జూన్ 10వ తేదీ మాలావత్ పూర్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.
***
ప్రపంచంలోనే అతి ఎత్తైన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడం అంటే మాటలు కాదు. చాలా కష్టమైన, క్లిష్టమైన పని. కఠోర శ్రమ, శిక్షణ, పట్టుదల అవసరం. అన్నింటి కంటే ముఖ్యం శారీరక దారుఢ్యం. మంచు పొరల మీద కాలు జారకుండా జాగ్రత్త పడే చాకచక్యం, శ్వాస అందని పరిస్థితులలో తట్టుకోగలిగిన శక్తి తప్పనిసరి. అవసరమైన పరిస్థితులలో ఆక్సిజన్ సిలిండర్‌ని వీపున మోయాలి. మంచు చరియలు విరిగి జారిపోతుంటే నిలదొక్కుకోవాలి. నిజంగా దుస్సాహసమే! అసాధ్యం చాలా మందికి.
ఇటువంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన పదమూడేళ్ళ బాలిక మాలావత్ పూర్ణ. ఈమె మన తెలుగమ్మాయి కావడం మనకి గర్వకారణం. మనం ముఖ్యంగా గుర్తుంచుకోవలసింది ప్రపంచంలోనే అతి పిన్న వయస్సులో ఎవరెస్టుని అధిరోహించిన మహిళ కావడం.
ఈమె 2000వ సంవత్సరంలో జూన్ 10వ తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (నేటి తెలంగాణలో) నిజామాబాద్ జిల్లాలోని సిరికొండ సమీపంలోని పాకాలలో జన్మించింది. ఈమె తల్లిదండ్రులు మాలావత్ లక్ష్మి దేవిదాస్‌లు. వీరు వ్యవసాయ కూలీలయిన గిరిజన కుటుంబీకులు. పేదరికంలో కునారిల్లే కుటుంబం.
ఈమె సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో చదివింది. చదువుతున్న సమయంలోనే భువనగిరిని అధిరోహించింది. భువనగిరి శిక్షణా శిబిరంలో అయిదు రోజులలోనే ‘A’ గ్రేడును సంపాదించింది. ఆ తరువాత తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీలో చేరింది. చదువుతో సమాంతరంగా కొండలను ఎక్కడం, పర్వతారోహణంలోనూ శిక్షణను పొందింది. అథ్లెటిక్స్‌లో మంచి శిక్షణను ఇప్పించారు. ఈమె కోసం ప్రత్యేక ప్రణాళికను తయారు చేసి శిక్షణను ఇప్పించారు. విశ్రాంత IPS అధికారి డాక్టర్ R.S. ప్రవీణ్ కుమార్ వీరికి సలహాలను ఇచ్చి ఏర్పాట్లు చేయించేవారు.
150 మంది విద్యార్థులను ఎంపిక చేసి పోటీలలో పరీక్షించారు. 20 మందిని ఎంపిక చేసి డార్జిలింగ్ లోని పర్వతారోహక శిక్షణా సంస్థకు పంపించారు. అక్కడ శిక్షణ ముగిసిన తర్వాత 9 మందిని మాత్రమే ఇండోచైనా సరిహద్దులలో పర్వతారోహణకు ఎంపిక చేశారు. ఈ 9 మందిలో ఇద్దరు మాత్రమే ఎవరెస్టు శిఖరారోహణకు ఎంపిక చేయబడ్డారు. వీరిలో ఒకరు మాలావత్ పూర్ణ కాగా రెండవ వ్యక్తి ఖమ్మం జిల్లాకు చెందిన ఆనంద్ కుమార్. వీరిద్దరూ కూడా నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నేటి తెలంగాణా రాష్ట్రానికి చెందిన వారవడం తెలంగాణ రాష్ట్రానికి, తెలుగు వారికి గర్వకారణం.
వీరికి శ్రీ శేఖర్ బాబు శిక్షణను ఇచ్చారు. శేఖర్ బాబు స్వయంగా ఎవరి సహాయం తీసుకోకుండానే ఎవరెస్టును అధిరోహించిన గొప్ప పర్వతారోహకులు. ఇటువంటి గొప్ప వ్యక్తి శిక్షణ లభించడం వీరికి లభించిన గొప్ప అదృష్టం.
హైస్కూలులో చదువుకుంటున్న సమయంలోనే పూర్ణకి అవకాశం లభించడం, మంచి శిక్షణ పొందగలగడం, డార్జిలింగ్ వెళ్ళగలగడం ఇవన్నీ ఆమెకి సునాయాసంగా లభించలేదు. బాల్యంలో పోషకాహార లోపం ఉన్నా అధిగమించింది. రెసిడెన్షియల్ పాఠశాల నుండి సొసైటీ విద్యా సంస్థకు మారింది. పట్టుదల, కృషి, ధైర్య సాహసాలు ఆమెకి పెట్టని కోటలై నిలిచాయి. వీటితో పాటు కఠోర శ్రమ ఈమెను విజయానికి చేరువ చేశాయి.


డార్జిలింగ్, లడక్‌లలో శిక్షణ పొందారు. చలి వాతావరణానికి శరీరం అలవాటు పడే శిక్షణ ముఖ్యం. శారీరకంగా, మానసికంగా బలంగా ఉండగలగాలి. ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం, జాగింగ్, ధ్యానంలలో కాలం గడపడం ముఖ్యం. శరీర దారుఢ్యం కోసం ఇవన్నీ అందరికీ తప్పనిసరి. సాహసకార్యాలకు పూనుకున్నవారికి మరీ అవసరం.
పై రెండు ప్రాంతాలలోని ఎత్తైన శిఖరాలను అధిరోహించి తమపట్ల తమకి నమ్మకం, ఆత్మవిశ్వాసం, సంకల్పబలం పెంచుకున్నారు. ఈ శిఖరాలలో ట్రెక్కింగ్ ఈమెని ఒక్కొక్క మెట్టూ ఎక్కించింది. అంచెలంచెలుగా ఎదిగి ప్రపంచలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరారోహణకి మార్గాన్ని సులభం చేసింది.
మూడునెలల పాటు కఠోరశిక్షణ తీసుకున్నారు. టెంట్లో ఎలా గడపాలి? మంచు చరియలు విరిగిపడి కాళ్ళు జారుతుంటే రోప్ సాయంతో ఎలా పైకి వెళ్ళాలి వగైరా వగైరా అన్నమాట.
అదే సమయంలో 17 మంది షెర్పాలు ఎవరెస్ట్‌ని అధిరోహిస్తూ మరణించారు. ఈ సమయంలో మరణభయం ఉంది వెనక్కి వచ్చెయ్యమని సలహా ఇచ్చారు ప్రవీణ్ కుమార్ గారు. పరిస్థితులు అనుకూలంగా లేవు అని వివరించారు. కాని సంకల్పబలం, ఆత్మవిశ్వాసం మెండుగా ఉన్న పూర్ణ మడమ తిప్పలేదు. వెనకడుగు వెయ్యలేదు. ముందడుగు వేసి ప్రయాణాన్ని కొనసాగించింది.
ఏప్రిల్ నెలలో మొదలైన ఎవరెస్ట్ శిఖరారోహణ ప్రయాణం మే 25 తేదీతో ముగిసింది. సహ ఎవరెస్ట్ పర్వతారోహకుడు ఆనంలో కలిసి భారత జాతీయ పతాకాన్ని ఎవరెస్ట్ మీద ప్రతిష్ఠించారు. వారి గురుకుల పాఠశాల పతాకాన్ని ప్రతిష్ఠించారు.
విశ్వవ్యాప్తంగా 13 సంవత్సరాల 11 మాసాల వయస్సులో ఎవరెస్టు అధిరోహించిన పిన్నవయస్కురాలిగా చరిత్రను సృష్టించింది. భారతదేశానికి, తను పుట్టిన తెలంగాణా గడ్డకి పేరు తెచ్చింది.
ఆ తరువాత ప్రపంచంలోని ఎత్తైన ఏడు శిఖరాలను అధిరోహించాలని సంకల్పించిన పూర్ణ ఆ ప్రయత్నంలో విజయపథంలో దూసుకుని వెళుతున్నారు. ఆమె ఆశయం నెరవేరాలని ఆకాంక్షించి, ఆశీస్సులను అందించారు పెద్దలు.
ఉద్యోగ రీత్యా చూస్తే సివిల్స్ పరీక్షలు వ్రాయాలని, IPS అధికారిణి కావాలని, పేదలకు సేవ చేయాలని ఆమె ఆశ.
ఒక ఇంటర్వ్యూలో “ఆదివాసీ ఆడపిల్లలు వెనకడుగు వేయరు. అనుకున్నది సాధించుతార”ని నొక్కి వక్కాణించింది. ఈమె ఆత్మవిశ్వాసం, సంకల్పబలాలు ఆమెను ముందుకు తీసుకుని వెళ్ళాలని ఆశిద్దాం.
ఈమె విజయానికి గుర్తుగా తపాలాశాఖ 2014లో విజయవాడలో జరిగిన APPEX 14లో ఒక ప్రత్యేక తపాలాకవర్ను విడుదల చేసింది. ఎవరెస్ట్ మీద జాతీయ పతాకం చేత పుచ్చుకున్న పూర్ణ ఈ కవర్ మీద కనిపిస్తుంది.
A Rare tribal gem, Malavath Poorna (13+) broke the world record became the youngest girl ever to conquer Mt. Everest on 25-05-2014 అని వ్రాసి ఉంది.
***
Image Courtesy: Internet

5 Comments
Sowmya
బాగుందండీ. పూర్ణ కథ సినిమాగా, పుస్తకంగా కూడా వచ్చింది (పుస్తకానికీ, సినిమాకీ సంబంధం లేదనుకుంటాను).
movie: [Link deleted]
book: [Link deleted]
పుట్టి. నాగలక్ష్మి
ధన్యవాదాలు సౌమ్యగారూ
కొల్లూరి సోమ శంకర్
నిర్మల జ్యోతి, తిరుపతి
కొల్లూరి సోమ శంకర్
Excellent! Amazing girl Poorna! Very interestingly narrated. Thank you for sharing.
Regards
A. Raghavendra Rao, Hyderabad
P.Usha Rani
Ooh…Malavath Poorna gari gurinchi chala chakkaga raasaru madam. Aame saahasam anirvachaneeyam.Nijamga telugu jathiratnam.Eeme gurinchi parichayam chesinanduku chala dhanyavaadhamulu andi.
