ఫిబ్రవరి 1వ తేదీ అల్లా జిలాయీ బాయి జయంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.
***
ప్రతి ప్రదేశానికి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. కళలకు కూడా ఇది వర్తిస్తుంది. ఆయా ప్రదేశాలలోని కళాకారులు కూడా వీటికి వన్నెచిన్నెలద్ది కొత్త సొబగులను చేకూర్చుతారు.
జానపద గేయాలు, సాహిత్యం అక్షర జ్ఞానంతో సంబంధం లేకుండా విలసిల్లుతూ ఉంటాయి. తరతరాలకూ తరగని నిధిలా వారసులకు అందుతాయి. ఇవి ఆయా జాతి ప్రజల మూలాలను పట్టి ఉంచుతాయి.
అటువంటి గొప్ప సంగీత సరస్వతి ఒకామె రాజస్థాన్ జానపదాన్ని ప్రపంచదేశాలకు పరిచయం చేశారు. మహారాజు ప్రోత్సాహాన్నందుకుని, దేశ విదేశాల్లో పర్యటించి ప్రసార మాధ్యమాల ద్వారా గొప్ప పేరు తీసుకుని వచ్చారు. హిందూస్థానీ సంగీత ప్రక్రియలను తన స్వరం నుండి అలవోకగా వెలయించారు. ప్రేక్షకశ్రోతలను తన స్వర మధురిమలలో ఓలలాడించారు. ఆమే అల్లా జిలాయీ బాయి.
ఈమె రాజస్థాన్ లోని బికనీర్ రాజ్యంలో జన్మించారు. 1902 ఫిబ్రవరి 1వ తేదీన సంగీత కళాకారుల కుటుంబంలో పుట్టారు. తల్లి, అత్తలు సంగీత సరస్వతులు.
తల్లి హజన్ అలీమాన్, తండ్రి నబీమియా బక్ష్జీ. జిలాయీ బాల్యంలో అనారోగ్యం పాలయ్యారు. అప్పుడు తల్లి దేవతలను పూజించారు. ‘అల్లా’ చేర్చి ‘అల్లా జిలాయీ బాయి’గా పేరును మార్చారట.
బాల్యంలో తల్లి వద్దే సంగీతాన్ని అభ్యసించారు. బికనీర్ మహారాజు శ్రీ గంగా సింగ్‌కి కళలంటే మక్కువ. కళాకారులను గౌరవించేవారు. కళలను ప్రోత్సహించేవారు. ఆయన కాలంలో విలసిల్లిన కళలు ఈ నాటికీ రాజస్థాన్‌లోనే గాక దేశంలోని వివిధ ప్రాంతాలలో ప్రేక్షకులను, శ్రోతలను అలరిస్తూనే ఉన్నాయి.
ఈమె తల్లితో కలిసి మహారాజు దర్బార్‌కి వెళ్ళి కచేరీలలో పాల్గొనేవారు. 1912 లో పదేళ్ళ వయస్సులో ఈమె గానం మహారాజుని ఆకట్టుకుంది. ఆయన ఈమెను ‘గుణి జంకనా’ (మహరాజు గారి ఆస్థాన పాఠశాల)లో చేర్చారు. విద్యాభ్యాసం, సంగీతాభ్యాసానికి అవకాశాన్నిచ్చారు. దీంతో హోలీ, దీపావళి, తీజ్ తదితర పండుగల సందర్భాలలో తల్లితో కలిసి పాటలు పాడేవారు. ఆయన ఆస్థానంలో ఉస్తాద్ హుస్సేన్ బక్ష్ఖాన్, అచ్చన్ మహారాజ్‌లు సంగీత గురువులుగా విధులను నిర్వహించేవారు. జిలాయీ బాయిని గొప్ప సంగీత కళాకారిణిగా మలచమని ఆయన వారిని ఆదేశించారు.
ఆ ఇద్దరు గురువుల దగ్గర ఈమె అనేక సంగీత ప్రక్రియలను అభ్యసించారు. మాంద్, తుమ్రీలు, దాద్రా, ఖయాల్ మొదలయిన ప్రక్రియలలో ఈమెను నిష్ణాతురాలిని చేశారు. మహారాజాస్థానంలో 22 ఏళ్ళపాటు ఆస్థాన కళాకారిణిగా ఈమె సేవలను అందించారు. ఆస్థానంలో జరిగిన ఎన్నో వేడుకలను తన రాగాలాపనతో సుసంపన్నం చేశారు.
మహారాజు పట్టాభిషేక స్వర్ణోత్సవాలు ఘనంగా జరిగాయి. లార్డ్ వైస్రాయ్ తన బృందంతో ఈ కార్యక్రమాలకి హాజరయ్యారు. జిలాయీ గానాన్ని ఆయన ఆనందాతిరేకంతో ఆస్వాదించారు.
ఆ తరువాత జిలాయీ సంగీత ప్రస్థానం కొత్త పుంతలు తొక్కింది. సప్త సముద్రాల ఎల్లలు దాటిన ఆ సుస్వరలక్ష్మి లండన్ నగరానికి తరలి వెళ్ళారు. అక్కడ ఎలిజబెత్ రాణి సమక్షంలో రాయల్ ఆల్బర్ట్ హాల్‌ను తన సంగీతంతో పునీతను చేశారు. మైక్రోఫోను సాయం లేకుండా సాగిన గానం అందరినీ అద్భుతంగా అలరించింది.
మహారాజు మరణానంతరం కూడా ఈమె సంగీతాన్ని నేర్చుకుంటూనే ఉన్నారు. ‘ఆల్ ఇండియా రేడియో’ వారు ఈమె సంగీత గానాన్ని తమ శ్రోతలకు వినిపించేవారు. ఈమె గానాన్ని వినడం కోసం లక్షలాది మంది శ్రోతలు గంటల తరబడి వేచి చూడడం గొప్ప విశేషం. ఈమెకి గల అపార ప్రజాదరణను ఈ విషయం ధృవపరుస్తుంది.
రాజస్థానీ మూలాలున్న జానపద గేయాలకు అనేక ఇతర గేయాలకు ఈమె చేసిన స్వర రచనకు అద్వితీయ పేరు ప్రఖ్యాతులు లభించాయి. ఈ నాటికీ ఈ పాటలు రాజస్థానీ సంగీతఝరిలో సింహభాగాన్ని ఆక్రమించాయి. దేశ విదేశాల్లో ఇవి వినబడుతూ ఉండడం ముదావహం.
ఈమెకి పేరు తెచ్చిన సంగీత ప్రక్రియలలో ముఖ్యమైనవి హిందుస్థానీ ప్రక్రియలతో పాటు మీరా భజన్లు, గాలిబ్ గీతాలు (గజళ్ళు), హోరీలు, కజ్రీల వంటివి కూడా ప్రముఖమైనవి.
“కేసరియా బలం ఆవో నీ పధరో మరే దే గీత్”, “ఝలో మసూదియో న జాయే”, “మూమల్ మరియు మహేంద్ర” వంటి గీతాలు ఆమెకు పేరు తీసుకుని వచ్చాయి.
సినిమాలలో పాడమని చాలా మంది నిర్మాతలు కోరేవారు. కాని ఈమెకు సినిమాలో పాడడం పట్ల క్రేజ్ లేదు. సున్నితంగా నిరాకరించేవారు.
విశ్వవ్యాప్తంగా బహుళ ప్రాచుర్యం పొందిన “కేసరియా బలం” పాటను సినిమాలలో ప్రవేశ పెట్టడం జరిగింది. ఈ పాటను జిలాయీ బాయి అనుమతిని తీసుకుని ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఆలపించారు.
ఈ పాట బలం ఈ నాటికీ విశ్వవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్న అనేక యూట్యూబ్ ఆడియోలు, వీడియోలు చెప్పకనే చెపుతాయి.
రాజస్థాన్ ప్రాంతానికే పరిమితమయిన అనేక జానపద గేయాలు ఈమె స్వరం ద్వారా అలవోకగా వెలువడ్డాయి. ఈమెకి ‘నైటింగేల్ ఆఫ్ రాజస్థాన్’ గా పేరు తెచ్చి పెట్టాయి.
ఈ సంగీత సరస్వతి అక్కున చేరిన పురస్కారాలెన్నో!
1975లో రాజస్థాన్ సంగీత నాటక అకాడమీ వారి చేత ‘మన్మాత్ర’ పురస్కారాన్ని, 1978లో ‘సంగీత శిరోమణి’, 1978లో ‘భారతీయ లోక్ మండల్ వారి ఉదయపూర్ సన్మాన పత్రం’, 1980లో ‘రాజస్థాన్ అవార్డు’, 1982లో ‘రాజస్థాన్ శ్రీ’, 1984లో ‘దాగర్ ఘర్నా పురస్కారాలు’ లభించాయి.
1982లో ఆనాటి భారత రాష్ట్రపతి శ్రీ నీలం సంజీవ రెడ్డి చేతుల మీదగా భారత ప్రభుత్వ ‘పద్మశ్రీ పురస్కారం’ ఈమెను వరించింది.
1988లో రాజస్థాన్ జానపద కళా రంగానికి ఈమె అందించిన సేవలకు గాను ‘సంగీత నాటక అకాడమీ’ పురస్కారాన్ని పొందారు ఈమె.
బాల్యంలో మార్వాడీ భాషలో కూనిరాగాలు తీసుకుని, తల్లి దగ్గర, మౌసికి అకాడమీ నుండి సంగీతంలో తొలి పాఠాలు నేర్చుకున్న జిలాయీ రాజస్థానానికి చేరి ఎదగడం వెనక ఆమె కఠోర శ్రమ, దీక్షా దక్షతలు కనిపిస్తాయి. సినిమాలలో పాడడానికి నిరాకరించి తన కళపట్ల నిబద్ధతను ప్రదర్శించారు.
1902 నవంబర్ 3వ తేదీన తన అపార సంగీత పరిజ్ఞానాన్ని మన కోసం మిగిల్చి ఆమె అమర లోకాన్ని చేరారు.
ఈమె జ్ఞాపకార్థం 2003 డిసెంబర్ 29వ తేదీన 5 రూపాయల విలువతో ఒక స్టాంపు విడుదలయింది. రాజస్థానీ వేషధారణలో మేలి ముసుగుతో రాగాలాపన చేస్తున్న జిలాయ్ బాయ్ హృద్యంగా కనిపిస్తారు.


‘Personality Series: Folk Music’ సిరీస్‌లో ఈ స్టాంపు విడుదలయింది. తోటి జానపద కళాకారుడు ‘లలాన్ ఫకీర్’ స్టాంపుతో పాటు Setanant of 2 Stamps గా ఇవి విడుదలవడం భారత ప్రభుత్వానికి కళాకారుల పట్ల గల మక్కువని తెలియజేస్తుంది.
ఫిబ్రవరి 1వ తేదీ ఈమె జయంతి సందర్భంగా ఈ నివాళి.
***
Image Courtesy: Internet

7 Comments
gdkyyprml@gmail.com
సంగీత శిరోమణి, రాజస్తాన్ శ్రీ, పద్మశ్రీ అల్లా జిలాయి బాయి మన భారత దేశానికి వన్నె తెచ్చిన జానపద సంగీత కళానిధి కి నా హృదయపూర్వక నమఃసుమాంజలులు..
P.Usha Rani
Goppa gayaneemani gurinchi mee dwara telisukogaliganu….chala baga rasaaru madam…avida gurinchi.
కొల్లూరి సోమ శంకర్
Excellent essay on alla jilai Bai, the greatest singer who made a mark in her singing career. Thanks and regards.
A. Raghavendra Rao
కొల్లూరి సోమ శంకర్
జిలాయి బాయి చరిత్ర ఎలా సేకరించారమ్మా.చాలాబాగుందివ్యాసం.
డా. వి. ఆర్. రాసాని
కొల్లూరి సోమ శంకర్
అల్హా జిలాయ్ బాయ్ పర్మిషన్ తో.. భారతరత్న లతాజీ కేసరి బలం పాట పాడడం.. గ్రేట్ మేడమ్!
ఎ. శ్రీవల్లి
కొల్లూరి సోమ శంకర్
రాయల్ ఆల్బర్ట్ హాల్లో స్వాతంత్ర్యం రాక ముందే కచేరీ చేయడం..మీ వ్యాసం ద్వారా తెలుసుకున్నాం
ధన్యవాదాలు నాగలక్ష్మి గారూ
జి. రమ
Jhansi Lakshmi
అల్లా జిలాయి బాయి అపార ప్రతిభా పాటవాలు ఆశ్చర్య పరిచింది… మీరు పరిచయం చేయకపోతే ఎందరో ప్రతిభావంతులు మాకు తెలియకుండా మరుగున పడిపోయేవారు.. మహరాజు గారి ఆధరణ దొరకటం అవిడ అదృష్టం..సరైన ప్రోత్సాహం లభిస్తే మహిళలు ఎంతో రాణించగలరు అనేదానికి అవిడ జీవితం ఒక ఉదాహరణ… ధన్యవాదాలు మేడం!!