాక్కెళ్ళింది.
***
ఇరువురిలో భావోద్వేగం నింపిన నిశ్శబ్దం –
గడిచిన గతం మదిలో నిలిపిన గుర్తులు.. తీపివో, చేదువో, కాలానికి వదిలేసి –
తిరుగు బాటలో ఇరువురూ –
భావాలను మాటల్లో పెట్టలేని మూగతనంలో –
ఎంత గండం గడిచింది.
అమ్మకేమైనా అయి ఉంటే తానేమయ్యేది, అనుకుంది జాహ్నవి.
రైలు కదులుతూంది – కలవని పట్టాలపై – ఎందరినో కలిపేందుకు!
కానీ, విడిపోయిన అమ్మా నాన్నలను అది కలుపలేదు.
అమ్మా -నాన్న ఎన్నటికీ కలువని ఈ రైలు పట్టాలే!
ఈ కలవని పట్టాల పైనే – తను ప్రయాణించింది.
ఎంత సుదీర్ఘ ప్రయాణం చేసినా వచ్చిన చోటుకే చేరాలనే చేదు నిజం ఆ చుక్ చుక్ల్లో వినిపిస్తూంది జాహ్నవికి.
ఇంతకీ అమ్మ తన లెటర్ చదివిందా!
ఎన్ని సార్లో అనుకుంది. కానీ అడగలేకపోయింది.
“అమ్మా!” అని పిలిచింది.
కిటికీలో నుండి బయటకు చూస్తున్న మాలతి “ఏమిటి! జానూ!” అంది.
అణిగిన అలలా ఆమె గొంతు ప్రశాంతంగా ఉంది.
ఆమెలో ఈ మార్పు జాహ్నవి గమనించింది.
“అమ్మా! నా లెటర్ వల్లే నీవీ నిర్ణయం తీసుకున్నావా!” అంది.
మాలతి కూతురి వంక చూసింది.
ప్రశ్న చిన్న గానే ఉంది.
సమాధానం లోనే మోయలేనంత బరువు ఉంది.
నిట్టూర్చి ఒక నిముషం ఆగి, జాహ్నవి వంక చూస్తూ చెప్పింది.
“కాదు జానూ! నీ లెటర్ కంటే ముందు నేను మృత్యు పత్రం చదివాను. అదే నన్ను మార్చింది, ఆ క్షణం నాకు ఆఖరి క్షణం అనిపించింది. అప్పుడు నా మనసు ఏమి ప్రార్థించిందో తెలుసా!” అంది మాలతి.
ఆ రోజు బెంచి పై తన వేదన గుర్తు చేసుకుంటూ..
అన్ని మోహాపాశాలకు అతీతంగా తన మనసంతా ఒకే కేంద్ర బిందువు వద్ద స్థిరమై, అంతః శక్తులన్నీ కూడదీసుకుని – ‘ఓ! భగవంతుడా!, నా పిచ్చి తల్లి జాహ్నవి కోసం, నా బంగారు తల్లి కోసం నన్ను బ్రతికించు! నా బిడ్డ కోసమే నా జన్మ ముగిస్తాను’ అని.”
జాహ్నవి తల్లి వంక చలించి పోతూ చూసింది. “అమ్మా!” అంటూ ఆర్తిగా హత్తుకుంది.
ఇద్దరి మనసులు మౌన రాగంతో పెనవేసుకున్నాయి.
***
మరో సీన్ –
విశాలమైన హాల్లో ఆనంద్ ఒంటరిగా నిల్చుని ఉన్నాడు.
అణుచుకున్న ఆవేదన ప్రస్ఫుటంగా కనిపిస్తూంది అతనిలో.
మాలతి వెళ్ళి పోయింది.
తన శరీరంలో ఒక భాగం వేరు అయినట్టు ఉంది.
మాలతిని పరిరక్షించుకోవడంలో తృప్తి – ఆమె తన వద్ద ఉంటే మనసుకో సంపూర్ణ భావం –
తనను ఇలా బాధ పెట్టేందుకేనా మాలతి మళ్ళీ వచ్చింది.
ఆనంద్ కళ్ళ నుండి నిశ్శబ్ద జలపాతం..
ప్యాంట్ జేబుల్లో చేతులు దూర్చి నిలబడిన ఆనంద్ కు ఓదార్చేందుకు కదిలి వచ్చింది ఓ గాలి తెమ్మర. పరదా ఊగి ‘మాలతి’ అన్న అక్షరాలు అతన్ని మృదువుగా స్పర్శిస్తూ, వెనక్కి మళ్ళాయి.
కొన్ని బంధాలంతే ఎంత చేరువో అంత దూరం – ఎంత దూరమో అంత చేరువ!
ఆశల బండి ఆనంద్ ప్రక్క నుండే కదిలిపోయింది.
సవ్యమైన కుటుంబ వ్యవస్థ కోసం బంధం నిలుపుకోవాలి.
మంచి కుటుంబమే మంచి సమాజాన్ని నిర్మిస్తుంది.
అమ్మా నాన్నల మధ్య అగచాట్లు లేని భావి తరం పిల్లలను అందరమూ చూడాలి.
***
పరిగెత్తే ట్రైన్ కిటికీల నుండి చూస్తూంది మాలతి.
ఈ ప్రయాణం తనకు ఓ గొప్ప సత్యం తెలిపింది. ఇది తాను ఊహించనిది. కానీ తన మనసు మంటను చల్లార్చేది.
తాను మోసపోలేదు. అవివేకంగా జీవితాన్ని చేజార్చుకుంది.
ఊర్మిళ ఆయన జీవితంలోకి వచ్చినా, తనపై ఆయన ప్రేమ చెక్కు చెదరలేదు. జన్మాంతం విడిపోని ప్రేమలు తమవి.
‘చాలు, ఇది చాలు.. తన జీవితానికి అంతా ఆ భావన చాలు.. ఆ భావమే తోడుగా ఉండగా, ఇంక తాను ఒంటరి ఎలా అవుతుంది’.
***
మాలతి జాహ్నవి బ్యాగ్ సర్దుతూంది.
“అమ్మా!ఎక్కడికి వెళుతున్నాం” అంది జాహ్నవి.
“వెళుతున్నాం కాదు. వెళుతున్నావు” అంది మాలతి.
జాహ్నవి కేమీ అర్థం కాలేదు.
మాలతి బ్యాగ్‌లో ఏవేవో సర్దేస్తూంది.
“హూ! ఏమిటో నీ ప్లాన్ చెప్పవు. వారం రోజుల నుండి బ్యాగ్ మాత్రం సర్దేస్తూ ఉన్నావు.”
మాలతి బ్యాగ్‌లో బట్టలు పెట్టడం మానేసి, జాహ్నవి వంక చూసింది.
“నీకు ఇష్టమైన ప్లేస్‌కు. నువ్వెన్నో కలలు గన్న ప్లేస్‌కు!”
“అంటే..” జాహ్నవికి ఏదో అర్థం అయ్యీ, కానట్టు ఉంది.
మాలతి అటు తిరిగి చెంగుతో కళ్ళద్దుకుంది.
“మీ నాన్న దగ్గరికి!” స్థిరంగా పలికింది గొంతు.
జాహ్నవి అయోమయంగా చూసింది.
“మామ్! డు యు నో, వాట్ ఆర్ యూ సేయింగ్!”
“ఎస్! ఐ నో!”
అంటూన్న తల్లి వంక బిత్తరపోయి చూసింది, జాహ్నవి.
“అదేంటి! నేను వెళితే నువ్వూ, తాతయ్య గారు ఏమి కావాలి?”
“ఏమి కాము. బాగుంటాము” వెనుక నుండి తాత గారి గొంతు వినిపించి, తిరిగి చూసింది జాహ్నవి.
“మీరు.. నేను లేకుండా ఉండగలరా!”
ఇది సాధ్యం అవుతుందా!
జాహ్నవికి ఆ మాటలకు షాక్ తగిలినట్టు అయ్యింది.
“మేము బాగుంటాము” ఇద్దరూ ముక్త కంఠంతో అంటుంటే నివ్వెర పోయిన జాహ్నవి, బిగ్గరగా అరిచింది. “నో! ఇట్స్ ఇంపాజిబుల్. మీరు ఉండలేరు. మీరు ఇద్దరే ఒంటరిగా ఉంటే నేను ఒప్పుకోను.”
“నువ్వే అన్నావు గదా! ఇద్దరు అని. ఇంక దిగులు ఎందుకు?”
“అలా అంటావేమిటి, మామ్! తాతగారు పెద్దవాళ్ళు. నీకు హెల్త్ బాగుండదు.”
“లేదు, జానూ! నేను హెల్త్ బాగా చూసుకుంటాను. ఎప్పుడు వీడియో కాల్ చేసినా, నా నవ్వు ముఖమే నీకు కనిపిస్తుంది.”
“అమ్మ నాతో రోజూ వాకింగ్‌కు వస్తుంది.”
“నేను నీలి వాళ్ళమ్మ గారితో కలిసి గుడికి కూడా వెళతాను. పక్కింటి ఆంటీలు పిలిస్తే పేరెంటాలకు వెళతాను. “
“అంతేనా, వినుత వాళ్ళమ్మ గారితో షాపింగ్‌కు కూడా వెళుతుంది” చెప్పారు తాతగారు.
అవునన్నట్టు తలాడించింది మాలతి.
వరాలు గుప్పిస్తూన్న అమ్మా, తాతయ్య గార్ల వంక ఇంకా అపనమ్మకంగా చూస్తూంది జాహ్నవి.
“ఎందుకు! ఎందుకు ఇలా ఇదంతా!”
గట్టిగా అంది. “నో! నేను వెళితే మీరు ఒక్కరు అవుతారు.”
“లేదు, జానూ! మేము హ్యాపీగా ఉంటాం. ప్రామిస్! “
“ఎందుకు అమ్మా! ఎందుకు ఇదంతా!”
“జానూ! నా మాట విను. ఇన్నేళ్ళు మా వద్ద ఉన్నావు. ఇప్పుడు నాన్న దగ్గర ఉండడం న్యాయం!”
జాహ్నవి మౌనంగా ఉంది.
“ఇకపై నీ భవిష్యత్‌కు సంబందించిన నిర్ణయాలన్నీ మీ నాన్న తీసుకుంటారు.”
“నాన్న మంచితనం నిన్ను మార్చేసిందా అమ్మా!” అంది జాహ్నవి గాద్గదికంగా.
‘శ్రుతకీర్తి స్నేహం కూడా ఆలోచింప జేసిందేమో!’
‘ఆత్మసాక్షిగా మృత్యుముఖంలో చేసుకున్న ప్రమాణంతో మనసు అంతర్ముఖమయ్యిందేమో!’
ఏమో, ఏమి జరిగిందో!
కాలము, మనుషులు మారడం సహజమే!
***
ట్రైన్ కదిలింది.
జాహ్నవి వీడలేక, వీడలేక ట్రైన్ ఎక్కింది.
అమ్మా, నాన్నా..
ఎవరినో ఒకరిని మిస్ అవక తప్పని తన జీవితం..
తనదే కాదు, ఎందరో డైవర్సీ పిల్లల జీవితం – ఇంతే!
ట్రైన్, పట్టాలపై నుండి కదిలి పోతుంటే, వెనుకే అవుతున్న అమ్మను చూస్తూ, ముందుకు కదిలింది జాహ్నవి.
(సమాప్తం)

శారద పువ్వాడ (తడకమళ్ళ) గారి స్వగ్రామం మిర్యాలగూడలోని తడకమళ్ళ గ్రామం. హైస్కూల్ చదువు సూర్యాపేట లోను, కాలేజీ చదువు హైదరాబాద్, నాంపల్లి లోని వనిత కాలేజీలో సాగింది. ప్రముఖ వార పత్రికల్లో కథలు కొన్ని అచ్చయ్యాయి. ఎఫ్.బి.లో కొన్ని కథలు, వచన కవితలు వ్రాసారు. ‘ఎంత చేరువో అంత దూరము’ వీరి మొదటి నవల. ఈ నవలను ప్రచురిస్తున్న సంచిక వారికి, తన రచనలను ఆదరించిన ముఖ పుస్తక మిత్రులకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు రచయిత్రి.
20 Comments
కొల్లూరి సోమ శంకర్
ఇది వి.ఎస్. భారతి గారి వ్యాఖ్య: *మాటలు లేవు – VS Bharathi.*
కొల్లూరి సోమ శంకర్
ఇది పి. నళిని గారి వ్యాఖ్య: మనసు కరిగిందా… కళ్ళల్లో తడి అదేనేమో. – Nalini Pyaraka.*
కొల్లూరి సోమ శంకర్
ఇది తాతా అనూరాధ గారి వ్యాఖ్య: *ముగింపు చాలా బావుంది అండి. టైటిల్ కి సరిగ్గా సరిపొయింది. – Anuradha Tata.*
కొల్లూరి సోమ శంకర్
ఇది అభిజ్ఞ గారి వ్యాఖ్య:* ఆనంద్ – మాలతి.. “ఎంత చేరువో అంత దూరము “.. పర్ఫెక్ట్ టైటిల్. తను తనలోని split personality వల్ల నాశనం చేసుకున్న జీవితాన్ని , చివరి క్షణం లో వచ్చిన మార్పుతో తన లైఫ్ ను accept చేసి ఇంకా ఐదివరకులాగా ఒంటరిగా ఉండిపోకుండ గుళ్ళకి , పెరెంటాలకి, షాపింగ్‌లకి, వెళ్ళాలని నిర్ణయం తీసుకోవడం.. జానును ఆనంద్ దగ్గరికి పంపాలనుకోవడం..చాలా చక్కగా అనిపించాయి.. కళ్ళలో నీళ్ళు తిరిగాయి చదువుతున్నంతసేపూ.
జాహ్నవి.. starting నుంచి జాహ్నవి maturity నన్ను అబ్బురపరుస్తూనే ఉన్నది.. ఒక వైపు తల్లి .. మరోవైపు దూరమైన తండ్రి ప్రేమ కోసం చేసిన ప్రయాణం.. తల్లి , తండ్రి, పిన్ని దగ్గర తనకు ఎదురైనా situations ను ఎంత చక్కగా హ్యాండిల్ చేసిందో అస్సలు.. చివరికి మాలతి తండ్రి దగ్గరికి వెళ్ళమన్న కూడా .. మీరు ఇద్దరు ఒంటరి అవుతారు .. ఆ మాటల్లో ఎంత భాధ్యత.. ఏ ఎపిసోడ్ కి ఆ ఎపిసోడ్ లో అబ్బురపరిచిన పాత్ర జాహ్నవి ది.. మొత్తానికి మాలతి ,ఆనంద్ ,ఊర్మిళ మరియు జాహ్నవి .. మానసిక పరిస్థితి కి లోబడి ఆనంద్ ను వదిలి వెళ్ళిన మాలతి.. ఎవరు లేకుండా ఆ దేవుడే దిక్కు అనుకునే సమయం లో ఆనంద్ కి దగ్గర అయిన ఊర్మిళ .. ఏమి చేసినా మాలతి లో మార్పు లేక ఇక ఏమి చేయాలేని స్థితి లో ఆనంద్.. తల్లి తండ్రి ప్రేమకు ఆరాటపడే జాహ్నవి.. వీరి ఆవేదనను చాల చక్కగా చిత్రీకరించారు.. చాల ఆసక్తికరంగా , సస్పెన్స్ లతో , ట్విస్ట్ లతో .. చాలా చక్కగా సాగింది ఈ ఎంత చేరువో అంత దూరము.*
కొల్లూరి సోమ శంకర్
ఇది ఎన్. వేణుగోపాల్ గారి వ్యాఖ్య: *కథ, చాలా బాగుంది. మాలతి, ఊర్మిళ పాత్రల సంర్షణ కనిపిస్తుంది కానీ, అందుకు సమానం అయిన సంఘర్షణ ఆనంద్‌ది. ముగింపు కూడా బాగుంది.*
కొల్లూరి సోమ శంకర్
ఇది వసుమతి గారి వ్యాఖ్య: ముగింపు బాగుంది – వసుమతి.*
కొల్లూరి సోమ శంకర్
ఇది దేవులపల్లి వైదేహి గారి వ్యాఖ్య: *చాలా బాగుంది అక్కా కథ. ప్రతివారం ఆసక్తికరమైన కథనంతో హృదయానికి హత్తుకునే సన్నివేశాలతో ట్విస్ట్ లతో చివరకు ముగింపు టైటిల్ కి సరిపోయేలా ఉంది


.*
కొల్లూరి సోమ శంకర్
ఇది వల్లూరి పార్థసారథి గారి వ్యాఖ్య: *శారదా మేడమ్ నమస్తే, కధ ఈ నాటి పరిస్థితులకు అనుగుణంగా ఉంది! ముఖ్యంగా మాలతి వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని నిర్ణయానికి రావడం చక్కని సందేశం! అలాగే జాహ్నవిని కూడా పరిణతి చెందిన అమ్మాయిలా చిత్రీకరించడం బాగుందండి! అది అవసరం కూడా! ముఖ్యంగా విడాకులు తీసుకున్న జంటలు, వారి పిల్లలకు ఈ కథ ఒక కరదీపిక! మీకు హార్దిక అభివందనాలు!*
కొల్లూరి సోమ శంకర్
ఇది ఎ. ప్రత్యూష గారి వ్యాఖ్య: *కథను గమనిస్తే జాహ్నవి తండ్రిని చేరుకోవాలి అన్న ఆరాటంతో పరుగు తీసి ఎక్కడి నుండి ఎక్కడికో మలుపులు తిరిగి ఉన్న చోటునే వచ్చి ఆగింది కథ. అంతే. కథనం నడిపిన తీరు ఆద్యంతం ఆసక్తికరమై, భావోద్వేగాలు పంచుతూ దూరాలు, చేరువలు సహజం అన్న భావన కలిగించింది. – ప్రత్యూష ఎ.*
కొల్లూరి సోమ శంకర్
ఇది మాధవి చకిలం గారి వ్యాఖ్య: *అందరి మనస్సులకు ఊరట కల్గింది. కథ ప్రశాంతంగా ముగిసింది శారద

మంచి మంచి మలుపులతో. – మాధవి చకిలం.*
కొల్లూరి సోమ శంకర్
ఇది జి. భార్గవి గారి వ్యాఖ్య: *టైటిల్ సరిగా సరిపోయింది. చదవటం పూర్తయాక ఏం చెప్పటానికి ఇంక మాటలు లేవు. అంతే, అలా ఉండిపోయాను.- జి. భార్గవి, మిరియాలగూడ.*
కొల్లూరి సోమ శంకర్
ఇది లక్ష్మి తలపూరు గారి వ్యాఖ్య: *చాలా బాగుంది శారదగారు. మాలతి చాల హుందాగా ప్రవర్తించినది. ఒక్కో ఎపిసోడ్‌కు ఒక్కొక్కరి మీద ఒక్కొ అభిప్రాయాలు కల్పిస్తు సస్పెన్స్‌తో కధను నడిపిస్తు మంచి ముగింపు ఇచ్చారు. ఇందులో ఎవరినీ తప్పు పట్టలేము.
శారదగారు మంచి భాషాపటిమతో, అర్థవంతమైన పదప్రయోగలతో, సమాజానికి ఒక స్ఫూర్తి, నీతి ఇచ్చిన మీ నుంచి మరెన్నో కథలు ఆశిస్తున్నా.*
కొల్లూరి సోమ శంకర్
This is a comment by Ramadevi garu: *Nice,this confidence I want to see in all humans.Irrespective of the situations one has to face everything boldly.Jahnavi can spend time with her mom and dad.Regarding education she can choose accordingly.*
కొల్లూరి సోమ శంకర్
ఇది దుర్గా మాధురి గారి వ్యాఖ్య: *మాలతి పాత్ర సానుభూతితో మొదలై, ఆ తర్వాత మనకు ఒక్కొక్క ఘట్టం తెలుస్తూ ఉండేసరికి, ఒకలాంటి బింకము, మొండితనము, అవి దాటిన తర్వాత ఆమె చరిత్ర బయటకు వచ్చేసరికి, అది కాస్తా ఆమె పట్ల ఆమె భయాలు పట్ల అవగాహన గా మారింది. ౙాలి కలిగింౘటమే కాక, ఇటువంటి వారందఱికీ ప్రతినిధిగా కనిపించింది. ముగింపు దశకు వచ్చేసరికి, ఆమె పాత్రలో హుందాతనం కనిపించింది.
అంటే తప్పు చేయటానికీ, లేదా సరిదిద్దుకోవటానికీ, ఇంకో అవకాశం మనకు లేదు అనుకున్నప్పుడు, మనిషికి తన అనుచిత ప్రవర్తన పట్ల పశ్చాత్తాపం కనపడింది. ఇది నిజ జీవితంలో అందరి విషయంలోనూ జరగకపోవచ్చు. కానీ, ఇక్కడ మాత్రం అలాగే చూపించడం ఒక మంచి పాఠం. ఏదో కేవలం ఒక కథ రాస్తున్నాను అనుకోకుండా, రచయిత్రి సమాజంలో ఒక మంచి మార్పుకు తపన పడుతూ శ్రీకారం చుట్టారు. సంతోషంగా ఉంది.
అయితే, అన్ని చోట్లా, ఊర్మిళ లాంటి మంచి వ్యక్తులు ఉండకపోవచ్చు, ఆనంద్ అంత సహనశీలులు ఉండకపోవచ్చు, జాహ్నవి అంత పరిణతి కలిగిన సంతానము కలుగకపోవచ్చు, శృతి కీర్తి వంటి సన్నిహితులు దొరకకపోవచ్చు. అన్నిటికీ మించి మృత్యువు కూడా ఈ విధంగా భయపెట్టకపోవచ్చు.
అందుకే తల్లి బిడ్డను వాన నుంచి ఆకలి నుంచి ఇతర రుగ్మతల నుంచి కాపాడుకున్నంత పదిలంగా ప్రతి స్త్రీ, తన సంసారాన్ని కాపాడుకోవాలి.
ఇక్కడ జాగ్రత్తగా స్త్రీలకే ఆపాదించడం ఎందుకంటే, సాంకేతికంగా ఆ సహనం ఆ పట్టుదల ఆ తపన స్త్రీలకే ఉంటాయి అని కొన్ని రుజువులు ఉండబట్టి.
దీని అర్థం పురుషుడు విర్రవీగవచ్చు అని కాదు.
కానీ సంసారం నాశనం చేసుకుంటే అది జీవితాన్ని కూడా నాశనం చేయవచ్చు అన్న జాగరూకత ముఖ్యం.*
కొల్లూరి సోమ శంకర్
ఇది తేజస్విని గారి వ్యాఖ్య: *నవల లో అన్నీ పాత్రలు, సన్నివేశాలు చక్కగా ఆవిష్కరించారమ్మా.. జాహ్నవికి అన్యాయం జరుగోద్దని, తప్పంతా మాలతి పాత్ర పైనే పడొద్దని కోరుకున్నాను. నేను అనుకున్నట్టుగానే కథ ముగిసింది సంతోషం
. అలాగే జరిగిన విషయంలో తమ తమ పొరపాట్ల గురించి మాలతి, ఊర్మిళ పాత్రలు ఆలోచించుకొని మనసులో ఒకరి గురించి ఒకరు క్షమాపణలు చెప్పుకున్నారు. కానీ ఇక్కడే నాకో లోపం కనిపించింది అదేమిటంటే ఆనంద్ పాత్ర. మాలతి సైకాలజీ ప్రాబ్లం వలన అలా ప్రవర్తించిందని తెలిశాక కూడా అతను తన పొరపాటు కూడా ఉందని గ్రహించినట్టు చూపించలేదు విషయం తెలియగానే అయ్యో అవునా… మాలతి నువ్వు మొండిగా ప్రవర్తిస్తున్నావనే అనుకున్నా కానీ, నువ్వు బాలింతవు.. బిడ్డను పోగొట్టుకొని ఉన్నావు.. నీకు postpartum డిప్రెషన్ ఏమైనా వచ్చిందేమోననే కోణంలో ఆలోచించలేకపోయాను..ఇంత చదువుకొని కూడా..నన్ను క్షమించు అని మనసులో అనుకున్నట్టు కానీ, మాలతికి చెప్పినట్టుగా కానీ చూపించలేదు. అలా చూపించాల్సింది అమ్మా… ఎందుకంటే అమ్మా… రచయితలు చెప్పిన మాటలు తప్పకుండా పాఠకుల్లో ఆలోచనలు రేకెత్తిస్తాయి. ఈ కథలో అందరు ఉండి కూడా మాలతి తను మొండిది, ఎవరీ మాట వినదు అనే ముద్ర వేయించుకొని చుట్టూ బంధాలు ఉండి కూడా ఒంటరి అయి ఎలా మధనపడిందో… నిజజీవితంలో కూడా చాలామంది తమ సైకాలజీ ప్రాబ్లెమ్స్ తమకీ అర్థం కాక, చుట్టూ ఉన్నవాళ్ళూ అర్థం చేసుకోక ఒంటరిగా జరిగిపోయి ఇబ్బంది పడుతున్నవారు ఎంతోమంది ఉన్నారు… సైకాలజిస్టుని కలవాలని వాళ్ళకు తెలియడమూ లేదు… తీసుకెళ్లాలని ప్రక్కన వాళ్ళకి తెలియడమూ లేదు. అందుకే ఆనంద్ పాత్రతో క్షమాపణ చెప్పించి ఒక సందేశంలాగా చూపించాల్సిందని అనిపించింది…
*
ఇదొక సద్విమర్శ లాగే తీసుకుంటారని ఆశిస్తున్నాను అమ్మా..
కొల్లూరి సోమ శంకర్
ఇది రావుల వసంతమయి గారి వ్యాఖ్య: *ముగింపు చాలా బావున్నది అండి.*
కొల్లూరి సోమ శంకర్
ఇది తడకమళ్ళ రాంచందర్ రావు గారి వ్యాఖ్య: *శారదా! నవల సూపర్. చక్కని ముగింపుతో పేరుకు తగ్గ విధంగా ముగిసింది. పాత్రల నడక, వ్యక్తిత్వ విలక్షణత, సంఘటనల సమాహారం, భావ శబలత, ఆలోచనాలోచనం, దేనికవే ప్రస్ఫుటంగా పాదుకున్నాయి. అభినందనలు. తడకమళ్ళ రాంచందర్ రావు.*
కొల్లూరి సోమ శంకర్
ఇది సీతంరాజు సంధ్య గారి వ్యాఖ్య: * నాకు కథలో కొన్ని పాయింట్స్ నచ్చాయి. ఇవి చాలా మంది గమనించరు. మాలతి అన్నమ్మ కూడా మంచిదేనా అనుకుంటే, అన్నమ్మ మాలతి సవతి తల్లి కనుక పిల్లాడిని ఏదో చేస్తుందేమోనని భయ పడుతుంది. కానీ మాలతి పిల్లాడి గాయానికి కట్టు కట్టి, తన కోపం పిల్లల మీద లేదు అని, తన ఉనికి ఊర్మిళకు
నిరూపించేందుకే ఆమె ప్రవర్తన అలా ఉండేదని ఇక్కడ రైటర్ అన్యాపదేశంగా నిరూపించడం బాగుంది. మాలతి పాత్రను నేటి తెలుగు సీరియల్స్ లో లేడీ విలన్ పాత్రలా మార్చనందుకు సంతోషంగా ఉంది. ఆడదానిలో అమ్మ ఉండకుండా ఎక్కడ పోద్ది అని అన్నమ్మతో అనిపించి, పాత్రల విలువలు పెంచారు. – సీతంరాజు సంధ్య*
కొల్లూరి సోమ శంకర్
ఇది టి. అంజనీ కుమార్ గారి వ్యాఖ్య: * ఊర్మిళ పాత్ర సూపర్బ్ అండి. మొదటి నుండి ఒకే పద్ధతి లో ఉంది, ఊర్మిళ క్యారెక్టర్. ఆనంద్ జీవితం లో కి వచ్చి కూడా మాలతి అంటే భయమే. భయం కూడా కాదేమో గొప్ప సంస్కారం. ముగింపు బాగుంది. – టి. అంజనీ కుమార్ *
కొల్లూరి సోమ శంకర్
ఇది మణి తిప్ప గారి వ్యాఖ్య: *చాలా బాగుందమ్మా. నచ్చింది. మార్పు చెందిన మాలతిలో పరిణతి బాగుంది. ఈసారి ఆమె దీనిని శిక్ష అనుకోలేదు.
రైలులో మాలతి మాటలు కన్నీరు తెప్పిస్తే, బట్టలు సర్దుతూన్నప్పటి మాటలు మనసును కడిగి వేశాయి.
డైవర్సీలందఱూ ఈ కథ ౘదివితే బాగుణ్ణు. మనసును తేలిక పరిచే ముగింపు నిచ్చారు.- మణి తిప్ప*